Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

మాటే మంత్రం!

విజయంలోనూ.. విరోధంలోనూ మన మాటలు.. హావభావాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవి ఎంత బాగుంటే అంతగా మన సామాజిక సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వీటినే శాస్త్రీయంగా వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ నైపుణ్యాలు అంటారు. విద్యార్థులుగా ఎదగాలన్నా, ఉద్యోగాలు సాధించుకోవాలన్నా.. సమాజంలో సక్సెస్‌ఫుల్‌గా నిలవాలన్నా.. ఇవి ఎంతో ముఖ్యం. వీటిలో కొన్ని సహజంగా అలవడితే.. మరికొన్నింటిని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నలుగురితో కలవడం.. నవ్వుతూ మాట్లాడటం అందరూ అనుసరించాల్సిన జీవన సూత్రం. అందుకే నోటి మాటలను, శారీరక సైగలనూ సమర్థంగా, సక్రమంగా వినియోగించుకునే సామాజిక మంత్రాలైన సోషల్‌ స్కిల్స్‌ను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి.

కళాశాలైనా.. ఆఫీసైనా.. ఇంట్లో మాటలైనా.. ఇంటర్వ్యూ అయినా నలుగురితో మాట్లాడటం, కలిసి పనిచేయడం తప్పనిసరి. అది సాఫీగా సాగడం అనేది మన మాటతీరు, ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. అవే తోటి వారితో మన సంబంధ బాంధవ్యాలను ప్రభావితం చేస్తాయి. అలాంటి విలువైన స్నేహాలు పొందాలన్నా.. అవసరమైన సమయంలో అందరి సహాయ సహకారాలు అందాలన్నా.. కొన్ని సోషల్‌ స్కిల్స్‌ (సామాజిక నైపుణ్యాలు) ఉండాలి. మంచి మానవ సంబంధాలకు, కెరియర్‌లో విజయానికి ఇవి ఎంతో అవసరం. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అలవర్చుకోవాలి. విద్యార్థి దశ నుంచి సాధన చేయడం మరీ మంచిది. సోషల్‌ స్కిల్స్‌ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి వెర్బల్‌ (మాట్లాడే), రెండోది నాన్‌ వెర్బల్‌ (శరీరభాష, చర్యలు) నైపుణ్యాలు.

మెప్పించేది మాటే!
సుధీర్‌ కొత్తగా కళాశాలలో చేరాడు. లెక్చరర్‌ పరిచయం చేసేటపుడు క్లాసులో అతనే టాప్‌ ర్యాంకర్‌ అని చెప్పారు. టాపర్‌ అనేసరికి అందరూ అతడితో స్నేహం చేయడానికి ఆసక్తి చూపారు. అయితే రోజుల వ్యవధిలోనే అందరూ అతడిని దూరం పెట్టడం మొదలు పెట్టారు. కారణం- సుధీర్‌ మాటెప్పుడూ అధికారం చెలాయిస్తున్నట్టుగా ఉంటుంది. చుట్టూ పరిస్థితులను పట్టించుకోకుండా తన మాటే నెగ్గించుకోవడానికి ఎంతసేపైనా వాదిస్తుండేవాడు. తాను సాధించిన ర్యాంకులు, అవార్డుల గురించే ఎప్పుడూ మాట్లాడేవాడు. తనకు నచ్చనివి చెప్పినా, తన మాటను కాదన్నా కోపాన్ని ప్రదర్శించేవాడు.
సుధీర్‌కి ఉద్యోగాన్ని సంపాదించడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలన్నీ ఉన్నాయి. అయితే సాంఘిక నైపుణ్యాలే కొరవడ్డాయి. అతడి పరిస్థితి నుంచి ఏం నేర్చుకోవచ్చు?
* మాట్లాడేటపుడు గొంతు ఏ స్థాయిలో ఉందో చూసుకోవాలి. మరీ నెమ్మదిగానో, మరీ పెద్దగానో మాట్లాడకూడదు.
* ఎదుటివారికి మీరేం చెబుతున్నారో అర్థమయ్యే స్థాయిలో మాట్లాడాలి. అయితే మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించాలి కానీ, వాదన చేస్తున్నట్లు అనిపించకూడదు.
* సంభాషించేటపుడు చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మీరు మాట్లాడేది పక్కవారికి ఇబ్బంది కలిగించేలాగానో, వారిపై ప్రభావం పడేలాగానో ఉండకూడదు.

ఎలా మెరుగుపరచుకోవాలి?
కొత్తవారితో మాట్లాడుతుండటం ద్వారా ఈ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు. అయితే సంభాషణను కొనసాగించాలంటే కొన్ని అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. తెలియని వ్యక్తులతో మొదటిసారి మాట కలిపేటప్పుడు సాధారణ విషయాలు, ప్రస్తుత పరిస్థితికి తగినవాటి గురించి ప్రస్తావించాలి. పూర్తిగా మీ వ్యక్తిగత విషయాలో, మీ గొప్పలు చెప్పుకునేలానో మాట్లాడకూడదు. ఉదాహరణకు- కళాశాల తోటి విద్యార్థులైతే..‘ఈ రోజు సర్‌ పాఠం బాగా చెప్పారు కదా!’, ‘మీ మొబైల్‌ చాలా బాగుంది. ధర ఎంత ఉంటుంది?’ ఇలా ప్రారంభించొచ్చు. అలాగే అవతలి వ్యక్తి దగ్గర నచ్చినవి- వస్తువులు కానీ, దుస్తులు, ప్రవర్తన కానీ ఉంటే అభినందించొచ్చు.

ఆపై సంభాషణ కొనసాగించడానికి సాధారణ అంశాల తరువాత వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించవచ్చు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపకాల గురించి అడగడం ద్వారా సంభాషణను పొడిగించడమే కాకుండా, అర్థవంతంగానూ మలచుకోవచ్చు. అయితే అడిగే విధానం మర్యాదగా ఉండాలి. అలాగే సంభాషణ ఇరువైపులా ఉండాలి. అవతలివారు ఏదైనా చెబుతున్నపుడు కేవలం వినడానికే పరిమితం కాకూడదు. ఎలా?, ఎప్పుడు, ఎందుకలా? అంటూ కొనసాగింపు ప్రశ్నలు వేయాలి. ఆ ప్రశ్నలు ఎదుటివారికి ఇంకా చెప్పాలి అనిపించాలి.

ఈ అంశాలు వద్దు: ఒక తెలియనివారితో మాట్లాడేటపుడు కొన్ని అంశాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా బాధ/ కోపం కలిగించే అవకాశమున్న విషయాల ప్రస్తావన తేకపోవడం మేలు. మతం, రాజకీయాలు, కుల ప్రస్తావన మొదలైనవి వీటి కిందకే వస్తాయి. ఇలాంటి వాటి ప్రస్తావన అప్పటిదాకా ఉన్న సానుకూల వాతావరణాన్ని మార్చే ప్రమాదముంది.

బాడీ లాంగ్వేజ్‌తో భద్రం
ఆమధ్య ఇంగ్లండ్‌తో భారత్‌ వన్డే సిరీస్‌లో ఆ దేశ క్రికెటర్‌ రూట్‌ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్‌ కిందకి వేసికొట్టి సైగలు చేశాడు. గుర్తుందా! అతడి చర్య మనవారికే కాకుండా ఆ దేశస్థులు కొందరికీ కోపం తెప్పించింది. మాటల్లో చెప్పేదానికంటే మన చర్యలు, బాడీలాంగ్వేజ్‌ ఎదుటివారికి ఎక్కువ శక్తిమంతంగా సమాచారాన్ని చేరవేస్తాయని ఈ ఉదాహరణ వల్ల తెలుస్తుంది. బాడీ లాంగ్వేజ్‌, చర్యలు కూడా సోషల్‌ స్కిల్స్‌లో భాగమే. పైగా విద్యార్థులూ, ఉద్యోగార్థులకూ ఇవి తప్పనిసరి. ఈ నైపుణ్యాలు వ్యక్తుల ఆత్మవిశ్వాసం, ప్రవర్తన వంటి అంశాలను అంచనా వేయడానికి పనికి వస్తాయి.

ఎలా ఉండాలి?
మన ఐ కాంటాక్ట్‌, ముఖ కవళికలు, చర్యలు ఏ సంకేతాలను ఇచ్చే అవకాశముందో గమనించుకుంటూ ఉండాలి. ఉదాహరణకు- ఐ కాంటాక్ట్‌ ఇవ్వకపోవడం, అందరికీ దూరంగా ఉండటం వంటి చర్యలు మాట్లాడటం ఇష్టం లేదన్న సంకేతాన్నిస్తాయి. కాబట్టి, ఎవరితోనైనా మాట్లాడేటపుడు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించేలా ఉండాలి.
* చేతులు కట్టుకోకూడదు, నిటారుగా నిలబడాలి. ఈ చర్యలు ఎదుటివారికి మంచి అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. ‌
* నిజమైన చిరునవ్వు పెదాలపై ఉండేలా చూసుకోవాలి. ఎదుటివారితో మాట్లాడటానికి మనం సుముఖంగా ఉన్నామనే విషయాన్ని అది బోధపరుస్తుంది. సంభాషణ ఆద్యంతం అది కొనసాగేలా చూసుకోవాలి.
* బయటికి వెళ్లేటపుడు మనపై మనం కొంత శ్రద్ధ పెట్టుకోవాలి. దుస్తులు, చెప్పులు వంటి వాటిని చూసుకోవాలి. ఆహార్యం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

తీర్చిదిద్దుకోండి.. ఇలా!
నలుగురి మధ్య ఉన్నప్పుడు ఇతరుల ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తుండాలి. వారిలో ఎవరిదైనా ప్రవర్తన నచ్చితే దానికి కారణాలను గమనించాలి. అంటే.. మాట్లాడేటప్పుడు వారి బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంది? ముఖ కవళికలు, ఐ కాంటాక్ట్‌ ఎలా ఇస్తున్నారు? వంటి అంశాలను పరిశీలించాలి. మనల్ని మెరుగుపరచుకోవడంలో అవసరమైతే వాటిని అనుకరించవచ్చు. ఇక్కడ రెండు విధాలుగా పరిశీలన ఉండాలి. ఇద్దరు తెలిసిన వ్యక్తుల మధ్య, తెలియని వ్యక్తుల మధ్య ఎలాంటి తేడాలున్నాయో గమనించాలి.

నేర్చుకున్నది ఉపయోగించాలి
నైపుణ్యాలను తెలుసుకోవడం, సాధన చేయడం ఒక ఎత్తయితే.. వాటిని ఉపయోగించడం మరో ఎత్తు. నేర్చుకోవడం పుస్తకాన్ని చదవడంలాంటిదైతే, ఉపయోగించడం ప్రాక్టికల్స్‌ లాంటిది. ఒకరకంగా మనల్ని మనం పరీక్షించుకోవడం అన్నమాట.
చొరవ చూపాలి: బ్యాంకులు, మార్కెట్లు మొదలైన చోట్ల ఇద్దరు నుంచి ముగ్గురు బిజీగా లేనివారిని ఎంచుకుని మాట కలపాలి. పరిస్థితికి అనుగుణంగా మాట్లాడాలి. ముందుగా మాట్లాడే ప్రయత్నం చేయాలి.
బిడియ పడొద్దు: అత్యవసర సమయంలో ఏదైనా అడగటానికి ఎలాగైతే వెనుకాడమో ఇక్కడా అదే సూత్రాన్ని అనుసరించాలి. కొత్త వారితో ఏదైనా సందేహాం లేదా ప్రశ్నలతో మాట కలపాలి. ఇది మనలోని బిడియాన్ని దూరం చేస్తుంది.
చెప్పేది వినాలి: వ్యక్తుల మనస్తత్వాలను బట్టి వారిచ్చే సమాధానంలోనూ మార్పు ఉంటుంది. కొందరు ఒక్కముక్కలో సంభాషణను ముగిస్తే, మరికొందరు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. ఏదైనా ముందు చెప్పేది వినాలి. ఉపయోగపడేదైతే వినియోగించుకోవాలి. మరీ ఎక్కువ సమయం తీసుకునే సంభాషణను అయితే దాన్ని ఎలా ముగించాలనే దానిపై అవగాహన వస్తుంది.
ఎక్కువమందితో మాట్లాడాలి: సోషల్‌ ఒకరిద్దరితో మాట్లాడి సంభాషణ సజావుగా అనిపించగానే ఈ నైపుణ్యాలు వచ్చేశాయని అనుకోకూడదు. మన మొదటి ప్రయత్నంలో సరైన వ్యక్తి ఎదురయ్యారని అర్థం. ఒక్కోసారి ఇందుకు విరుద్ధంగా జరిగినా బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే మనలో సోషల్‌ స్కిల్స్‌ లేవనీ కాదు. ఇది కూడా పాఠమే! మరోసారి ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది.
ఐ కాంటాక్ట్‌: ఎదురుగా ఉన్న వ్యక్తి కళ్లలోకి చూస్తూ మాట్లాడటం మన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. అలాగని మాట్లాడుతున్నంతసేపూ కళ్లలో కళ్లు పెట్టి అదేపనిగా చూడమని కాదు. ఎక్కువశాతం అంటే.. మాట్లాడుతున్న ప్రతిసారి కనీసం 3-5 సెకన్లపాటు కొనసాగిస్తే చాలు. సాధ్యమైనంత సహజంగా ఉండేలా చూసుకోవాలి.

సాధన ఎక్కడ? ఎలా?
ఈ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి సరైన ప్రదేశం- ఇల్లే. బాగా అలవాటైన ప్రదేశం కాబట్టి, భయం, కంగారు వంటివి ఉండవు. పైగా ఎలాంటి ఒత్తిడీ ఉండదు. అలాగే కుటుంబ సభ్యులతో సంభాషణను వీడియో తీసుకుని చూసుకుంటుండాలి. దాని ఆధారంగా మన బాడీ లాంగ్వేజ్‌ను ఎలా మెరుగుపరచుకోవచ్చో చూసుకోవాలి. అద్దం ముందు నిలబడి కూడా మాట్లాడి చూసుకోవచ్చు. ఇంకా అవసరమనుకుంటే కుటుంబంలో మన దగ్గరి వ్యక్తులు, స్నేహితుల సలహాలు అడగొచ్చు.

ముగింపూ ముఖ్యమే
సంభాషణను ఎంత మర్యాదగా ప్రారంభించారో, ముగింపూ అలాగే ఉండాలి. ఎదుటివారు మాట్లాడుతున్నపుడు మధ్యలో తుంచేసి వెళ్లిపోవడం వంటివి చేయవద్దు. నిజంగా మధ్యలో వెళ్లాల్సిన పరిస్థితే ఉంటే, మర్యాదగా ఆ విషయాన్ని తెలియజేయాలి. మనం చెప్పే విధానం అవతలి వాళ్లను బాధ పెట్టకూడదు. అలాగే వాళ్లు చెప్పిన విషయాలను మనం ఆసక్తిగా విన్నామనే అభిప్రాయాన్ని కలిగించగలగాలి. ‘నాకు ఆలస్యమవుతోంది. నేనిక వెళ్లనా! మళ్లీ మనం తప్పకుండా కలుస్తామనుకుంటున్నాను’, ‘మీతో మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు. ఇక నేను వెళ్లకపోతే బస్‌ మిస్‌ అవుతాను. మరి ఉండనా!’ లాంటి మాటలు ఇక్కడ ఉపయోగపడతాయి.


Back..

Posted on 27-06-2019