Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సోషల్‌గా జాబ్‌ సాధించవచ్చు బాస్‌

ఆధునిక సమాజం సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి నడుస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం అంటే దరఖాస్తు ఫారాలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు తప్పనిసరిగా ఉండేవి. ఇప్పుడు తరం మారింది. అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఉద్యోగార్థులు మంచి ఉద్యోగం సాధించడంలో, సంస్థలు నైపుణ్యం ఉన్న ఉద్యోగిని ఎంపిక చేసుకోవడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి...
సామాజిక మాధ్యమాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేవి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, లింక్డ్‌ఇన్‌, గూగుల్‌ప్లస్‌. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు, విద్యార్థులు ఈ సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి సంస్థల్లో భవిష్యత్‌ బాగుంటుంది? మీరు ఎంచుకున్న ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఏమిటి? ఒక సంస్థలో ఖాళీలను ఎలా భర్తీ చేస్తారు? లాంటి విషయాలు తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలు మంచి వేదికగా ఉపయోగపడతాయి.
* మీరు పంపిన రెజ్యూమె చూసిన ఏ సంస్థ అయినా గూగుల్‌లో మీ పేరుతో వెతికితే ఏయే వివరాలు ప్రత్యక్షమవుతాయో ఒకసారి పరిశీలించండి. అసందర్భంగా ఉన్న పోస్టులు, ఫొటోలు ఉంటే వాటిని తక్షణమే తొలగించండి. అలాగే మీకు సంబంధించిన సరైన సమాచారం మాత్రమే సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండాలి. అది కూడా అన్ని చోట్లా (ఫేస్‌బుక్‌, ట్విటర్‌, లింక్డ్‌ఇన్‌లో) ఒకేలా ఉండాలి. మంచి ఉద్యోగం పొందడానికి ఇది చాలా అవసరం.
* మీ రంగానికి సంబంధించిన ఇతర ఉద్యోగులు ఏ విధమైన పోస్ట్‌లు చేస్తున్నారు? వారికి సంబంధించిన వివరాలు ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నాయి? అనేది పరిశీలించండి. ఇది మీ ప్రొఫైల్‌లో ఉన్న లోపాలను సవరించుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే ఒక సంస్థ ఎలాంటి లక్షణాలున్న ఉద్యోగి కావాలని కోరుకుంటుందో అవి మీ ప్రొఫైల్‌లో ఉండాలి.
సామాజిక మాధ్యమాల్లో మీరు చేసే పోస్టులు, కామెంట్లు మీ వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రతిబింబించేలా ఉండాలి. మీ గౌరవానికి, వృత్తిపరంగా మీ విశ్వసనీయతకు భంగం కలిగించేలా అసలు ఉండకూడదు.
* ఫేస్‌బుక్‌లో మీ వ్యక్తిగత సమాచారం అందరికీ తెలిసేలా ఉంచకండి. మీ స్నేహితులు, బంధువులు మాత్రమే మీ వ్యక్తిగత విషయాలు చూడగలిగేలా సెట్టింగ్స్‌ను మార్చుకోండి. ఏదైనా కంపెనీ యజమాని గూగుల్‌లో సెర్చ్‌ చేయడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకునే అవకాశం ఉండదు.
* మీకంటూ ఒక సొంత యూఆర్‌ఎల్‌ సృష్టించుకోండి. దీన్ని లింక్డ్‌ఇన్‌, ట్విటర్‌లో మీ రెజ్యూమెతోపాటు ఉంచొచ్చు. దీని ద్వారా మీరు ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాలను వాడుతున్నట్లు సంస్థ యజమానులకు తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో మీరు సిద్ధహస్తులని కూడా అర్థమవుతుంది.
* వివిధ సంస్థల సమాచారంతోపాటు వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి తెలుసుకోవడానికి లింక్డ్‌ఇన్‌ మంచి వేదిక. కొన్ని సంస్థలు ఖాళీలను భర్తీ చేయడానికి ఎలాంటి ప్రకటనలు ఇవ్వవు. అలాంటి వాటిని ఒక జాబితా తయారు చేసుకుని, వాటిలో పనిచేసే ఉద్యోగులను లింక్డ్‌ఇన్‌ ద్వారా పరిచయం చేసుకోవచ్చు. ఇది మీ ఉద్యోగ వేటలో మీకు ఉపయోగపడుతుంది.
* మీరు ఉద్యోగ వేటలో ఉన్నారనే విషయం సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసేలా చూడండి (ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారైతే దానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి). మీకు ఎందులో ఆసక్తి ఉందో తెలిస్తే ఏదైనా సంస్థలో అవకాశం ఉందని వినగానే మీ స్నేహితుల జాబితాలో ఉన్నవారు ఆ విషయం మీకు తెలియజేస్తారు. ఏదైనా సంస్థలో ఇంటర్వ్యూకి హాజరుకాబోతున్నప్పుడు ఆ విషయాన్ని పోస్ట్‌ చేయడం కూడా మంచిదే.
* ఉద్యోగార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సామాజిక మాధ్యమం ఏదీలేదు. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన అంశాలు ఏ సామాజిక మాధ్యమంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటాయో తెలుసుకుని దాన్ని అనుసరించాలి. లింక్డ్‌ఇన్‌లో వివిధ రంగాలకు ప్రత్యేకమైన గ్రూపులు ఉంటాయి. అలాగే న్యూస్‌ లెటర్స్‌, బ్లాగులు, చర్చా వేదికల్లాంటివి ఉద్యోగాన్వేషణలో, మీ రంగంలో తాజా సమాచారం తెలుసుకోవడానికి బాగా తోడ్పడతాయి.
* మీకంటూ ప్రత్యేకంగా ఒక బ్లాగ్‌ ఉంటే మంచిది. అందులో సొంతంగా కథనాలు రాస్తుంటే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంతో అనుసంధానం కావొచ్చు. ఇది నేర్చుకోవడంపై మీకున్న తపనను తెలియజేస్తుంది. మీ పోస్ట్‌లను ఏదైనా సంస్థ యజమాని లేదా రిక్రూటింగ్‌ సంస్థల అధికారులు చూసి, నచ్చితే మీకు ఉద్యోగం ఇవ్వొచ్చు లేదా ఇప్పటికే మీరు ఆ సంస్థలో ఉద్యోగి అయితే మీకు ప్రమోషన్‌ దక్కొచ్చు.
* సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్‌ ఓపెన్‌ చేసి, అలాగే వదిలేయడం కూడా మంచిది కాదు. క్రియాశీలకంగా ఉండాలి. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ గ్రూప్‌లలో పాల్గొనవచ్చు. మీ నైపుణ్యాలను పంచుకోవచ్చు. ఇవన్నీ ఉద్యోగవేటలో మీకు ఉపయోగపడేటట్లు చూసుకోవాలి.
* సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండండి. వెబినార్లలో పాల్గొనండి. దీని ద్వారా మీ రంగానికి సంబంధించి మీకున్న విషయ పరిజ్ఞానం అవతలి వారికి తెలుస్తుంది. అయితే ఇదంతా సందర్భోచితంగా, సరైందిగా ఉండాలి.
* సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండటం ఉద్యోగార్థులకు అవసరమే! మంచి ప్రొఫైల్‌, ఫొటోలు పోస్ట్‌ చేయండి.
* బ్లాగుల్లో మీకు నచ్చిన అంశాలపై అర్థవంతమైన వ్యాసాలు రాయండి.
* ఆన్‌లైన్‌ సమావేశాల్లో పాల్గొనండి. మీ తెలివితేటలు, నైపుణ్యంతో కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించండి..!

Back..

Posted on 25-10-2016