Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొన్ని ప్రత్యేక కోర్సులు!

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌, బీఏ, బీకాం, బీఎస్సీ...లాంటి డిగ్రీ కోర్సుల‌తోపాటు విద్యార్థుల అభిరుచి మేర‌కు ప‌లు ఇత‌ర కోర్సులెన్నో ఉన్నాయి. ఆస్ట్రోబ‌యాల‌జీ, ప‌ప్పెట్రీ, ఆల్కహాల్ టెక్నాల‌జీ, కార్పెట్ టెక్నాల‌జీ, గాంధియ‌న్ థాట్‌, టీ టెస్టింగ్‌, వైన్ టెస్టింగ్‌ ...ఇలా ఎవ‌రికి న‌చ్చిన కోర్సులో వారు చేరొచ్చు. కొన్ని ప్రత్యేక‌ సంస్థల్లో మాత్రమే ఈ త‌ర‌హా కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆయా కోర్సుల వారీ వివ‌రాలు చూద్దాం...

కోర్సు: ఆల్కహాల్ టెక్నాల‌జీ
ఎక్కడ: వ‌సంత్‌దాదా సుగ‌ర్ ఇన్‌స్టిట్యూట్‌, పుణె (మ‌హారాష్ట్ర)
కోర్సు వ్యవ‌ధి: 22 నెల‌లు
సీట్లు: 120
అర్హత: బీఎస్సీ- కెమిస్ట్రీ/ బ‌యోటెక్నాల‌జీ/ మైక్రోబ‌యాల‌జీ లేదా బీటెక్ -కెమిక‌ల్/ బ‌యోటెక్నాల‌జీ
ఈ సంస్థను 1975లో ఏర్పాటుచేశారు. పంచ‌దార ప‌రిశ్రమ‌కు అవ‌స‌ర‌మైన పూర్తి స్థాయి ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేయ‌డం, అవ‌స‌ర‌మైన కోర్సులు రూపొందించ‌డం దీని ల‌క్ష్యం. చెర‌కు నుంచి ఆల్కహాల్ ఉత్పత్తి పెంచడానికి ఇండ‌స్ట్రియ‌ల్ ఫెర్మెంటేష‌న్ అండ్‌ ఆల్కహాల్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సును రూపొందించారు. ఈ సంస్థ సుగ‌ర్ టెక్నాల‌జీ, సుగ‌ర్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ టెక్నాల‌జీ, సుగ‌ర్ ఇంజినీరింగ్‌, సుగ‌ర్‌కేన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ల్లో పీజీ డిప్లొమా కోర్సుల‌ను అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.vsisugar.com

కోర్సు: కార్పెట్ టెక్నాల‌జీ
ఎక్కడ‌: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాల‌జీ, భ‌డోహి (ఉత్తర‌ప్రదేశ్‌)
కార్పెట్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాల‌జీలో ఈ సంస్థ బీటెక్ కోర్సును అందిస్తోంది. ఈ సంస్థ కేంద్ర వ‌స్త్రశాఖ ఆధ్వర్యంలో ప‌నిచేస్తుంది. వ‌స్త్రాన్ని త‌యారుచేయ‌డం, రంగుల‌ద్దడం, ఆర‌బెట్టడం, ఉత‌కడం...త‌దిత‌రాంశాల్లో త‌ర్ఫీదునిస్తారు. ప‌లు దూర‌విద్య, స్వల్ప వ్యవ‌ధి కోర్సుల‌ను కూడా ఈ సంస్థ అందిస్తోంది. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు బీటెక్ నాలుగో సంవ‌త్సరంలో హోమ్ టెక్స్‌టైల్ టెక్నాల‌జీ, అడ్వాన్స్‌డ్ టెక్స్‌టైల్ టెక్నాల‌జీ, టెక్స్‌టైల్ డిజైనింగ్ టెక్నాల‌జీ స్పెష‌లైజేష‌న్లను చ‌దువుతారు. ప‌లు స్వల్ప కాలిక వ్యవ‌ధి, దూర‌విద్య కోర్సులు ఐఐసీటీ అందిస్తోంది. వ‌స్త్ర ప‌రిశ్రమ‌లో సృజ‌నాత్మక‌త‌ను పెంపొందించి, నాణ్యమైన మాన‌వ‌వ‌న‌రుల‌ను వృద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో దీన్ని నెల‌కొల్పారు.
వెబ్‌సైట్‌: www.iict.ac.in

కోర్సు: మౌంటెనీరింగ్‌
ఎక్కడ‌: నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌, ఉత్తరకాశీ (ఉత్తరాఖండ్‌), ప‌లు ఇత‌ర సంస్థల్లో.
ప‌ర్వతారోహణ‌‌పై ఆస‌క్తి ఉన్నవాళ్లు, ప‌ర్వతారోహ‌ణ శిక్షకులుగా మారాల‌నుకున్నవాళ్లు ఈ కోర్సులో చేర‌వ‌చ్చు. ఆయా వ‌య‌సులు వారికి గ్రూప్‌ల వారీ ఏడాదిలో ప‌లు ద‌ఫాల‌గా బేసిక్‌, అడ్వాన్స్‌డ్ కోర్సులు అందిస్తున్నారు.
వెబ్‌సైట్‌: www.nimindia.net
కోర్సు అందించే ఇత‌ర సంస్థలు:
వింట‌ర్ స్పోర్ట్స్‌, ప‌హ‌ల్గమ్‌
వెబ్‌సైట్‌: www.pahalgam.in
అట‌ల్ బిహారీ వాజ్‌పాయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటినీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్‌, ప‌హాలీ
వెబ్‌సైట్‌: www.adventurehimalaya.org
హిమాల‌య‌న్ మౌంటినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌, డార్జిలింగ్
వెబ్‌సైట్: www.hmi-darjeeling.com
సోన‌మ్ గ్యాట్సో మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్, గ్యాంగ్‌ట‌క్

కోర్సు: ప‌పెట్రీ
ఎక్కడ‌: ముంబై యూనివ‌ర్సిటీ
తోలుబొమ్మలు త‌యారీపై ఆస‌క్తి ఉన్నవాళ్లకి ముంబై యూనివ‌ర్సిటీ ఒక చ‌క్కని వేదిక‌. ఇది నాలుగు నెల‌ల పార్ట్ టైం కోర్సు. ఇంట‌ర్ పూర్తిచేసిన‌వాళ్లు ఈ కోర్సులో చేరొచ్చు.
వెబ్‌సైట్: http://mu.ac.in

కోర్సు: రూర‌ల్ స్టడీస్
ఎక్కడ‌: భావ్‌న‌గ‌ర్ యూనివ‌ర్సిటీ, గుజ‌రాత్‌తోపాటు ప‌లు సంస్థలు
గ్రామీణ భారతం గురించి తెలుసుకోవాల‌నుకునేవారికి, గ్రామాల అభివృద్ధిపై ఆస‌క్తి ఉన్నవారికి స‌రిపోయే కోర్సు రూర‌ల్ స్టడీస్‌. పెంపుడు జంతువులు, పాడిప‌శువులు, వ్యవ‌సాయం, ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వులు, శిశువికాసం...త‌దిత‌రాంశాలు కోర్సులో భాగంగా బోధిస్తారు. ఆయా స్థానిక ప‌రిస్థితులు, అక్కడున్న వ‌న‌రులు ఉప‌యోగించి గ్రామాల‌ను ఎలా అభివృద్ధి చేయొచ్చో తెలిసేలా చేస్తారు. ప‌లు ప్రభుత్వ, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు గ్రామీణాభివృద్ధి కోసం కృషిచేస్తున్నాయి. కోర్సు పూర్తిచేసివ‌వాళ్లు ఇలాంటి సంస్థల్లో ఉపాధి పొందొచ్చు.
ఇత‌ర సంస్థలు...
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ సంస్థ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సు అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.nird.org.in
ఇందిరా గాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సు అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.ignou.ac.in
దేశంలోని ప‌లు యూనివ‌ర్సిటీలు రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో రెండేళ్ల ఎంఏ కోర్సు అందిస్తున్నాయి.

కోర్సు: ఆస్ట్రోబ‌యాల‌జీ
ఎక్కడ‌: ఇండియ‌న్ ఆస్ట్రో బ‌యాల‌జీ రీసెర్చ్ సెంట‌ర్‌, ముంబై
భూగోళం, అంత‌రిక్షం భ‌విష్యత్తులో ఎలా ఉండ‌బోతోంది, బ‌యాల‌జీ సాయంతో మాన‌వ మ‌నుగ‌డ‌ను మ‌రింత గొప్పగా ఎలా తీర్చిదిద్దవ‌చ్చు...లాంటి అంశాల‌పై ఆస‌క్తి ఉన్నవాళ్లు ఆస్ట్రోబ‌యాల‌జీ కోర్సును ఎంచుకోవ‌చ్చు. ఇండియ‌న్ ఆస్ట్రో బ‌యాల‌జీ రీసెర్చ్ సెంట‌ర్ - ఆస్ట్రోబ‌యాల‌జీ, ఆస్ట్రాన‌మీ, కాస్మాల‌జీల్లో డిప్లొమా కోర్సులు అందిస్తోంది. అంత‌ర్జాతీయ డిప్లొమా కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్‌: www.iarc.res.in

కోర్సు: గాంధియ‌న్ థాట్
ఎక్కడ‌: య‌శ్వంత‌రావ్ చ‌వాన్ మ‌హారాష్ట్ర ఓపెన్ యూనివ‌ర్సిటీ, నాసిక్‌
మ‌హాత్మా గాంధీ అనుస‌రించిన జీవ‌న‌విధానం, ఆయ‌న ఆలోచ‌న‌లు, వివిధ సంద‌ర్భాల్లో వ్యవ‌హ‌రించిన తీరు...ఇవ‌న్నీ సూక్ష్మ స్థాయిలో తెలుసుకోవాల‌నే జిజ్ఞాస ఉన్నవాళ్లు ఈ కోర్సులో చేరొచ్చు. గాంధీ విచాత్ ద‌ర్శన్ పేరుతో ఏడాది వ్యవ‌ధి ఉండే డిప్లొమా కోర్సును ఈ యూనివ‌ర్సిటీ అందిస్తోంది. కోర్సులో భాగంగా అహింస‌, స‌త్యాగ్రహ ఉద్యమం, గాంధీ త‌త్వం...అంశాల‌ను బోధిస్తారు.
వెబ్‌సైట్‌: http://ycmou.digitaluniversity.ac

కోర్సు: టీ టెస్టింగ్‌
ఎక్కడ‌: డార్జిలింగ్ టీ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్‌, డార్జిలింగ్‌
తేనీరు అంటే అంద‌రికీ ఇష్టమే. తేయాకు శ్రేష్టమైన‌ది అయితే ఆ టీ రుచి అమోఘం. మంచి తేయాకును గుర్తించ‌డం, ఎంత మోతాదులో క‌ల‌పాలో తెలుసుకోవ‌డం, వాటికి గ్రేడ్‌లు ఇవ్వడం టీ టెస్టర్ ప‌ని. దీనికోస‌మే డార్జిలింగ్ టీ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ మూడు నెల‌ల వ్యవ‌ధి ఉండే టీ టెస్టింగ్ స‌ర్టిఫికెట్ కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు. కోర్సు ఫీజు రూ.45,000. ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. 25 శాతం సీట్లు మ‌హిళ‌ల‌కు కేటాయించారు.
వెబ్‌సైట్: www.nitm.in

కోర్సు: వైన్ టెస్టింగ్‌
వైన్ రుచి ఎలా ఉంది, దాన్ని మ‌రింత‌గా పెంపొందించాలంటే ఏం చేయొచ్చు, ఏ ఫ్లావ‌ర్ ఎంత మోతాదులో క‌లిపితే ఆ వైన్ అద్భుతంగా రూపొందుతుందో చెప్పడం వైన్ టెస్టర్ల బాధ్యత‌. వైన్‌పై ఆస‌క్తి ఉన్నవాళ్లు ఈ కోర్సును ఎంచుకోవ‌చ్చు. ప్రపంచంలోని ప్రసిద్ధ సంస్థల‌తోపాటు భార‌త్‌లోనూ ప‌లు అకాడెమీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. డిగ్రీ అర్హత‌తో ఈ కోర్సుల్లో చేరొచ్చు. లెవెల్ 1, 2, 3 కోర్సులు ఉంటాయి.
ఇవీ సంస్థలు:
వైన్ అండ్ స్పిరిట్ ఎడ్యుకేష‌న్ ట్రస్ట్‌, లండ‌న్‌
మెల్‌బోర్నే విక్టోరియా యూనివ‌ర్సిటీ, మెల్‌బోర్న్‌
భార‌త్‌లో...
తుల్లీహో వైన్ అకాడెమీ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైన్ అండ్ బేవ‌రేజ్ స్టడీస్‌
ది వైన్ సొసైటీ ఆఫ్ ఇండియా
విన్‌క్రెస్ట్ ఇండియా
వెబ్‌సైట్‌: http://iwbs.in

Back..

Posted on 18-06-2016