Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సాఫ్ట్‌స్కిల్స్‌ తో ఉద్యోగ సాధన

     వివిధ అంశాల్లో ప్రవీణులైన అభ్యర్థుల కోసం ఇప్పటి సంస్థలు చూస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే కంపెనీలు సాఫ్ట్‌స్కిల్స్‌ ఉన్నవారికోసం ఎదురుచూస్తున్నాయి. కేవలం ఒక అర్హత ఉంటే ఉద్యోగసాధనలో వెనకబడిపోవాల్సిందే.
కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కాలేకపోయినందుకు కలత చెందాడు రాహుల్‌. ఎందుకంటే అతడికి మంచి సాంకేతిక నైపుణ్యాలున్నాయి. టెక్నికల్‌ & ఆప్టిట్యూడ్‌ రాతపరీక్షలో అత్యధిక మార్కులే సాధించాడు. అందుకే తప్పకుండా ఉద్యోగం సంపాదిస్తాడని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఫలితం అనుకూలంగా రాలేదు.
రాహుల్‌ హెచ్‌ఆర్‌ రిక్రూటర్‌ మాధవన్‌ను కలిసి ఏం చేయాలో సలహా అడిగాడు. సాఫ్ట్‌స్కిల్స్‌ను మరింతగా మెరుగుపరచుకోవాల్సిన అవసరముందని ఆయన సూచించాడు.
రాహుల్‌ మాదిరే చాలామంది ఉద్యోగ నియామకాల్లో భాగంగా నిర్వహించే బృందచర్చ, మౌఖికపరీక్షల సమయాల్లో వెనకబడుతున్నారు. సాఫ్ట్‌స్కిల్స్‌ సరిగా పెంచుకోని ఫలితం వారికి చేదు అనుభవాలను అందిస్తోంది.
అదనంగా...
సాంకేతిక, ఉద్యోగ- సంబంధిత నైపుణ్యాలు విద్యార్థులకు ముఖ్యమే. కానీ ఉద్యోగాన్ని వెతుక్కోవటానికీ, వేగవంతమైన పురోగతికీ అవే సరిపోవు. సంప్రదాయ తరహా నియామకాలు పాతబడిపోయాయి. ప్రొఫెషనల్‌ మేనేజర్లు తమ ఉద్యోగులకు కొన్ని అదనపు నైపుణ్యాలుండాలని ఆశిస్తున్నారు. వాటినే సాఫ్ట్‌ స్కిల్స్‌/ లైఫ్‌ స్కిల్స్‌ అని వ్యవహరిస్తున్నాం.
సాఫ్ట్‌స్కిల్స్‌ అంటే ముఖ్యంగా వ్యక్తిగత నైపుణ్యాలు; సాంకేతికేతరమైనవీ, కంటికి కనిపించనివీ. ఇక హార్డ్‌ స్కిల్స్‌ అంటే రెజ్యూమెలో కనిపించేవి. అంటే- విద్య, అనుభవం, నైపుణ్యాల స్థాయి వంటివి.
పరిశ్రమ/ ఉద్యోగ తరహాతో సంబంధం లేకుండా ఎవరికైనా సాంప్రదాయిక హార్డ్‌ స్కిల్స్‌తోపాటుగా సాఫ్ట్‌స్కిల్స్‌ అవసరమే. మొదటివాటికి రెండోవి పరిపూర్ణతను తెస్తాయి. అదే సమయంలో హార్డ్‌స్కిల్స్‌ సాఫ్ట్‌స్కిల్స్‌ స్థానాన్ని భర్తీ చేయలేవు. సాఫ్ట్‌ స్కిల్స్‌ను వారంలోనో, రాత్రికి రాత్రే నేర్పడం కష్టం. సముచిత శిక్షణ, సాధనతోనే ఇవి అభివృద్ధి అవుతాయి. హార్డ్‌ స్కిల్స్‌ ఉన్నవారు చాలామందే ఉంటున్నారు కానీ, సంస్థలకు అవసరమైన సాఫ్ట్‌ స్కిల్స్‌ మాత్రం సమర్థులైన అభ్యర్థుల్లోనూ కొరవడుతున్నాయని నియామక సంస్థల ఫిర్యాదు.
పరిశ్రమ / ఉద్యోగ తరహాతో సంబంధం లేకుండా ఎవరికైనా సాంప్రదాయిక హార్డ్‌ స్కిల్స్‌తోపాటుగా సాఫ్ట్‌స్కిల్స్‌ అవసరమే. మొదటి వాటికి రెండోవి పరిపూర్ణతను తెస్తాయి. సాఫ్ట్‌ స్కిల్స్‌ను రాత్రికి రాత్రే నేర్పడం కష్టం. సముచిత శిక్షణ, సాధనతోనే ఇవి అభివృద్ధి అవుతాయి.
ఈ నైపుణ్యాల్లో ప్రధానమైనవి పరిశీలిస్తే...
భావ ప్రసరణ : ఉద్యోగ ఖాళీల ప్రకటనల్లో అతి సాధారణంగా కనిపించే అంశమిది. ఈ నైపుణ్యమున్న వ్యక్తి తోటి ఉద్యోగులతో బాగా కలిసిపోతాడు; సూచనలను సరిగా విని, బాగా అర్థం చేసుకుండుటా; తమ వాదాన్ని దూకుడుతనం లేకుండా ఇతరుల ముందుంచుతాడు. తను చేయదలిచిన పనికి తగ్గట్టుగా భావవ్యక్తీకరణ తీరును మార్చుకోగలుగుతాడు. మంచి భావవ్యక్తీకరణ సామర్థ్యాలుంటే తోటి ఉద్యోగస్థులతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగిస్తారు. నిర్మాణాత్మక విమర్శలనుంచి నేర్చుకోగలుగుతారు.
నిర్ణయాలను తీసుకునే సామర్థ్యం : నిర్ణయాలను తీసుకోవడంలో విభిన్న రీతులుంటాయి కానీ, తిరుగులేని నిర్ణయాన్ని తీసుకోవడమే ప్రధానం. వాస్తవాలను సేకరించడం, సలహా తీసుకోవడం, ముఖ్యమైన అంశాలనూ, ప్రత్యామ్నాయాలనూ పరిగణనలోకి తీసుకోవడం, పర్యవసానాలను దృష్టిలో ఉంచుకోవడం- మంచి నిర్ణయాన్ని తీసుకునేటపుడు ఇవన్నీ అవసరమే. చంచలమైన, దూకుడు నిర్ణయాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.
నిబద్ధత : యాజమాన్యం ఒకరిపై ఆధారపడని, విశ్వసనీయమైన, ఉత్సాహవంతులైన, కఠోర శ్రమను ఆస్వాదించగలిగేవారిని కోరుకుంటుంది. ఎందుకంటే నిబద్ధత కలిగిన ఉద్యోగులకు పనిని సమర్థంగా నిర్వహించడానికి అతి తక్కువ పర్యవేక్షణ, ప్రేరణ ఉంటే సరిపోతుంది.
సమయానికి తగ్గట్టుగా : తరచూ మారిపోయే పనివేళల్లో మనం పనిచేస్తుంటాం. కాబట్టి, వాటిని అనుసరించగల, వాటికి తగ్గట్టుగా మారిపోగల స్వభావం ఉంటే, మీరు సమయానికి తగ్గట్టుగా మారే అవకాశముంటుంది. మీ కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటపడగలిగితే అది మీకు లాభమే అవుతుంది. అంతకుముందు చేయనివాటిని కూడా ప్రయత్నించండి. సానుకూల దృక్పథం, ఆశావహ దృక్పథం, ఏదైనా చేయగలన్న తీరు కలవారిని యాజమాన్యాలు స్వాగతిస్తాయి.
సమయ పాలన : చేయాల్సిన గడువులు స్పష్టంగా లేనపుపుడు, మిగతావాటితో పోల్చితే సమయపాలనకు ప్రాధాన్యం ఎక్కువ. తరువాత ఏ అంశాలు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను కలిగిస్తాయో ఆలోచించాలి. తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఎన్నో పనులను చక్కబెట్టడం... గొప్ప వ్యక్తుల జీవితాలు నేర్పుతాయి. శాస్త్రీయమైన సమయ నిర్వహణలోనే ఉంది ఆ రహస్యమంతా.. దానిని గుర్తించగలగాలి.
నాయకత్వ నైపుణ్యాలు : సిబ్బందిని నియంత్రించే అధికారం మీకు ఇవ్వనప్పటికీ యాజమాన్యం మీలోని నాయకత్వ లక్షణాలను అంచనా వేస్తుంది. నాయకుడిగా ముందుకు నడిపించే లక్షణం, నిరంతరం అభివృద్ధి చెందాలనే కోరిక, తమనుంచి తాము ప్రేరణ పొందగల లక్షణం, సానుకూల దృక్పథం, ఎప్పుడు సూచనలను పాటించాలో, ఎప్పుడు ముందుండి నడిపించాలో తెలిసినవారికోసం సంస్థలు చూస్తాయి.
సృజనాత్మకత, సమస్యా పరిష్కారం : ఏ ఉద్యోగానికైనా సృజనాత్మకత, ఉహాత్మక ఆలోచన ముఖ్యం. తార్కిక జ్ఞానం, సృజనాత్మకతలను సమస్యల సాధనలో ఉపయోగించేవారిపై యాజమాన్యానికి ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఒకవేళ సమస్య, సమాధానాలు రెండింటినీ చూడగల మనస్తత్వం మీదైతే ఈ తరహా విధానం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిల్చోబెడుతుంది.
బృందంతో పనిచేయగలగడం : నేడు ప్రపంచం నవీకరణ సూత్రాన్ని పటిస్తోంది. నిరంతర మార్పు, సంస్థ విజయం బృందాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఉద్యోగులకు మేనేజ్‌మెంట్‌లోని అన్ని కోణాల్లో శిక్షణనివ్వడం తప్పనిసరైంది. ఉద్యోగులకు శిక్షణనిచ్చే ముఖ్యమైన అంశాల్లో బృందంతో కలిసి పనిచేయడం ఒకటి. మంచి బృంద సభ్యుడు బృంద లక్ష్యాలపై స్పష్టంగా ఉండి, వాటిని సాధించడానికి మిగతావారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వారు ఎటువంటి అరమరికలు లేకుండా, నిజాయతీగా, నిర్మాణాత్మక సలహాలను అందిస్తూ, ఇతరులు చెప్పేది శ్రద్ధగా ఆలకిస్తూ పనిచేయాలి.
బాధ్యతలను స్వీకరించడం : పనిని అభిమానించి, దానికి ధైర్యంగా తమ పేరును అనుసంధానించుకునే వారికోసం సంస్థలు చూస్తాయి. తప్పు జరిగినపుడు తప్పించుకోకుండా, ధైర్యంగా తప్పును ఒప్పుకునేవారిని గౌరవిస్తాయి. తప్పులు ఎవరైనా చేస్తారు. వాటికి ఎలా స్పందిస్తారు, ఏం నేర్చుకున్నారనేదే ప్రధానం.
ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం : కేటాయించిన వ్యవధిలోపే పని పూర్తిచేయటం, అత్యవసరమైన పనిని చేపట్టటం ఇలాంటి సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. ఈ ఒత్తిడిని ఎదుర్కొంటూనే చేతిలో ఉన్న పనిపై దృష్టి కేంద్రీకరించాలి. స్వల్ప సమయంలోనే గరిష్ఠ ఫలితం రావటానికి ఏ పద్ధతిని అనుసరించాలో నిర్ణయించుకోవాలి. ఒత్తిడిని ఎదుర్కోవటంలో మనిషికీ మనిషికీ తేడా ఉంటుంది. కానీ పని, ఒత్తిడీ ఒకటి లేకుండా మరొకటి సాధారణంగా ఉండవు. ఏ ఉద్యోగంలోనైనా ఎవరికైనా ఒత్తిడి సహజం. దీన్ని ఎదుర్కోగలిగే సత్తాపైనే విజయం ఆధారపడివుంటుంది.
లక్షణాల జాబితా
కొన్ని వ్యక్తిగత లక్షణాలే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మీ మిత్రులనూ, కుటుంబ సభ్యులనూ మీ మంచి లక్షణాలనూ, అంతగా మంచిగా లేని లక్షణాలనూ జాబితాగా రాయమని కోరండి. వాటిలో అందరూ ఎక్కువగా ప్రస్తావించినవాటిని గమనించండి. మీ బలాలను గుర్తించి, మీ ఉద్యోగార్హత నైపుణ్యాలను మెరుగుపరచటానికి ఈ కసరత్తు సహాయపడుతుంది.
నిరంతరం నేర్చుకుంటే మన మెదడు చురుకుగా ఉండి ఆరోగ్యకరంగా ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ సాఫ్ట్‌స్కిల్స్‌లోని కొన్ని అంశాలను తప్పకుండా మెరుగుపరచుకోగలుగుతారు. ఈ నైపుణ్యాలు మీకుంటే వాటిని మీ రెజ్యూమెలో, దరఖాస్తులో ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఇంటర్‌వ్యూలో కూడా సందర్భానుసారం ప్రస్తావించవచ్చు.

posted on 09.03.2015