Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
స్పెల్లింగ్‌ సత్తాకు సవాల్‌!

* 5 నుంచి 9 తరగతుల విద్యార్థులకు అవకాశం
ఆంగ్ల అక్షర క్రమం (స్పెల్లింగ్‌) సరిగా చెప్పగలిగే ప్రావీణ్యం ఉన్నవారిని గుర్తించి, వారి ప్రత్యేక నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావడం కోసం ‘స్పెల్‌ బీ’ నిర్వహిస్తున్నారు. క్లాస్‌మేట్‌ స్పెల్‌ బీ సీజన్‌-11కు సంబంధించిన నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొనేందుకు ఐదు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులు అర్హులు.

ఇతర భాషల నుంచి ఎన్నో పదాలు ఆంగ్లంలో చేరాయి. వీటన్నిటి స్పెల్లింగ్‌ను గుర్తుంచుకోవాలంటే పరిజ్ఞానం, కృషి, సాధన తప్పనిసరి. ఒక పదానికి మూలం ఏమిటి, దాని అర్థం కాలక్రమంలో ఎలా మారిందీ- ఇవన్నీ గ్రహించాలి. కచ్చితమైన స్పెల్లింగ్‌ను వేగంగా చెప్పగలగటం కూడా ముఖ్యమే. విద్యార్థుల స్పెల్లింగ్‌ పరిజ్ఞానం పెంచి, వారిలో ఆ ప్రతిభను వెలికితీసేందుకు ఐటీసీకి చెందిన నోట్‌బుక్‌ బ్రాండ్‌ క్లాస్‌మేట్‌, రేడియో మిర్చి సంయుక్తంగా స్పెల్‌ బీని నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 30 నగరాల్లోని 1000కిపైగా స్కూళ్ల విద్యార్థులు దీనిలో పాల్గొంటారు. మొత్తంగా 6,50,000 మంది ఐదు- తొమ్మిది తరగతుల విద్యార్థులు దీనిలో పాల్గొంటారు. పరీక్ష షెడ్యూల్‌ ఇంకా వెలువడాల్సివుంది.

ఆన్‌లైన్‌లో (www.classmatespellbee.in) లో పేరు, స్కూలు మొదలైన వివరాలతో నమోదు చేసుకోవాలి. విద్యార్థి తాను ఎంపిక చేసిన 30 నగరాల్లో లేకపోయినట్లయితే ఆన్‌లైన్‌ ద్వారా కూడా పరీక్ష రాయొచ్చు. అయితే వీరు తమకు దగ్గరగా ఉన్న నగరాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష తేదీ, సమయం వివరాలను నమోదు చేసుకున్న విద్యార్థులకు ముందుగా తెలియజేస్తారు.

ఎంపికలో నాలుగు స్థాయులు
* మొదటి స్థాయిలో ప్రతి స్కూలులో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇచ్చినవాటిలో 75 సరైన ఇంగ్లిష్‌ స్పెల్లింగులను విద్యార్థి గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి స్కూలు నుంచీ టాప్‌ స్కోరు సాధించినవారిని రెండో స్థాయికి పంపుతారు.
* రెండో స్థాయిలో మొదటి స్థాయి టాపర్లందరూ పోటీ పడతారు. దీనిలో 75 ప్రశ్నలను 7.5 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిలోనూ టాప్‌ స్కోరు సాధించినవారిని సెమీఫైనల్స్‌కు ఎంపిక చేస్తారు. ‌
* మూడో స్థాయిలో రెండు రౌండ్లుంటాయి. మొదటి రౌండ్‌లో 10 నిమిషాల్లో 60 పదాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి నగరం నుంచి ఎక్కువ స్కోరు సాధించిన 10 మందిని రెండో రౌండ్‌కు ఎంపిక చేస్తారు. రెండో రౌండ్‌లో 10 నిమిషాల్లో 40 పదాలను గుర్తించాలి. దీనిలో దేశవ్యాప్తంగా ఎక్కువ స్కోరు సాధించిన 16 మందిని ఎంపిక చేస్తారు.
* నాలుగో స్థాయిలోనూ రెండు రౌండ్లుంటాయి. మొదటి రౌండ్‌లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 16 మంది విద్యార్థులను నలుగురు చొప్పున నాలుగు గ్రూపులు చేస్తారు. ప్రతి గ్రూపువారూ నాలుగు సెమీఫైనల్స్‌లో ఒక దానిలో పాల్గొంటారు. సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన వారంతా గ్రాండ్‌ ఫినాలేలో పోటీ పడతారు. దీనిలోనూ గెలిచినవారే తుది విజేత అవుతారు.

ఏమేం బహుమతులు?
తుది విజేతకు రూ.2 లక్షల నగదు బహుమతితోపాటు వాషింగ్‌టన్‌ డీసీ, యూఎస్‌లో నిర్వహించే స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ-2019ను చూసే అవకాశం ఉంటుంది. విద్యార్థి తనతోపాటు తన తల్లిదండ్రుల్లో ఒకరిని వెంట తీసుకెళ్లవచ్చు. మొత్తం ఖర్చు నిర్వాహకులే భరిస్తారు. సెమీఫైనల్‌కు చేరుకున్న ప్రతి ఒక్కరికీ రూ.50,000 నగదు బహుమతి ఉంటుంది.
పరీక్షకు సన్నద్ధమవ్వడానికి స్టడీ గైడ్‌, చిట్కాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. మాదిరి పరీక్ష కూడా అందుబాటులో ఉంది.


Back..

Posted on 05-02-2019