Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తక్కువ సమయం.. ఎక్కువ మార్కులు

* పరీక్షల వేళ.. ‘పది’ ప్రణాళిక ఇలా
* పోటీ భావనను మస్తిష్కం నుంచి తరమాలి
ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థి జీవితంలో కీలకదశగా భావించే పదో తరగతి పరీక్షలు మరికొద్ది రోజుల్లోనే జరగబోతున్నాయి. ఏడాదంతా పడిన శ్రమకు ఫలితమిచ్చే తరుణం కావడంతో ఇటు విద్యార్థుల్లో... అటు తల్లిదండ్రుల్లో ఒకటే ఉత్కంఠ. పరీక్షలకు మరో పదిహేను రోజుల గడువే ఉండటంతో ఈ సమయం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే పక్కా ప్రణాళిక రూపొందించుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల సన్నద్ధత ఎలా ఉండాలి..? సమయ విభజన ఎలా చేసుకోవాలి? ఏ సమయంలో చదవడానికి ప్రాధాన్యమివ్వాలి? తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా మంచుకొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.మల్లికార్జునశర్మ అందిస్తున్న సలహాలివి..

సులువైనవి ముందు
సమయం తక్కువ కాబట్టి పుస్తకం మొత్తం చదవాలనే ఆలోచన పక్కన పెట్టాలి. సులువైన పాఠాల్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చదవడం ద్వారా పట్టు సాధించొచ్చు. లఘుప్రశ్నలకు సమాధానాల్ని రాబట్టేందుకు ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ అర్థం కాని భావనలు ఉంటే.. వాటిల్లోని లఘుప్రశ్నలపైనే దృష్టి కేంద్రీకరించాలి. క్లిష్టతరమైన వాటిపై దృష్టి సారిస్తే సమయం వృథా అయ్యేందుకు అవకాశముంది. పుస్తకాల్లోని అంశాలను ఆకళింపు చేసుకోవడం ద్వారా సొంతంగా ప్రశ్నలు రూపొందించి సమాధానాలు రాబట్టాలి. ఇలా చేయడం ద్వారా ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించి ఎక్కువ మార్కులు సాధించేందుకు ఆస్కారముంటుంది.

బృంద అధ్యయనం మేలు
ఈ కీలక తరుణంలో విద్యార్థులు ఒంటరిగా చదువుకోవడం కంటే బృందంగా ఏర్పడి చదువుకోవడం ఉత్తమం. చదువుకున్నప్పుడు ఉత్తన్నమయ్యే సందేహాల్ని అప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడం అన్ని విధాలా ప్రయోజనం కాబట్టి బృంద అధ్యయనం ద్వారానే అది సాధ్యమవుతుంది. చదువుకోవడంతోపాటు పరస్పరం లఘు ప్రశ్నల్ని సంధించి సమాధానాలు రాబడితే బాగా గుర్తుంచుకోవచ్చు. ముఖ్యంగా ఎవరినో వూహించుకొని పోటీ పడే భావన అంత మంచిది కాదు. అలాంటి భావనను మస్తిష్కం నుంచి వెంటనే తొలగించేయాలి. ‘నాకు నేనే పోటీ’ అనుకుని చదువుపై దృష్టి సారించాలి.

ఆరోగ్యం కీలకం
పరీక్షల సమయంలో ఆరోగ్యంపై దృష్టి సారించడం కీలకం. ఏడాదంతా చదివిన తర్వాత పరీక్షల వేళ అనారోగ్యానికి గురైతే ఆ శ్రమంతా వృథా అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆహారాన్ని తీసుకోవాలి. ఎండాకాలం కాబట్టి చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరినీటితోపాటు బార్లీ గింజలు నానబెట్టిన నీళ్లు, తేనె స్వీకరించాలి. నూనెతో కూడిన ఆహార పదార్థాలు, వేపుళ్లు, మాంసాహారం, జంక్‌ఫుడ్స్‌కు విరామం ప్రకటించడం మంచిది. ఈ బాధ్యతను తల్లిదండ్రులే తీసుకోవాలి.

రెండు సబ్జెక్ట్‌లు.. ఒక లాంగ్వేజ్‌
ఏడాదంతా చదివిన చదువుతో పోలిస్తే పరీక్షల సమయం కాబట్టి ఈ పదిహేను రోజులు కీలకం. సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి చదువుకునే వేళల్ని ప్రణాళిక బద్ధంగా విభజించుకోవాలి. ఉదయం వేళ ఒక సబ్జెక్ట్‌, రెండు లాంగ్వేజ్‌లు, సాయంత్రం ఒక సబ్జెక్టు, రెండు లాంగ్వేజ్‌లకు సమయాన్ని కేటాయించుకోవాలి. ఉదాహరణకు ఉదయం పూట గణితంతోపాటు తెలుగు, హిందీ, సాయంత్ర వేళ సాంఘికశాస్త్రం, సామాన్యశాస్త్రం, ఆంగ్లంకు కేటాయించొచ్చు. ఒక్కో అంశానికి 30-45 నిమిషాలే గడువు పెట్టుకోవాలి. గణితం సబ్జెక్టుకు గంట సమయం కేటాయించుకోవాలి.

ప్రతీ సబ్జెక్ట్‌కు 92
సాధారణంగా విద్యార్థులు గణితం, ఆంగ్లం, సామాన్యశాస్త్రం.. లాంటి సబ్జెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తుంటారు. ఇవి కష్టంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా చదవాలని ఆత్రుత పడతారు. ఇది సరైన చర్య కాదు. అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. గ్రేడ్‌లను నిర్ణయించడంలో ఇదే కీలకమవుతుంది. అన్ని సబ్జెక్టుల్లో 92 కంటే ఎక్కువ మార్కులు వస్తేనే ఏ-1 గ్రేడ్‌ సాధించేందుకు ఆస్కారముంటుందనే విషయాన్ని మరవొద్దు. ఏ ఒక్క సబ్జెక్టులో ఆ మార్కు రాకున్నా 10 జీపీఏ కోల్పోతారు. అందుకే అన్ని సబ్జెక్టులపై దృష్టి కేంద్రీకరించడం అవసరం.

ఆటలకు అరగంట
పరీక్షల సమయం కదా ఆటలకు విరామం ఇవ్వాలనేది సహజంగా వచ్చే ఆలోచన. సమయాభావం వల్ల అది సరైనదే అయినా.. కాస్త తక్కువగానైనా క్రీడలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలోనూ సాయంత్రం ఒక అరగంట సేపు ఆటలాడాలి. అదీ కూర్చుని ఆడేవి కాకుండా శరీరానికి చెమటలు పట్టేలా మైదానంలో ఆడాలంటున్నారు. బృందంగా ఆడే ఆటలైతే శరీరానికి మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ శారీరక శ్రమ వల్ల విద్యార్థులు ఉత్తేజితులై చదువుపై మనసు లగ్నం చేయగలుగుతారు.

ఉదయం 4.. రాత్రి 10
పరీక్షలు కదా అని రాత్రి బాగా పొద్దుపోయే దాకా చదవడం మంచిది కాదు. కచ్చితంగా రాత్రి పది గంటలకే పడుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అలా నిద్రకు ఉపక్రమించి తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి చదువుకు ఉపక్రమించాలి. ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చదువుపై మనసు లగ్నం చేసేందుకు ఆస్కారముంటుంది. అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో కొంతసేపు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రతపై పట్టు సాధించొచ్చు.

Back..

Posted on 23-02-2017