Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
చురుగ్గానే ఉన్నారా?

పది, డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులనూ పరీక్షలతో నిమిత్తం లేకుండా అప్‌గ్రేడ్‌ చేసేశారు. మరోవైపు ప్రవేశపరీక్షలు ఎన్నోసార్లు వాయిదాపడ్డాయి. ఉద్యోగులూ ఎక్కువ శాతం ఇంటి నుంచే పని చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా సాగే జీవితంలో ఒక్కసారిగా స్తబ్ధత ఏర్పడింది. చురుకుదనం తగ్గిపోయింది. లాక్‌డౌన్‌లో సడలింపుతో దాదాపుగా అన్నీ తిరిగి పుంజుకుంటున్నాయి. మరి విద్యార్థులూ, ఉద్యోగార్థుల సంగతేంటి? స్తబ్ధతను వీడి కార్యాచరణకు కదులుతున్నారా?

కరణ్‌.. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ అవకాశం ఇవ్వడంతో తుది పరీక్షలు రాయకుండానే మూడో ఏడాదిలోకి ప్రవేశించాడు. పరీక్షలు లేవు, కళాశాల ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. అస్తమానూ టీవీతోనో, మొబైల్‌తోనో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఏ మధ్యరాత్రో పడుకుంటాడు. ఎప్పుడు లేస్తాడో తనకే తెలియదు.

రాజ్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. విదేశాలకు వెళదామనుకున్నాడు. విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ ఇప్పట్లో తెరుచుకునేలా లేవు. పోనీ ఈ ఏడాదికి ఉద్యోగం చేసి, ఆపై విదేశీ విద్య గురించి ఆలోచిద్దామనుకున్నాడు. సంస్థలూ ఇప్పట్లో నియామక ప్రక్రియ చేపట్టేలా లేవు. పైగా ఉన్న ఉద్యోగాలే కోల్పోతున్న స్థితి. దేనికి సిద్ధమవ్వాలో తెలియక తికమకపడుతున్నాడు.

లాక్‌డౌన్‌ పరిణామాల కారణంగా విద్యార్థులూ, ఉద్యోగార్థులందరి పరిస్థితీ కరణ్, రాజ్‌ల్లానే తయారైంది. ఇది వారినే కాదు, తల్లిదండ్రులనీ ఆందోళనకు గురిచేస్తోంది.

లాక్‌డౌన్‌లో దశలవారీగా సడలింపులు వచ్చాయి. రోజువారీ కార్యకలాపాలన్నీ పుంజుకున్నాయి. కొన్ని పోటీ పరీక్షల తేదీలూ ఖరారయ్యాయి. విద్యార్థులూ, ఉద్యోగార్థులూ చురుగ్గా సన్నద్ధతపై దృష్టిపెట్టాల్సిన సమయమిది.

ఏం చేయాలి?
* మున్ముందు అవసరం: పది అయినా, డిగ్రీ అయినా అప్‌గ్రేడ్‌ అయ్యి తరువాతి తరగతికి వెళ్లిపోయారు. ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఎపుడ[ు ప్రారంభమవుతాయో ఇంకా స్పష్టత లేదు. ఇంజినీరింగ్‌ వాళ్లకు మాత్రం ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి. కొన్ని ప్రముఖ డిగ్రీ కళాశాలలూ ఆన్‌లైన్‌ బాట పట్టాయి. అయితే ఇంట్లోనే ఉన్నవాళ్లు ఈ విరామాన్ని ఆహ్లాదంగానో, నిస్సారంగానో గడపడానికి పరిమితం కాకూడదు. ప్రస్తుత తరగతి పాఠాలు తరువాతి తరగతుల్లో లోతుగా వస్తుంటాయి. ప్రాథమిక అంశాలపై అవగాహన ఉంటేనే అవి అర్థమవుతాయి. పరీక్షలు లేనంత మాత్రాన వాటిని వదిలేయాల్సిన అవసరం లేదు. మననం చేసుకుంటుండటం తప్పనిసరి.
* సిద్ధంగా ఉండాలి: పరీక్షలు పదే పదే వాయిదా పడుతున్నపుడు ఒకరకమైన అనాసక్తి ఏర్పడటం సహజమే. చుట్టూ పరిస్థితులు అలా ఉన్నపుడు ఎవరూ ఏమీ చేయలేరు. కానీ మళ్లీ మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతుందనో, పక్కాగా నిర్వహిస్తారని తెలిసినపుడే మొదలుపెడదామని కూర్చుంటే అసలు సమయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. తాజా ఉదాహరణే చూడండి. అకస్మాత్తుగా ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 పరీక్ష తేదీని ప్రకటించింది. ఇంతసేపూ విరామం తీసుకుని ఒక్కసారిగా పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటామంటే మెదడు కూడా సహకరించదు. కాబట్టి, ఆందోళన మాని లక్ష్యానికి అనుగుణంగా సన్నద్ధత సాగించడమే మేలు.
* టైం టేబుల్‌ సిద్ధమా?: అనుకోని విరామం ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. దీంతో చాలామందికి ఒక ప్రణాళిక లేకుండా సాగిపోవడం అలవాటై పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకస్మిక పరిణామాలు ఎప్పుడైనా సంభవించవచ్చు. అప్పుడు తీరా మార్చుకుందామంటే శరీరం, మనసు రెండూ సహకరించవు. ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదిగా ఒక ప్రణాళిక ప్రకారం శరీరాన్నీ, మనసునూ ఇప్పటినుంచే సిద్ధం చేయాలి.
* వీటికి దూరం: ఫలానా అంశాలు ఆందోళన/ ఒత్తిడి కలిగిస్తున్నాయనిపిస్తే వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. విజయంలో పాత్ర తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో గానీ, అపజయంలో మీకు తప్ప ఎవరికీ బాధ్యత ఉండదన్న విషయాన్ని గమనించాలి. బయట ఉద్యోగ పరిస్థితులైనా, పోటీ అయినా అందరికీ ఒకటే. దాన్ని తట్టుకోవడానికి మీవంతు ప్రయత్నం మీరేం చేస్తున్నారన్నదే ప్రధానం.
* ఇవి సాయపడతాయి: త్వరగా పూర్తయ్యే వాటిని మొదట ప్రారంభించండి. ఒకటి పూర్తయ్యాక ఇంకోటి ప్రయత్నించండి. మీపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. వ్యక్తిగత, మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. మనసు ఆనందంగా ఉంటేనే దేనిపైనైనా దృష్టి నిలపడం సాధ్యమయ్యేది!

Back..

Posted on 24-06-2020