Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆటగాళ్ల ఆహారంపై కోర్సులు

స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ కోర్సు విభిన్నమైనది. దేశంలోని క్రీడాకారుల ఆహారపు అలవాట్లను మార్చి, ఆట తీరును అంతర్జాతీయ స్థాయికి మెరుగుపరిచే విధంగా ఇందులో శిక్షణ పొందుతారు. ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచేే శిక్షణ ఈ కోర్సులో ఉంటుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) 2019 విద్యాసంవత్సరానికి ఎంఎస్సీ (స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌) ప్రోగ్రాం కోసం ప్రవేశపరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంఎస్సీ (అప్లైడ్‌ న్యూట్రిషన్‌) కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా త్వరలో విడుదల కానుంది.

మనుషుల ఆహారపు అలవాట్లలో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఏది పడితే అది తినేయకుండా వాటిలో ఏయే పోషకాలు ఉన్నాయి...వాటివల్ల కలిగే ప్రయోజనాలేమిటన్నది తెలుసుకుంటున్నారు. సాధారణ వ్యక్తులే ఇలా అనుకుంటే క్రీడల్లో రాష్ట్రాలు, దేశాలకు ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అందుకు శాస్త్రీయమైన శిక్షణ అందించే కోర్సే స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌.

బీఎస్సీ హోమ్‌ సైన్స్‌లో ప్రధాన సబ్జెక్టుగా ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ న్యూట్రిషన్‌/ అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌/ క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ లేదా బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌లో బోటనీ/ జువాలజీ/ జెనిటిక్స్‌/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ లేదా ఎంబీబీఎస్‌ లేదా బీఏఎంఎస్‌ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సు చేయడానికి అర్హులు.

ఎంపిక విధానం
ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు నాలుగు విభాగాలుగా ఉంటాయి. మొత్తం 100 మార్కులు. 90 నిమిషాల కాలపరిమితితో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో జనరల్‌ నాలెడ్జ్‌, ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన 20 ప్రశ్నలు, రెండో విభాగంలో న్యూట్రిషన్‌ ప్రశ్నలు 40, మూడో విభాగంలో ఫిజియాలజీ ప్రశ్నలు 20, నాలుగో విభాగంలో బయోకెమిస్ట్రీ ప్రశ్నలు 20 ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒకమార్కు.

ఎంఎస్సీ (స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌) లో మొత్తం 15 సీట్లు ఉంటాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు 5 సీట్లు ఉన్నాయి. మిగిలినవి కేంద్ర కోటా కింద ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయిస్తారు. 50కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తేనే ఎన్‌ఐఎన్‌ ప్రవేశపరీక్ష నిర్వహిస్తుంది. అంతకంటే తక్కువ వస్తే పరీక్ష ఉండదు. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఉద్యోగ అవకాశాలు
ఈ కోర్సును పూర్తి చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి అవకాశాలుంటాయి. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా/ స్పోర్ట్స్‌ అకాడమీలు/ సంస్థలు/ ఫెడరేషన్లు/ స్పోర్ట్స్‌ సప్లిమెంటరీ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందవచ్చు. అథ్లెట్లకు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలిచ్చే వ్యక్తిగత సహాయకులుగా చేరవచ్చు. ఒబెసిటీ, డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ తదితర సమస్యలతో బాధపడేవారికి సహాయకులుగా ఉండొచ్చు. స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ ఉపాధ్యాయులు/ అధ్యాపకులు/ రిసెర్చర్లుగా చేయవచ్చు. సొంతంగా ఫిట్‌నెస్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

చివరితేది: జూన్‌ 28

పరీక్ష తేది: జులై 14

మరింత సమాచారం కోసం: ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, తార్నాక మెట్రోస్టేషన్‌ పక్కన, జామీ-ఉస్మానియా పోస్ట్‌, హైదరాబాద్‌ - 500007, తెలంగాణ. ఫోన్‌: 040-27197200

ఈ-మెయిల్‌: directornin@ninindia.org, nin@ap.nic.in,

వెబ్‌సైట్‌: http://www.nin.res.in/

ఎన్‌ఐఎన్‌ ఎంతో ప్రత్యేకం
శాస్త్రవేత్తలు విద్యాబోధన చేయటం ఎన్‌ఐఎన్‌ ప్రత్యేకత. వారితో విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకునే వీలుంటుంది. అందువల్ల ఇక్కడ చదివే విద్యార్థికి ఆలోచనా పరిధి విస్తృతంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరికీ ప్రాక్టికల్‌ పరిజ్ఞానం అలవడుతుంది. ఇక్కడ అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు ఉన్నాయి. ఇక్కడ కోర్సు పూర్తిచేసినవారికి ఉద్యోగాల్లో సైతం ప్రాధాన్యం లభిస్తుంది. - డా. వై. వెంకటరమణ, హెచ్‌ఓడీ, ఫిజియాలజీ అండ్‌ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌


Back..

Posted on 05-06-2019