Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
స్టెమ్‌కు దీటుగా.. డీ-ఆర్ట్‌

* 250+ కోర్సులు.. 40+ సంస్థలు.. ఒకే ఎంట్రన్స్‌

ఇంటర్మీడియట్‌ తర్వాత.. ఎక్కువమంది విద్యార్థుల చూపు స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) కోర్సులపైనే. వీరికి భిన్నంగా వైవిధ్యభరితమైన క్రిియేటివ్‌, లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులు చేయాలనుకునే వారి సంగతేమిటి? రకరకాల ఎంట్రన్సులు రాయాల్సిందేనా? ఇలాంటి వారి కోసమే డీఏఎల్‌హెచ్‌ఏఎం ఫౌండేషన్‌ ‘డీ-ఆర్ట్‌’ అనే ఒక ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. రెండు విభాగాలుగా జరిగే ఈ పరీక్షలో ప్రశ్నలు వైవిధ్యంతో ఉండి, విద్యార్థులు తమకు దేనిలో ఆసక్తి ఉందో తెలుసుకునే వీలు కల్పిస్తాయి. ఒక్క పరీక్ష ద్వారా స్టెమ్‌ మినహా అన్ని కోర్సుల్లోకి ప్రవేశం పొందవచ్ఛు.

ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు జేఈఈ, ఎంసెట్‌. వైద్యవిద్యకు నీట్‌. ఇలా సైన్స్‌, టెక్నాలజీ కోర్సులు చదవాలంటే ప్రవేశపరీక్షలు ఉన్నాయి. కానీ సృజనాత్మక, లిబరల్‌ ఆర్ట్స్‌ లాంటి కోర్సుల విషయానికొస్తే.. చాలావరకూ ప్రతి సంస్థ ప్రత్యేక ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది. దీని వల్ల విద్యార్థికి డబ్బు, సమయం వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో నాన్‌-స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌యేతర) కోర్సులకు డీఏఎల్‌హెచ్‌ఏఎం ఫౌండేషన్‌ ఒక కామన్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది.

ఏమిటీ పరీక్ష?
డీఏఎల్‌హెచ్‌ఏఎం అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ టూల్‌ (డీ-ఆర్ట్‌) పేరుతో నిర్వహించే ఈ ప్రవేశపరీక్ష ద్వారా కొన్ని ప్రముఖ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పలు రకాల అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ల్లోకి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దీన్ని నిర్వహించే డీఏఎల్‌హెచ్‌ఏఎం స్వతంత్రమైన, లాభాపేక్ష లేని సంస్థ. నాన్‌ స్టెమ్‌ కోర్సులు- క్రియేటివ్‌, లిబరల్‌ ఎడ్యుకేషన్‌కు ప్రాచుర్యం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. పరీక్ష ద్వారా 40కి పైగా ప్రముఖ విద్యాసంస్థల్లో 250కి పైగా విభిన్నమైన కోర్సుల్లోకి ప్రవేశాలు నిర్వహిస్తారు.

విద్యార్థులు తమ ఆసక్తి ఎందులో ఉందో తెలుసుకునే విధంగా ప్రవేశపరీక్షను రూపొందించారు. ఇది జీవితానికి సంబంధించిన జ్ఞానాన్నీ పరిశీలించేలా ఉంటుంది. పరీక్షలో భాగంగా డీఏఎల్‌హెచ్‌ఏఎం పేరులోని ఆరు విభాగాలు- డిజైన్‌, ఆర్ట్స్‌, లిబరల్‌ స్టడీస్‌, హ్యుమానిటీస్‌, ఆర్కిటెక్చర్‌, మీడియా కింద వచ్చే అన్ని సబ్జెక్టులపైనా దృష్టిసారిస్తారు. 2020లో ఇంటర్‌ పూర్తయ్యేవారు/ ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు మొదటి సంవత్సరం చదువుతున్నవారు అనర్హులు. వయసు 16 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.

నమోదు ప్రక్రియ
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.4,999. అప్లై చేసుకున్న 10 రోజులకు అడ్మిట్‌ కార్డులు అందజేస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: డిసెంబరు 30, 2019
హ్యూమన్‌ ఫ్యాక్టర్‌ పరీక్ష తేదీ: జనవరి 5, 2020
నాలెడ్జ్‌ వాలిడేషన్‌ పరీక్ష తేదీ: జనవరి 19, 2020
పరీక్ష పూర్తయిన నెలరోజులకు ఫలితాలను ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేస్తారు.
వెబ్‌సైట్‌: https://www.dalhamfoundation.org/

ఏమేం సిద్ధమవ్వాలి?
ఇంటర్‌లో చదివిన అంశాలు ఇందుకు సాయపడతాయి. వాటిని నిత్యజీవితంలో ఎంతవరకూ అన్వయించుకోగలుగుతున్నారనేది ప్రధానంగా పరీక్షిస్తారు. వెబ్‌సైట్‌లో నమూనా పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మాదిరి ప్రశ్నపత్రాలనూ డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది.

పరీక్ష విధానం
ఇది ఆన్‌లైన్‌ పరీక్ష. డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ విభాగాలవారికి పెన్‌, పేపర్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో హ్యూమన్‌ ఫాక్టర్‌ (మానవీయ అంశాలు), నాలెడ్జ్‌ వాలిడేషన్‌ (పరిజ్ఞాన ధ్రువీకరణ) అనే రెండు విభాగాలుంటాయి.

పార్ట్‌-ఎ: హ్యూమన్‌ ఫ్యాక్టర్‌: దీనిలో మళ్లీ నాలుగు సెక్షన్లు ఉంటాయి. 300 మార్కులకు ఉంటుంది. సమయ పరిమితిని సూచించలేదు. దీన్ని ఇంటి నుంచీ రాసే వీలు ఉంది.
సెక్షన్‌-1: అప్లికేషన్‌ రేటింగ్‌: వంద మార్కులకు పది ప్రశ్నలుంటాయి. ఇవి విద్యార్థి, విద్యానేపథ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోడానికి తోడ్పడతాయి. విద్యానేపథ్యం, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ అంశాలు, విద్యార్జన సమయంలో నిర్వహించిన బాధ్యతలు, ప్రాజెక్టులు, సర్టిఫికేషన్లు, సాధించిన విజయాలు, సోషల్‌ యాక్టివిటీస్‌/ కమ్యూనిటీ సర్వీస్‌, నాయకత్వం వహించిన సందర్భాలు వంటి వాటిని ప్రమాణాలుగా తీసుకుంటారు.
డీ-ఆర్ట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్న ప్రముఖ విద్యాసంస్థల్లో- పెరల్‌ అకాడమీ, జీడీ గొయెంకా యూనివర్సిటీ, జేడీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ టెక్నాలజీ, ఎన్‌ఎస్‌హెచ్‌ఎం, చిత్కర యూనివర్సిటీ, కోడ్‌-వీజీయూ, యూఐడీ, శ్రీశ్రీ యూనివర్సిటీ, జాగరన్‌ లేక్‌సిటీ యూనివర్సిటీ, మోదీ యూనివర్సిటీ వంటివి ఉన్నాయి.
సెక్షన్‌-2: వీడియో ఎస్‌ఓపీ: వంద మార్కులకు ఉంటుంది. విద్యార్థి తన వ్యక్తిత్వాన్నీ, లక్ష్యాలనూ తెలియజేసే మార్గంగా ఇది సాయపడుతుంది. దీనిలో భాగంగా విద్యార్థి తన ప్రణాళికలు, తనకు నచ్చిన కోర్సు/ కళాశాలలో సీటు సంపాదించడం ద్వారా తన లక్ష్యాలు ఏవిధంగా సాకారమవుతాయో తెలియజేయాల్సి ఉంటుంది. మూడు విషయాలను ఇస్తారు. విద్యార్థి వాటిలో ఒకదాన్ని ఎంచుకుని దానిపై 3 నిమిషాలపాటు మాట్లాడాలి. ఎంచుకున్న అంశంపై సన్నద్ధం కావడానికి 3 నిమిషాల సమయం ఇస్తారు.
సెక్షన్‌-3: థిఫఫమాటిక్‌ అప్రిసియేషన్‌ టెస్ట్‌ (టీఏటీ): ఇదీ వంద మార్కులకే. దీనిలో విద్యార్థి ఆలోచన, ఆటిట్యూడ్‌, గమనించే నైపుణ్యం, భావోద్వేగ ప్రతిస్పందన వంటివి పరీక్షిస్తారు. 5 చిత్రాలతో కూడిన స్లైడ్‌షోను ఇస్తారు. ప్రతి దానికి సంబంధించి ఒక సృజనాత్మక కథను తయారు చేయాలి. ప్రతి దానికీ శీర్షిక, ప్రారంభం, విషయం, ఫోకస్‌ ఏరియా, ముగింపు తప్పక ఉండాలి.
సెక్షన్‌-4: సోషల్‌ స్కిల్స్‌ టెస్ట్‌: వివిధ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో చూస్తారు. ఎలా ఉంటే బాగుంటుందో సూచించమంటారు. ఇందుకు అనుగుణంగా కొన్ని సూచనలతో ప్రశ్నలు అడుగుతారు. వాటికి విద్యార్థి జవాబులు సూచించాలి. ప్రత్యేకంగా మార్కులంటూ ఏమీ లేవు.

పార్ట్‌-బి: నాలెడ్జ్‌ వాలిడేషన్‌: నాలుగు వందల మార్కులకు ఉంటుంది. కాలవ్యవధి 3 గంటలు. దీనిలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి.
సెక్షన్‌-1: కాంప్రహెన్సివ్‌ సెక్షన్‌: దీనికి 200 మార్కులు కేటాయించారు. 100 ప్రశ్నలను 80 నిమిషాల్లో పూర్తిచేయాలి. నిత్యజీవితంలో ఎదుర్కొనే అంశాలపైనే ప్రశ్నలుంటాయి. సమాజంతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలను కలిగిఉన్నారో, సంస్కృతి పట్ల ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడమే దీని ఉద్దేశం. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌, ట్రూ/ఫాల్స్‌/ అసర్షన్‌- రీజన్‌ విధానాల్లో ఉంటాయి.
పరీక్షాంశాలు: అకౌంటింగ్‌, ఎకనామిక్స్‌, ఆంత్రపెన్యూర్‌షిప్‌ అండ్‌ ఇన్నవేషన్‌, జాగ్రఫీ, సైకాలజీ, స్పోర్ట్స్‌, లీడర్‌షిప్‌, థియేటర్‌ అండ్‌ ఫిలిం, కాన్‌టెంపరరీ స్టడీస్‌, జర్నలిజం, క్రియేటివ్‌ కమ్యూనికేషన్స్‌, హిస్టరీ/ ఆర్కియాలజీ, లిటరేచర్‌, మెటఫర్స్‌ అండ్‌ నెరేటివ్స్‌, టీవీ అండ్‌ మీడియా, జెండర్‌, కల్చరల్‌ స్టడీస్‌, మైథాలజీ, పర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, సోషల్‌ ఆంత్రప్రైజ్‌, డిజైన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, ఆంత్రపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, రెలిజియస్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, పొలిటికల్‌ సైన్స్‌, విజువల్‌ ఆర్ట్స్‌.
సెక్షన్‌-2: ఎలక్టివ్‌ బేస్‌డ్‌ సెక్షన్‌: వంద మార్కులకు ఉంటుంది. 50 ప్రశ్నలను 50 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇక్కడ విద్యార్థి తనకు నచ్చిన ఎలక్టివ్‌ను ఎంచుకునే వీలుంది. ఆరు ఎలక్టివ్‌లు- డిజైన్‌, ఆర్ట్స్‌: ఫైన్‌ఆర్ట్స్‌/ పర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, లిబరల్‌ ఆర్ట్స్‌; హ్యుమానిటీస్‌, ఆర్కిటెక్చర్‌, మీడియా ఉంటాయి. వీటిలో ఒకటి నుంచి మూడు వరకూ ఎలక్టివ్‌లను ఎంచుకునే వీలుంది. ప్రతిభ ఆధారంగా నచ్చిన కళాశాలలో సీటునూ సొంతం చేసుకోవచ్ఛు విద్యార్థికి ఎంచుకున్న రంగంపై ఎంతవరకూ అవగాహన ఉందో, రంగంలోకి ప్రవేశించడానికి ఎంతవరకూ సిద్ధంగా ఉన్నారో పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌, ట్రూ/ఫాల్స్‌/ అసర్షన్‌ రీజన్‌ విధానాల్లో ఇస్తారు. డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ వాళ్లకి డ్రాయింగ్‌, విజువలైజేషన్‌ స్కిల్స్‌ను పరీక్షించేందుకు ఓపెన్‌ ఎండెడ్‌ ప్రశ్నలుంటాయి. ఒకటి కంటే ఎక్కువ ఎలక్టివ్‌లు ఎంచుకున్నవారికి ఒక్కోదాని మధ్యలో 30 నిమిషాల విరామం ఉంటుంది.
సెక్షన్‌-3: ఆప్టిట్యూడ్‌ సెక్షన్‌: వంద మార్కులకు 50 ప్రశ్నలు ఇస్తారు. 50 నిమిషాల్లో పూర్తిచేయాలి. లాజికల్‌ రీజనింగ్‌/ వెర్బల్‌ ఎబిలిటీ/ జనరల్‌ అవేర్‌నెస్‌లపై ప్రశ్నలుంటాయి. విద్యార్థి ప్రాథమిక ఆలోచనా విధానాన్ని అంచనావేయడం దీని ఉద్దేశం.

పరీక్ష కేంద్రాలు: దేశంలోని దాదాపుగా అన్ని ప్రముఖ నగరాల్లో పరీక్షకేంద్రాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

వివిధ సంస్థలు అందిస్తున్న కోర్సుల వివరాలు...
డిజైన్‌

* టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌
* గ్రాఫిక్‌ డిజైనింగ్‌
* వీడియో గేమ్‌ డిజైనింగ్‌
* ఫర్నిచర్‌ డిజైనింగ్‌
* ఇలస్ట్రేషన్‌
* జ్యువెల్లరీ డిజైనింగ్‌
* ఫ్యాషన్‌ డిజైనింగ్‌
* ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌
* ఆటోమోటివ్‌ డిజైనింగ్‌
* ఇంటీరియర్‌ డిజైనింగ్‌
* విజువల్‌ కమ్యూనికేషన్‌ డిజైన్‌

ఆర్ట్స్‌
1. ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌:
* ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌
* సెరామిక్స్‌
* పెయింటింగ్‌
* మేకప్‌ ఆర్టిస్ట్‌
* స్కెచింగ్‌
* మెటల్‌ ఫాబ్రికేషన్‌
* స్క్రీన్‌ ప్రింటింగ్‌
* ఆర్ట్‌ హెరిటేజ్‌
* స్కల్‌ప్టింగ్‌
* వుడ్‌ వర్కింగ్‌
2. పర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌:
* టీవీ/ ఫిలిం డైరెక్షన్‌
* సౌండ్‌ ఇంజినీరింగ్‌
* డాన్స్‌
* టీవీ/ ఫిలిం ప్రొడక్షన్‌
* యాక్టింగ్‌
* కెమెరా ఆపరేషన్‌

లిబరల్‌ ఆర్ట్స్‌
* పొలిటికల్‌ సైన్స్‌
* హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌
* ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌
* పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
* రిక్రియేషనల్‌ స్పోర్ట్స్‌ ప్రోగ్రామ్‌
* ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
* ఇంటర్‌డిసిప్లినరీ సోషల్‌ సైన్సెస్‌
* సోషియాలజీ
* స్పోర్ట్స్‌ ప్రొఫెషనల్‌
* ఏజింగ్‌ స్టడీస్‌

హ్యుమానిటీస్‌
* లీగల్‌
* హిస్టరీ
* హ్యూమన్‌ రిసోర్స్‌
* పాలిటిక్స్‌
* జాగ్రఫీ
* ఎకనామిక్స్‌
* సైకాలజీ
* సోషియాలజీ

ఆర్కిటెక్చర్‌
* ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌
* లాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌
* నేవల్‌ ఆర్కిటెక్చర్‌
* రెసిడెన్షియల్‌ స్పేస్‌ డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
* ఆర్బన్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్‌

మీడియా
* అడ్వర్టైజింగ్‌
* క్రియేటివ్‌ రైటింగ్‌
* ఎడిటింగ్‌
* జర్నలిజం
* పబ్లిషింగ్‌
* టీవీ ఆర్ట్‌

Back..

Posted on 18-12-2019