Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆటలూ ఉపాధి బాటలే!

* * స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు

ఐపీఎల్‌ క్రికెట్‌ వస్తోందంటే యువతలో ఎంతో ఉత్సాహం... కళ్లు చెదిరేంత ఘనంగా జరిగే ఆ పోటీలు ఆద్యంతం ఆకర్షణీయంగా ఉంటాయి. అందరూ వాటి గురించే మాట్లాడుకుంటుంటారు. ప్రేక్షకుల ఆదరణ చూసి ఐపీఎల్‌ బాటలోనే హాకీ ఇండియా లీగ్, ప్రో-కబడ్డీ, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఫుట్‌బాల్‌), ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ మొదలైనవి పుట్టుకొచ్చాయి. ఆటగాళ్లు, మైదానాలు, ప్రకటనకర్తలు, ప్రేక్షకులను సమన్వయం చేసుకుంటూ ఇంత పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమాల నిర్వహణ ఎవరు చేస్తారు? ఎంతమంది ఉంటారు? వాళ్లకు ఈ నైపుణ్యాలు ఎలా వచ్చాయి... ఇదంతా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌. ఇవన్నీ ఆటలు చూపే కెరియర్‌ బాటలు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ప్రపంచ పోటీల్లో సత్తా చాటడం, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యమివ్వడం, సాధన, శిక్షణల సౌకర్యాలు మెరుగవ్వడం, మీడియాలో క్రీడలకు ప్రాధాన్యం పెరగడం.. తదితర కారణాలతో మనదేశంలో రోజురోజుకీ క్రీడలకు ఆదరణ పెరుగుతోంది. జనాభాలో యువత ఎక్కువ సంఖ్యలో ఉండడం, పెరుగుతోన్న మధ్య తరగతి వర్గాల ఆదాయం... కూడా దీనికి దోహదపడ్డాయి. ఇప్పుడు ఎంతోమంది ఏదో ఒక ఆటలో ప్రావీణ్యం పొందడానికి శిక్షణ తీసుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ కోసం ఏదో ఒక ఆటకు ప్రాధాన్యమిస్తోన్న పెద్దలు సైతం పెరిగారు. వివిధ మాధ్యమాల ద్వారా క్రీడలు వీక్షించేవారి సంఖ్యకు ఢోకా లేదు. ప్రజలంతా ఆటలపై శ్రద్ధ చూపడంతో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ చెప్పుకోదగ్గ కెరియర్‌గా ఆవిర్భవించింది. భవిష్యత్తులో ఇది మరింతగా విస్తరించే అవకాశాలున్నాయి.

గత కొన్నేళ్లుగా భారత క్రీడారంగంలో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌), ప్రో కబడ్డీ లీగ్‌ విజయవంతం కావడంతో రెజ్లింగ్‌, బ్యాడ్మింటన్లలో సైతం లీగ్‌లు మొదలయ్యాయి. భారత అథ్లెట్లు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటడంతో దేశీయంగా మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో క్రీడల్లో సేవలు అందించే సంస్థలు విస్తరిస్తున్నాయి. క్రీడల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించడమూ పెరుగుతోంది. ఉత్పత్తుల ఆవిష్కరణ, బ్రాండ్‌ బిల్డింగ్, బ్రాండ్‌ అసోషియేషన్‌ కోసం క్రీడాకారులు, క్రీడలు అస్త్రంగా మారాయి. చాలామంది ఆంత్రప్రెన్యూర్లు ఈ రంగంలో అడుగు పెడుతున్నారు.

అయితే ఈ రంగాన్ని నిపుణులైన మేనేజర్ల కొరత వేధిస్తోంది. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీలు ఉన్నవారు ఇందులో రాణించడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఔత్సాహికులను స్పోర్ట్స్‌ బిజినెస్‌ వైపు అడుగులేయించడం, ప్రభుత్వ, పబ్లిక్‌ రంగాలు, అటానమస్‌ స్పోర్ట్స్‌ బాడీలకు మరింత వృత్తిపరమైన దృష్టి కల్పించి వారిని క్రీడల అభివృద్ధికి వినియోగించడం, పాతతరం క్రీడాకారులను తీసుకోవడం, బ్రాండ్‌ బిల్డింగ్‌లో క్రీడలు ఉపయోగించడంపై మార్కెటర్లకు అవగాహన కల్పించడం ఇవన్నీ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా నేర్పిస్తారు. ఈఎస్‌పీఎన్, జీ, టెన్‌ స్పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యు స్పోర్ట్స్, ఎడ్యూ స్పోర్ట్స్, లిబరో స్పోర్ట్స్, ఐఎంజీ...తదితర సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి.

డిగ్రీ, పీజీ, డిప్లొమా

స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో బీఏ, బీబీఎం కోర్సులు చేయడానికి ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. పీజీ డిప్లొమా చేసేందుకు కనీస అర్హత డిగ్రీ. పీజీ కోర్సులను సాధారణ డిగ్రీతో చదువుకోవచ్చు. అయితే కొన్ని సంస్థలు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ చదువుకున్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

యూజీ స్థాయిలో బీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, బీబీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి. పీజీలో ఎంఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ఎంబీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, ఎంబీఏ స్పోర్ట్స్‌ బిజినెస్, మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను పలు సంస్థలు అందిస్తున్నాయి. పీజీ డిప్లొమా ఇన్‌-స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ / స్పోర్ట్స్‌ బిజినెస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉంటే ఈ విభాగంలో పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. కొన్ని సంస్థలు దూరవిద్య ద్వారా యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.

హోదాలెన్నో...

* స్పోర్ట్స్‌ మేనేజర్లు: వీరు క్రీడాకారులకూ బయట ప్రపంచానికీ మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. ఆటగాళ్ల లీగల్‌ కాంట్రాక్ట్, ఫైనాన్స్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఉదాహరణకు ఏదైనా సంస్థ తమ ఉత్పత్తిని క్రీడాకారుని ద్వారా మార్కెట్లో ప్రచారం చేయాలనుకున్నప్పుడు మేనేజర్‌ని సంప్రదిస్తుంది. ప్రాథమిక చర్చలు అనంతరం సమాచారాన్ని ఆ క్రీడాకారునికి చేరవేస్తారు. సరే అనుకున్న తర్వాత ఒప్పందాలు, షూటింగ్‌ షెడ్యూల్‌...ఇవన్నీ మేనేజర్‌ క్రీడాకారుడి తరఫున చూసుకుంటారు. ఆ క్రీడాకారుడి స్థాయిని బట్టి వీరికి వేతనాలు లభిస్తాయి. అలాగే అనుభవానికీ ప్రాధాన్యం ఉంటుంది. అయితే రూ.పాతికవేలకు తగ్గకుండా లక్ష రూపాయల వరకు నెలవేతనం అందుకోవచ్చు. నేడు క్రీడాకారులు తమ అవసరాల పర్యవేక్షణకు వ్యక్తిగత స్పోర్ట్స్‌ మేనేజర్లను నియమించుకుంటున్నారు. ఆ క్రీడాకారుని వ్యాపారాత్మక, మార్కెటింగ్‌ విలువను మరింత పెంచడమే ఈ మేనేజర్ల లక్ష్యం. సమర్థ నాయకత్వ, వ్యాపారాత్మక నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండి క్రీడలే అభిమతమైతే రాణించవచ్చు. దేశంలో పేరొందిన కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారం, మార్కెటింగ్‌ పెంచుకోవడానికి క్రీడాకారులనే ఉపయోగించుకుంటున్నాయి. ఇందుకోసం పెద్దమొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. క్రీడాకారులే కాకుండా క్రీడలతో ముడిపడిన కంపెనీలు సైతం స్పోర్ట్స్‌ మేనేజర్లను తీసుకుంటున్నాయి. ప్రస్తుతం బహుళ జాతి కంపెనీలు కూడా స్పోర్ట్స్‌ మేనేజర్లను తీసుకుని ఉద్యోగుల మధ్య క్రీడాపోటీలు నిర్వహిస్తున్నాయి.

* స్పోర్ట్స్‌ కన్సల్టెంట్లు: స్పోర్ట్స్‌ కన్సల్టింగ్‌ సంస్థల్లో అవకాశాలుంటాయి. ఇందులో స్పోర్ట్స్‌ క్లబ్బులకు కన్సల్టెంట్‌గా వ్యవహరించవచ్చు. ఆటగాళ్లకు కావాల్సిన అవసరాలను వీళ్లు తీర్చుతారు. వారికి సరైన శిక్షకులను కేటాయించడం, సూచలు చేయడం లాంటివి చేస్తారు.

* ఈవెంట్స్‌ కోఆర్డినేటర్లు: వివిధ స్థాయుల్లో జరిగే క్రీడా పోటీలకు సంధానకర్తగా వ్యవహరించవచ్చు. సరైన వేదికను ఎంపికచేయడం, ఆటగాళ్లతో సమన్వయం, క్రీడలను ప్రసార మాధ్యమాల్లో అందుబాటులోకి తేవడం ఇవన్నీ స్పోర్టింగ్‌ ఈవెంట్‌ కోఆర్డినేటర్లు చూసుకుంటారు.

* ఫిట్‌నెస్‌ డైరెక్టర్లు: వీరు ఫిట్‌నెస్‌ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఆ గ్రూప్‌ సభ్యులు ఫిట్‌నెస్‌ కోల్పోకుండా ఉండడానికి కావాల్సిన క్రీడలు, వ్యాయామాలు వారితో చేయిస్తారు. ఇందుకు అనువైన వేదిక, పరికరాలను సమకూరుస్తారు. అలాగే ప్రజల్లో అవగాహన పెంచడానికి క్యాంపెయిన్లు సైతం నిర్వహించి కొత్తవారిని ఆకట్టుకుంటారు. కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాయి. సొంతంగానూ రాణించవచ్చు.

* స్పోర్ట్స్‌ ప్రమోటర్లు: స్పోర్ట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో స్పెషలైజేషన్‌ చేసినవారు స్పోర్ట్స్‌ ప్రమోటర్లగా రాణించవచ్చు. ఏదైనా ఈవెంట్‌కు ప్రచారం చేయడానికి వీరు కమిషన్‌ తీసుకుంటారు లేదా సొంతంగా కంపెనీ సైతం నిర్వహించుకోవచ్చు. నిర్వహణ నైపుణ్యం, ప్రణాళికల ద్వారా స్పోర్ట్స్‌ ప్రమోటర్లగా మెప్పించవచ్చు. వేదిక, సరైన తేదీలు, మంచి సమయం, అనువైన స్థలం...ఇవన్నీ క్లయింట్లకు సూచిస్తారు. ఒకసారి అన్నీ నిర్ణయించుకున్న తర్వాత ఆ పోటీలకు సంబంధించి ప్రకటనలు, మార్కెటింగ్‌ వ్యవహారాలు చూసుకుంటారు.

* అకౌంట్‌ కోఆర్డినేటర్లు: మార్కెటింగ్‌ వ్యూహాలు రచించడంలో ఉన్నత స్థాయి ఉద్యోగులకు సహాయకులుగా అకౌంట్‌ కోఆర్డినేటర్లు వ్యవహరిస్తారు. సంస్థలు, కార్పొరేట్‌ క్లయింట్లతో మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుతారు.

* పబ్లిక్‌ రిలేషన్స్‌ అసిస్టెంట్లు: వీరు క్రీడాసంస్థల్లోని కోచ్‌లు, క్రీడాకారులు, ఉన్నత స్థాయి ఉద్యోగులకు సహాయపడతారు. ఆ పోటీలు మీడియాలో వచ్చేలా చూస్తారు. అవసరమైతే కోచ్, క్రీడాకారులతో ఇంటర్వ్యూలు ఇప్పించడం లాంటివి చేస్తారు. ఆ సంఘటన న్యూస్‌ కవరేజ్‌ నిమిత్తం వచ్చినవారికి సహాయపడతారు. అవసరమైన ఫొటోలు, వీడియో క్లిప్పింగ్స్‌ అందిస్తారు. మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. క్రీడలు జరుగుతున్నప్పుడు మీడియా గ్యాలరీలో అవసరమైన ఏర్పాట్లు చూసుకుంటారు.

స్పోర్ట్‌ ఇన్ఫర్మేషన్‌ డైరెక్టర్‌ పోస్టు కూడా ఇలాంటిదే. స్పోర్ట్స్‌ టీం, మీడియా మధ్య సంధానం చేస్తారు. కవరేజ్‌ మీడియాలో వచ్చేలా చూస్తారు. మీడియా సమావేశాలు నిర్వహించడం, అవసరమైన సమాచారం మీడియాకు అందించడం మొదలైనవి వీరు చూసుకుంటారు.

* స్పోర్ట్స్‌ బ్రాడ్‌ కాస్టర్‌: స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో మరో కెరియర్‌ అవకాశమిది. మంచి ఆహార్యం, విశ్లేషణ నైపుణ్యం, వాక్‌ చాతుర్యం ఉన్నవాళ్లు నేరుగా స్క్రీన్‌ మీద సత్తా చాటవచ్చు. ఇందుకోసం సంబంధిత క్రీడాంశాల్లో మంచి పట్టు తప్పనిసరి. తెర వెనుక జరిగే తతంగాన్ని పర్యవేక్షించి ఆ సంఘటనను విజయవంతం చేయడానికి సైతం ఎంతోమంది అవసరం ఉంటుంది.

స్పోర్ట్స్‌ ఇన్ఫర్మేషన్‌ డైరెక్టర్లు / పబ్లిక్‌ రిలేషన్‌ అసిస్టెంట్లు రూ.40,000 నుంచి రూ.70,000 వరకు వేతనం ఆశించవచ్చు. స్పోర్ట్స్‌ మార్కెటింగ్‌ మేనేజర్లు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు వేతనం అందుకోవచ్చు. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిగ్రీ ఉన్నవారు లెక్చరర్లగా రాణించవచ్చు. ఆ సంస్థ స్థాయిని బట్టి రూ.25,000 నుంచి రూ.50,000 వరకు వేతనం లభిస్తుంది. స్పోర్ట్స్‌Ã ఈవెంట్‌ మేనేజర్లు పొందే వేతనం రూ.30,000కు పైగా ఉంటుంది.

ఫిజియోలో ప్రత్యేక ప్రావీణ్యం ఉన్న స్పోర్ట్స్‌ థెరపిస్టులుగా రాణించవచ్చు. స్పోర్ట్స్‌ మెడిసిన్, స్పోర్ట్స్‌ జర్నలిజం తదితర అవకాశాలు లభిస్తున్నాయి. దాదాపు ప్రతి మీడియా సంస్థలోనూ స్పోర్ట్స్‌ జర్నలిస్టులు ఉన్నారు. పత్రికలు, టీవీ ఛానెళ్లలో ఇందుకోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ప్రత్యేక పేజీలు, బులిటెన్లు వెలువడుతున్నాయి. స్పోర్ట్స్‌ సైకాలజీ పూర్తి చేసుకున్నవారు స్పోర్ట్స్‌ సైకాలజిస్టులుగా రాణించవచ్చు. వీరు ఆటగాళ్లలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తారు. మైండ్‌ మేనేజ్‌మెంట్‌పై తర్ఫీదునిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు టీం తరఫున స్పోర్ట్స్‌ సైకాలజిస్టులు ఉంటారు.

ఏ సంస్థల్లో ఏ కోర్సులు?

* నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, ముంబయి: మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (బీఎంఎస్‌) -స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, యూజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌.

* జార్జ్‌ కాలేజ్, కోల్‌కతా: బీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌

* ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, ముంబయి: బ్యాచిలర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ వెల్‌నెస్‌ మేనేజ్‌మెంట్‌

* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్, కోల్‌కతా: పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌

* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పుణె: మాస్టర్స్‌ ప్రోగ్రాం ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ప్రోగ్రాం ఇన్‌ స్పోర్ట్స్‌ సైన్సెస్, డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌

* తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, చెన్నై: ఎంబీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్, పీజీడీ ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్, ఎంటెక్‌ స్పోర్ట్స్‌ టెక్నాలజీ, పీహెచ్‌డీ స్పోర్ట్స్‌ టెక్నాలజీ, పీహెచ్‌డీ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌

* లక్ష్మీబాయ్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, గ్వాలియర్‌: మాస్టర్స్‌ ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌), పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్, డిప్లొమా ఇన్‌స్పోర్ట్స్‌ కోచింగ్‌

* నేతాజీ సుభాష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఎస్‌ఐఎస్‌), పాటియాలా: అథ్లెటిక్స్, జూడో, హాకీ, సైక్లింగ్‌ ల్లో బీపీఈడీ శిక్షణ

* అలగప్పా యూనివర్సిటీ, కరైకుడి- తమిళనాడు: పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌

* మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, పశ్చిమ్‌ బంగ: బీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌

స్కిల్‌ నేషన్‌ ఇండియా (ముంబయి) స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రసిద్ధి చెందింది. ఫుట్‌బాల్, టెన్నిస్, గోల్ఫ్, క్రికెట్, బాస్కెట్‌ బాల్, రెజ్లింగ్, హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్‌ల్లో... ఈ కోర్సులు అందిస్తోంది. ఇక్కడ ఫుల్‌ టైం, పార్ట్‌ టైం, ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థ ఇంటర్న్‌షిప్, ఉద్యోగాలను కల్పిస్తోంది.

వెబ్‌సైట్‌: www.skillanation.com

Back..

Posted on 06-12-2018