Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నిర్లిప్తానికి లాక్‌డౌన్‌!

* పోటీ పరీక్షలకు స్మార్ట్‌ కిటుకులు

వారాల తరబడి లాక్‌డౌన్‌ అనిశ్చితిలో చిక్కుకుని, ప్రవేశ పరీక్షలకు తయారవ్వాల్సిరావటం ఇప్పుడు విద్యార్థులకు ఎదురవుతున్న సవాలు! లేనిపోని ఆందోళనలకూ, ఒత్తిడికీ తావివ్వకుండా, తొట్రుపాటుకు గురవ్వకుండా సబ్జెక్టుల అధ్యయనంపై పూర్తి దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయమిది. అయితే.. పాఠ్యాంశాల సారం గ్రహించే సందర్భంగా చేసే పొరపాట్లతో సన్నద్ధతలో అవరోధాలు ఏర్పడే అవకాశముంది. అవేమిటో... తెలుసుకుని లోపాలను సవరించుకుంటే సమగ్రంగా తయారై ధీమాగా పరీక్షలను రాయొచ్చు!

కొవిడ్‌-19 వైరస్‌ను మానవాళి ఎదుర్కొంటున్న ఈ విపత్కాలంలో అజాగ్రత్త, ఆందోళనలకు బదులు అప్రమత్తత, ధైర్యం ముఖ్యం. కానీ ఇంటికే పరిమితం చేసిన ఈ లాక్‌డౌన్‌లో నిర్లిప్తత, నిరుత్సాహం లాంటి భిన్నరకాల భావోద్వేగాలు విద్యార్థులను చుట్టుముడుతూనే ఉన్నాయి. స్టడీ రూములో ఉన్నప్పటికీ టీవీ వార్తలు పక్క గది నుంచి చెవినపడుతూంటే.. ఆలోచనలన్నీ కరోనా సంక్రమణ వేగంపైనో, లాక్‌ డౌన్‌ సడలింపులపైనో మళ్లుతూ, ఆ పరధ్యానంలో పరీక్షల సన్నద్ధత వెనక్కిపోతుంటుంది. వార్తలను పదేపదే చూడకుండా ఉండటం, వీలైనంతవరకూ టీవీకి దూరంగా ఉండటం ప్రధానం. చాలా సందర్భాల్లో ఒత్తిడి, ఆందోళనల మూలంగా విద్యార్థులు సరైన పంథాలో ప్రిపేర్‌ కాలేకపోతుంటారు.

అందుకే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ‘అనుకున్నంతగా చదవలేకపోతున్నాను’ అని దిగులు పడకూడదు. పరీక్షలంటే భయపడుతూ ‘ఫెయిలవుతామేమో’, ‘మార్కులు సరిగా రావేమో’ అంటూ బాధపడే మిత్రులకు ఫోన్‌లోనైనా పరీక్షల వరకూ దూరంగా ఉండటం మంచిది. ఇవన్నీ ఒత్తిడిని పెంచేస్తాయి. ఒత్తిడి కూడా అంటువ్యాధి లాంటిదే. నూరుశాతం టైమ్‌టేబుల్‌ను అనుసరించలేకపోయినప్పుడు బెంబేలు పడనవసరంలేదు.వీలైనంతవరకూ దాన్ని అనుసరించి చిత్తశుద్ధితో సిద్ధమైతే చాలు. పరీక్షలు మెరుగ్గా రాయటానికే కాదు, సన్నద్ధత సమయంలోనూ ప్రశాంతత, సానుకూల దృక్పథాలు అవసరమని గుర్తించాలి.

విద్యార్థులు పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని మెలకువలు పాటిస్తే స్మార్ట్‌గా, సమర్థంగా ప్రిపేర్‌ కావొచ్ఛు అవేమిటో చూద్దాం.

అన్నీ కుక్కేస్తే కష్టమే
చాలామంది విద్యార్థులు తక్కువ వ్యవధిలో ఎక్కువ విషయాలను కవర్‌ చేయాలనే ప్రయత్నంలో నిర్విరామంగా చదివేస్తుంటారు. ఏకబిగిన చదివేస్తూ పాఠ్యాంశాలను ఒకరకంగా మెదడులోకి కుక్కేస్తుంటారు. దీనివల్ల అనవసరమైన ఒత్తిడి తప్ప అనుకూల ఫలితమేమీ ఉండదు. ఏ విషయాన్నయినా సరిగా గ్రహించి, జీర్ణమవ్వటానికి కనీస సమయం పడుతుంది. ఇది గ్రహించి చదివే తీరును మార్చుకోవాలి. చిన్నచిన్న విరామాలు ఇస్తూ ప్రిపరేషన్‌ను ఆసక్తికరంగా, అర్థవంతంగా మల్చుకోవాలి. పుస్తకాలూ, నోట్సుల నుంచే కాకుండా వివిధ భావనలూ, ఫార్ములాలను ఫ్లాష్‌ కార్డుల రూపంలో పునశ్చరణ చేసుకోవచ్ఛు ఇలాంటి చిన్నచిన్న చిట్కాలు ప్రిపరేషన్‌ను ఉల్లాసభరితం చేస్తాయి. అదనపు మార్కులు తెస్తాయి.

రివిజన్‌కు బద్ధకించొద్దు
‘చదివేసిన పాఠ్యాంశాలే కదా, మరోసారి చదవటం ఎందుకూ..’ అని చాలామంది పునశ్చరణను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎంత బాగా చదివినప్పటికీ రివిజన్‌కొచ్చేసరికి బద్ధకిస్తుంటారు. ఒకసారి చదివినవి మళ్లీ చదవటం అంటే విసుగ్గా ఉంటుందనేది ఎక్కువమంది విద్యార్థుల ఫిర్యాదు. కానీ నిజానికి రివిజన్‌ అనేది అద్భుతమైన స్మార్ట్‌ వ్యూహం. టాపర్లందరూ ఉపయోగించే మెలకువ. ఇది గ్రహిస్తే రివిజన్‌ పట్ల ఉన్న అపోహ, వ్యతిరేక ధోరణి తగ్గిపోతుంది. తరచూ పాఠ్యాంశాలను పునశ్చరణ చేయటం అనేది అదనంగా చేసే పని కాదనీ, అది ప్రిపరేషన్లో కీలక భాగమనీ అర్థం చేసుకోవాలి.

నచ్చినవే చదివితే ఎలా?
పుస్తకంలో ముఖ్యమైన టాపిక్‌లనో, వ్యక్తిగతంగా నచ్చిన అంశాలనో చదువుతూ, వాటిపైనే అధికంగా దృష్టిపెట్టటం చాలామంది విద్యార్థులు చేస్తుంటారు. కష్టమైన మిగిలిన అంశాలను సరిగా చదవరు. కేవలం కొన్ని అంశాలు బాగా వచ్చినంతమాత్రాన వాటితోనే పరీక్ష సన్నద్ధత పూర్తికాదు. సిలబస్‌లోని ముఖ్యాంశాలను కవర్‌ చేసేలా సన్నద్ధమవ్వాలి. మార్కుల వెయిటేజిని గుర్తించి, ప్రాముఖ్యం ఇవ్వాల్సిన పాఠ్యాంశాలపై అధిక దృష్టిపెట్టాలి. మొత్తమ్మీద అధ్యయనం సమగ్రంగా ఉండాలి. కొందరు పుస్తకంలో మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకూ వరసగా, యాంత్రికంగా చదివేస్తుంటారు. మార్కుల వ్యూహం ఏదీ లేకుండా ఇలా అసంపూర్ణంగా, అరకొరగా చదివితే మెరుగైన మార్కులకు ఆస్కారమే ఉండదు.

నమూనా టెస్టుల ప్రయోజనం
పదేపదే చదవటంలో మునిగిపోయినప్పుడు నమూనా పరీక్షలకు వ్యవధి దొరకదు. ఒకవేళ దొరికినా నమూనా టెస్టులు రాసే బదులు ఆ సమయంలో మరింత ప్రిపేర్‌ అవ్వొచ్చు కదా అని ఆ పరీక్షలను పక్కనపెడుతుంటారు. ఇది పొరపాటు అవగాహన. చదివింది ఎంతవరకూ రాయగలుగుతున్నారో, ఏయే పొరపాట్లు చేస్తున్నారో ముందస్తుగా నమూనా పరీక్షలద్వారా తెలిస్తేనే కదా, వాటిని సరిదిద్దుకునే వీలుండేది! మాక్‌ టెస్టులను నిర్లక్ష్యం చేస్తే పరీక్షలో సమయనిర్వహణ దెబ్బతిని అంచనాలన్నీ తలకిందులవుతాయి. మార్కులు తగ్గిపోతాయి. ఆ ప్రమాదం జరక్కుండా పరీక్షలకు ముందే నిర్దిష్ట సమయం పెట్టుకుని ప్రశ్నలు సాధన చేయాలి. వేగంగా, కచ్చితంగా సమాధానాలు గుర్తిస్తున్నారో లేదో గమనించి, లోటుపాట్లు సవరించుకోవాలి.

మననం చేసుకుంటే మేలు
పాఠ్యాంశాలను పదేపదే చదివేస్తే/ పునశ్చరణ చేస్తే సరిపోతుందా? లేదు. చదివింది ఎంతవరకూ వచ్చిందో మననం చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. పుస్తకాలూ, నోట్సూ మూసేసి అంతకుముందు రోజు ఏయే అంశాలు సిద్ధమైందీ గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రయత్నపూర్వకంగా ఇలా చేసి ఆ సమాచారాన్ని లాంగ్‌టర్మ్‌ మెమరీలోకి బదిలీ అయ్యేలా చేయవచ్ఛు పాఠ్యాంశాన్ని రెండు మూడు సార్లు చదవటం (రిపీట్‌) తేలిక. కానీ ఇలా నిర్దిష్ట సమాచారాన్ని మెదడులోకి ప్రయత్నపూర్వకంగా పంపటం (రిట్రీవల్‌ ప్రాక్టీస్‌) కొంచెం కష్టం. కానీ ఈ కసరత్తు విద్యార్థులకు పరీక్షల్లో మేలు చేస్తుంది.

వేగంగా నేర్చుకునే టెక్నిక్‌
కొన్ని కాన్సెప్టులు చదివినప్పుడు అర్థమైనట్టే ఉంటాయి. కానీ కొద్దిరోజుల తర్వాత గుర్తు చేసుకోవాలని ఆలోచిస్తే.. అసలేమీ బోధపడదు. అంటే అవి సంపూర్ణంగా అవగాహన కాలేదని అర్థం. అందుకే నోట్సును ఎక్కువసార్లు బట్టీ పట్టి గుర్తుంచుకునే పద్ధతిని చాలామంది పాటిస్త్తుంటారు. ఇది పాసివ్‌ లర్నింగ్‌. ఇలా చదివినపుడు ఒక నిర్వచనం గుర్తుంటుంది కానీ అదేమిటో సరిగా అర్థం కాదు. దాన్ని కొంచెం మార్చి ఇచ్చినా ముందుకు ఎలా వెళ్లాలో అర్థం కాదు. విషయ అవగాహనతో నిమిత్తం ఉండదు కాబట్టి దీర్ఘకాలంలో ఇది ప్రయోజనకారి కాదు.
దీనికంటే యాక్టివ్‌ లర్నింగ్‌ మంచిదని నిపుణులు చెప్తున్నారు. అంటే విషయాన్ని అర్థం చేసుకుంటూ గుర్తుంచుకోవటం. దీనికి సంబంధించి నోబెల్‌ బహుమతి గ్రహీత రిచర్డ్‌ ఫైన్‌మన్‌ రూపొందించిన విధానం విద్యార్థులకు చాలా ఉపయోగకరం. విద్యార్థులు కొత్త కాన్సెప్టులనూ, సమాచారాన్నీ వేగంగా నేర్చుకోవటానికి తేలికైన విధానమిది.
ఫైన్‌మన్‌ టెక్నిక్‌లో నాలుగు దశలుంటాయి.
1. కాన్సెప్టును ఎంచుకోవటం: నేర్చుకోవలసిన కాన్సెప్టు పేరును తెల్ల కాగితం పై భాగంలో రాయాలి.
2. విద్యార్థికి బోధన: ఆ భావనను వివరిస్తూ కాగితమ్మీద రాయాలి. తేలిక భాషలో మాత్రమే రాయాలి. మిమ్మల్నో ఉపాధ్యాయునిగా ఊహించుకుని, ఓ హైస్కూలు విద్యార్థికి చెప్తున్నట్టుగా దాన్ని వివరించాలి. దీనివల్ల మీకెంత అర్థమైందో, ముఖ్యంగా ఏ విషయం స్పష్టంగా చెప్పలేకపోయారో తెలుస్తుంది.
3. లోపాల గమనింపు: మీ వివరణలో అస్పష్టంగా, అనుసంధానం లేకుండా ఉన్న అంశాలను గుర్తించి సమీక్షించుకోవాలి. పాఠ్యపుస్తకం తెరిచి, ఆ విషయాన్ని మళ్లీ చదివి, స్పష్టత తెచ్చుకోవాలి. దాన్ని కాగితమ్మీద తేలిక భాషలో రాసి, హైస్కూలు విద్యార్థికి చెప్తున్నట్టు వివరించాలి.
4. సులువుగా మార్చటం: రాసింది పరిశీలించాలి.. పుస్తకంలోని పదాలనే ఎక్కువ ఉపయోగించివుంటే ఇప్పుడు తేలికైన పోలికలతో భాషను సరళతరం చేయాలి.

ఒత్తిడిని పోగొట్టే చిట్కా
ఒక్కోసారి గుండె త్వరగా కొట్టుకోవడం, చెమట పట్టటం, అసౌకర్యం ఏర్పడి, విద్యార్థులు పాఠ్యాంశాలపై ఏకాగ్రత చూపలేకపోతారు. ఒత్తిడీ, ఆందోళనలే దీనికి కారణం. ఇలాంటపుడు వాటిని పోగొట్టి.. రిలాక్స్‌ అవ్వటానికి విద్యార్థులు చేయదగ్గ సరళమైన వ్యాయామం- లోతైన శ్వాస. దీనివల్ల ఎక్కువ ఆక్సిజన్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరాన్నీ, మనసునూ ప్రశాంతపరుస్తుంది. ఆందోళన ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా దీన్ని ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేస్తే మంచిదే.
* సౌకర్యవంతమైన ప్రదేశంలో నిటారుగా కూర్చోండి.
* ముక్కు ద్వారా నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకుంటూ మనసులో 5 అంకెలు లెక్కపెట్టండి. (5 సెకన్ల సమయం)
* శ్వాసను నిలిపి.. నెమ్మదిగా శ్వాస వదులుతూ మనసులో 5 అంకెలు లెక్కపెట్టండి.
అలా మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బట్టి ఐదు నుంచి పదిసార్లు దీన్ని పునరావృతం చేయాలి. అయితే మూర్ఛ సమస్య, గుండె జబ్బులు లాంటివి ఉంటే దీన్ని ప్రాక్టీస్‌ చేయడానికి ముందు వైద్యుడిని సంప్రదించాల్సివుంటుంది.

- సి. ఉమారాణి ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌

Back..

Posted on 18-05-2020