Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధ్యాయ శిక్షణకు ఉత్తమ మార్గాలు

బోధన రంగం ఇప్పుడు ఎంతో ఆకర్షణీయమైన కెరియర్‌. ప్రపంచ పోకడలూ, ఆర్థిక మాంద్యం లాంటి చిక్కులతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేలాంటి గిరాకీ ఉండటం దీని ప్రత్యేకత. ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్నవారు అత్యున్నత శిక్షణ ఇచ్చే ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నించటం మేలు. ఈ విద్యాసంస్థలేమిటి? వాటి ప్రవేశాల తీరుతెన్నులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

సమాజంలో ఏమాత్రం హోదా తగ్గనిదిగా ఉపాధ్యాయ వృత్తికి పేరుంది. ఈ బోధన రంగంలో ఉన్నవారు తమ ప్రభావాన్ని విద్యార్థుల జీవిత పర్యంతం కలగజేయగలుగుతారు. అందుకే ఇదెంతో గౌరవప్రదమైనదిగా పేరుపొందింది. అయితే ఈ వృత్తిలో ఎవరైనా సరే, తేలిగ్గా రాణిస్తారని భావిస్తే అది అపోహే. నిరంతరం నేర్చుకోవటంపై నిజమైన ప్రేమ ఉండి సహనం, భావప్రసార సామర్థ్యం లాంటివి ఉంటే విజయవంతం కాగలుగుతారు.
గణితం, చరిత్ర, ఆంగ్లం.. దేన్ని బోధించేవారైనా తమ సబ్జెక్టులో ఒకవైపు బోధిస్తూనే మరోవైపు దాని తాజా అంశాలను నేర్చుకుంటుంటేనే దానిలో గణనీయస్థాయిని సాధించటానికి వీలుంటుంది. ఇలా వ్యక్తిగత, వృత్తిపరమైన సంతృప్తిని అందించే తక్కువ కొలువుల్లో ఉపాధ్యాయ ఉద్యోగం ముందు వరసలో ఉంటుంది.
ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలంటే.. డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) తప్పనిసరి అనేది అందరికీ తెలిసిన విషయమే. బీఎడ్‌ కోర్సును పేరున్న సంస్థల్లో చదివినవారు బోధన నైపుణ్యాలను బాగా ఆకళింపు చేసుకోగలరు. దీంతో ఉపాధ్యాయ కొలువును సులువుగానే పొందటం సాధ్యమవుతుంది.
రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్లు
సమాజానికి అత్యుత్తమ ఉపాధ్యాయులను అందించాలనే సమున్నత లక్ష్యంతో ప్రాంతీయ విద్యాసంస్థలు (రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ - ఆర్‌ఈఐ) దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యాయి. దేశ విద్యారంగ మార్పుల మూలంగా వచ్చే సవాళ్ళను స్వీకరించి తగిన మార్గదర్శనం చేసే సంస్థలివి. వీటిని గతంలో రీజనల్‌ కాలేజెస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అనేవారు. ఇది న్యూదిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన కాన్‌స్టిట్యుయెంట్‌ యూనిట్‌. పాఠశాల, బోధన విద్యకు సంబంధించి శ్రేష్ఠమైన విద్యాసంస్థలవి.
ఇంటర్‌ అర్హతతో ఇక్కడ డిగ్రీతోపాటు బీఎడ్‌ను నాలుగేళ్ళలోనే పూర్తిచేయవచ్చు. దీంతోపాటు రెగ్యులర్‌ బీఎడ్‌, ఎంఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌, ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ కోర్సులను ఆర్‌ఐఈలు అందిస్తున్నాయి.
ఇంటర్‌ తర్వాత నేరుగా బీఎడ్‌
సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్‌ తర్వాత డీఎడ్‌ కోర్సులో చేరతారు. మరికొందరు డిగ్రీ తర్వాత బీఎడ్‌ చదువుతారు. ఈ రెండూ రెండేళ్ళ వ్యవధితో నిర్వహించేవే. అయితే ప్రాంతీయ విద్యాసంస్థల్లో (ఆర్‌ఐఈ) మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడ డీఎడ్‌ ఉండదు. కానీ ఇంటర్‌ తర్వాత నేరుగా బీఎడ్‌ కోర్సులో చేరిపోవచ్చు. అంటే బీఏ లేదా బీఎస్‌సీ డిగ్రీతోపాటు బీఎడ్‌ కలిసి చదువుకోవచ్చు. నాలుగేళ్ళలోనే కోర్సు పూర్తి కావడం మరో ప్రత్యేకత. డిగ్రీ తర్వాత బీఎడ్‌ చేయడంతో పోల్చుకుంటే ఇంటర్‌ విద్యార్థులు ఈ కోర్సులో చేరటం ద్వారా ఏడాది సమయం ఆదా అవుతుంది. అంతే కాకుండా వరుసగా నాలుగేళ్లపాటు చదవటం వల్ల సబ్జెక్టుపై పూర్తిపట్టు లభిస్తుంది. ముఖ్యంగా మెథడాలజీలో నైపుణ్యం ఎంతో మెరుగవుతుంది. ఈ కారణంవల్ల బోధన వృత్తిలోకి ప్రవేశించాలనుకునేవారు ఆర్‌ఐఈల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం.
దేశవ్యాప్తంగా అజ్మీర్‌, భువనేశ్వర్‌, భోపాల్‌, మైసూరు, షిల్లాంగ్‌, ఝజ్జర్‌- ప్రారంభ్‌ (హరియాణ)ల్లో ఆర్‌ఐఈలున్నాయి. ఒక్కో సంస్థ పరిధిలోకి కొన్ని రాష్ట్రాలు వస్తాయి. మన తెలుగు రాష్ట్రాలు మైసూరు కిందకి వస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులకు ఇక్కడ మాత్రమే చదువుకునే అవకాశముంది. మనతోపాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్‌ ఆర్‌ఐఈ మైసూరు పరిధిలోకి వస్తాయి. సీట్ల కేటాయింపు కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా విభజించారు.
ఇక్కడ బీఎస్‌సీ బీఎడ్‌ (ఎంపీసీ)లో 40 సీట్లు, బీఎస్‌సీ బీఎడ్‌ (బైపీసీ)లో 40 సీట్లు, బీఏ బీఎడ్‌లో 40 సీట్లు ఉన్నాయి.
ఆరేళ్ల ఎమ్మెస్సీ ఎడ్‌
వీటితోపాటు ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సు ఒక్క ఆర్‌ఐఈ మైసూరులో మాత్రమే ఉంది. దీని వ్యవధి ఆరేళ్లు. సాధారణంగా ఇంటర్‌ తర్వాత డిగ్రీ, పీజీలకు ఐదేళ్ళు అవసరం. అలాగే బీఎడ్‌ చేయాలంటే రెండేళ్ళు. మొత్తం ఏడేళ్లవుతాయి. ఇంటర్‌ తర్వాత నేరుగా పీజీతో పాటు బీఎడ్‌ పూర్తికావటం ఈ కోర్సు ప్రత్యేకత. దీంతో ఏడాది సమయం ఆదా అవుతుంది.
ఎమ్మెస్సీ ఎడ్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టులో 15 చొప్పున సీట్లు ఉన్నాయి. వీటికోసం దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆరేళ్ళలోపు మధ్యలో వైదొలగడమూ కుదరదు. ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సు పూర్తిచేసినవారు మైసూరులోనే ఎడ్యుకేషన్‌పై పీహెచ్‌డీ చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు.
సాధారణ బీఎడ్‌ సైన్స్‌, మ్యాథ్స్‌ విభాగంలో 25, సోషల్‌ సైన్స్‌, లాంగ్వేజిల్లో 25 చొప్పున ఆర్‌ఐఈ మైసూరులో సీట్లు ఉన్నాయి. ఇది డిగ్రీ అనంతర కోర్సు. వ్యవధి రెండేళ్ళు. ఎంఎడ్‌ కోర్సులో 30 సీట్లు ఉన్నాయి. దీని వ్యవధీ రెండేళ్ళే.
ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ + ఎంఎడ్‌
ఈ విశిష్ట కోర్సు ఆర్‌ఐఈ భోపాల్‌లో మాత్రమే అందిస్తున్నారు. ఇందులో 40 సీట్లు ఉన్నాయి.కోర్సు వ్యవధి మూడేళ్ళు. ఈ కోర్సు ఒక్క భోపాల్‌లోనే ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ సీట్లు కోసం పోటీపడవచ్చు. ఎలిమెంటరీ, సెకండరీ, సీనియర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌లలో దేనినైనా స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు.
ఆర్‌ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ ఉపకార వేతనాలు లభిస్తాయి. మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రాతిపదికన వీటిని అందజేస్తారు. ఇక్కడి విద్యార్థులకు ఏటా క్యాంపస్‌ నియామకాలు జరుగుతాయి. బీఏ/బీఎస్‌సీ ఎడ్‌ లేదా బీఎడ్‌ కోర్సులు చదువుకున్నవారికి నెలకు కనీసం రూ.25 వేలకు పైగా వేతనం లభిస్తుంది. ఎమ్మెస్సీ ఎడ్‌, ఎంఎడ్‌ కోర్సుల వారికి కనీసం రూ.35 వేల చొప్పున చెల్లిస్తారు.కార్పొరేట్‌ పాఠశాలలు ఇక్కడి విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి.
ప్రకటన వచ్చేసింది
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్‌ఐఈలలో ఎడ్యుకేషన్‌ కోర్సుల ప్రవేశానికి తాజాగా ప్రకటన వెలువడింది.
* రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ) కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (సీఈఈ)-2018.
* కోర్సులు: 1) ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ, కాలవ్యవధి: నాలుగేళ్ళు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌ ఉత్తీర్ణత.
* ఎమ్మెస్సీ ఎడ్యుకేషన్‌, కాల వ్యవధి: ఆరేళ్ళు అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత
* ఎంఈడీ, కాలవ్యవధి: రెండేళ్ళు అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బీఈడీ/బీఏ ఎడ్యుకేషన్‌/బీఎస్‌సీ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత.
* బీఈడీ (సైన్స్‌ అండ్‌ మ్యాథ్స్‌), బీఈడీ (ఇంగ్లిష్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌), కాలవ్యవధి: రెండేళ్ళు
* అర్హత: బీఏ/బీఎస్‌సీ/ఎంఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణత
* ఎంపిక: ప్రవేశపరీక్ష (ఆర్‌ఐఈ సీఈఈ) ద్వారా
* ప్రవేశపరీక్ష తేదీ: 10.6.2018
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 9.5.2018
* వెబ్‌సైట్‌: www.ncert-cee.kar.nic.in
ప్రవేశపరీక్ష ఎలా?
రాతపరీక్షకు 60 శాతం, అర్హతకు సంబంధిత పరీక్షలో సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజి ఇస్తారు. పరీక్షలో భాషా నైపుణ్యాలు, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ అంశాల నుంచి మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు.
సెంట్రల్‌ యూనివర్సిటీల్లో...
బోధన రంగానికి సంబంధించి ప్రత్యేకమైన కోర్సులను కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఎడ్‌నూ, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌ కోర్సులనూ ఆఫర్‌ చేస్తున్నాయి. సీయూ సెట్‌ ద్వారా వీటిలో ప్రవేశం దొరుకుతుంది. కోర్సు వ్యవధి నాలుగేళ్ళు. పరీక్షలు ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో నిర్వహిస్తారు. https://cucetexam.in
అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో...
సుప్రసిద్ధ అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం రెసిడెన్షియల్‌ విధానంలో ఈ ఏడాది నుంచి బీఎస్‌సీ బీఎడ్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సును ఆరంభిస్తోంది. వ్యవధి నాలుగు సంవత్సరాలు.
బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌; మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స్ట్రీముల్లో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది. ఈ సంస్థ ఎంఎడ్‌ కోర్సును కూడా అందిస్తోంది. ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 30.
వెబ్‌సైట్‌: http://azimpremjiuniversity.edu.in
గాంధీ గ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్లో....
కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో తమిళనాడులోని గాంధీ గ్రామ్‌లో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. దీనిలో ఇంటిగ్రేటెడ్‌ విధానంలో బీఎస్‌సీ బీఎడ్‌ కోర్సును అందిస్తున్నారు. ప్రవేశాల ప్రకటన వెలువడుతుంది. ఇంటర్‌ ఎంపీసీ గ్రూపులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: www.ruraluniv.ac.in
బీఏ/బీఎస్‌స్‌ ఎడ్‌ని ఇంటిగ్రేటెడ్‌ విధానంలో అందించే మరికొన్ని సంస్థలు
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌, గుజరాత్‌
* శంబల్‌పూర్‌ యూనివర్సిటీ
* లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ
* తేజ్‌పూర్‌ యూనివర్సిటీ
* సావిత్రీబాయి ఫూలే పుణే యూనివర్సిటీ
* జీడీ గోయంకా యూనివర్సిటీ

Back..

Posted on 04-04-2018