Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పట్టు పడితే.. విజ్ఞానం.. వినోదం!

* పాఠశాల, కళాశాలల విద్యార్థులకు రోబోటిక్‌ పోటీలు

రోబోటిక్స్‌.. ఆటోమేషన్‌ ఆధునిక పరిశ్రమల అభివృద్ధి మంత్రాలు. అందుకే ఆ విభాగాల్లో కొలువులకు డిమాండ్‌ పెరుగుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులూ సంబంధిత కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు పిల్లలను టెక్నాలజీ దిశగా ప్రోత్సహించేందుకు రోబోటిక్‌ పోటీలను నిర్వహిస్తున్నాయి. వీటి వల్ల సైన్స్‌, మ్యాథ్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ అభ్యర్థులు భవిష్యత్తు తరాల ఉద్యోగాలకు సంసిద్ధులయ్యే అవకాశం కలుగుతుంది.

ఆధునిక టెక్నాలజీపై ఈతరం విద్యార్థులు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆరేళ్ల పిల్లలూ రోబోటిక్స్‌పై పట్టు సాధించడానికి తరగతులకు హాజరవుతున్నారు. చాలా సంస్థలు వివిధ రకాల కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. మరికొన్ని ఆర్గనైజేషన్లు చిన్నారుల అభిరుచిని ప్రోత్సహించేందుకు, సృజనాత్మకతను వెలికితీసేందుకు రోబోటిక్‌ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఎడ్యుకేషన్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఎడ్యుటెయిన్‌మెంట్స్‌) కలగలిపి వీటిని రూపొందిస్తున్నాయి. దీంతో విభిన్న వయసుల విద్యార్థులంతా కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతోంది. రోబోటిక్‌ పోటీలు ఏడాది పొడవునా ఉంటున్నాయి. మన దేశంలో జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఉంటున్నాయి. జనవరిలో జరిగేవాటిలో కొన్నింటికి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. మరి కొన్నింటి వివరాల కోసం ఆయా వెబ్‌సైట్లలో సంబంధిత అధికారులను ముందుగానే సంప్రదించవచ్చు.

లాభాలు ఏమిటి?
నవీన రూపకల్పనల దిశగా యువతను ప్రేరేపించడానికి ఈ పోటీలు సాయపడతాయి. తమ డిజైన్‌లు, ఇంజినీరింగ్‌ వ్యూహాలను ప్రదర్శించే అవకాశం విద్యార్థులకు దక్కుతుంది. రోబోలను నిర్మించడానికి కావాల్సిన నైపుణ్యాలు, కోడింగ్‌, పోటీలో భాగంగా ఎదురయ్యే వివిధ సమస్యల పరిష్కారానికి వ్యూహాలను సిద్ధం చేయడం, వాటిని అర్థం చేసుకోవడం, కొత్త టెక్నాలజీలను పరిశోధించడం తదితరాలు అలవడతాయి. భవిష్యత్తులో దాదాపు ప్రతి రంగంలోనూ ఆటోమేషన్‌ జరుగుతుంది. దీంతో స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

స్టెమ్‌ అంశాలతో విద్యార్థులను జోడించి ఇంటర్‌పర్సనల్‌ నైపుణ్యాలను మెరుగుపరచడమే ఈ పోటీల లక్ష్యం. నేర్చుకున్నవాటిని నిజజీవితంలో ఉపయోగించే విధంగా ప్రోత్సహిస్తారు. విలువైన ఇంజినీరింగ్‌ నైపుణ్యాలే కాకుండా బృందంతో పనిచేయడం, కమ్యూనికేషన్‌, కొలాబరేషన్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, క్రిటికల్‌ థింకింగ్‌ వంటి జీవన నైపుణ్యాలూ అలవర్చుకోగలుగుతారు.

ఇవే కాకుండా....
ఎన్నో విదేశీ సంస్థలూ రోబోటిక్‌ కాంపిటిషన్లను నిర్వహిస్తున్నాయి. ఒక్కో దేశం నుంచి ఒకటి లేదా కొన్ని బృందాలకే అవకాశం కల్పిస్తున్నాయి. ఉదాహరణకు- రోబోకాన్‌. దీనిని ఏషియా- పసిఫిక్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ యూనియన్‌ (ఏబీయూ) నిర్వహిస్తోంది. ఆసియా పరిధిలోని దేశాలన్నీ దీనిలో పాల్గొంటాయి. దూరదర్శన్‌ ఇందులో భాగస్వామి. మొదట దేశంలోని బృందాలను పరీక్షించి, వాటిలో విజయం సాధించినవాటిని ఆసియా పరిధిలోని ఏదైనా దేశంలో జరిగే చాంపియన్‌షిప్‌కు దేశం తరఫున తీసుకెళతారు.

దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలూ ఫెస్ట్‌ల్లో భాగంగా రోబోటిక్‌ పోటీలను జరుపుతున్నాయి. ఉదాహరణకు- బిట్స్‌ పిలానీ ఈ ఏడాదికి తిశివీబినిని పేరుతో టెక్నికల్‌ ఫెస్ట్‌ను నిర్వహించింది. అందులో రోబోటిక్‌ పోటీలు- రోబోట్స్‌ వార్‌, రోబో సాకర్‌ ఉన్నాయి. రోబోల తయారీ, పోరాటంలో అవి పడిపోకుండా ఉండటం వంటివి భాగంగా ఉంటాయి. దీనిలో టెక్నికల్‌ విద్యార్థులు మాత్రమే పోటీపడే అవకాశముంటుంది.

ఈ ఎడ్యుటెయిన్‌మెంట్‌ చాంపియన్‌షిప్‌/ కాంపిటిషన్ల ద్వారా 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. వీటిలో హార్డ్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉన్నాయి. కంప్యుటేషనల్‌ థింకింగ్‌, సెల్ఫ్‌ డైరెక్టెడ్‌ లర్నింగ్‌, క్రియేటివ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సమయపాలన, బృందంతో కలిసి పనిచేయడం మొదలైనవి వీటిలో భాగంగా ఉంటాయి.

స్పార్క్‌ చాలెంజ్‌
ఎస్‌పీ రోబోటిక్‌ వర్క్స్‌ దీన్ని నిర్వహిస్తోంది. స్కూలు, కళాశాల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. రీజనల్‌ రౌండ్లను హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబయిల్లో నిర్వహిస్తారు. గ్రాండ్‌ ఫినాలే ముంబయిలో జరుగుతుంది. రోబో సాకర్‌, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్‌ చాలెంజ్‌, ఇండియా ఎక్స్‌పో, సేవ్‌ ద సిటీ మొదలైనవి ఉంటాయి. విద్యార్థి తనకు నచ్చినదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా జనవరిలో పోటీ నిర్వహిస్తారు.
https://sproboticworks.com/competitions

టెక్నోక్సియాన్‌
ఇది అంతర్జాతీయ వేదిక. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ (ఏఐసీఆర్‌ఏ) ఏటా దీన్ని దిల్లీలో నిర్వహిస్తోంది. ఇన్నవేషన్‌, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌ మొదలైన అంశాల్లో పోటీలుంటాయి. స్కూలు నుంచి యూజీ వరకు విద్యార్థులు బృందంగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో గ్రూప్‌లో 10 మంది వరకూ ఉండవచ్చు. దీనిలో ఫాస్టెస్ట్‌ లైన్‌ ఫాలోవర్‌, రోబో రేస్‌, రోబో సాకర్‌, మైక్రో మౌస్‌ వంటివి ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ పోటీలకు దరఖాస్తు చేసుకునే వీలుంది. 15 ఏళ్లలోపు జూనియర్‌ లెవల్‌గా, అంతకుమించితే సీనియర్‌ లెవల్‌గా పరిగణిస్తారు.
https://www.technoxian.com/

వరల్డ్‌ రోబోటిక్‌ ఒలింపియాడ్‌
దేశంలో నిర్వహించే పెద్ద రోబోటిక్స్‌ పోటీల్లో ఒకటి. ఇండియా స్టెమ్‌ ఫౌండేషన్‌ దీనిని 2006 నుంచి ఏటా నిర్వహిస్తోంది. 9 నుంచి 25 ఏళ్లలోపు వారు పాల్గొనవచ్చు. సృజనాత్మకత, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలను పరీక్షించేలా పోటీ ఉంటుంది. ఏటా ఒక థీమ్‌తో పోటీలను నిర్వహిస్తారు. స్కూలు/ కళాశాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి. బృందంలో ముగ్గురు సభ్యులుండాలి. రీజనల్‌, నేషనల్‌ స్థాయి పోటీలుంటాయి. వయసులవారీగా గ్రూప్‌లుంటాయి. విద్యార్థుల బృందం హ్యూమన్‌ అథ్లెట్‌ రూపంలో ఉండే రోబోను డిజైన్‌ చేసి, రూపొందించాలి. దేశంలోని ప్రతి ప్రధాన నగరంలో వీటిని నిర్వహిస్తున్నారు. పాల్గొనాలనుకునేవారు కొంత మొత్తం చెల్లించాలి. గెలిచినవారికి బహుమతులుంటాయి.
https://indiastemfoundation.org/programs/#wro

రోబోఫెస్ట్‌ ఇండియా
నోవాటెక్‌రోబో దీన్ని నిర్వహిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలు- బెంగళూరు, హైదరాబాద్‌, న్యూదిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై మొదలైనవాటిల్లో జరుగుతుంది. సెకండ్‌ గ్రేడ్‌ నుంచి కాలేజ్‌ విద్యార్థులు బృందంగా పాల్గొంటారు. రోబో డిజైన్‌, ప్రోగ్రామింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ ఇందులో భాగం. జూనియర్‌ (2-4 తరగతులవారు), బాటిల్‌, ఎగ్జిబిషన్‌ (జూనియర్‌ 5-8 తరగతులు, సీనియర్‌ 9- ఇంటర్‌) విభాగాలుంటాయి. పాల్గొన్నవారందరికీ వ్యక్తిగత మెడల్స్‌, సర్టిఫికెట్‌లు అందజేస్తారు. క్వాలిఫయింగ్‌, చాంపియన్‌షిప్‌ విన్నర్లకు ట్రోఫీలు ఇస్తారు.
https://www.robofestindia.com/

మేక్‌ఎక్స్‌ కాంపిటిషన్స్‌
ఏటా ఏదైనా థీమ్‌ ఆధారంగా ఈ పోటీలను నిర్వహిస్తారు. నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు .. ఉదాహరణకు ఈ ఏడాది వాతావరణ కాలుష్యం, ఆహార భద్రత, రీసైక్లింగ్‌ మొదలైనవి ఇచ్చారు. కఠినత్వ స్థాయుల ఆధారంగా రెండు ప్రోగ్రామ్‌లు ఉంటాయి. వాటిలో క్వాలిఫయింగ్‌, చాంపియన్‌షిప్‌ రౌండ్లు ఉంటాయి. వయసు బట్టి వీటిల్లో మార్పులుంటాయి. 6-11 ఏళ్లలోపు వారిని జూనియర్‌, 12-16 ఏళ్లవారిని సీనియర్‌ స్థాయిగా పరిగణిస్తారు. బృందాలుగా దరఖాస్తు చేసుకోవాలి. 1-2 విద్యార్థులు, 1-2 మెంటర్లూ బృందంలో ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గెలిచినవారికి నగదు బహుమతి ఇస్తారు.
https://makebot.in/makex/competition.html

Back..

Posted on 06-11-2019