Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అంతకు మించి...!

* అదనపు నైపుణ్యాలకు డిగ్రీలోనే పునాది!

కళాశాల విద్య అనగానే విద్యార్థులందరికీ కొత్తగా రెక్కలొచ్చేశాయన్న భావన. అప్పటిదాకా ఉన్న చదువుల ఒత్తిడికి కొంత బ్రేక్‌ పడుతుంది. అయితే అంతిమంగా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవటం ఒక్కటే సరిపోదు. అంతకుమించి అదనపు నైపుణ్యాలను సాధించే ప్రయత్నం చేయాలి. పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో ప్రతిభచూపేలా కెరియర్‌కు చక్కని పునాది వేసుకోవాలి. అందుకు గ్రాడ్యుయేషన్‌ రోజులే తగిన సమయం మరి! ఆధునిక జీవితంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కళాశాల విద్యార్థి తనను తాను మార్చుకుంటూ స్థాయిని మెరుగుపరుచుకోవటం తప్పనిసరి. డిగ్రీ పూర్తవకముందే ముఖ్యమైన ఐదు రకాల లక్షణాలను అలవర్చుకుని, వాటిని పెంపొందించుకోవటానికి కృషి చేయాలి.

ఒక కళాశాలలో ఇటీవల ప్రాంగణ నియామకాలు జరిగాయి. కొన్ని ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. దాదాపుగా అందరూ అన్ని సంస్థలకూ దరఖాస్తు చేసుకున్నారు. ‘తప్పకుండా ఉద్యోగం సాధిస్తారు’ అని లెక్చరర్లు అంచనా వేసినవారిలో కొందరు ఒకటి రెండింట్లో ఎంపికయ్యారు. మరికొందరు చివర్లో పోగొట్టుకున్నారు. ‘యావరేజ్‌గా చదువుతారు’ అనుకున్నవారిలో కొందరు వీరికంటే మెరుగైన ప్రతిభ చూపించి ఆశ్చర్యపరిచారు. మార్కుల శాతంతో సంబంధం లేని ఇతర కీలక అంశాల్లో వారు చూపిన చొరవ, ప్రతిభే దీనికి కారణం. సాధారణంగా ఏ తరగతిలో అయినా బాగా చదివేవారు, ఓ మోస్తరుగా చదివేవారు, బాగా చదవనివారు అనే కేటగిరీలుంటాయి. బాగా చదివేవారికి ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయనే భావన కూడా ఉంటుంది. నిజానికి ఒకసారి గమనిస్తే..

* సంస్థలు అడుగుతున్న కనీస అర్హత 60 శాతం మార్కులు. చాలా తక్కువమంది మినహా దాదాపుగా అందరూ సాధించగల మార్కుల శాతమిది. కాబట్టి, మొదటి విడత వడపోత ఇక్కడే జరిగిపోతుంది.
* మిగిలినవారికి ఎంతో కొంత సబ్జెక్టు పరిజ్ఞానం తప్పకుండా ఉంటుంది. ప్రాథమిక విషయాలు, కాన్సెప్టులపై అవగాహన ఉంటే ఇంటర్వ్యూ వరకూ వెళ్లగలుగుతారు.
కానీ ఆ అసలైన మెట్టును దాటాలంటే మాత్రం సబ్జెక్టు పరిజ్ఞానం సరిపోవడం లేదు అదనపు సామర్థ్యాలు ఉన్నవారు మాత్రమే కొలువులను కొట్టగలుగుతున్నారు. కీలకమైన గ్రాడ్యుయేషన్‌ సమయాన్ని మార్కులకే పరిమితం చేయకూడదు. ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టడానికి అవసరమైన పునాది కూడా ఈ సమయంలోనే పడుతుంది. కాబట్టి అందుకు అనువైన లక్షణాలపై దృష్టిపెట్టడమూ తప్పనిసరే!
రానురానూ జాబ్‌ మార్కెట్‌లో ఎన్నో సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విద్యావిధానంలోనూ, పనిచేసే చోటా ఎన్నో మార్పులు వస్తున్నాయి.విద్యార్థికి పుస్తక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. సంస్థలు కూడా అభ్యర్థిలో సబ్జెక్టు పరిజ్ఞానం, మార్కుల శాతాలతోపాటు అదనపు నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. వాటిని రెజ్యూమెలో నామమాత్రంగానో చూపించడం ద్వారానో, ఇంటర్వ్యూకు ముందు సంసిద్ధమవడం ద్వారానో సంస్థలను మెప్పించలేరు.

1. స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఒత్తిడి నిర్వహణ)
పరీక్షలు దగ్గరపడుతున్నపుడు ఒత్తిడిని ఎదుర్కోవడం విద్యార్థికి అనుభవమే. కంపెనీల విషయానికొస్తే.. కీలక సమయాల్లో, పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు అభ్యర్థి ఎలా స్పందిస్తాడనేది సంస్థలు పరిశీలిస్తాయి. అంటే అసలు ఒత్తిడికి గురవ్వకూడదని కాదు. పనిచోట ఒత్తిడి అనేది సర్వసాధారణం. దాని నుంచి ఎంత త్వరగా బయట పడతారు? అందుకు అభ్యర్థి ఎంచుకునే మార్గాలేంటి అనేవి చూస్తారు.
ఎలా సాధించొచ్చు: విద్యార్థి తనను ఒత్తిడి నుంచి త్వరగా బయట పడేయగల మార్గాలను పరిశీలించుకోవాలి. ఉదాహరణకు- కొందరికి నచ్చిన పాట వినగానే మూడ్‌ మారిపోతుంది. కొందరికి మెడిటేషన్‌ చేయగానే అలసట దూరమైందన్న భావన కలుగుతుంది. ఇంకొందరికి ఎక్సర్‌సైజ్‌, ప్రకృతిని చూడటం, స్నేహితులతో మాట్లాడటం.. ఇలా ఏదైనా కావొచ్చు. వీటిలో తమకు తగినదేదో విద్యార్థి ఎంచుకోగలగాలి. ఒత్తిడిని త్వరగా దేన్ని దూరం చేస్తోందో ఆచరణలో పరిశీలించుకోవాలి.

2. టైం మేనేజ్‌మెంట్‌ (సమయపాలన)
ఒక వ్యక్తి పని పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాడన్న విషయం అతని సమయపాలన ద్వారానే అర్థమవుతుంది. తరగతి గదిలో ఎంత బాగా మార్కులు తెచ్చుకున్నప్పటికీ చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేయనివారి పట్ల ఉపాధ్యాయులు అంత ఆసక్తి కనబర్చకపోవడం గమనిస్తుంటాం కదా! ఇదీ ఒక రకమైన క్రమశిక్షణే. ఎంత మార్కులు సాధించినా.. ఆ క్రమశిక్షణే లేనపుడు వాటికి విలువుండదు. సంస్థలూ ఇందుకు మినహాయింపు కాదు. కేటాయించిన పనిని ఎంత కష్టపడైనా ఉద్యోగి సకాలంలో పూర్తి చేయాలనుకుంటాయి. అందుకు తగినవారని భావించినపుడే ఎంచుకుంటాయి.
ఎలా సాధించొచ్చు: ఇంటర్మీడియట్‌ వరకూ విద్యార్థి భయంతోనో, తల్లిదండ్రుల చొరవతోనో సమయపాలనను పాటిస్తుంటారు. డిగ్రీకి వచ్చేసరికి విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడుతుంది. కాబట్టి, కొద్దిగా పక్కకు వెళతారు. ఆ లోపం సవరించుకోవాలి. వారానికి తగ్గ ప్రణాళికను తయారు చేసుకోవాలి. తరగతులు, చదవడానికి, మిగతా కార్యకలాపాలు, స్నేహితులతో గడిపే సమయం, నిద్ర వంటి వాటన్నింటికీ అందులో చోటుండాలి. దాన్ని పక్కాగా పాటించాలి.

3. లీడర్‌షిప్‌ (నాయకత్వ నైపుణ్యాలు)
రానురానూ పెరుగుతున్న పోటీలో పని ప్రదేశంలో మనుగడ సాగించాలంటే నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. ఒక బృందంగా పని చేస్తున్నపుడు ఒక వ్యక్తి చేసే తప్పు అందరిపైనా ప్రభావం చూపించగలదు. అలాంటి సమయంలో ‘నా పని అయిపోయింది కదా! ఇతరుల దాంతో నాకేం పని’ అని భావించేవారికంటే ఆ వ్యక్తికి సాయం చేస్తూ, తమతోపాటు కలిసి సాగేలా మిగతావారు ప్రోత్సహించాలని సంస్థలు ఆశిస్తాయి. ఈ తరహా లక్షణం ఎదుటి వ్యక్తిలోని నాయకత్వ లక్షణాన్ని సూచిస్తుంది.
ఎలా సాధించొచ్చు: కళాశాల సమయంలో ఎన్నో గ్రూప్‌ ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు చేసే అవకాశాలు వస్తాయి. వీటిని చేసే క్రమంలో ఎన్నో అభిప్రాయాలు, సలహాలు రావొచ్చు. ఒక్కోసారి ఒకరి అభిప్రాయాలు ఇంకొకరితో విభేదించే అవకాశముంటుంది. అలాంటి సమయంలో సంయమనంతో ఆచరణ సాధ్యమైనవాటినీ, కాని వాటినీ వివరించగలగాలి. ఈ క్రమంలో ఎదుటివారు బాధపడకుండా చూడగలగాలి. కాలేజ్‌ ఫెస్ట్‌ల్లో పాలు పంచుకోవడం ద్వారా బృందంతో పనిచేసే అవకాశం లభిస్తుంది. పొరపాట్లకు బాధ్యత తీసుకోవడం, అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడం వంటివి అలవాటు అవుతాయి. ఇవన్నీ అలవర్చుకోవటం, పెంపొందించుకోవటం చేస్తే ఉద్యోగాన్వేషణ సులభతరం అవుతుంది!

4. కమ్యూనికేషన్‌ (భావప్రసరణ నైపుణ్యాలు)
చాలామంది విద్యార్థులు లెక్చరర్లను సందేహాలు అడగడానికి భయపడుతుంటారు. కొత్తవారితో మాట్లాడటానికి సందేహిస్తుంటారు. ఇలా కాకుండా ఎవరితోనైనా ఇట్టే మాట కలిపేయటం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఎదుటివాళ్లు చెప్పింది వినడం, విషయాన్ని ప్రభావవంతంగా చెప్పడమూ ప్రధానమే. ఉద్యోగులు తమ పనిలో భాగంగా బృందంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. క్లయింట్లతోనూ మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి, సంస్థలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాయి.
ఎలా సాధించొచ్చు: చుట్టూ ఉన్నవారితో మాట్లాడటం, లెక్చరర్లను సందేహాలు అడగడం వంటివి చేయొచ్చు. ప్రయాణాల్లో పక్కవారిని పలకరించడం, వారి గురించి తెలుసుకోవడం చేయొచ్చు. దీని ద్వారా నెట్‌వర్క్‌ పరిధి పెరగడంతోపాటు పరిజ్ఞానాన్నీ పెంచుకునే వీలుంటుంది. కళాశాలకు సంబంధించిన ప్రోగ్రాముల్లో పాల్గొనడమూ ఉపకరిస్తుంది.

5. క్రిటికల్‌ థింకింగ్‌ (సృజనాత్మక చింతన)
ఒక ఆలోచన ఆచరణ సాధ్యమవుతుందో లేదో తెలియాలంటే పలు విధాలుగా, వివిధ కోణాల్లో ఆలోచించాల్సి ఉంటుంది. ఇదే క్రిటికల్‌ థింకింగ్‌. సమస్య ఎదురైనపుడు దాని నేపథ్యం, పరిష్కరించే మార్గాలను తర్కం ప్రకారం ఆలోచించాలి. ఇది అభ్యర్థిలోని సృజనాత్మకతకూ పదును పెడుతుంది. సంస్థ పనిలో సమస్య ఎదురైనపుడు దానికి పరిష్కారం సూచించినపుడు.. చేసేవారి కంటే దాన్ని విశ్లేషించి సలహాలివ్వగలవారికి ప్రాముఖ్యం ఉంటుంది.
ఎలా సాధించొచ్చు: ఏదైనా ఒక పనిని చేస్తున్నపుడు దాన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చో ఆలోచించుకోగలగాలి. ఏదైనా ప్రాజెక్టు చేస్తున్నారనుకుంటే.. మిగతా వారి కంటే భిన్నంగా ఎలా చేయొచ్చో ఆలోచించాలి. ప్రెజెంటేషన్లు, కాలేజ్‌ నివేదికల విషయంలోనూ ఈ విధానాన్ని ప్రయత్నించొచ్చు.

Back..

Posted on 24-12-2018