Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పదునైన అస్త్రం... పునశ్చరణ!

సంవత్సరమంతా చదివి నేర్చుకున్న విషయాలు కొద్ది గంటల్లోనే రుజువు చేసుకోవాల్సిన కీలకమైన సందర్భం పరీక్షలు. ‘ఎంత నేర్చుకున్నాం’ అనేది ముఖ్యం కాదు. ‘పరీక్షల్లో ఎలా జవాబులు రాశాం / గుర్తించాం’ అనేదే ప్రధానం. పరీక్షాపత్రంలో రాసింది విద్యార్థి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇంత ముఖ్యమైన సమయంలో సన్నద్ధతను పరీక్షల దిశగా ఎలా మలుపు తిప్పాలో, పునశ్చరణ (రివిజన్‌) తీరు ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం!
పరీక్షలు దగ్గరకు వచ్చినపుడు చదువెలా సాగించాలి, మొత్తం పాఠాలు ఆమూలాగ్రం చదవాలా, అక్కడక్కడా చూసుకోవాలా అనేది కూడా ముఖ్యమే.
ప్రవర్తనల్లో, ఆలోచనా విధానాల్లో విద్యార్థికీ విద్యార్థికీ వ్యత్యాసాలుంటాయి. ఉదాహరణకు ఒక విద్యార్థి- ‘నేను తెలివైన విద్యార్థిని. నేర్చుకున్న విషయాలను మళ్ళీమళ్ళీ చదవాల్సిన అవసరం నాకు లేదు. సాధారణ విద్యార్థులు మాత్రమే అది చెయ్యాలి. నేను కాదు. అలా చేస్తే నాకు బోర్‌ కొడుతుంది’ అని ఆలోచిస్తాడు.
మరి కొందరుంటారు. ‘చదివిన విషయాలనూ, నేర్చుకున్న పాఠాలనూ మళ్ళీ చదువుకోవాల్సిందే. అప్పుడే గుర్తుంటుంది. లేకపోతే మరిచిపోవటం మామూలే. అబ్బో! మరి ఇన్ని టాపిక్స్‌ ఉన్నాయే... ఇవన్నీ ఎలా చదివేది? టైం సరిపోదే? మరేం చెయ్యాలి?’... ఇలా ఆలోచిస్తుంటారు.
మరింకెన్నో భేదాలు ఉన్నప్పటికీ విద్యార్థుల్లోని ఈ రెండూ మాత్రం ప్రధానమైనవని చెప్పుకోవచ్చు.
ఈ రెండు విభిన్నమైన ఆలోచనల్లో ఏది సరైనది? ఏది కాదు? అనే విషయాన్ని పరిశీలిస్తే... రెండిట్లోనూ కొంత నిజం ఉన్నా అపసవ్యమైన తర్కం కూడా ఉంది. ‘చదివిన సబ్జెక్టు మళ్ళీ చదవాలంటే నాకు బోర్‌ కొడుతుంది’ అని ఏమీ చదవకుండా ఉండటం సరి కాదు. అలాగే ‘ప్రతి పాఠాన్నీ ఏ నుంచి జడ్‌ వరకూ మళ్ళీ చదువుతాను. లేకపోతే నాకు గుర్తుండదు’ అనుకోవడమూ సరైన పద్ధతి కాదు.

విద్యాసంవత్సరం ప్రారంభంలో...
విద్యాసంవత్సరం మొదలైనపుడు విద్యార్థి ప్రతి పాఠాన్నీ చక్కగా చదివి నేర్చుకుంటాడు. దానికి కారణం... అతడికి కావలసినంత సమయం ఉండటమే. అందుకే ప్రతి సబ్జెక్టులోంచీ పాఠాలు ఇదేవిధంగా చదువుతాడు. చదవాలి కూడా. పరీక్షలు దగ్గరపడినప్పుడు ఇలా చదివే వ్యవధి ఎక్కడుంటుంది? అన్ని సబ్జెక్టులూ కవర్‌ చేయకపోతే విద్యార్థి మనసును వ్యాకులత చుట్టేస్తుంది. దానితో ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒకవేళ ఏమీ చదవకుండా వదిలేసినా ముఖ్యమైన విషయాలు గుర్తుండకపోవచ్చు. పరీక్షహాల్లో అవి గుర్తుకురాని సమస్య ఏర్పడవచ్చు. పర్యవసానం ప్రతికూలమే.
ఇలాంటపుడు రాబిన్సన్‌ అనే మనస్తత్వవేత్త సూచించిన SQ- 3R పద్ధతి ఉపయోగపడుతుంది.

ఏమిటీ విధానం?
ఈ పద్ధతి ‘మళ్ళీ చదివితే నాకు బోర్‌ కొడుతుంది’ అనే విద్యార్థులకు చక్కగా సరిపోతుంది. ఈ పద్ధతిలో మొదటిది ఎస్‌. అంటే సర్వే. ఇక్కడ విద్యార్థి మొత్తం అధ్యాయం (చాప్టర్‌) చదవకుండా దాన్ని ‘సర్వే’ చేస్తాడు. అలా చేసి దాని సారాంశం (సమ్మరీ) తెలుసుకుంటాడు. ఒకవేళ ఆ చాప్టర్‌ మొదట్లోనే ఈ సారాంశం ఉంటే మరీ మంచిది. దాన్నే చదువుతాడు. మొత్తం అధ్యాయం సర్వే చేసిన తర్వాత చాప్టర్‌లోని సైడ్‌ హెడింగ్స్‌పై ఒక ప్రశ్నను రూపొందించుకుంటాడు. ఉదాహరణకు ‘హైడ్రొజన్‌ నిర్వచనం’ ఉంటే ఆ నిర్వచనం ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించవచ్చు? అనే ప్రశ్నను తయారుచేసుకుంటాడు.
తర్వాత మూడు ఆర్‌లు ఉన్నాయి కదా? అందులో మొదటి ఆర్‌ అంటే ‘రీడ్‌’ (చదవడం). రెండో ఆర్‌ ‘రిసైట్‌’, మూడోది ‘రివ్యూ’.
మొదటి ఆర్‌ అంటే రీడ్‌ కదా? సైడ్‌ హెడింగ్‌పై ఏ ప్రశ్నను ‘ఫ్రేమ్‌’ చేసుకుంటాడో దానికి జవాబు ఇస్తున్నట్లుగా చదువుతాడు. సైడ్‌ హెడింగ్స్‌ అంతా అయిపోయిన తర్వాత రెండో ఆర్‌- రిసైట్‌ తీసుకుంటాడు. మూడో ఆర్‌కు పోకుండా ఆ సైడ్‌ హెడింగ్‌ను మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటాడు. ఏదైనా విషయాన్ని మర్చిపోతే ఒకసారి ఆ విషయాన్ని మళ్ళీ చదువుకుంటాడు. ఇదేవిధంగా అన్ని సైడ్‌ హెడింగ్స్‌ అయిపోయాక అప్పుడు మూడో ఆర్‌- రివ్యూను తీసుకుంటాడు. మొత్తం అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడమని అర్థం.
ఈ విధంగా చదవడం వల్ల మొత్తం అధ్యాయం కవర్‌ చేసినా ‘మళ్ళీ చదివాను’ అన్న భావన విద్యార్థికి రాదు. అందుకే బోర్‌ ఫీల్‌ కాడు. పైగా అన్ని విషయాలూ గుర్తుంటాయి.
ఇక రెండో కోవకు చెందినవారి గురించి మాట్లాడ్డానికి ముందు మనం ‘మెమరీ ట్రేసెస్‌’ గురించి తెలుసుకోవాలి. మనం ఏదైనా నేర్చుకుంటే ఆ విషయం ఆ వ్యక్తి మస్తిష్కంలో నిల్వ ఉంటుందని న్యూరో సైకాలజిస్టుల అభిప్రాయం. ఇలా మెమరీ భద్రపరిచివుండటమే మెమరీ ట్రేసెస్‌. ఇది చెక్కుచెదరకుండా ఉన్నంతవరకూ జ్ఞాపకశక్తి కూడా అదేరకంగా చక్కగా ఉంటుంది. ఒకవేళ మెమరీ ట్రేసెస్‌ మలిగిపోతే మెమరీ కూడా చెదిరిపోతుంది.
ఈ రెండో రకానికి చెందిన విద్యార్థులు ఎస్‌క్యూ- త్రీ ఆర్‌తో పాటు ముఖ్యమైన విషయాలు చూసుకుంటే మేలు. అప్పుడు మెమరీ ట్రేసెస్‌ కూడా చెక్కుచెదరకుండా ఉండి, విషయాలను చక్కగా గుర్తుంచుకోగలుగుతారు.
ముఖ్యంగా పరీక్షల సమయంలో ‘నేను చక్కగా రాయాలి’ అనే తపన, ప్రేరణ ఎంతో ముఖ్యం. ఈ తపనే విద్యార్థిని అందలాలు ఎక్కించగలుగుతుంది. జీవితంలో రాకెట్లా ముందుకు దూసుకుపోయేలా చేస్తుంది!


Back..

Posted on 28.2.2017