Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఏ బోర్డులో చేరాలి?

పక్కింటి పిల్లాడు ఇంటర్‌నేషనల్‌ స్కూలు, ఎందురింటి బాబు సీబీఎస్‌ఈ, పైపోర్షన్‌లో పాప ఐసీఎస్‌ఈ... మనకేమో స్టేట్‌ బోర్డా... చిన్నతనంగా లేదూ? ఇదీ సగటు తల్లిదండ్రుల ఫీలింగ్‌. అయినా ఎక్కడ చదివినా ఆఖరికి రాష్ట్ర సిలబస్‌కి రావాల్సిందేలే.. అని ఇంకొందరి నిష్ఠూరాలు.

అలాంటి అపోహలేమీ అవసరం లేదంటున్నారు నిపుణులు. ప్రతి బోర్డు సిలబస్‌కీ ప్రత్యేకతలు, లక్ష్యాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, అవకాశాలను అనుసరించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలల అడ్మిషన్ల హడావిడి మొదలవుతోంది. అటు విద్యార్థులూ, ఇటు తల్లిదండ్రులూ అందరినీ వేధించే ప్రశ్న.. ఏ సిలబస్‌లో చేరాలి? సెంట్రలా.. స్టేటా? సీబీఎస్‌ఈ ఎందుకు తీసుకోవాలి? రాష్ట్ర బోర్డులనే ఎంచుకుంటే లాభమేంటి? ఏది మంచిది? ఒకదాంట్లో చేరితే ఇంకోదాని వల్ల వచ్చే ప్రయోజనాలను నష్టపోతామా... తెలుసుకోవాలంటే ఆయా బోర్డుల తీరుతెన్నులపై స్థూలంగా అవగాహన తెచ్చుకోవాలి.


శీతాకాలంతోపాటు ప్రవేశాల సీజన్‌ మొదలైంది. చాలామంది తల్లిదండ్రులు సిలబస్‌, బోర్డు విషయంలో రకరకాల సందేహాలతో తర్జన భర్జనలు పడుతున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌, ఐబీ, ఐజీసీఎస్‌ఈ... ఎంచుకోవడానికి ఆప్షన్లు పెరగడంతో ఎటువైపు అడుగులేస్తే పిల్లల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందో బేరీజు వేసుకుంటున్నారు! అన్ని బోర్డులపై స్థూలంగా అవగాహన తెచ్చుకుంటే తమ అవసరాలకు తగిన నిర్ణయం తీసుకోవటం సులువు అవుతుంది!
నచ్చిన బోర్డును ఎంచుకోవాలా? మెచ్చిన స్కూల్లో చేర్చాలా? ఈ సందిగ్ధత చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. అయితే ఆయా బోర్డులు అందించే చదువుల విషయంలో విద్యార్థుల లక్ష్యాల, అవసరాలపరంగా అనుకూలతలూ, ప్రతికూలతలూ ఉన్నాయి. స్పష్టంగా ఈ బోర్డు చదువులే విలువైనవి, గొప్పవి అని చెప్పే శాస్త్రీయ కొలమానాలేమీ లేవు. సిలబస్‌ ఏదైనప్పటికీ విద్యార్థులను జ్ఞానాత్మకంగా తీర్చిదిద్దడానికే రూపొందించారు.
సిలబస్‌ కంటే బోధించే విధానం, ఉపాధ్యాయుడి పాత్ర గొప్పది. అందువల్ల పిల్లలపై ఒత్తిడి లేని విద్యా సంస్థలను ఎంచుకోవడం ముఖ్యం. అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న పాఠశాలలకే మొగ్గు చూపడం మంచిది.
బోర్డు గొప్పదైనంత మాత్రాన పాఠశాల సరైనది కాకుంటే విద్యార్థికి ప్రయోజనం దక్కదు. అదే ఉన్నత ప్రమాణాలు పాటించే పాఠశాలలు ఏ బోర్డు సిలబస్‌ అందిస్తున్నా వాటిలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
ఎందుకంటే పైథాగరస్‌ సిద్ధాంతం, న్యూటన్‌ గమన నియమాలు, గుణింతాలు, కూడికలు, తీసివేతలు...ఇవన్నీ ఏ బోర్డులోనైనా మారవు కదా? విద్యార్థికి అర్థమయ్యేలా బోధించడమే కీలకం. ఇప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు ఆ పాఠ్యాంశాన్ని బోర్డుతో సంబంధం లేకుండా బాగా అధ్యయనం చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. ఇతర బోర్డుల నుంచి మంచిని గ్రహించి బోధనలో ఆచరిస్తున్నారు. చాలా పాఠశాలలు సైతం ఇలా ఇంటిగ్రేటెడ్‌ లర్నింగ్‌, టీచింగ్‌ విధానాల్ని ప్రోత్సహిస్తున్నాయి.
కాబట్టి బోర్డు, సిలబస్‌లపై ఎక్కువగా ఆలోచించకుండా తగిన అర్హతలున్న ఉపాధ్యాయులు, ప్రమాణాలు పాటించే పాఠశాలలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతోపాటు ప్రయోగశాల, గ్రంథాలయం, కనీస ఆటస్థలం మొదలైనవాటిని ఎంపికలో పరిగణనలోకి తీసుకోవచ్చు. సర్టిఫికెట్ల విషయానికొచ్చేసరికి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ.. మూడింటికీ సమాన విలువ, ప్రాధాన్యం ఉంటుంది.

అవసరాలకు అనుగుణంగా...
ప్రతి బోర్డూ ప్రత్యేకమైన బోధనాశైలిని అనుసరిస్తుంది. మీ అవసరాలు, ఇష్టాలకు అనుగుణంగా బోర్డులను ఎంచుకోవచ్చు. సీబీఎస్‌ఈ పాఠశాలలు విద్యా ప్రధాన నైపుణ్యాలను అందిస్తాయి. ఐబీ పాఠశాలలు పరిశోధనా సామర్థ్యాలను మెరుగుపర్చడానికీ, సమస్య పరిష్కారంపై దృష్టి సారించడానికీ దోహదపడతాయి. స్టేట్‌ బోర్డులో స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. సొంత రాష్ట్రంలో స్థిరపడి ఉన్నవారికీ, స్థానిక ఉద్యోగాలను కోరుకునేవారికీ స్టేట్‌ బోర్డు బాగుంటుంది. ఆంగ్ల భాష, సాహిత్యం, కమ్యూనికేషన్‌లపై ఐసీఎస్‌ఈ ఎక్కువ దృష్టి సారిస్తుంది. ప్రాథమికాంశాలకు ప్రాధాన్యం కల్పిస్తూ సిలబస్‌ విస్తృతంగా ఉంటుంది. ఐజీసీఎస్‌ఈ దాదాపు ఐబీ మాదిరిగానే ఉంటుంది. విదేశీవిద్యకు అనువైనది.

అది థియరీకి; ఇది ఆచరణకు...
ఎక్కువ పరీక్షలను సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగానే నిర్వహిస్తున్నారు. గణితం స్థాయి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ రెండు బోర్డుల్లోనూ దాదాపు ఒకేలా ఉంటుంది. అయితే ఐసీఎస్‌ఈలో కాస్త అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. సీబీఎస్‌ఈలో థియరీకి ప్రాధాన్యం ఉంది. అదే ఐసీఎస్‌ఈలో ఆచరణకు పెద్ద పీట వేశారు. సీబీఎస్‌ఈ పదోతరగతి సైన్స్‌ పరీక్షలో ఒక పేపర్‌ ఉంటే ఐసీఎస్‌ఈలో 3 పేపర్లు ఉంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ ఒక్కో సబ్జెక్టు నుంచి 80 మార్కులు చొప్పున రాత పరీక్షకు, 20 చొప్పున ఇంటర్నల్స్‌కు కేటాయించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ రెండు సర్టిఫికెట్లకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది.

సీబీఎస్‌ఈ
సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సంక్షిప్తరూపమే సీబీఎస్‌ఈ. విద్యార్థి కేంద్రంగా ఒత్తిడి లేని సంపూర్ణ విద్య అందించడమే లక్ష్యంగా దీన్ని నెలకొల్పారు. దేశవ్యాప్తంగా విస్తరించడమే కాకుండా పాతిక దేశాల వరకూ పరిధి పెంచుకుంది. ఒకటో తరగతి నుంచి ప్లస్‌ టూ వరకూ ఒకేచోట చదువుకోవచ్చు. సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిస్తుంది. పదో తరగతిలో ఆలిండియా సెకెండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌సీఈ), 12వ తరగతిలో ఆల్‌ ఇండియా సీనియర్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌సీఈ) పరీక్షలు నిర్వహిస్తోంది.
అనుకూలతలు
జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జేఈఈ, నీట్‌ ప్రశ్నపత్రాలను ఈ పాఠ్యపుస్తకాల ఆధారంగానే రూపొందిస్తున్నారు. ఈ సిలబస్‌లో మ్యాథ్స్‌, సైన్సెస్‌కి కొంచెం ప్రాధాన్యం లభిస్తోంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులు చదవాలనుకునేవారికి ఇది అనువైనది. కేంద్రప్రభుత్వ జనరల్‌ ఉద్యోగాలైన సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యంగా ఉన్నవారు, యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరవచ్చు. ఇతర రాష్ట్రాలకు బదిలీలు ఉండే తల్లిదండ్రులు సీబీఎస్‌ఈకి ప్రాధాన్యం ఇవ్వటం మేలు. ఆంగ్ల, హిందీ మాధ్యమాల్లో బోధన అందుతోంది.

ఐసీఎస్‌ఈ
కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఐఎస్‌సీఈ) ఆధ్వర్యంలో ఇండియన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ (ఐసీఎస్‌ఈ) పదో తరగతి వరకు చదువులు అందిస్తోంది. 11, 12 తరగతులకు ఐఎస్‌సీ పేరుతో విద్య అందిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉంటుంది. ఇది పూర్తిగా ప్రైవేటు సంస్థ. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వ చదువులు లభించవు. సిలబస్‌ విస్తృతం. ప్రాథమికాంశాలపై బాగా దృష్టి ఉంటుంది. సోషల్‌, సైన్సెస్‌, లాంగ్వేజెస్‌ అన్నింటికీ ప్రాధాన్యం లభిస్తోంది.
అనుకూలతలు
ల్యాబ్‌, ప్రాక్టికల్‌ వర్క్‌, అనలిటికల్‌ స్కిల్స్‌, ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం. జీఆర్‌ఈ, టోఫెల్‌, ఎస్‌ఏటీ మొదలైన పరీక్షలకు ఈ చదువులు ఉపయోగపడతాయి. వైవిధ్యమైన సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఆంగ్లం లేదా సాహిత్యాంశాల్లో రాణించాలనుకున్నవారు, విదేశాల్లో యూజీ కోర్సులు చదవాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. అయితే... జేఈఈ, నీట్‌ రాయాలనుకున్న ఐఎస్‌సీ విద్యార్థులు అదనంగా కొంత సమాచారం సీబీఎస్‌ఈ నుంచి చదువుకోవడం తప్పనిసరి. మారిన పరిస్థితుల దృష్ట్యా దేశంలో నిర్వహించే పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. పుస్తకాల ఖరీదు, ఫీజు సీబీఎస్‌ఈతో పోలిస్తే ఎక్కువ. సిలబస్‌ విస్తృతంగా ఉండడం వల్ల గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎక్కువ. ఇంటర్‌ విషయానికొచ్చేసరికి చాలా తక్కువ చోట్లే అందుబాటులో ఉంది.

స్టేట్‌ బోర్డు
బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో పదో తరగతినీ; బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో ఇంటర్‌ విద్యనూ తెలుగు రాష్ట్రాల్లో అందిస్తున్నారు. ఏపీ, తెలంగాణల్లోనే కాకుండా మహారాష్ట్ర, గోవా...మొదలైనచోట్ల స్టేట్‌ బోర్డు చదువులు బలమైన పునాదులతో పటిష్ఠంగా ఉన్నాయి. ప్రాంతీయ భాషల్లో చదువులు అందించడం స్టేట్‌ బోర్డుల ప్రత్యేకత. అయితే మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమంలోనూ బోధిస్తున్నారు. కొత్త బోర్డులు వచ్చినప్పటికీ వీటి కీర్తి ప్రతిష్ఠలు చెక్కు చెదరలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రామాలు, మండల కేంద్రాల్లో ఉన్న పాఠశాలలన్నీ స్టేట్‌ బోర్డునే అనుసరిస్తున్నాయి. ఈ సిలబస్‌ను ఎస్‌సీఈఆర్‌టీ పర్యవేక్షిస్తోంది.
అనుకూలతలు
ఎన్‌సీఈఆర్‌టీ నుంచి మంచి విషయాలను గ్రహించి, స్థానికతకు అనుగుణంగా మార్పులు చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో స్టేట్‌ బోర్డుకు ఆదరణ తగ్గలేదు. సాధారణ విద్యార్థులు, చురుకైనవారు ఇద్దరికీ అనువుగా ఉండేలా సిలబస్‌ మేళవించారు. తెలుగు, ఇంగ్లిష్‌లతోపాటు కొన్ని చోట్ల ఉర్దూ మాధ్యమాల్లో బోధన అందుతోంది. ఇప్పుడు ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలు దాదాపు ఎన్‌సీఈఆర్‌టీకి అనుగుణంగానే రూపొందించారు. కాబట్టి సీబీఎస్‌ఈ, స్టేట్‌ బోర్డుల మధ్య సిలబస్‌ పరంగా పెద్దగా వ్యత్యాసం లేదు. అయితే పరీక్ష విధానంలో స్వల్ప మార్పులున్నాయి. రాష్ట్రస్థాయిలో అవకాశాలు పొందాలనుకునేవారికి స్టేట్‌ బోర్డు చదువులు బాగుంటాయి. ఇతర బోర్డులతో పోల్చుకుంటే సిలబస్‌ సులువుగా, తక్కువ ఒత్తిడితో ఉంటుంది. ఒకే రాష్ట్రంలో స్థిరంగా ఉండే తల్లిదండ్రులు ఈ సిలబస్‌ ఎంచుకోవచ్చు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించే పిల్లలకు ఈ పాఠశాలలు బాగుంటాయి.

ఇంటర్నేషనల్‌ బాకలోరియట్‌ (ఐబీ)
విద్యార్థిని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సిలబస్‌ రూపొందించారు. విద్యార్థి ఇష్టమే ఇక్కడ ప్రమాణం, ఒత్తిడి ఉండదు. తరగతిలో తక్కువమంది విద్యార్థులుంటారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆదర్శవంతంగా ఉంటుంది. అందువల్ల ప్రతి విద్యార్థిపైనా పూర్తిస్థాయి పర్యవేక్షణ సాధ్యమవుతుంది. సిలబస్‌ కూడా మేటిగా రూపొందించారు. ఈ విద్యాసంస్థల ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. అందువల్ల ఫీజులు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. స్వేచ్ఛగా నేర్చుకునే విధానానికే ప్రాధాన్యం. ఈ విధానంలో బోధించే ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ కలిగి ఉంటారు. ప్రైమరీ ఇయర్స్‌ ప్రోగ్రాం (పీవైపీ), మిడిల్‌ ఇయర్స్‌ ప్రోగ్రాం (ఎంవైపీ), డిప్లొమా ప్రోగ్రాం (డీపీ) అని మూడు భాగాలుంటాయి. ఇవి మన అయిదు, పది, ఇంటర్‌ వరకు చదువుల్లా అన్నమాట. మనదేశంలో మూడు ప్రోగ్రాంలు కలిపి అందిస్తోన్న సంస్థలు చాలా తక్కువే. మహా నగరాల్లోనే ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి.
అనుకూలతలు
ఈ విధానంలో అడ్మిషన్లు, పరీక్షల సీజన్‌ భారతీయ విద్యావిధానానికి భిన్నంగా ఉంటాయి. దేశీయంగా నిర్వహించే పోటీ పరీక్షలతో సంబంధం లేకుండా విదేశాల్లో యూజీ తప్పనిసరిగా చదవాలి అనే లక్ష్యం ఉన్నవారు, ఎలాంటి ఆర్థిక సమస్యలు లేనివారు ఐబీలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ప్రస్తుతం దేశంలో ఉన్నత స్థాయి కుటుంబాలు, సంపన్న వర్గాలు, ఉన్నతోద్యోగులు తమ పిల్లలను ఐబీ పాఠశాలల్లో చదివించడం ట్రెండ్‌ గా మారింది. దేశవ్యాప్తంగా 157 ఐబీ స్కూళ్లు ఉన్నాయి. స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎస్‌ఏటీ), టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ మొదలైన పరీక్షలకు ఈ సిలబస్‌ ఉపయోగపడుతుంది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో నిర్వహించే పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకున్నవారు ఐబీలో చేరకపోవడమే మంచిది. తరచూ విదేశాల్లో ఉండాల్సిన తల్లిదండ్రులు ఈ సిలబస్‌లో చేర్చడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

ఐజీసీఎస్‌ఈ
కేంబ్రిడ్జి అసెస్మెంట్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (సీఏఐఈ) ప్రాథమిక, సెకండరీ, అడ్వాన్స్‌డ్‌ స్థాయుల్లో విద్య అందిస్తోంది. ఇంటర్నేషనల్‌ జనరల్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ (ఐజీసీఎస్‌ఈ)- కేంబ్రిడ్జి యూనివర్సిటీ... మన పదో తరగతికి సమానమైన కోర్సు. అందుబాటులో ఉన్న 70 సబ్జెక్టుల్లో కనీసం 5, గరిష్ఠంగా 14 సబ్జెక్టుల వరకు విద్యార్థులు ఎంచుకోవచ్చు.
అనుకూలతలు
విదేశాల్లో యూజీ కోర్సులు చదవాలనుకునేవారికి ఇది అనువైనది. స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎస్‌ఏటీ), టోఫెల్‌ లాంటి పరీక్షలకు ఈ సిలబస్‌ ఉపయోగపడుతుంది. క్రిటికల్‌ థింకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, కాన్సెప్ట్‌లకు ప్రాధాన్యం ఉంటుంది. అయితే...ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేంబ్రిడ్జి సిలబస్‌ అందిస్తోన్న పాఠశాలలు 40లోపే ఉన్నాయి. ఫీజు ఇంచుమించు ఐబీ స్థాయిలోనే ఉంటుంది. దేశీయంగా నిర్వహించే పోటీ పరీక్షలకు ఈ సిలబస్‌ అనువైనది కాదు. అయితే దీని లక్ష్యం కూడా అది కాదు.

Back..

Posted on 20-11-2018