Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సైన్స్‌ పీజీలో ప్ర‌వేశాలు

ఒకవైపు బీఎస్‌సీ పరీక్షలూ, ఆ వెంటనే స్వల్ప కాలవ్యవధితో జరిగే ఎమ్మెస్సీ ప్రవేశపరీక్ష సన్నద్ధతతో విద్యార్థులు బిజీగా ఉన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పీజీ ప్రవేశపరీక్షలు ప్రారంభం కానున్నాయి. బేసిక్‌ సైన్సెస్‌, బయాలజీ సబ్జెక్టులకు పోటీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ కల నెరవేరాలంటే, విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించాలంటే.. ఎంట్రన్సులకు ఎలా తయారవ్వాలి?

మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మెటీరియల్‌ సైన్స్‌, నానో టెక్నాలజీ సబ్జెక్టులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఎం.ఎస్‌.సి. కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంట్రన్స్‌లకు ఈ సబ్జెక్టుల్లో విద్యార్థులు ఎక్కువగా పోటీపడుతున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లతోపాటు బయాలజీ సబ్జెక్టులైన బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీలకూ పోటీ అధికమే!

బీఎస్‌సీ పరీక్షలకు కొన్ని ఎంచుకున్న టాపిక్స్‌ చదివితే సరిపోతుంది. కానీ పీజీ ప్రవేశపరీక్షకు సిలబస్‌ మొత్తాన్నీ అనువర్తిత ధోరణిలో చదవాలి. 10+2 సిలబస్‌తో ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి. తెలుగు అకాడమీ, సీబీఎస్‌సీ పుస్తకాలు రిఫర్‌ చేసి బేసిక్‌ కాన్సెప్ట్‌లపై పట్టు పెంచుకోవాలి. ఆపై బీఎస్‌సీ సిలబస్‌ను టాపిక్‌వారీగా రిఫరెన్స్‌ పుస్తకాల ద్వారా చదవాలి.

పీజీ కోసం ఎంచుకున్న సబ్జెక్టు డిగ్రీ స్థాయి పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. వివిధ అంశాలను అన్వయించడం తెలుసుకోవాలి. అది ఎంట్రన్స్‌ పరీక్షలకు పునాది. ఎంట్రన్స్‌ మోడల్‌ పేపర్‌ ప్రకారం పరీక్షలకు సిద్ధమవ్వాలి..ప్రస్తుతం ఉన్న పోటీ¨ని బట్టి చూస్తే ప్రవేశపరీక్షలో 60-70 శాతం మార్కులు సాధిస్తే సీట్లు రావచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ, డిగ్రీ పూర్తయినవారూ రోజుకు కనీసం 6-8 గంటలు చదవాలి. పవేశపరీక్షల్లో సమయం ముఖ్యమైనది కాబట్టి నమూనా పరీక్షలను బాగా సాధన చేయటం అవసరం.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ
హెచ్‌.సి.యు. పీజీ ఎంట్రన్స్‌లో ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక పద్ధతిలో నిర్వహిస్తారు. నెగిటివ్‌ మార్కులుంటాయి. సరైన సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయాలి.
* బయోకెమిస్ట్రీ, యానిమల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌లో 80-90 శాతం బయాలజీ, 10-20 శాతం కెమిస్ట్రీ సంబంధ ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బయాలజీని అనువర్తితంగా చదవాలి.
* ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలను మాత్రమే అడుగుతారు. కాబట్టి సమగ్రంగా చదవటం అవసరం.

సీయూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌
మనదేశంలో 10 సెంట్రల్‌ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ ఎం.టెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎం.ఎస్‌.సి.ల అన్ని కోర్సులకూ, ఇంటిగ్రేటెడ్‌ బి.ఎస్‌.సి, బీఈడీకీ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. నెగిటివ్‌ మార్కులుంటాయి. ప్రతి పరీక్ష వ్యవధి 2 గంటలు.

మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీయట్‌ విద్యార్థులు ఎం.సెట్‌., ఐ.ఐ.టి. ప్రవేశపరీక్షలకు సంసిద్ధులై ఉంటారు కాబట్టి పార్ట్‌-బి విభాగంలోని సిలబస్‌ వారికి సుపరిచితమే. అందుకని పార్ట్‌-ఎ ప్రశ్నలపై అధిక దృష్టిని పెట్టాలి.

ఎలా సిద్ధం కావాలి?
ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ ప్రవేశపరీక్ష బయోకెమిస్ట్రీ సిలబస్‌లో Amino Acids & Proteins, Carbohydrate Metabolism, Enzymes, Biochemical Techniques, Cell-Signalling టాపిక్స్‌ నుంచి అధిక ప్రశ్నలను అడుగుతున్నారు. జెనెటిక్స్‌, మాలిక్యులార్‌ బయాలజీ సిలబస్‌లో డి.ఎన్‌.ఎ. ధర్మాలు, ఆర్‌.డి.ఎన్‌.ఎ. టెక్నాలజీ, ట్రాన్స్‌లేషన్‌, ట్రాన్స్‌స్క్రిప్షన్‌ మొదలైన టాపిక్స్‌ మీద అధిక దృష్టి పెట్టాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో రియాక్షన్‌ మెకానిజం, స్టీరియోకెమిస్ట్రీ, నేమ్‌డ్‌ రియాక్షన్స్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీలో కెమికల్‌ కైనటిక్స్‌, థర్మోడైనమిక్స్‌ సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి. ఇనార్గానిక్‌ కెమెస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనాలిటికల్‌ కెమిస్ట్రీలపై అధిక దృష్టిని కేంద్రీకరించాలి. మ్యాథమేటిక్స్‌ మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, కాల్‌క్యులస్‌, వెక్టర్స్‌, ట్రిగొనామెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీలను సమగ్రంగా చదవాలి. ఇతర ఎంట్రన్స్‌ సబ్జెక్టులు రాసేవారికంటే వీరు ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి.

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశపరీక్ష రాసే విద్యార్థులు ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీల మీద శ్రద్ధ పెట్టాలి. కెమిస్ట్రీతోపాటు మ్యాథ్స్‌ బేసిక్‌ సిలబస్‌నూ చదవాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో జనరల్‌ కెమిస్ట్రీ, రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, నేమ్‌డ్‌ రియాక్షన్స్‌, రియొజెంట్స్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్‌, కెమికల్‌ కెనటిక్స్‌, క్వాంటమ్‌ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలను అధ్యయనం చేయాలి. ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ ఎంట్రన్స్‌ రాసేవారు ఫిజికల్‌ ఆప్టిక్స్‌, క్వాంటమ్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, వేవ్స్‌, ఆసిలేషన్స్‌, క్వాంటమ్‌, స్పెక్ట్రోస్కోపి, న్యూక్లియర్‌, అటామిక్‌ ఫిజిక్స్‌, హీట్‌, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌ సంబంధిత సిలబస్‌పై అనువర్తిత ధోరణిలో సిద్ధం కావాలి. ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్‌ ప్రవేశపరీక్ష రాసేవారు మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, కాల్‌క్యులస్‌, వెక్టర్స్‌, ట్రిగొనామెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీ సబ్జెక్టులను శ్రద్ధగా సాధన చేయాలి.

తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో

తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీల ఎమ్మెస్సీ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాలు బహుళైచ్ఛిక పద్ధతిలో ఉంటాయి. విద్యార్థులు సబ్జెక్టును అనువర్తిత ధోరణిలో చదివి ఆపై ఇదే తరహా ప్రశ్నలున్న రిఫరెన్స్‌ పుస్తకాలూ, మోడల్‌, పూర్వ ప్రశ్నపత్రాలను అభ్యాసం చేయాలి.

ఈ పీజీ పరీక్షల్లో 100 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సివుంటుంది. నెగిటివ్‌ మార్కులుండవు కాబట్టి అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల ఎంట్రెన్స్‌లకు 100 శాతం ప్రశ్నలు అయా సబ్జెక్టుల నుంచే అడుగుతారు.



Back..

Posted on 19-04-2018