Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కేంద్ర ప్రభుత్వంలో ఇంజినీర్‌ కొలువులు

* స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమాలు చేసిన నిరుద్యోగులకూ, చిరుద్యోగులకూ ఓ బంగారు అవకాశం వచ్చింది! కేంద్ర ప్రభుత్వ పరిధిలో జూనియర్‌ ఇంజినీర్ల పోస్టుల నియామకాల కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసి, వెంటనే సన్నద్ధత ప్రారంభించటం శ్రేయస్కరం. కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షకు సమగ్రంగా తయారై మెరుగైన ప్రతిభ చూపితే చక్కటి ఉద్యోగం అందుకోవచ్చు!

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ బ్రాంచీల్లో డిప్లొమా; సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారిలో అర్హులతో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నది. ఇలా నియమితులైనవారికి కేంద్ర జలసంఘం, సీపీడబ్ల్యూడీ, మిలటరీ ఇంజినీరింగ్‌ సర్వీసు, బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ తదితర సంస్థల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఈ పరీక్ష ద్వారా ఉద్యోగం పొందినవారు గ్రూప్‌ బి (నాన్‌ గెజిటెడ్‌)లో జూనియర్‌ ఇంజినీర్స్‌ పోస్టుల్లో నియమితులవుతారు. వారికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం దాదాపుగా రూ.35,400 నుంచి రూ.1,12,400 స్కేలులో 60 వేల నుంచి 65 వేల రూపాయల మొత్తం జీతంగా లభిస్తుంది.

ఆసక్తి ఉన్నవారు http://ssconline.nic.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చేతిరాత ద్వారా పోస్టులో దరఖాస్తులను స్వీకరించరు.

* పరీక్ష రుసుము రూ.100. ఎస్‌బీఐ ఛలానా, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ్య మహిళా అభ్యర్థులు ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీల వారికి పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది.

అర్హతలు: సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ డిప్లొమా, డిగ్రీ చదివినవారు అర్హులు. ్ర పోస్టులకు అనుగుణంగా 18 నుంచి 32 ఏళ్లవారు అర్హులు. వివిధ కేటగిరీల వారికి వయఃపరిమితిలో సడలింపు ఉంది.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు: 25.2.2019

* ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష రుసుము గడువు: 27.2.2019

* పేపర్‌-1 పరీక్ష తేదీ: 23.9.2019 నుంచి 27.9.2019

* పేపర్‌-2 పరీక్ష తేదీ: 29.12.2019

ఏ సబ్జెక్టు ఎలా?
పేపర్‌-1 (ఆబ్జెక్టివ్‌ తరహా)

1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
వెర్బల్, నాన్‌వెర్బల్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డెసిషన్‌ మేకింగ్, అరిథ్‌మెటిక్‌ రీజనింగ్, క్లాసిఫికేషన్, నంబర్‌ సిరీస్, అనాలజీ అంశాలపై ప్రశ్నలడుగుతారు. డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదివినవారికి ఈ అంశాలు వారు చదివిన పాఠ్యాంశాల్లో లేనప్పటికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి, వారు సరైన పద్ధతిలో సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.

2. జనరల్‌ అవేర్‌నెస్‌
ఈ విభాగంలో అభ్యర్థి పరిసరాల్లో జరిగే సాధారణ విషయాల అవగాహనను, సమాజంపై అవి చూపే ప్రభావాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. సాధారణంగా ఇలాంటి అంశాలపై డిప్లొమా, ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ రోజువారీ వార్తాపత్రికలు, ముఖ్యమైన వార్తా సంచికలు, ప్రామాణిక పాఠ్యపుస్తకాలను సమగ్రంగా అధ్యయనం చేస్తే పరీక్షలో ప్రశ్నల సాధన సులభమవుతుంది.

3. జనరల్‌ ఇంజినీరింగ్‌
ఇందులో అభ్యర్థుల సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రశ్నలు అడుగుతారు. అంటే సివిల్‌ విద్యార్థులు సివిల్‌ ఇంజినీరింగ్‌కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాలవారికి తమ తమ విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.

సివిల్‌ ఇంజినీరింగ్‌: అభ్యర్థులు గత ప్రశ్నపత్రాల ద్వారా సరైన అవగాహనను పొంది, తమ అభ్యాసాన్ని మొదలుపెట్టడం మంచిది. పూర్వ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్‌ మెటీరియల్స్, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్, సర్వేయింగ్, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతుండటాన్ని గమనించొచ్చు. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్టులను ముందుగా అభ్యసించడం, మాదిరి ప్రశ్నలను సాధన చేయడం ఎంతో కీలకం.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే.. ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషిన్స్, థర్మల్‌ ఇంజినీరింగ్, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో ఎక్కువ ప్రశ్నలు రావడాన్ని గమనించొచ్చు.

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: ఈ విభాగం నుంచి ఎలక్ట్రికల్‌ మెషిన్స్, పవర్‌ సిస్టమ్స్, మెజర్‌మెంట్స్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.

పేపర్‌-2 (కన్వెన్షనల్‌ తరహా)
పేపర్‌-1లో మెరుగైన మార్కులు సాధించినవారిని పేపర్‌ 2 రాయడానికి అనుమతిస్తారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఇందులో మొత్తం ఆరు ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 60 మార్కులు. అయితే ప్రతి ప్రశ్నను 3 లేదా 4 విభాగాలుగా విభజించారు. ప్రతి విభాగానికి 10 నుంచి 20 మార్కులు కేటాయించారు. మొత్తం ఆరు ప్రశ్నల్లో ఏవేని అయిదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

సివిల్‌ ఇంజినీరింగ్‌లో గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్‌ మెటీరియల్స్, సర్వేయింగ్, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్, స్ట్రక్చరల్‌ అనాలిసిస్‌ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషిన్స్, థర్మల్‌ ఇంజినీరింగ్, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్, ఐసీ ఇంజిన్స్, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ సబ్జెక్టులు ముఖ్యమైనవి. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విషయానికొస్తే.. ఎలక్ట్రికల్‌ మెషిన్స్, పవర్‌ సిస్టమ్స్, మెజర్‌మెంట్స్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్రధానమైనవాటిగా చెప్పొచ్చు.

నెగ్గాలంటే..?
పేపర్‌ 1లో థియరీ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. అన్ని సబ్జెక్టులకూ తగినంత సమయం కేటాయించాలి. కాబట్టి, ప్రశ్నలకు సరైన సమాధానాలను రాయడంతోపాటు ఎంత త్వరగా సమాధానాలు గుర్తించామనేదీ ముఖ్యమే. సమాధానాలు త్వరగా రాయాలంటే అభ్యర్థులకు విస్తృతమైన సాధన అవసరం. అలాగే పరీక్ష సమయంలో సూటిగా సమాధానం రాయగల ప్రశ్నలను మొదట ఎంచుకుని తక్కువ సమయంలో పూర్తిచేయాలి. మిగిలిన సమయాన్ని ఎక్కువ సమయం పట్టే సంఖ్యాపరమైన, సూత్రాధారిత ప్రశ్నలకు కేటాయించవచ్చు.

* ప్రశ్నపత్రాలు డిప్లొమా సిలబస్, స్టాండర్డ్‌ ఆధారంగా ఉంటాయి. కానీ డిప్లొమాతోపాటు డిగ్రీ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పోటీపడతారు. కాబట్టి డిప్లొమా విద్యార్థులు కొంత ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది.

* ఎస్‌ఎస్‌సీ పరీక్షకు దాదాపుగా 8 నెలల కాలవ్యవధి ఉంది. ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ ప్రణాళికే అభ్యర్థులకు పరీక్షలో మంచి మార్కులు సాధించిపెట్టడానికి మొదటి మెట్టు.

* ఆ ప్రణాళికలో రోజుకు 5 నుంచి 6 గంటల సమయం సాధనకు కేటాయించాలి.

* ప్రాథమికాంశాలపై సరైన అవగాహన తెచ్చుకుని తరువాత గత సంవత్సరాల, ఆన్‌లైన్‌ మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. ప్రతి వారాంతం, నెలకోసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి.

* పరీక్షకు సన్నద్ధమయ్యేటపుడు ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్య అంశాలను చిన్నచిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారుచేసుకోవాలి.

* సాధనలో పునశ్చరణ ఎంతో ముఖ్యం. అందువల్ల చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. ఇందుకోసం చిన్న చిన్న పట్టికలు ముందుగా తయారుచేసుకుంటే ఎంతగానో ఉపయోగపడతాయి.

* అభ్యర్థులు సిలబస్‌ను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలో అర్థమవుతుంది.

* మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం సాధనకు ప్రధానం.

నోటిఫికేషన్
వెబ్‌సైట్‌

- వై.వి. గోపాలకృష్ణమూర్తి, ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ


Back..

Posted on 04-02-2019