Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

మంచి టీ లాంటి ఉద్యోగం!

శీతాకాలం చలి చంపేస్తుంటే... వెచ్చగా ఓ టీ తాగాలనిపిస్తుంది. కాలాలకు అతీతంగా టీని ఇష్టపడేవారు ఎందరో. అందుకే తేనీటి నాణ్యతకు మెరుగులు దిద్ది... దాని రంగు, రుచి, చిక్కదనాలను మరింత పెంచే ‘టీ టేస్టర్ల’కు గిరాకీ పెరుగుతోంది. సాధారణ ఉద్యోగాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన వేతనం ఉండటంతో ఈ కొలువుపై యువత ఆసక్తి చూపిస్తోంది. బెంగళూరులోని ఐఐపీఎం ‘ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టీ టేస్టింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌’ ప్రవేశ ప్రకటన విడుదలైన సందర్భంగా ఈ కెరియర్‌ విశేషాలు....మన జీవనశైలిలో తేనీరు ఎప్పుడో భాగంగా మారిపోయింది. అంతేకాదు మన డార్జిలింగ్‌ టీ ఖ్యాతి దేశ సరిహద్దులను దాటి ప్రపంచమంతటా విస్తరించింది. తేనీటిని సేవించి, ప్రేమించి మురిసిపోవడమే కాదు... టీ తోనే ముడిపడిన ఒక ఉద్యోగమూ ఉంది. అదే... టీ టేస్టర్‌. టీని రుచి చూడటం, ఆ రుచిని పెంపొందించే సలహాలు, సూచనలు ఇవ్వడం ఈ ఉద్యోగ విధులు.

పొడి చూసి.. లోపాలు పట్టేస్తారు
* వివిధ టీల మధ్య ఉండే తేడాలను గుర్తించడానికి ప్రముఖ కంపెనీలు టీ టేస్టర్లను నియమించుకుంటాయి. టీ తయారీదార్లు, తేయాకు మిశ్రమాలను తయారుచేసేవారు టీ టేస్టర్లను నియమించుకుంటారు.
* టీ పొడి తయారీకి ముందే తేయాకు పరిమాణం, రంగు ఆధారంగా తేడాను గుర్తించగలుగుతారు. ఏవైనా లోపాలుంటే తేయాకును తిరిగి ఫ్యాక్టరీలకు పంపిస్తారు.
* తేయాకు తోటల యజమానులతో కలసి పనిచేస్తారు. ఎగుమతి, దిగుమతులను పర్యవేక్షిస్తారు. తేయాకు సాగు చేసేవాళ్లకు నాణ్యత, లభ్యత విషయంలో సూచనలు, సలహాలు అందజేస్తారు.
* స్వదేశీ, విదేశీ మార్కెట్లలో తేయాకు వ్యాపారంలో వచ్చే మార్పులను తేయాకు ఉత్పత్తిదార్లకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.
* ఈరంగంలో అనుభవం సంపాదించిన వాళ్లు కన్సల్టెన్సీ సర్వీసులను కూడా ప్రారంభించవచ్చు. ఏ రకం తేయాకును పండించవచ్చు, కొత్తరకం తేయాకు, వాటి అవకాశాలు, కొత్త అభ్యర్థుల నియామయం, వారికి శిక్షణ ఇవ్వడం, నష్టపరిహారం, తేయాకు తోట కార్మికుల వేతనాలు మొదలైన విషయాల్లో సూచనలు అందజేయవచ్చు.
ఈ రంగంలో అనుభవం సాధించినవారు నెలకు రూ.25,000 వరకు సంపాదించవచ్చు. నైపుణ్యం పెరిగితే రూ.40,000 నుంచి 50,000 వరకు సంపాదించవచ్చు.

డిప్లొమాలు... సర్టిఫికెట్లు
టీ టేస్టింగ్‌ మెలకువలను నేర్పేందుకు 45 రోజులు, 3 నెలల కాలవ్యవధి ఉన్న సర్టిఫికెట్‌ కోర్సులు, 1 సంవత్సర కాలవ్యవధి ఉన్న డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు చేయాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలి.
* డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బోటనీ/ ఫుడ్‌ సైన్సెస్‌/ హార్టీకల్చర్‌ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
* ఇంగ్లిష్‌లో మాట్లాడటం, రాయడం రావాలి. ‌
* ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, బ్లైండ్‌ (సెన్సారీ) టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* తేయాకు నాణ్యతను పసిగట్టడంలో అభ్యర్థికి ఉండే నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. టీ తోటల్లో పనిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.

పీసీపీ-టీటీఎంలో చేరాలంటే...
బెంగళూరులోని ఐఐపీఎం ‘ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టీ టేస్టింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌’ (పీసీపీ-టీటీఎం)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు కాలవ్యవధి 45 రోజులు (2019 మే 20 నుంచి జులై 3 వరకు). డిగ్రీ పాసైనవారు అర్హులు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, బ్లైండ్‌ (సెన్సారీ) టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. ఆంగ్లంలో రాత నైపుణ్యం, మౌఖిక కమ్యూనికేషన్‌ తప్పనిసరి.
దరఖాస్తులకు చివరి తేదీ: 12.4.2019 www.iipmb.edu.in

కోర్సులు అందిస్తున్న సంస్థలు
* బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ స్టడీస్‌, కోల్‌కతా.
* డిప్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ స్టడీస్‌, కోల్‌కతా.
* డార్జిలింగ్‌ టీ రిసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌, డార్జిలింగ్‌.
* యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ బెంగాల్‌, డార్జిలింగ్‌.
* డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టీ హస్బెండరీ అండ్‌ టెక్నాలజీ, అస్సామ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ.
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐపీఎం), బెంగళూరు.
ఈ విద్యాసంస్థల నుంచి దరఖాస్తును నేరుగా పొందవచ్చు లేదా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Back..

Posted on 03-12-2018