Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
స్వల్ప విరామం గొప్ప మేలు

     వ్యాసరూప పద్ధతి అయినా, ఆబ్జెక్టివ్‌ విధానం అయినా సబ్జెక్టును ఆకళింపు చేసుకోవటం తప్పనిసరి. దీనికోసం పరీక్షల సమయంలో ఎక్కువ సమయం సన్నద్ధత కొనసాగించాల్సిందే. ఈ సందర్భంగా త్వరగా అలసిపోకుండా ఉండాలంటే? చదివిన అంశాలు పటిష్ఠంగా జ్ఞాపకం ఉండాలంటే? ఏమేం చేయాలి?
కంప్యూటర్‌లో ఒక ఫైల్‌ తయారుచేసి, 'సేవ్‌' చేయకపోతే అది మాయమవుతుంది. మనలో చాలామందిమి చదువు విషయంలో ఇదే తరహా తప్పు చేస్తుంటాం. సబ్జెక్టును చదువుతాం కానీ, మెదడులోని హార్డ్‌ డిస్క్‌లో సేవ్‌ చేయం.
రోజు పూర్తయ్యేటప్పటికి శరీరానికి విశ్రాంతి అవసరమవుతుంది. దాంతో నిద్రకు ఉపకరిస్తాం. దేన్నైనా మనం చదివినపుడు ఆ సమాచారం మన మెదడులోని నిర్దిష్ట ప్రదేశంలో నిక్షిప్తమవుతుంది. ఈ వ్యాసాన్ని చదువుతున్నారంటే మీ మెదడులోని ఒక భాగం ఉత్తేజితంగా ఉందన్నమాట. 40- 50 నిమిషాలు అలా ఉంటుందది. ఆ తరువాత ఆ భాగం అలసిపోతుంది, దానికి విశ్రాంతి అవసరమవుతుంది.
కంప్యూటర్‌లో సమాచారాన్ని ఇన్‌పుట్లను ఆపుచేసి, 'సేవ్‌' కమాండ్‌పై నొక్కడం ద్వారా నిక్షిప్తం చేస్తాం. లోపలికి వచ్చే విషయ ఉద్ధృతి నుంచి కూడా మన మెదడుకు ఈ తరహా విరామం ఉంటేనే ఆ సమాచారం సేవ్‌ అవుతుంది.
అప్పటికే ఉన్న పాత సమాచారంతో కలిపినా, అనుసంధానం చేస్తేనే మన మెదడు కొత్త సమాచారాన్ని గుర్తుంచుకుని నిల్వ చేసుకుంటుంది.
పది నిమిషాల స్వల్ప విరామం తీసుకుంటే... మెదడు కొత్త సమాచారాన్ని చక్కగా స్వీకరిస్తుంది. అంతేకాకుండా మెదడులోని అలసిపోయిన భాగం అలసట తీర్చుకోవడానికీ, శక్తిని పెంచుకోవడానికీ, పునరుత్తేజం చెందడానికీ వీలవుతుంది.
ఇలా చేస్తే సరి
* మెదడుకు విశ్రాంతినివ్వడమే స్వల్పకాలిక విరామ ఉద్దేశం. ఈ విశ్రాంతి కారణంగా 40- 50 నిమిషాలపాటు చదివినదంతా మెదడు సులువుగా ఎక్కించుకుని, నిల్వ ఉంచుతుంది.
* 40- 50 నిమిషాలు చదివాక విరామం ఇవ్వండి. లేచి కొద్దిసేపు అటూఇటూ నడవండి. దీనివల్ల శారీరక కదలికల వల్ల మెదడుకి రక్తప్రసరణ జరుగుతుంది. అలసట కూడా తీరుతుంది. పెరిగిన రక్తప్రసరణ అధిక ప్రాణవాయువును మెదడుకు చేరవేస్తుంది.
* దీర్ఘశ్వాస తీసుకుని, కొంత మంచినీరు తాగి అపుడు తిరిగి చదవడానికి కూర్చోండి. అంతకుముందు 40- 50 నిమిషాలు చదివినదాన్ని జ్ఞప్తి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి.
* నాలుగు- ఐదు గంటలపాటు మీ చదువు కొనసాగాలంటే ప్రతి 40- 50 నిమిషాలకోసారి 10 నిమిషాల విరామం అవసరం. లేవడం, అటూఇటూ నడవడం, దీర్ఘశ్వాస తీసుకోవడం, ద్రవ పదార్థాలు సేవించడం చేయాలి. అప్పుడు తిరిగి కూర్చుని చదవడం కొనసాగించవచ్చు.
పునశ్చరణతో జ్ఞాపకశక్తి
చాలామంది విద్యార్థులు రోజులు గడుస్తున్నకొద్దీ చదివిందేదీ గుర్తుండడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. సరిగా చదివే పద్ధతులు తెలియకపోవడమే దీనికి కారణం. కొద్దిరోజుల క్రితం చేసిన లెక్కనే పరీక్షలో అడిగితే కొన్ని స్టెప్‌లను మరచిపోతుంటారు. ఎందుకలా?
ఏదైనా సబ్జెక్టును చదివినపుడు సమాచారం స్వల్పకాలిక జ్ఞాపకంగా (షార్ట్‌టర్మ్‌ మెమరీ) మెదడులో చేరుతుంది. కొంతకాలానికి దీన్ని మరచిపోతే ఆశ్చర్యపడనక్కర్లేదు. దీనికేమిటి పరిష్కారం? సరైన పునశ్చరణే! (రివిజన్‌).
ఎంత మరచిపోతాం?
చాలావరకూ సమాచారాన్ని మొదటి 24 గంటల్లోనే మరచిపోతాం. అంటే సమాచారాన్ని అధికంగా కోల్పోయే తత్వం మొదటి 24 గంటల్లోనే జరుగుతుంది. చదివిన 24 గంటల తర్వాత చాలాకొద్ది మొత్తంలోనే గుర్తుంచుకోగలుగుతాం. కాబట్టి మొదటి పునశ్చరణ తప్పకుండా మొదటి 24 గంటల్లోపే జరగాలి. కాబట్టి మెమరీ చార్ట్‌ను తయారు చేసుకోవడం, ఆడియో టేప్‌/ బృందంగా చదవడం వంటి పద్ధతులను 24 గంటల్లోగా పాటించడం మేలు.
పునశ్చరణ ... ఎప్పుడు ఎలా చేయాలి?
పునశ్చరణ అంటే అంతకుముందు చదివినదాన్నే తిరిగి చదవడం అనే పొరపాటు అభిప్రాయంతో చాలామంది ఉంటారు. అది తిరిగి చదవటం మాత్రమే అవుతుంది. పునశ్చరణ అసలు అర్థం- మెదడులో అప్పటికే నిల్వ ఉన్న సమాచారాన్ని దృశ్యరూపకంగా గుర్తుతెచ్చుకోవడం. కళ్లుమూసుకుని అంతకుముందు చదివినదాన్ని దృశ్యరూపంలో వూహించుకోవడం చేస్తుండాలి.
ఏ సమాచారాన్నయినా నాలుగైదు సార్లు పునశ్చరణ చేస్తే అది దీర్ఘకాలిక జ్ఞాపకంగా (లాంగ్‌టర్మ్‌ మెమరీ) మారిపోతుంది. మన పేరు, వ్యక్తిగత నంబర్లు, చిరునామా మొదలైన అంశాలు నిక్షిప్తమయ్యేచోట ఇది కూడా చేరుతుంది. అందుకని తగిన వ్యవధుల్లో క్రమం తప్పకుండా పునశ్చరణ చేయడం తప్పనిసరి.
ఎప్పుడైనా దేన్నయినా పునశ్చరణ చేయదలిస్తే ముందుగా సంబంధిత మెటీరియల్‌ను దగ్గర పెట్టుకోవాలి. మొదట కళ్ళు మూసుకుని దీర్ఘశ్వాస తీసుకోవాలి. తరువాత చదవడానికి బదులుగా, దృశ్యరూపంగా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. గుర్తుకు రాని పాయింట్లను మాత్రమే తిరిగి చదవాలి. చివరగా, మొత్తం సమాచారాన్ని మనసులో వూహించుకోవాలి.

posted on 02.03.2015