Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బ్యాంకు పీఓ పోస్టులు... పోటీ పడదాం!

బ్యాంకు పరీక్షార్థులు ఆసక్తిగా ఎదురుచూసే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పి.ఒ. ప్రకటన వెలువడింది. రెండు దశల రాతపరీక్ష, మూడో దశలో మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు ప్రణాళికాబద్ధంగా సంసిద్ధం కావాలి. అందుకు ఉపకరించే నిపుణుల సూచనలు ఇవిగో..!
పన్నెండు వేలకు పైగా శాఖలతో దేశంలోనే ప్రథమశ్రేణి బ్యాంకుగా ఎస్‌బీఐకి పేరు. రెండు లక్షల మందికి పైగా ఉద్యోగుల బలం దీనిది. ఇతరదేశాల్లో కూడా శాఖలుండటం వల్ల విదేశాల్లో పనిచేసే అవకాశం ఉండటం, ఇతర బ్యాంకులతో పోలిస్తే అధిక జీతభత్యాలు ఉండటం లాంటి కారణాల వల్ల ఎక్కువమంది అభ్యర్థులు ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ పరీక్ష కోసం పోటీపడతారు. అందుచేత ఇది ఇతర పరీక్షలతో పోలిస్తే హెచ్చుస్థాయిలోనే ఉంటుంది. సన్నద్ధత కూడా అదే విధంగా ఉండాలి.
ఎస్‌బీఐ పి.ఒ.: ముఖ్యాంశాలు
* ఖాళీలు: 2313
* అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత
* వయసు: 1 ఏప్రిల్‌ 2017 నాటికి 21 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ వారికి 3 సంవత్సరాల గరిష్ఠ వయఃపరిమితి మినహాయింపు ఉంది.
* ఎంపిక: మూడు దశల్లో.
1వ దశ: ప్రిలిమినరీ
ఆబ్జెక్టివ్‌ విధానం. 100 ప్రశ్నలు- 100 మార్కులు
2వ దశ: మెయిన్స్‌
ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌. ప్రశ్నలు 155- మార్కులు 200
మూడో దశ: గ్రూప్‌ ఎక్సర్‌సైజులు, ఇంటర్‌వ్యూ.
* ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: మార్చి 6
ప్రిలిమినరీ: ప్రాథమికాంశాలే ఎక్కువ
ఇటీవల జరుగుతున్న బ్యాంకు పరీక్షల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్‌ మార్కులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వేగంగా జవాబులు గుర్తించేలా అభ్యర్థులు సాధన చేయాలి.
ప్రిలిమినరీ పరీక్ష కఠినతరంగా వచ్చినప్పటికీ అభ్యర్థులు ఆందోళన చెందకూడదు. వీలైనన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించగల్గాలి. ఒకే ప్రశ్న మీద ఎక్కువ సమయం కేటాయించకూడదు. ఈ విధంగా సంసిద్ధమైతే కీలకమైన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు.

ప్రిలిమినరీ రాత పరీక్ష 100 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. దీన్ని గంట వ్యవధిలో పూర్తిచేయాలి.
ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ మార్కులు మెయిన్స్‌ సాధించటానికి మాత్రమే పరిగణనలోకి తీసుకొంటారు. తుది ఎంపికకు ఈ మార్కులను లెక్కించరు. ఈమధ్య కాలంలో జరిగిన ప్రిలిమినరీ పరీక్షలు పరిశీలిస్తే... అన్ని ప్రశ్నలూ ప్రాథమికాంశాల (బేసిక్స్‌) నుంచి వస్తున్నాయని గ్రహించవచ్చు.

ఇటీవల జరిగిన ప్రిలిమినరీ పరీక్షల ఆధారంగా.. విభాగాల వారీగా వచ్చే ప్రశ్నలు, మార్కులు ఇలా ఉన్నాయి.
రీజనింగ్‌: రీజనింగ్‌ సబ్జెక్టులో ప్రశ్నలు అభ్యర్థి ఆలోచనా విధానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. అధికారి స్థాయి ఉద్యోగాలు కాబట్టి ఇందులో వచ్చే ప్రశ్నలు కొంచెం కఠినంగా అభ్యర్థుల సహనానికి పరీక్షపెడతాయి. ఇటీవలి కాలంలోని ప్రిలిమినరీ పరీక్షలను పరిశీలిస్తే... ప్రశ్నల తీరు ఎలా ఉందో చూడండి
విద్యార్థులు ఈ విభాగంలో ఎక్కువ మార్కులకు ప్రయత్నించాలి. దానికి తగిన విధంగా సమాయత్తం కావాలి.
న్యూమరికల్‌ ఎబిలిటీ: ఇందులో ప్రశ్నలు అభ్యర్థి వేగాన్నీ, కచ్చితత్వాన్నీ నిర్థారించేవిగా ఉంటాయి. ముఖ్యంగా న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ల నుంచి అధిక ప్రశ్నలు ప్రిలిమినరీలో వస్తాయి. సూక్ష్మీకరణలపై దృష్టి పెట్టి షార్ట్‌కట్స్‌ పాటించటం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా ప్రశ్నలు ప్రతి పాఠ్యాంశం బేసిక్స్‌ మీద విశ్లేషణాత్మక ప్రశ్నలు ఇస్తున్నారు. వీటిస్థాయి కొంచెం కఠినంగా ఉంటుంది. ఈ మాదిరి ప్రశ్నలను సాధన చేస్తే ఎక్కువ మార్కులు లభిస్తాయి.

ఇంగ్లిష్‌: చాలామంది అభ్యర్థులు ఈ విభాగంలోని ప్రశ్నలను ఇబ్బందిగా భావిస్తారు. కానీ గ్రామర్‌ మీద పట్టుతో పాటు పఠన నైపుణ్యాలు పెంచుకుంటే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఇందులో ప్రశ్నలు ప్రధానంగా అభ్యర్థి అవగాహనపై ఆధారపడివుంటాయి. ఇంగ్లిషు దినపత్రికలు చదివి కొత్త పదాలు నేర్చుకోవాలి. వాక్యనిర్మాణం తీరు గమనించాలి. తద్వారా రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లోని యాంటనిమ్స్‌, సిననిమ్స్‌ను తేలికగా గుర్తించగలుగుతారు. ప్రతిరోజూ ఆంగ్ల వార్తలు, ఇంగ్లిషు బృంద చర్చలను పరిశీలిస్తూ, ఎక్కువ ప్రశ్నలు సాధన చేయటం ద్వారా మంచి మార్కులు పొందవచ్చు.

ఏక కాలంలో రెండు పరీక్షల సన్నద్ధత

ప్రధాన పరీక్షల్లో ఉన్న నాలుగు విభాగాల్లో మూడు విభాగాలు ప్రాథమిక పరీక్షలో ఉన్నాయి. అందుచేత అభ్యర్థులు ఈ మూడు విభాగాలకూ ప్రధాన పరీక్ష స్థాయిలోనే సిద్ధమైతే ప్రాథమిక పరీక్షకు సన్నద్ధత పూర్తవుతుంది.
ఎస్‌బీఐ పీఓ పరీక్షల్లో సాధారణంగా పీఓ పరీక్షలో అడిగే తరహా ప్రశ్నలతో పాటుగా కొత్త తరహా ప్రశ్నలను ప్రవేశపెడుతుంటారు. అన్ని సబ్జెక్టుల్లో ఈ తరహా ప్రశ్నలుంటాయి. అంతకుముందు అడగని అలాంటి ప్రశ్నలు సాధించడానికి అభ్యర్థులు సన్నద్ధమై ఉండగలగాలి.
ఎస్‌బీఐ పి.ఒ. ప్రధాన పరీక్షావిధానంలో గత సంవత్సరం (2016) నుంచి మార్పు చేశారు. అంతకుముందు పరీక్షల్లో నాలుగు విభాగాలకు కలిపి 200 ప్రశ్నలు సాధించడానికి 2 గంటల సమయం ఉండేది. దాని స్థానంలో ప్రశ్నల సంఖ్యను 155కు కుదించి సమయాన్ని 3 గంటలకు పెంచారు. దీన్నిబట్టి ప్రశ్నలు ఏ స్థాయిలో ఉంటాయో అవగతం చేసుకోవచ్చు.
డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌
ప్రధాన పరీక్షలో ఈ విభాగంలో 35 ప్రశ్నలు 60 మార్కులతో ఉంటాయి. వీటిని సాధించడానికి 45 నిమిషాల సమయం ఉంటుంది. వీటిలో ప్రశ్నలు టేబుల్స్‌, లైన్‌గ్రాఫులు, బార్‌ డయాగ్రములు, పై చార్టుల నుంచి ఎక్కువగా ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువగా గ్రాఫులున్న మిక్స్‌డ్‌ గ్రాఫ్‌ మోడల్స్‌ ఉంటాయి. గ్రాఫుల మధ్య ఉన్న సంబంధాన్ని త్వరగా తెలుసుకుని ప్రశ్నలు సాధించాలి.
వీటితో పాటు డేటా సఫిషియన్సీ, పర్మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ, ఇతర అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలు కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ బాగా నేర్చుకుని సాధారణ స్థాయి నుంచి హెచ్చుస్థాయి వరకూ వివిధ ప్రశ్నలు బాగా సాధన చేయాలి.
గత సంవత్సరం పరీక్షలో ఏదేని రెండు క్వాంటిటీలను కనుగొని వాటి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే నూతన తరహా ప్రశ్నలు అడిగారు. ఈ విభాగానికి చాలా సాధన అవసరం. అభ్యర్థులకు పర్సంటేజి, ఏవరేజి, రేషియో- ప్రపోర్షన్‌ల మీద చాలా పట్టు ఉండాలి.
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌
ఈ విభాగంలో 45 ప్రశ్నలు 60 మార్కులతో ఉంటాయి. వీటిని సాధించడానికి 60 నిమిషాల సమయం ఉంటుంది. గత ఏడాది పరీక్షలో 40 ప్రశ్నలు రీజనింగ్‌ నుంచీ, 5 ప్రశ్నలు కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ నుంచీ ఇచ్చారు. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌లో ఒక ఫ్లో చార్టు ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలను అడిగారు.
రీజనింగ్‌ విభాగంలో అభ్యర్థులు అధిక స్థాయిలో సన్నద్ధమవాలి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్‌ టెస్ట్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, కోడెడ్‌ ఇనీక్వాలిటీస్‌, నంబర్‌ కోడింగ్‌, డేటా సఫిషియన్సీ, ఎలిజిబిలిటీ టెస్ట్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ అసంప్షన్స్‌, స్టేట్‌మెంట్‌- కంక్లూజన్స్‌/కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్స్‌/ఇన్‌ఫరెన్సెస్‌ విభాగాలు ముఖ్యమైనవి. వీటిన్నిటినీ బాగా సాధన చేయాలి. ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి త్వరగా సాధించగలిగేలా సాధన ఉండాలి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
ఈ విభాగం 35 ప్రశ్నలు, 40 మార్కులతో ఉండి వీటిని సాధించడానికి 40 నిమిషాల సమయం ఉంటుంది. గత ఏడాది పరీక్షను గమనిస్తే సాధారణంగా గ్రామర్‌ ఆధారంగా అడిగే ప్రశ్నలకు భిన్నంగా నూతన తరహాలో కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఒక పాసేజీని ఖాళీతో ఇచ్చి ఆ ఖాళీని ఆప్షన్లలోని వాక్యం ద్వారా భర్తీ చేయడం, 5 ఆప్షన్లలో ఏదేని పాసేజ్‌కి సంబంధించిన 4 స్టేట్‌మెంట్స్‌తో పాటు సంబంధిత 5 వ స్టేట్‌మెంట్‌ను గుర్తించడం లాంటి తరహా ప్రశ్నలున్నాయి.
ఇంగ్లిష్‌ భాషపై పట్టు ఉంటే ఇలాంటివి బాగా చేయగలుగుతారు. అదేవిధంగా సాధారణంగా అడిగే జంబుల్డ్‌ సెంటెన్సెస్‌, కరక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, క్లోజ్‌ టెస్ట్‌ మొదలైనవి ఇతర మోడల్‌ ప్రశ్నలు కూడా వస్తాయి. వీటితోపాటు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌ ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు గ్రామర్‌ బాగా చూసుకుని వీలైనన్ని మోడల్‌ ప్రశ్నలు సాధించడం సాధన చేయాలి. పాసేజి వేగంగా చదివితే అర్థం చేసుకునేలాగా ఉండాలి.
ప్రాథమిక పరీక్షకు ఉండే రెండున్నర నెలల సమయంలో ప్రాథమిక, ప్రధాన పరీక్షలో ఉండే మూడు విభాగాలను పూర్తిచేసు కోవటం తగిన వ్యూహం!
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌
ఇది 40 ప్రశ్నలు, 40 మార్కులతో ఉండి రాయటానికి 35 నిమిషాల సమయం ఉంటుంది. ఈ విభాగంలో పరీక్షకు ముందు 4, 5 నెలల వరకూ ఉన్న తాజా పరిణామాలపై ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సంబంధ విషయాలపైనే ప్రశ్నలు అధికంగా వస్తాయి.
ఆర్‌బీఐ, నీతి అయోగ్‌ లాంటి కేంద్రప్రభుత్వ ఆర్థిక సంస్థలు, స్టాక్‌ మార్కెట్‌, కేంద్రప్రభుత్వ పథకాలు, భారత ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంకులు-టాగ్‌ లైన్స్‌, ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, బ్రిక్స్‌ మొదలైన అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంతర్జాతీయ విషయాలు, పెద్దనోట్ల రద్దు-అనంతరణ పరిణామాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం లాంటివాటిపై ప్రశ్నలు వస్తాయి.
విషయాలన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కేవలం ప్రశ్నకు జవాబు అన్న రీతిలో కాకుండా పరిణామాలను విశ్లేషించేవిధంగా సన్నద్ధత ఉండాలి. సరిగా సిద్ధమైతే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగే విభాగమిది.
హెచ్చుస్థాయిలో ఉండే పరీక్ష కాబట్టి అభ్యర్థుల సన్నద్ధత అదే విధంగా ఉండాలి. ప్రాథమిక పరీక్షకు ఉండే రెండున్నర నెలల సమయంలో ప్రాథమిక, ప్రధాన పరీక్షలో ఉండే మూడు విభాగాలను పూర్తిచేసుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాన్ని ప్రాథమిక పరీక్ష తర్వాత చూసుకున్నా సరిపోతుంది. దానికి దాదాపు నెల రోజుల సమయం ఉంటుంది.
అత్యధికులైన అభ్యర్థులు పోటీపడే స్థాయి ఎక్కువ ఉండే పరీక్ష అయినప్పటికీ మొదటిసారి రాసే అభ్యర్థులు కూడా విజయం సాధించడానికి సరిపోయే సమయం ఉంది. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సరిగా వినియోగించుకోవాలి!

Website

Notification


Back..

Posted on 13-02-2017