Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఆ పదితో.. కొలువు పదిలం!

అన్ని ఉద్యోగాలకూ పోటీ ఎక్కువైపోతోంది. అందరినీ దాటి అనుకున్న కొలువు అందుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలి. అడుగడుగునా మారిపోతున్న ఆటోమేషన్‌ యుగంలో ఏ స్కిల్స్‌ ఉంటే విజయం వరిస్తుందో ఎలా తెలుస్తుంది? ఆందోళన కలిగించే ఈ ప్రశ్నకు లింక్‌డిన్‌ సమాధానం ఇస్తోంది. అంతా పరిశీలించి ఒక పది నైపుణ్యాలతో జాబితా రూపొందించింది. వాటిని నేర్చుకుంటే పదిలంగా కొలువులోకి చేరిపోవచ్చని చెబుతోంది.

కిరణ్‌.. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ ముందే. ఏ తరగతిలోనైనా తనే ముందు. సబ్జెక్టుపరంగా మంచి పరిజ్ఞానముంది. తన పరిశ్రమకు సంబంధించిన కొత్త పోకడలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. కానీ తన తరగతిలో ఇద్దరు ముగ్గురు మినహాయించి మిగిలినవారి పేర్లు కూడా తెలియదు. చదువే తన లోకం అన్నట్లుగా ఉంటాడు. కాలేజీలో గ్రూప్‌ అసైన్‌మెంట్‌ ఇచ్చినా తను విడిగా తన పని చేసుకుంటాడు, మిగతావాళ్ల గురించి పట్టించుకోడు.

అదే తరగతికి చెందిన నవీన్‌.. అందరితో కలిసిపోతాడు. ఏ పని ఎవరు చేయగలరో, ఎలా చేస్తే పూర్తవుతుందో బాగా తెలుసు. అందరికీ సాయపడతాడు. అతడితో పని చేయడానికి ఇతరులు ఇష్టపడతారు. సబ్జెక్టు పరిజ్ఞానం మాత్రం ఎప్పుడూ కాస్త వెనకే.

ప్రాంగణ నియామకాల్లో వీరిద్దరూ విఫలమయ్యారు. కిరణ్‌కు హార్డ్‌ స్కిల్స్‌ ఉన్నా సాఫ్ట్‌ స్కిల్స్‌ లేవు. నవీన్‌కు సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉన్నాయి గానీ హార్డ్‌ స్కిల్స్‌ లేవు. ఏ ఉద్యోగ దరఖాస్తు అయినా, ఇంటర్వ్యూ అయినా సంస్థలు ఈ రెండు రకాల నైపుణ్యాల కోసం చూస్తాయి. ఇవి రెండూ సమాంతరంగా సాగే రైలు పట్టాల్లాంటివి. ఏ ఒక్కటి దెబ్బతిన్నా ప్రయాణం అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి, ఉద్యోగ వేటలో విజయం సాధించాలనుకునే అభ్యర్థి తనలోని ఈ రెండు రకాల నైపుణ్యాలనూ ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఏమిటివి?
ఉద్యోగం పొందడానికి అవసరమైన, బోధన ద్వారా నేర్చుకోగలిగినవి హార్డ్‌ స్కిల్స్‌ కిందకి వస్తాయి. విద్యాబోధన, శిక్షణ ప్రోగ్రామ్‌లు, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు, కోచింగ్‌ల ద్వారా నేర్చుకునే నైపుణ్యాలు అన్నమాట. ఒకరకంగా ఒక ఉద్యోగం చేయడానికి అవసరమైన కనీస నైపుణ్యాలుగా వీటిని చెప్పొచ్చు. అయితే వీటికి నిర్ణీత ప్రమాణాలు ఉంటాయి. ఉదాహరణకు- ఒక ఉద్యోగానికి సంబంధించి ప్రకటనలో అడిగే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫలానా డిగ్రీ, ఫారెన్‌ లాంగ్వేజ్‌లో నైపుణ్యం, రాత నైపుణ్యాలు, మేథమేటికల్‌ నైపుణ్యాలు, కోడింగ్‌ నైపుణ్యాలు మొదలైనవి.
సాఫ్ట్‌ స్కిల్స్‌ సంగతి? ఒకరకంగా వ్యక్తి ఇతరుల పట్ల ప్రదర్శించే లక్షణాలు, స్వభావం, ప్రభావాలుగా వీటిని చెప్పొచ్చు. వీటిని హార్డ్‌ స్కిల్స్‌ మాదిరిగా చదివి నేర్చుకునే అవకాశం ఉండదు. అనుభవం, ప్రయత్నం ద్వారా నేర్చుకోవచ్చు. ప్రతి సంస్థా తమ ఉద్యోగులను ఎంచుకునే క్రమంలో ఈ నైపుణ్యాలు ఉండాలని ఆశిస్తాయి. సమయపాలన, సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌, నాయకత్వ లక్షణాలు, బృందంతో పనిచేయడం వంటివన్నీ వీటికి ఉదాహరణలు.

ఇప్పటికి ఇవీ!
కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో ప్రొఫెషనల్స్‌ కూడా ఉన్నారు. ఇది మంచి పరిణామమే! అయితే.. లింక్‌డిన్‌ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50,000 ప్రొఫెషనల్‌ స్కిల్స్‌ ఉన్నాయి. వీటన్నింటినీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం అసాధ్యం. దీంతో ఈ ఏడాదికిగానూ సంస్థలు ఎక్కువగా ఆశిస్తున్న హార్డ్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ పదింటిని జాబితాగా రూపొందించింది.

హార్డ్‌ స్కిల్స్‌
క్లౌడ్‌ కంప్యూటింగ్‌: గత కొద్దికాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ఇంటర్నెట్‌ ద్వారా వివిధ సేవలను అందించడమే క్లౌడ్‌ కంప్యూటింగ్‌. డేటా స్టోరేజ్‌, సర్వీసెస్‌, డేటాబేసెస్‌, నెట్‌వర్కింగ్‌, సాఫ్ట్‌వేర్‌ వంటి టూల్స్‌, అప్లికేషన్లు వీటిలో భాగం. హార్డ్‌డ్రైవ్‌లు, లోకల్‌ స్టోరేజ్‌ డివైజెస్‌ల్లో సమాచారాన్ని నిల్వ చేయడం కంటే ఇది సులువైన పద్ధతి. ఎక్కడి నుంచైనా సమాచారాన్ని తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఖర్చు, వేగం, భద్రత దృష్ట్యా కూడా ఇది చాలా అనుకూలం.
అనలిటికల్‌ రీజనింగ్‌: సరైన నిర్ణయాన్ని తీసుకునే క్రమంలో ఉపయోగించే డిడక్టివ్‌ స్కిల్‌గా దీన్ని చెప్పొచ్చు. పరిస్థితి/ సమస్యను విశ్లేషించాక వాస్తవాలను గమనించి, సమస్య పర్యవసానాలు, దానికి పరిష్కారాలను సూచించడం దీనిలో భాగం. ఇందుకు వివిధ వనరుల నుంచి సమాచారం అవసరం అవుతుంది. ఈ విధానంలో సమస్యలు త్వరగా, ప్రభావవంతంగా పరిష్కారమవుతాయి.
పీపుల్‌ మేనేజ్‌మెంట్‌: దీన్నే హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌గానూ వ్యవహరిస్తారు. ఒక సంస్థ విజయం సాధించాలన్నా, వైఫల్యం పొందాలన్నా దానిలో పనిచేసే వారిపైనే ఆధారపడి ఉంటుంది. వారు సరైన మార్గంలో వెళ్లేలా మేనేజర్‌ స్థాయి వారు చూసుకుంటారు. ఉద్యోగులను నడిపించడం, శిక్షణనివ్వడం, వారిని ప్రోత్సహించడం వంటివి వీరి బాధ్యత. ఉద్యోగుల ఎంపిక, తొలగింపు, వారి పనిని అంచనా వేయడం వంటివీ వీరే చూసుకుంటారు.
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌: సిరి, టెస్లా, నెట్‌ఫ్లిక్స్‌, పండోరా, గూగుల్‌ నెస్ట్‌, ఫ్లయింగ్‌ డ్రోన్లు.. తెలుసా? ఇవన్నీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో సంబంధమున్నవే. కంప్యూటర్‌ సైన్స్‌లో ఏఐ ఒక భాగం. టెక్నాలజీ, వ్యాపార సముదాయాల్లో ప్రసిద్ధి చెందిన సబ్జెక్టు ఇది. యంత్రాలను మానవునిలా ఆలోచించే శక్తి, తెలివితేటలిచ్చి ఉపయోగించడం, పనిచేసేలా అభివృద్ధి చేయడం. ఉదాహరణకు- గొంతును గుర్తుపట్టడం, సమస్యా పరిష్కారం, నేర్చుకోవడం, ప్లానింగ్‌ మొదలైనవి.
యూఐ/ యూఎక్స్‌ డిజైన్‌: యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఒక వస్తువు/ సర్వీస్‌కి సంబంధించి డిజైన్‌ విజువల్‌ డిజైన్‌, ఇంటరాక్షన్‌ డిజైన్‌ అంశాలకు సంబంధించింది. యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఆ వస్తువు, సర్వీస్‌ వల్ల కలిగిన అనుభవాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు- ఒక రెస్టారెంట్‌లో పాత్రలు, ప్లేట్లు, టేబుల్‌ వంటివి యూఐను సూచిస్తే, ఆహారం, సర్వీస్‌ వంటివి యూఎక్స్‌ను సూచిస్తుంది.
ఎక్కడ నేర్చుకోవచ్చు?: వీటికి సంబంధించిన కోర్సులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎడ్యురేఖ, ఎడ్‌ఎక్స్‌, కోర్స్‌ఎరా, విజ్‌ఐక్యూ, యుడెమి, యుడాసిటీ మొదలైనవి ఆన్‌లైన్‌లో ఈ కోర్సులను అందిస్తున్న వేదికలు.

సాఫ్ట్‌ స్కిల్స్‌
క్రియేటివిటీ (సృజనాత్మకత): ప్రతి అంశాన్నీ కొత్తగా ఆలోచించడంగా దీన్ని చెప్పొచ్చు. ఏదైనా పనిని ఇచ్చినపుడో, సమస్య ఎదురైనపుడో అందరూ చేసేలా కాకుండా భిన్నంగా, ప్రభావవంతంగా చేసేలా ప్రయత్నించడం. చేసే పనికి ఇది తాజాదనాన్ని తీసుకొస్తుంది. దీనిని సాధన ద్వారా మెరుగుపరచుకోవచ్చు.
ఎలా నేర్చుకోవచ్చు?: ఏదైనా అంశాన్ని తీసుకుని ఎదుటివారికి వివరించే/ రాసే ప్రయత్నం చేయడం; వివిధ రకాల పజిళ్లు, సమస్యలను పరిష్కరించడం; ప్రశ్నించుకోవడం వంటివి చేయడం ద్వారా మెరుగుపరచుకోవచ్చు.
పర్సువేషన్‌ (ఒప్పించడం): ఎదుటివారి ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రవర్తనలను అవతలి వ్యక్తి/ సంస్థ, పరిస్థితి, ఆలోచనలకు అనుగుణంగా మార్చుకునేలా చేయడం. దీనిని సమచారాన్ని చేరవేయడం, భావాలను వ్యక్తపరచడం ద్వారా సాధిస్తారు. ఉదాహరణకు- ఒక చిన్నపిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి ఏదైనా కావాలనిపించినపుడు అలిగో, ఏడ్చో దాన్ని దక్కించుకుంటాడు కదా? మార్కెటింగ్‌ వారు తమ వస్తువుపై ఆసక్తి కలిగించడానికి దానిలో ఆకర్షణీయ అంశాలను చెప్పడం ద్వారా కొనాలనే ఆసక్తిని వినియోగదారుల్లో కలిగించడం లాంటివి ఈ నైపుణ్యం కిందకే వస్తాయి.
ఎలా నేర్చుకోవచ్చు?: ఒకరిని దేనికైనా ఒప్పించాలంటే ముందుగా దాని గురించి పూర్తి సమాచారం తెలిసుండాలి. కాబట్టి, విషయం చిన్నదైనా, పెద్దదైనా దాని గురించిన పరిశోధన చేసుకుని ఉండాలి. పరిశోధన గుణాన్ని అలవాటుగా చేసుకోవాలి. శాంతం, ఓపికగా ఉండటాన్నీ అలవాటు చేసుకోవాలి.
కొలాబరేషన్‌ (సహకారం): ఇప్పటి ఉద్యోగాలు ఎక్కువగా ఎక్కువమంది కలిసి పనిచేసేవిగా ఉంటున్నాయి. పని పూర్తవడానికి అందరి సహకారం, సూచనలు అవసరమవుతుంటాయి. ఒకరకంగా బృంద విధిగా కూడా చెప్పొచ్చు.
ఎలా నేర్చుకోవచ్చు?: కళాశాల స్థాయిలో ఎన్నోసార్లు విద్యార్థులు కలిసి పనిచేసే అవకాశాలు వస్తుంటాయి. వాటిని వినియోగించుకోవాలి. ఒకవేళ అలాంటివాటికి దూరంగా ఉండే వారైతే ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. ముందుగా ఒకరిద్దరితో ఒక టాస్క్‌ను పూర్తిచేయడం లాంటివి చేస్తుండాలి. బృందం అన్నాక కొందరు త్వరగా చేసేవారు, కొందరు నెమ్మదిగా చేసేవారు ఉంటారు. ఇలాంటప్పుడు కోపం, అసహనాలకు తావివ్వకుండా ఒకరికొకరు తోడ్పాటునందించుకోవడం అలవాటు చేసుకోవాలి.
అడాప్టబిలిటీ (పరిస్థితులకు అనుగుణంగా మారడం): ఈ ఆధునిక యుగంలో మార్పులు త్వరితగతిన చోటు చేసుకుంటున్నాయి. వాటికి తగ్గట్టుగా వ్యక్తులూ మారాల్సి ఉంటుంది. ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావవంతంగా మార్పు చెందగల అభ్యర్థులకు విలువ ఎక్కువ.
ఎలా నేర్చుకోవచ్చు?: మార్పునకు సిద్ధంగా ఉండాలి. ఏదైనా పరిస్థితి ఎదురైనపుడు వెంటనే స్పందించకుండా దాన్ని పరిశీలించాలి. సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అందుకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉండాలి. గత పద్ధతులపై ఆధారపడకూడదు. నేర్చుకుంటూ ఉండాలి. అవసరమనుకుంటే సాయం తీసుకోవడానికీ సిద్ధంగా ఉండాలి.
టైం మేనేజ్‌మెంట్‌ (సమయ పాలన): నిర్దిష్ట పనుల్లో దేన్ని ఎప్పుడు చేయాలో, దేనికి ముందు ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకునే ప్రక్రియే టైం మేనేజ్‌మెంట్‌. మంచి సమయపాలన ఏ పనినైనా సులభతరం చేస్తుంది. ఒత్తిడిలోనూ తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయడం సాధ్యమవుతుంది. అందుకే సంస్థలు అభ్యర్థిలో ఈ లక్షణాన్ని చూస్తాయి.
ఎలా నేర్చుకోవచ్చు?: దేనికైనా ముందుగా ప్రణాళిక వేసుకునే ప్రారంభించాలి. దానిలోనూ ముందుగా దేన్ని చేయాలో, తరువాత ఏది చేయాలో నిర్ణయించుకోవాలి. ప్రతిదానికీ గడువు నిర్ణయించుకుని, ఆ ప్రకారం ముగించేలా ఉండాలి. ముందస్తుగా ప్రారంభించేలా ఉండాలి.


Back..

Posted on 06-06-2019