Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వృద్ధుల సేవలో వీరు స్పెషలిస్టులు

జీవితానుభవంతో తర్వాతి తరాలకు మార్గదర్శనం చేసే వయో వృద్ధులు సమాజాభివృద్ధిలో ముఖ్య భాగం. సీనియర్‌ సిటిజన్ల సంరక్షణ, వారి బాగోగులు చూసుకోవటం ఇప్పుడు ఉపాధి మార్గంగా ఉంది. వైద్యరంగంలో డిగ్రీ గానీ డిప్లొమా గానీ ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. వీరికోసం విభిన్న రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి!

గతంతో పోలిస్తే మనిషి ఆయుర్దాయం పెరిగింది. పెద్దవయసులో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వీటిని అధిగమించటం సవాలుగా మారుతుంది. వృద్ధుల సంరక్షణలో భాగంగా... వారి సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు సూచించటానికి ప్రత్యేక శాస్త్రం ఉంది. ఇదే జెరంటాలజీ. దీనిలో నిపుణులు జెరంటాలజిస్టులు. ఆధునిక సమాజంలో వీరి ప్రాధాన్యం దృష్ట్యా ఈ రంగాన్ని అధ్యయనాంశంగా, ఎంచుకుని ఉపాధి పొందేవారి సంఖ్య పెరుగుతోంది!

వయోజనులు ఎదుర్కొనే సమస్యలు విభిన్నంగా ఉంటాయి. వారి జీవ, శారీరక, మానసిక, సామాజిక మార్పులపై అవగాహన లేకపోతే వాటిని సవ్యంగా పరిష్కరించటం సాధ్యం కాదు. జెరంటాలజీలో బయో జెరంటాలజీ, సోషల్‌ జెరంటాలజీ అనే రెండు శాఖలున్నాయి. బయో జెరంటాలజీ... జీవ సంబంధ పరిణామాలు, వయసు పెరుగుతున్నకొద్దీ వివిధ అంగాల సామర్థ్యం దెబ్బతినడం వల్ల తలెత్తే సమస్యలను అధ్యయనం చేస్తుంది. సోషల్‌ జెరంటాలజీ.. వయసు పెరగడం వల్ల తలెత్తే సామాజిక సమస్యల గురించి పరిజ్ఞానం అందిస్తుంది.

వయోవృద్ధులు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటారు. వీటిని గుర్తించడంలో ఒక్కోసారి సాధారణ ఎంబీబీఎస్‌ వైద్యులు సఫలం కాకపోవచ్చు. జెరంటాలజీ సంబంధిత కోర్సులు చేసినవారు ఈ విషయంలో తగిన వైద్యసహాయం, సమగ్ర సంరక్షణను అందించగలుగుతారు. ఈ విభాగంలో కెరియర్‌ను అన్వేషించదలిచినవారికి కొన్ని నిర్దిష్ట లక్షణాలుండాలి.

* వృద్ధులతో కలసి పనిచేయడాన్ని ఆస్వాదించగలగాలి.
* వాక్చాతుర్యం, నిరంతర ఉత్సాహం అవసరం.
* వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగు పరచాలంటే... సహనంతో వ్యవహరించే స్వభావం ఉండాలి.
* ఆత్మవిశ్వాసం, సమస్యలను వేగంగా పరిష్కరించే నేర్పు ఉండాలి.
* వీటన్నింటితోపాటుగా వృద్ధులు చెప్పేది సావధానంగా వినగలగాలి.

పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు
జెరంటాలజీతో సంబంధమున్న వివిధ కోర్సుల వివరాలు చూద్దాం.
1. నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, హైదరాబాద్‌
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జెరియాట్రిక్‌ మెడిసిన్‌.
కాలవ్యవధి: ఏడాది. ఎంబీబీఎస్‌ పూర్తిచేసినవారు అర్హులు. వయః పరిమితి లేదు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ కోర్సును పూర్తిచేస్తే వృద్ధుల అనారోగ్య సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం సంపాదించవచ్చు. జెరియాట్రిక్స్‌ విభాగంలో రోజువారీ వైద్య సేవలను అందించవచ్చు.
పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జెరియాటిక్‌ మెడిసిన్‌ (పీజీడీజీఎం)
కాలవ్యవధి: ఏడాది
2. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమ్‌ ఎకనామిక్స్‌ (ఐ.హెచ్‌.ఇ.), ఎఫ్‌-4, హౌజ్‌ ఖాస్‌, బ్లాక్‌-ఎఫ్‌, పోలీస్‌ కాలనీ, న్యూదిల్లీ - 110 016.
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ అండ్‌ సోషల్‌ జెరంటాలజీ.
3. ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ, న్యూదిల్లీ
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జెరియాట్రి¨క్‌ మెడిసిన్‌
4. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ డిఫెన్స్‌ (ఎన్‌.ఐ.ఎస్‌.డి.), వెస్ట్‌ బ్లాక్‌-1, వింగ్‌-7, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఆర్‌.కె.పురం, న్యూదిల్లీ-110 066.
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఇన్‌ జెరియాటిక్‌ కేర్‌
కాలవ్యవధి: ఏడాది
5. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టి.ఐ.ఎస్‌.ఎస్‌.), డియోనర్‌ బస్‌స్టాప్‌ ఎదురుగా, వి.ఎన్‌.పూరవ్‌ మార్గ్‌, ముంబయి-400088.
కోర్సు: పార్ట్‌టైమ్‌ డిప్లొమా ఇన్‌ జెరంటాలజీ
కాలవ్యవధి: ఏడాది
6. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కౌన్సెలింగ్‌, బి-83, గ్రౌండ్‌ ఫ్లోర్‌ అండ్‌ బేస్‌మెంట్‌, గుల్‌మెహర్‌ పార్క్‌, న్యూదిల్లీ-110 049.
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జెరంటలాజికల్‌ కౌన్సెలింగ్‌
కాలవ్యవధి: ఏడాది
7. రామ్‌నారియన్‌ రుయా కాలేజ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైకాలజీ, థర్డ్‌ ఫ్లోర్‌, ఎల్‌.నప్పొ రోడ్‌, మతుంగ, ముంబయి - 400 019.
కోర్సు: సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ జెరంటాలజీ
కాలవ్యవధి: 4 నెలలు

ఉద్యోగావకాశాలు..
వైద్య, ఆరోగ్య రంగంలో మేనేజర్లుగా, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌, మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌లుగా ఉద్యోగాలు పొందవచ్చు.
మెడికల్‌ క్లినిక్‌లు, గవర్నమెంట్‌ అండ్‌ ప్రైవేట్‌ హాస్పిటళ్లు, నర్సింగ్‌ హోమ్‌లలో ఉద్యోగాలు పొందవచ్చు. పనిచేస్తూ సంపాదించే అనుభవంతో సొంతంగా హాస్పిటల్‌నూ ఏర్పాటుచేసుకోవచ్చు.
అర్హతలు, అనుభవం, పనిచేసే సంస్థను బట్టి వేతనం ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ ఈ రంగంలో వేతనమూ పెరుగుతుంది.


Back..

Posted on 20-02-2019