Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలుగులోనూ స్కోరుకు ఆస్కారం!

తెలుగు సిలబస్‌లో, ప్రశ్నపత్ర విధానంలో, మూల్యాంకనంలో స్కోరింగుకు అనుగుణంగా మార్పు చేశారు. ఫలితంగా ఎందరో విద్యార్థులు ద్వితీయ భాషగా తాము ఎంచుకున్న తెలుగులో అత్యధిక మార్కులు సాధిస్తున్నారు.
ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్‌వారికైనా ప్రథమభాష ఆంగ్లమే. పేచీ అంతా ద్వితీయ భాష (సెకండ్‌ లాంగ్వేజ్‌) దగ్గరే వస్తుంది. కార్పొరేట్‌ కళాశాలల్లో చదివేవారందరూ దాదాపు సంస్కృతాన్నే ద్వితీయ భాషగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ, కొన్ని ఇతర కళాశాలల్లోనూ విద్యార్థులు చదివేది తెలుగు. అతి కొద్దిమంది హిందీనో, ఉర్దూనో ద్వితీయభాషగా ఎంచుకుంటున్నారు.
పదో తరగతి వరకూ ప్రాథమిక స్థాయిలో చదువుకున్న సబ్జెక్టులు ఇంటర్మీడియట్లో స్థాయి పెరిగి విద్యార్థులను కొంత కంగారుకు గురిచేస్తాయి. ముఖ్యంగా భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, రసాయనశాస్త్రం వంటివి. ఈ పరిస్థితుల్లో ద్వితీయ భాషగా మాతృభాష తెలుగు ఉండటం వల్ల కొంత బరువు తగ్గినట్లు భావించే అవకాశం ఉంటుంది.

మార్కుల మాటేమిటి?
మొదట్లో తెలుగులో 60 నుంచి 80 మార్కుల వరకూ వస్తే ఎక్కువగా అనిపించేది. కానీ ఆ పరిస్థితి ఐదు సంవత్సరాలుగా గణనీయంగా మెరుగుపడింది. తెలుగులో కూడా విద్యార్థులకు 99 మార్కులు వస్తున్నాయి. తెలుగు సిలబస్‌లో, ప్రశ్నపత్ర విధానంలో, మూల్యాంకనంలో స్కోరింగుకు అనుగుణంగా మార్పు చేశారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని ఎందరో విద్యార్థులు తమ ద్వితీయ భాష అయిన తెలుగులో అత్యధిక మార్కులు సాధిస్తున్నారు.
2015-16 విద్యాసంవత్సరంలోని ఉదాహరణనే చూస్తే... బాపట్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు 76 మంది పరీక్ష రాస్తే వారిలో 66 మందికి తెలుగులో 90పైన మార్కులు వచ్చాయి.
ఏడుగురికి 80పైన మార్కులూ, ముగ్గురికి 70 పైన మార్కులూ వచ్చాయి. వీరిలో అతి తక్కువ మార్కు 75. అంటే ర్యాంకు తెచ్చుకోగలిగే విద్యార్థులే కాకుండా సగటు స్థాయి వారు కూడా ఏ గ్రేడ్‌లో తెలుగులో ఉత్తీర్ణులవడం ఇక్కడ గమనించవచ్చు. ఇతర ప్రభుత్వ కళాశాలలు కొన్నిటిలో ఇదే తరహా ఫలితాలు నమోదయ్యాయి.

తెలుగును ద్వితీయ భాషగా తీసుకున్నవారికి ప్రయోజనాలు...
* మాతృభాష కావడం వల్ల విద్యార్థులకు శ్రమ ఉండదు. హాయిగా చదువుకోగలుగుతారు.
* గ్రూపు సబ్జెక్టుల ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుంది.
* సివిల్స్‌ వంటి పోటీ పరీక్షల్లో తెలుగును మాధ్యమంగానే కాకుండా ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వ సర్వీసులైన గ్రూప్స్‌ను అత్యధికులు రాసేది తెలుగులోనే. నేటి ఇంటర్‌ విద్యార్థులు రేపటి పోటీపరీక్షల అభ్యర్థులవుతారు కాబట్టి వీరు మాతృభాషకు దూరం కాకుండా ఉండేందుకు ద్వితీయభాష ఆస్కారం కలిగిస్తుంది.

ఏ అంశాలపై దృష్టిపెట్టాలి?
ఇంటర్మీడియట్‌ తెలుగు ప్రశ్నపత్రంలో స్కోరింగుకు అవకాశమిచ్చే కొన్ని కీలక అంశాలున్నాయి. వీటిపై దృష్టిపెట్టి చదివితే సరిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యభాగాలు వేరైనప్పటికీ పరీక్ష ప్రశ్నపత్రం విధానం ఒకటే.

మొదటి సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రంలో...
* ఎనిమిది సంధి రూపాలను ఇచ్చి నాలుగింటిని విడదీసి సంధి పేరు, సూత్రం రాస్తే: 4x3 = 12 మార్కులు.
* సమాసాలు: 4x2 = 8మార్కులు.
* ఆంగ్ల వాక్యాలకు తెలుగు అనువాదాలు: 5x1 = 5 మార్కులు (ఆంగ్ల వాక్యాల పట్టిక పాఠ్యపుస్తకంలో ఇచ్చారు. వాటినుంచే అడుగుతారు).
* పేరాగ్రాఫ్‌ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయడం: 5x1 = 5
* పద్య, గద్య పాఠ్యాంశాల్లో ఏకపద ప్రశ్నలు: 10x1 = 10 మార్కులు
మొత్తం 40 మార్కుల స్కోరింగ్‌ ఇది. మిగిలినవి కూడా పద్యపూరణం, భావం 6 మార్కులూ, పద్య గద్య వ్యాసరూప ప్రశ్నలు 12 మార్కులూ. ఆపై సంక్షిప్త ప్రశ్నలు, లేఖ, సాధారణ వ్యాసం, ఉపవాచకం ప్రశ్నలు, సందర్భ సహిత వ్యాఖ్యలు ఉంటాయి.

ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రంలో...
* ఛందస్సులో నాలుగు వృత్తపద్యాలు (ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం); మూడు ఉపజాతి పద్యాలు (ఆటవెలది, తేటగీతి, సీసం); జాతి పద్యం (కందం). వీటిలో మూడు ఇచ్చి ఒకటి సోదాహరణ లక్షణ సమన్వయం చేయమంటారు. 6 మార్కులు. అంతే కాక ఛందస్సులో ప్రాథమికాంశాలపై ఏకపద ప్రశ్నలకు 6 మార్కులు. మొత్తం 12
* అలంకారాలకు కూడా అంతే. నాలుగు శబ్దాలంకారాలు (వృత్త్యనుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస). నాలుగు అర్థాలంకారాలు (ఉపమా, రూపకం, స్వభావోక్తి, అతిశయోక్తి). వీటిలో మూడు ఇచ్చి ఒకటి రాయమంటారు. 6 మార్కులు. అలంకారాల్లో ప్రాథమికాంశాలపై ఏకపద ప్రశ్నలకు 6 మార్కులు. మొత్తం 12.
* పద్య, గద్య ఏకపద ప్రశ్నలకు 12 మార్కులు
* కొన్ని పదాల ఆధారంతో సంభాషణ కల్పనకు 6 మార్కులు
* ఇంకా భాషాభాగాలు, వాక్యదోషాలు మొదలైన అంశాలపై 10 మార్కులు.
ఈ మొత్తం 52 మార్కులు స్కోరింగుకు అనువైనవి.
ఇవి కాక ప్రతిపదార్థ తాత్పర్యాలకు 6, పద్యగద్య వ్యాస ప్రశ్నలకు 12, ఉపవాచక ప్రశ్నలకు 8, సందర్భ సహిత వ్యాఖ్యలకు 6 మార్కులు, పద్య, ఉపవాచకాల్లో 12, సంక్షిప్త ప్రశ్నలకు 8 చొప్పున మార్కుల వెయిటేజి ఉంది.
ఈ వ్యాకరణం, ఛందస్సు... నేర్చుకోవటం సులువే. ఇవన్నీ పాఠశాల స్థాయిలో చదివినవే; కొత్తవేమీ కాదు. కష్టమైనవి అంతకంటే కాదు. తెలుగు, సంస్కృత సంధుల పరిచయం ఆరో తరగతి నుంచే ఉంటుంది.
అందుకే విద్యార్థులు తెలుగులో మంచి ప్రతిభ చూపగలుగుతున్నారు. అత్యధిక మార్కుల కోసం ఎంచుకునే ద్వితీయ భాషల్లో సంస్కృతంతో పాటు తెలుగు కూడా ఉందని గుర్తించి, విద్యార్థులు తమ ఆసక్తీ, అభిరుచుల మేరకు నిర్ణయం తీసుకోవడం సముచితం!

Back..

Posted on 28-06-2016