Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పల్లె విద్యార్థికి పట్టం

బాసర, ముథోల్‌, న్యూస్‌టుడే: గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ ఐటీ విద్య అందించే బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు విద్యాలయం ఆహ్వానం పలుకుతోంది. స్వయం ప్రతిపత్తి పొందిన అనంతరం తొలిసారిగా తెలంగాణ విద్యార్థులకు సువర్ణావకాశంగా మారింది. నిరుపేద విద్యార్థులకు పాలిట వరంగా మారిన ఆర్జీయూకేటీలో ప్రవేశాలు, ఎంపిక విధానం, ఇప్పటివరకు ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల వివరాలతో స్ఫూర్తిదాయక కథనం.

ఎంపిక ప్రక్రియ:
బాసర ఆర్జీయూకేటీలో ఈ సంవత్సరం 1000 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. పదో తరగతి బోర్డుల నుంచి (ఎస్‌ఎస్‌సీ, సీబీఎస్‌ఈ) విద్యాలయమే మార్కుల జాబితాను పొంది విద్యార్థుల మెరిట్‌ను పరిశీలిస్తారు. జీపీఏ ఆధారంగా, రిజర్వేషన్లను పాటిస్తూ ఎంపిక చేస్తారు. జిల్లా, పురపాలక, గ్రామీణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచీ విధానం ద్వారా 0.4 జీపీఏను అదనంగా కలుపుతారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 371/డి ప్రకారం 85 శాతం తెలంగాణ, 15 శాతం ఆంధ్రా-తెలంగాణ, విద్యార్థులతో (అన్‌ రిజర్వుడ్‌ సీట్లు)సీట్లను భర్తీచేస్తారు. 5 శాతం ఎన్‌ఆర్‌ఐ, గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంతతి విద్యార్థులు, ఇతర రాష్ట్రాల విద్యార్థులతో సూపర్‌న్యూమెరరీ సీట్లను భర్తీ చేస్తారు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా వారికి జూన్‌ 23వ తేదిన కౌన్సిలింగ్‌ ఉంటుంది. మెరిట్‌జాబితాలో సీటు పొంది కౌన్సిలింగ్‌కు హాజరుకాని వారి స్థానంలో తదుపరి మెరిట్‌ విద్యార్థికి అవకాశం లభిస్తుంది.

విద్యావిధానం:
ఆరేళ్ల కోర్సులో తొలుత రెండేళ్ల ఇంటర్‌ తత్సమాన కోర్సు పీయూసీ ఉంటుంది. అనంతరం నాలుగేళ్ల బీటెక్‌ కోర్సు ఉంటుంది. పీయూసీ అనంతరం మెరుగైన అవకాశాలు వస్తే విద్యార్థులు ఆర్జీయూకేటీ నుంచి బయటకు వెళ్లొచ్చు. సివిల్‌, కెమికల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులను అందిస్తుంది. పీయూసీలో సాధించిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో కోర్సులు కేటాయిస్తారు.

కష్టపడితే కొలువు చిక్కినట్టే..:
ఆర్జీయూకేటీలో తొలిబ్యాచ్‌ విద్యార్థులు 2014లో చదువు పూర్తిచేశారు. తొలి సంవత్సరం నుంచే ప్రముఖ సంస్థలు విద్యాలయంలో ప్రాంగణ నియామాకాలు చేపట్టాయి. విద్యాలయంలో పలు లోపాలున్న చదువు విషయంలో మెరుగైన ప్రతిభ కనబరుస్తుంది. 2014లో 2035 మంది విద్యార్థులకు 280 మంది విద్యార్థులు ప్రాంగణ నియామాకాల్లో ఎంపికయ్యారు. 2015 సంవత్సరంలో 1820 విద్యార్థులకు 338 ప్రాంగణ నియామాకాల్లో ఉద్యోగాలు పొందారు. ఈ సంవత్సరం 845 మంది విద్యార్థులకు 315 మంది కొలువులు సాధించారు. గేట్‌ తదితర ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ర్యాంక్‌లను కొల్లగొడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామాకాల్లో 131 మంది విద్యార్థులు ఇంజినీర్లుగా ఉద్యోగాలు సాధించారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థుల వార్షిక వేతనాలు రూ. 6.23 లక్షలనుంచి రూ. 3.6 లక్షలుగా ఉన్నాయి.

ప్రవేశ అర్హతలు
విద్యార్థులు తొలిప్రయత్నంలోనే 2016 ఎస్‌ఎస్‌సీ, లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి.
31-12-2016 నాటికి 18 సంవత్సరాలు మించకూడదు.ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల వయస్సు 21 సంవత్సరాలకు మించకూడదు

రిజర్వేషన్లు: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 8, బీసీ-ఏకు 7, బీసీ-బికి 10, బీసీ-సీ కి 1శాతం, బీసీ-డీకి 7శాతం, బీసీ-ఈకి 4 శాతం కోటా ఉంటుంది. సూపర్‌ న్యూమరరీ కోటా కింద దివ్యాంగులకు 3 శాతం, సైనిక ఉద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్‌ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు.

ఫీజుల వివరాలు: ఎంపికైన విద్యార్థులు ప్రతి సంవత్సరం రూ. 36 వేలు విద్యాలయానికి చెల్లించాలి. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్‌ సౌకర్యం కింద ఫీజు మొత్తాన్ని చెల్లిస్తుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్‌, బీసీ విద్యార్థులు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 500 చెల్లించాలి. కాషన్‌ డిపాజిట్‌ కింద ప్రతి విద్యార్థి రూ.2000 చెల్లించాలి. దీనిని విద్యార్థి విద్యాలయం నుంచి వెళ్లేటప్పుడు తిరిగి చెల్లిస్తారు. ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు రూ. 300000, ఇతర రాష్ట్రాల వారురూ. 1.36 లక్షలను ఫీజుగా చెల్లించాలి.

దరఖాస్తు విధానం:
ఆర్జీయూకేటీలో చేరాలనుకునే విద్యార్థులు మెదటగా ఆన్‌లైన్‌ ప్రక్రియ (ఏపీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్స్‌) ద్వారా ఆర్జీయూకేటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ-సేవా, మీ-సేవా, విద్యాలయ వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా తమ అప్లికేషన్లను నమోదు చేయవచ్చు. దీనికి సంబంధించిన మూడు పేజీల దరఖాస్తు ప్రతి సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అందులోని కాలమ్‌లలో అడిగిన వివరాలు పొందుపరిచి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. జనరల్‌, బీసీ విద్యార్థులు 150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 100 ధరఖాస్తు రుసుం చెల్లించాలి. అనంతరం ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తును ప్రింట్‌ తీసుకుని, ధృవపత్రాల నకళ్ళను ఆర్జీయూకేటీ, బాసర చిరునామాకు రిజిస్టర్‌ లేదా స్పీడ్‌పోస్ట్‌ ద్వారా జూన్‌ 5వ తేదిలోగా పంపాలి. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు సంబంధించి ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు విద్యార్థులు మే 31వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ప్రతి, మిగతా ధ్రువీకరణ పత్రాల నకళ్లను జూన్‌ 5వ తేదీలోపు విద్యాలయానికి పంపాలి. జూన్‌ 11వ ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. జులై 1, 6 తేదీల్లో కౌన్సిలింగ్‌ ఉంటుంది. జులై 15 నుంచి విద్యార్థులకు తరగతులు ఆరంభమవుతాయి.

విద్యాప్రమాణాలు మెరుగుపడ్డాయి - ఠాగూర్‌రెడ్డి, విజిలెన్స్‌, నాణ్యత ప్రమాణాల అధికారి, గ్రామీణ నీటిపారుదల శాఖ
బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉంది. గతంతో పోలిస్తే విద్యాలయ ప్రమాణాలు మెరుగుపడ్డాయి. నిపుణులైన బోధన సిబ్బంది, ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. మొదటిబ్యాచ్‌ విద్యార్థుల చదువు పూర్తి అయినప్పటి నుంచి బహుళజాతి సంస్థలు విద్యాలయంలో ప్రాంగణ నియామాకాలు చేపడుతున్నాయి. ఇష్టపడి చదివితే ప్రయోజకులు అయ్యే అవకాశం ఉంది.

నాణ్యమైన విద్య అందిస్తున్నారు - శ్రీకాంత్‌, ఏఈ, నీటిపారుదల శాఖ
బాసర ఆర్జీయూకేటీ తెలంగాణలో గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా సాంకేతిక విద్యనందించే ఏకైక విద్యాలయం.ఇక్కడ విద్యార్థులకు భోజనం, వసతి తదితర వసతులు ఉచితంగానే సమకూరుస్తారు. నాణ్యమైన విద్యతో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గేట్‌లాంటి పరీక్షల్లో ప్రతి సంవత్సరం బాసర విద్యార్థులు ర్యాంక్‌లు సాధిస్తున్నారు. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ విద్య ఒకే ప్రాంగణంలో లభించటం సానుకూలంశం.


Back..

Posted on 18-05-2016