Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
రోబోల యుగానికి కెరియర్‌ రోడ్‌!

అత్యాధునిక సాంకేతికతలు దూసుకొస్తూ వివిధ రంగాల్లో పెనుమార్పులు తెస్తున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిణామం మున్ముందు ఇంకా వేగవంతమవుతుంది. అందుకే సంప్రదాయ పంథాలో కెరియర్‌ ప్రణాళిక చేద్దామంటే ఇప్పుడు ఏమాత్రం సరిపోదు. నవతరం విద్యార్థులు తాము ఎదుర్కొనబోయే సవాళ్లకు దీటుగా తయారవ్వాలి. అందుకే భవిష్యత్‌ సామర్థ్యాలు నేర్చుకుంటూ.. వాటికి సానపెట్టుకునేలా కెరియర్‌ ఎంపిక ఉండాలి!

ఒక అభ్యర్థిని ఉద్యోగానికి ఎంపిక చేయాలంటే పరీక్షలు పెట్టి, మార్కుల లెక్కలు కట్టి, ఇంటర్వ్యూకి పిలిచి నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. పరిజ్ఞానాన్ని తెలుసుకోడానికి పలు ప్రశ్నలు వేస్తారు. భవిష్యత్తులో సెలక్షన్లు అలాంటి సంప్రదాయ పద్ధతుల్లో ఉండవు. రోబోలు, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ తదితర టెక్నాలజీల సాయంతో వ్యక్తి ప్రజ్ఞను వేగంగా అంచనా వేస్తారు. అంతర్జాలంలో అనంతంగా అందుబాటులో ఉన్న సమాచారంలో అవసరమైనదాన్ని తీసుకొని ఉపయోగించుకోగలిగిన సామర్థ్యాలను లెక్కగడతారు. సమాచార నిల్వ, ప్రాసెసింగ్‌ల్లో యంత్రాలను దాటి మనిషి నిలబడలేడు. కానీ సృజనాత్మకంగా, మానవీయ కోణంలో ఆలోచించగలిగిన తీరు మాత్రం మనిషికే సొంతం. రాబోయే తరాలు అలాంటి నైపుణ్యాలను నేర్చుకుంటేనే అవకాశాలను అందుకోగలుగుతాయి.

నిజానికి రానున్న కాలంలో చదువులు, ఉద్యోగాల రూపమే మారిపోబోతోంది. ఇప్పుడున్న వాటిల్లో 75 శాతం వరకూ మాయమైపోతాయి. కొత్త కొత్త పేర్లతో ఎన్నో కోర్సులు, ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఏం వస్తాయో, ఎలా వస్తాయో తెలియని వాటికి ఎలా సిద్ధం కావాలి? ఈ ప్రశ్నకు సమాధానమే ఇంటర్‌ డిసిప్లినరీ విధానం. అంటే పరస్పరాధారితంగా ఉన్న ఒకటి కంటే ఎక్కువ విజ్ఞాన శాఖల్లో సామర్థ్యాన్ని సంపాదించడం. దీనికి ఆదరణ పెరుగుతోంది. కాబట్టి, దీనికి తగ్గట్టుగా కెరియర్‌ ప్లానింగ్‌ ఉండాలి. అలాగే నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు రాణించాలన్నా, భవిష్యత్తులో చక్కటి కొలువులో స్థిరపడాలన్నా చిన్నప్పటి నుంచే వారికి కొన్ని నైపుణ్యాలు, సామర్థ్యాలను నేర్పించాలి.

పిల్లలకు నేర్పించాల్సిన నైపుణ్యాలు
పరిశీలన (అబ్జర్వేషన్‌): పిల్లలకు పరిశీలనా శక్తి పెరిగేలా చేయాలి. ఇంట్లో ఉన్నా, పార్కుకు లేదా ఏదైనా కొత్త ప్రాంతానికి తీసుకెళ్లినా వాళ్లను అక్కడున్న పరిసరాలను జాగ్రత్తగా గమనించమనాలి. దాన్నుంచి వాళ్లేం గ్రహించారో చెప్పమనాలి. అప్పుడప్పుడూ వారితో చర్చించాలి. పిల్లలు పాఠశాల వెలుపల, బయట రెండుచోట్లా తమ పరిశీలనా శక్తిని పెంపొందించుకునేలా చూడాలి.
వినగలిగే నేర్పు (లిసనింగ్‌): ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా విని, అర్థం చేసుకుని తమకు కావాల్సిన విధంగా పిల్లలు ఉపయోగించుకోగలగాలి. చాలామంది పూర్తిగా వినకముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అది సరికాదు. పిల్లలకు ఈ స్కిల్స్‌ అలవడాలంటే కథలు చెబుతూ, మధ్యలో వాళ్లను ప్రశ్నించాలి. తద్వారా చెప్పింది వాళ్లు వింటున్నారా? ఏం అర్థం చేసుకున్నారు లాంటివి తెలుస్తాయి.
చదవడం (రీడింగ్‌): పాఠ్య పుస్తకాలే కాకుండా, పాఠ్యేతర పుస్తకాలు చదివేలా పిల్లలను ప్రోత్సహించాలి. ఇది వాళ్ల వాళ్ల స్థాయిని బట్టి జరగాలి. ప్రాథమిక స్థాయిలో ఉంటే కథల పుస్తకాలు, హైస్కూల్‌ స్థాయి విద్యార్థులైతే సైన్స్‌ ఫిక్షన్‌ లేదా సోషల్‌ స్టడీస్‌కు సంబంధించిన జనరల్‌ పుస్తకాలు, వాళ్ల ఆసక్తిని బట్టి చదివేలా చూడాలి. ఇలా చదవడం వల్ల అవగాహనా శక్తి, భాషపై పట్టు పెరుగుతాయి.
రాయడం (రైటింగ్‌): రాయడం అంటే భావ వ్యక్తీకరణ. భావాన్ని అవతలి వారికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. అందుకు రాయడం ఒక మార్గం. కాబట్టి పిల్లల్లో రిన్‌ స్కిల్స్‌ పెంపొందించాలి. వివిధ వ్యాస రచన, ఇతర పోటీల్లో పాల్గొనేలా చేయాలి. వ్యక్తపరిచే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సాయం చేయాలి.
ఏకాగ్రత (కాన్‌సన్‌ట్రేషన్‌): పని ఏదైనా దాన్ని ఏకాగ్రతతో చేయడం పిల్లలకు అలవాటు చేయాలి. ఉదాహరణకు అన్నం తింటుంటే ఆ రుచిని ఆస్వాదించాలి. తరగతిలో టీచర్‌ పాఠం చెబుతున్నట్లయితే శ్రద్ధగా వినాలి. అర్థం చేసుకోవాలి. ఏవైనా సందేహాలు వస్తే ఉపాధ్యాయుడిని అడిగి నివృత్తి చేసుకోవాలి.
అవగాహన (కాంప్రహెన్షన్‌): ఏదైనా చదివినప్పుడు/ విన్నప్పుడు/ చూసినప్పుడు పిల్లలు దానిపై సొంత అవగాహన ఏర్పరచుకోగలగాలి.ఉద్యోగసాధనలో ఇది చాలా అవసరం.
విశ్లేషణ (అనలిటికల్‌): పిల్లలకు విశ్లేషణా సామర్థ్యాలు (అనలిటికల్‌ స్కిల్స్‌) కూడా ఉండాలి. చదివిన విషయాన్ని వివిధ కోణాల్లో ఎలా ఆలోచించి, విశ్లేషించుకోవాలో నేర్పించాలి.
అనువర్తన (అప్లికేషన్‌): ఏ అంశాన్నయినా నేర్చుకోవడం ఒక్కటే కాదు. దాన్ని ఉపయోగించి చుట్టూ ఉన్న సమస్యలకు పరిష్కారం కనుక్కోగలగాలి.దీన్ని పిల్లల్లో చిన్నప్పటి నుంచే పెంపొందించాలి.

రేపటికి దీటుగా రాణించాలంటే!
రాబోతున్న రోబోటిక్‌ విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలకు అలవర్చాల్సిన కొన్ని ఫ్యూచరిస్టిక్‌ (భవిష్యత్‌) సామర్థ్యాలున్నాయి. లైఫ్‌ స్కిల్స్‌లో భాగంగా ఇప్పటికి ఉన్నవాటితోపాటు కొత్తగా కొన్నింటిని నేర్పించాలి.
విమర్శనాత్మకంగా ఆలోచించడం (క్రిటికల్‌ థింకింగ్‌): శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా సామాజిక మాధ్యమాల్లో అధిక సమాచారం పోగవుతోంది. అందులో ఏది ఎంచుకోవాలి? ఎంత తీసుకోవాలి, పరిణామాలేంటి అని విమర్శనాత్మకంగా ఆలోచించగల సామర్థ్యం పిల్లలకు ఉండాలి. కేవలం పాఠాల పరిజ్ఞానానికి పరిమితం కాకూడదు. ప్రశ్నించే తత్వాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. దాని వల్ల విమర్శనాత్మకంగా ఆలోచించగలిగే సామర్థ్యం వారిలో పెరుగుతుంది.
సామాజిక ప్రజ్ఞ (సోషల్‌ ఇంటలిజెన్స్‌): చుట్టూ ఉన్న వ్యక్తుల ఆలోచనలను, హావభావాలను పిల్లలు సరిగా అర్థం చేసుకునేలా చూడాలి. ఇంటర్నెట్‌ వాడకం విస్తృతమైన నేటి పరిస్థితుల్లో అవతలి వ్యక్తిని చూడకపోయినా వారు పంపిన సమాచారాన్ని బట్టి అవగాహన ఏర్పరచుకోగలగాలి. వారి మన్నన, విశ్వాసం పొందాలి. అప్పుడే వ్యక్తులతో దృఢమైన బంధాలు ఏర్పడతాయి. ఇలాంటి సామాజిక ప్రజ్ఞను పిల్లల్లో ఎలా పెంపొందించాలంటే - పిల్లలకు చిన్నప్పటి నుంచి కథలు చెప్పాలి. అందులోని పాత్రల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకునే అవకాశం కల్పించాలి. అలాగే ఇంటికి బంధువులు, స్నేహితులు రాగానే పిల్లలను లోపలికి పొమ్మనడం, పుస్తకం చదువుకోమనడం సరికాదు. నలుగురితో కలవనివ్వాలి. అవతలి వ్యక్తిని ఆకట్టుకోవడం, విశ్వాసాన్ని పొందడం వంటి సామాజిక ప్రజ్ఞలను పిల్లల్లో పటిష్ఠం చేయాలి.
మిశ్రమ సంస్కృతీ సామర్థ్యం (క్రాస్‌ కల్చరల్‌ కాంపిటెన్సీ): ప్రపంచీకరణ నేపథ్యంలో నిత్యం విభిన్న దేశాలు/ ప్రాంతాలు, సంస్కృతుల నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. సహోద్యోగుల సంస్కృతిని సరిగా అర్థం చేసుకోగలగాలి. అప్పుడే వారు బహుళ సంస్కృతుల్లో ఇమడగలుగుతారు. పిల్లలను ప్రాంత, కుల, మత, వర్గ భేదాలకు దూరంగా ఉంచాలి. సంకుచితమైన భావాలను వారిపై రుద్దకూడదు. తమ సంస్కృతి, భాషలను అభిమానిస్తూనే అవతలి వ్యక్తులతో సామరస్యంగా వ్యవహరించే సామర్థ్యాన్ని పిల్లల్లో పెంపొందించాలి.
బహుళ సబ్జెక్టుల పరిజ్ఞానం (ట్రాన్స్‌డిసిప్లినారిటీ): ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు అనేక డిసిప్లిన్స్‌ తెలిసి ఉండాల్సిందే. అన్ని సబ్జెక్టులపై కనీస పరిజ్ఞానం ఉండాలి. సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం కనుక్కోవడానికి ట్రాన్స్‌డిసిప్లినారిటీ అవసరం. అంటే పిల్లల్లో ఇచ్చిన విషయాన్ని విశ్లేషించుకోవడం తెలిస్తేనే ఒక సబ్జెక్ట్‌కి మరొక సబ్జెక్ట్‌కి అనుసంధానం ఏమిటో వాళ్లకు అర్థమవుతుంది.
సహానుభూతి (ఎంపతీ): అవతలి వ్యక్తుల స్థానంలో తమను ఊహించుకుని, వారి ఆలోచనలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పిల్లలకు ఉండాలి. మనుషుల మధ్య సంబంధాలు పటిష్ఠంగా ఉండాలంటే సహానుభూతి చాలా అవసరం. వీలున్నప్పుడు వారిని అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు తీసుకు వెళ్లాలి. సమాజంలో రకరకాల అవసరాలు/ సమస్యలు ఉన్న పిల్లలు/ వ్యక్తులు ఉంటారు. పిల్లలను వాళ్ల వయసుకు తగినట్లు ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్తే అక్కడి వ్యక్తుల కోణంలో వారిని అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
పరిస్థితులకు అనుగుణంగా మారడం (మెంటల్‌ ఎలాస్టిసిటీ): మార్పులకు అనుగుణంగా మారి మసలగల సామర్థ్యాన్ని పిల్లల్లో పెంచాలి. దాన్నే ఎడాప్టబిలిటీ అంటారు. అంటే పరిస్థితుల ప్రకారం సర్దుకుపోవడం. దీనికి మానసికంగా సిద్ధం కావడాన్ని మెంటల్‌ ఎలాస్టిసిటీ అంటారు. ఉదాహరణకు స్కూల్లో పిల్లల సెక్షన్‌ మారిస్తే తమ స్నేహితులు దూరమవుతారని బాధపడతారు. కానీ కొత్త సెక్షన్‌లో కొత్త స్నేహితులు ఏర్పడతారనే ఆలోచన కలిగించాలి. మార్పు ఎంత అనివార్యమో, దాన్ని ఎలా ఆహ్వానించాలో, అందులోని మంచిని ఎలా అంగీకరించాలో, చెడు ఉంటే ఎలా దూరం పెట్టాలో పిల్లలకు నేర్పించాలి.
సంక్లిష్ట సమస్యల పరిష్కారం (కాంప్లెక్స్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌): సంక్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు విభిన్నంగా ఆలోచించటం అవసరం. వినూత్న పరిష్కారాలను కనుక్కోగలిగిన లేటరల్‌ థింకింగ్‌ పిల్లల్లో పెంపొందించాలి.
సృజనాత్మకత (క్రియేటివిటీ): పిల్లలకు సహజంగా సృజనాత్మకత (మూసలో వెళ్లకుండా కొత్త బాటను అనుసరించటం) అలవడుతుంది. వాళ్లు ఏదైనా కొత్త ప్రశ్న అడిగినప్పుడు, పుస్తకంలో ఉన్నది చదవమని విసుక్కోకూడదు. సరైన జవాబు తెలుసుకునేలా ప్రోత్సహించాలి. వాళ్లలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, పదును పెట్టేలా విద్యా బోధన కొనసాగాలి.
- అమర్‌నాథ్‌ వాసిరెడ్డి


Back..

Posted on 30-04-2019