Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
* తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లు - దోస్త్ 2020
ఆరు యూనివర్సిటీల్లో ప్రవేశించడానికి ఒకటే దరఖాస్తు సరిపోతుంది. ఎందులో ఏ కోర్సు కావాలో ఎంచుకుంటే చాలు అందులో చేరిపోవచ్చు. ప్రతి కాలేజీకీ ప్రత్యేకంగా అప్లికేషన్ పెట్టాల్సిన పనిలేదు. బీఏ, బీఎస్సీ, బీకామ్ వంటి కోర్సులు మొదలు బీబీఎం, బీబీఏ, బీసీఏ తదితర సీట్లనూ పొందవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలతో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఆ విధి విధానాలను తెలుసుకుంటే తేలిగ్గా కోరుకున్న కోర్సులో చేరి చదువుకోవచ్చు.

తెలంగాణలోని ఆరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ‘దోస్త్’ (డి్గ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ - తెలంగాణ) ప్రకటన విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏయే కోర్సులు?
బీఏ, బీఎస్సీ, బీకామ్, బీకామ్ (ఒకేషనల్), బీకామ్ (ఆనర్స్), బీఎస్ డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏ మొదలైన వాటితోపాటు ఆయా యూనివర్సిటీల గుర్తింపు పొందిన కళాశాలలు అందించే ఇతర అన్ని రకాల కోర్సులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కనీస అర్హతలు
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల వారూ అప్లై చేసుకోవచ్చు.

ఏయే యూనివర్సిటీలు?
ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం దోస్త్ ప్రకటన విడుదల చేసింది.

ప్రవేశ విధానం
* విద్యార్థి మొబైల్ నెంబర్ తో ఆధార్ కార్డు లింక్ చేసి ఉంటే దోస్త్ సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక వేళ విద్యార్థి మొబైల్ నెంబర్ తో ఆధార్ లింక్ చేసి లేకపోతే తల్లిదండ్రుల మొబైల్ నెంబర్ తో ఆధార్ ను లింక్ చేసుకోవచ్చు.
* టీ యాప్ ఫోలియో అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా విద్యార్థి దోస్త్ కు నమోదు చేసుకోవచ్చు. దీనికి ఫోటో వెరిఫికేషన్ ఉంటుంది.
* దోస్త్ సహాయకేంద్రం, మీసేవ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది. సహాయ కేంద్రాలను సంప్రదిస్తే అన్ని వివరాలు సమగ్రంగా అందుతాయి.

రిజిస్ట్రేషన్ ఇలా?
రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200 కట్టిన తర్వాత విద్యార్థికి దోస్త్ ఐడీ, పిన్ నెంబరు వస్తాయి. వాటి ఆధారంగా వెబ్ సైట్ లోకి ప్రవేశించి దరఖాస్తు పూర్తి చేయాలి. వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. ఒకసారి సబ్ మిట్ చేసిన తర్వాత సవరించడం సాధ్యం కాదు. తర్వాతి దశలో వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలి. కోరుకున్న కాలేజీ, కోర్సులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే ఆ ఆప్షన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. దోస్త్ ఐడీ, పిన్ నెంబర్లను ఎవరికి ఇవ్వకూడదు.

ఇదీ కాల‌ప‌ట్టిక‌..
మొదటి విడత
* ఆగస్టు 24 - సెప్టెంబరు 7: రిజిస్ట్రేషన్
* ఆగస్టు 29 - సెప్టెంబరు 8: వెబ్ఆప్షన్లు
* సెప్టెంబరు 16: సీట్ల కేటాయింపు
* సెప్టెంబరు 17 - 22: ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌
రెండో విడత
* సెప్టెంబరు 17 - 23: రిజిస్ట్రేషన్, వెబ్ఆప్షన్లు
* సెప్టెంబరు 28: సీట్ల కేటాయింపు
* సెప్టెంబరు 28 - అక్టోబరు 2: ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌
మూడో విడత
* సెప్టెంబరు 28 - అక్టోబరు 3: రిజిస్ట్రేషన్, వెబ్ఆప్షన్లు
* అక్టోబరు 8: సీట్ల కేటాయింపు
* అక్టోబరు 8 - 10: ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌
* అక్టోబరు 8 - 12: 1, 2, 3 విడతల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీట్లను ధ్రువీకరించుకున్నవారు కళాశాలలకు వెళ్లి రిపోర్టు చేయాలి.

ఎంపిక ప్రకారమే సీట్ల కేటాయింపు
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తికాగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తారు. కేటాయించిన సీటుతో అభ్యర్థి సంతృప్తి చెందితే ఆన్ లైన్ లో సెల్స్ రిపోర్టింగ్ చేయాలి. నిర్ణీత ఫీజు చెల్లించాలి. తర్వాత కాలేజీని సందర్శించి సర్టిఫికెట్లను అందజేయాలి. అవసరమైన ఫీజు చెల్లించాలి. అప్పుడే అభ్యర్థికి సీటు ఖరారు అవుతుంది. ఒక వేళ అభ్యర్థి తనకు కేటాయించిన సీటు పట్ల అసంతృప్తితో ఉంటే ముందుగా నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి. తర్వాత మళ్లీ రెండు లేదా మూడు దశల్లో వెబ్ ఆప్షన్లను పెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 60 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి రిజిస్ట్రేషన్, ఆధార్ వివరాల్లో ఇబ్బందులు, సవరణలు, సర్టిఫికెట్ అప్ లోడింగ్ విషయాల్లో విద్యార్థులకు సాయం చేస్తాయి.

దోస్త్ - 2020 లో కొత్తగా..
* కొవిడ్-19 నేపథ్యంలో కొన్ని కొత్త సర్వీసులను దోస్త్ - 2020 లో ప్రవేశపెట్టారు. వ్యక్తులను తాకే అవసరం లేకుండా రియల్ టైమ్ ఫేస్ రికగ్నిషన్ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇందు కోసం టీ యాప్ ఫోలియో అనే మొబైల్ యాప్ ను కొత్తగా ఉపయోగిస్తున్నారు. ఇది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో పరీక్షలు పాసైన వారికి మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మొబైల్ అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు యాప్ లో నమోదు చేస్తే వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక సెల్ఫీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయితే దోస్త్ ఐడీ, పిన్ వస్తాయి. వాటితో తర్వాతి ప్రక్రియ కొనసాగించవచ్చు.
* వాట్సాప్ చాట్ బోట్ ను ఏర్పాటు చేశారు. 7901002200 నెంబరును మీ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లో చేర్చుకొని ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలనూ దోస్త్ -2020 నమోదు ప్రక్రియలో వినియోగించుకోవచ్చు. దోస్త్ యూట్యూబ్ చానెల్ లో పలు వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
ఫేస్ బుక్ పేజీ: https://www.facebook.com/dost.telangana
ట్విటర్: https://twitter.com/dost_telangana
నోటిఫికేషన్ వెబ్ సైట్: https://dost.cgg.gov.in

Back..

Posted on 23-06-2020