Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మిగిలింది 21 రోజులే

* పదోతరగతికి సమీపిస్తున్న ప్రీ ఫైనల్‌.. పబ్లిక్‌ పరీక్షలు
* అంతర్గత మార్కుల కేటాయింపులో తొలగని గందరగోళం
* ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే మేలైన ఫలితాలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే : విద్యార్థి భ‌విష్య‌త్తుకు తొలి మెట్టు ప‌దో త‌ర‌గ‌తి. కీల‌క‌మైన ఈ ద‌శ‌లో త‌ప్ప‌ట‌డుగు వేస్తే జీవితం మొత్తం అంధ‌కార‌మే. అందుకే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను విద్యార్థులు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తారు. ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ఇంకా కేవ‌లం 21 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌టంతో పాటు ప్రీఫైన‌ల్ ప‌రీక్ష‌కు, ప‌బ్లిక్ ప‌రీక్ష‌కు మ‌ధ్య కేవ‌లం ఐదు రోజులే విరామం. ఈ ప్ర‌భావం ఉత్తీర్ణ‌త శాతంపై ప‌డుతుంద‌ని ఉపాధ్యాయులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. దానికి తోడు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లో అంత‌ర్గ‌త మార్కులు కీల‌కంగా మారాయి. ఈసారి మార్కుల కేటాయింపుపై ఇంకా స్ప‌ష్ట‌త రాక‌పోవ‌టంతో విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నారు.
విద్యాప్రణాళిక ప్రకారం రెండు సమ్మేటివ్‌లు, నాలుగు ఫార్మేటివ్‌ పరీక్షలు నిర్వహించాలి. ఈ విద్యాసంవత్సరం ఆగస్టులో నిర్వహించిన సమ్మేటివ్‌-1 ప్రశ్నాపత్రాలు లీకవడంతో వాటిని రద్దు చేశారు. తిరిగి సమ్మేటివ్‌-1 పరీక్షను జనవరిలో నిర్వహించారు. సమ్మేటివ్‌ -2 పరీక్షలు జరపలేదు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు జరుపుతున్నారు. మార్చి 15 నుంచి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐదు రోజుల్లో ఎలా సన్నద్ధం కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయోమయంలో అంతర్గత మార్కులు..
పది పరీక్షల్లో అంతర్గత మార్కులు కీలకంగా మారాయి. గత సంవత్సరం వరకు నిర్వహించిన నాలుగు ఫార్మేట్‌, రెండు సమ్మేటివ్‌ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అంతర్గత మార్కులను కేటాయించారు. సమ్మేటివ్‌-1లో ఫార్మేటివ్‌ 1, 2 మార్కులు, సమ్మేటివ్‌-2లో ఫార్మేటివ్‌ 3, 4 మార్కులు క్రోడీకరించి విద్యార్థులు సాధించిన అంతర్గత మార్కులు లెక్కించాలి. ఈ ఏడాది సమ్మేటివ్‌-2 పరీక్షలు నిర్వహించనందున ఇప్పటికే పూర్తయిన మూడు ఫార్మేటివ్‌ పరీక్షలు, ప్రస్తుతం నిర్వహించే ఫార్మేటివ్‌-4ను బట్టి అంతర్గత మార్కులను కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే మూడు ఫార్మేటివ్‌ మార్కుల వివరాలు అప్‌లోడ్‌ చేసినా.. నాలుగో ఫార్మేటివ్‌ మార్కులు ఎప్పుడు నమోదు చేస్తారన్న విషయంలో గందరగోళం నెలకొంది. సమ్మేటివ్‌ -2 నిర్వహించకపోవటంతో ప్రీఫైనల్‌ మార్కుల్ని పరిగణనలోకి తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి అంతర్గత మార్కులు ఎలా గణించాలనే విషయంలో స్పష్టత లేక ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు.
పాఠ్యాంశాలన్నీ కీలకమే..
పదోతరగతిలో ఏ పాఠ్యాంశాన్నీ తక్కువగా తీసుకోకూడదు. ప్రతి సబ్జెక్టుపైనా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రీఫైనల్‌, పబ్లిక్‌ పరీక్షల మధ్య కేవలం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో విద్యార్థులు ఆయా పాఠ్యాంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా బోధించే అవకాశం లేదు. దీంతో ప్రీఫైనల్‌కు ముందే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.

తెలుగు అక్షర దోషాలు నివారించుకోవాలి -కె.బర్నాబాస్‌, తెలుగుపండితుడు, చిగురుకోట
తెలుగు పేపరు-1లో నక్షత్ర గుర్తు ఉన్న పద్యాలను క్షుణ్ణంగా చదవాలి. గద్య పాఠ్యాంశం నుంచి ఇచ్చిన గద్యాన్ని చదివి సమాధానం రాయాలి. గద్యభాగంలో ఇచ్చే లఘు ప్రశ్నలను సాధన చేయాలి. కవి పరిచయం నేపథ్యం, పాత్ర స్వభావాలపై ప్రశ్నలు వస్తాయి. పద్య, గద్య భాగాల నుంచి ఇచ్చే వ్యాసరూప ప్రశ్నలకు వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు లేకుండా సమాధానం ఇవ్వాలి. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి, వికృతి, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారం తదితర వ్యాకరణాలపై పట్టు సాధించాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలు, లఘు ప్రశ్నలపై దృష్టి సారించాలి. వ్యాసరూప ప్రశ్నలతో సృజనాత్మక ప్రశ్నలు బాగా చదవాలి. పేపరు-2లో పదికి పది పాయింట్లు సాధించడానికి తోడ్పడేది సంస్కృతం. విభక్తులు, ధాతువుల మీద వ్యాకరణంపై దృష్టిసారించాలి.

అంగ్లం
కష్టపడితే మంచి మార్కులు - అజయ్‌, ఆంగ్లం ఉపాధ్యాయుడు, వడాలి
పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి భాషా భాగాలను చక్కగా సాధన చేయాలి. అంతర్గత భాషా భాగాలను తెలుసుకుని చదవాలి. వ్యాకరణంపై దృష్టి సారించాలి. లేఖలు, సంభాషణలు, డేటా ఎంట్రీ వాటిపై పట్టు సాధించాలి. కాన్వర్జేషన్‌లోని వ్యాసరూప ప్రశ్నలకు సరైన జవాబు ఇచ్చేలా సాధన చేయాలి. వ్యాకరణాంశాలపై దృష్టి పెట్టాలి. పార్ట్‌ బీలో పూర్తి మార్కులు సాధించటం సులభం. స్పెల్లింగ్‌, మ్యాచింగ్‌, రైట్‌ ఫామ్‌ ఆఫ్‌ ది వర్‌్్డ, సినానమ్స్‌, యాంటోనిమ్స్‌ తదితరాల్లో రోజుకో అంశంపై సాధన చేస్తే పార్ట్‌బీలో పూర్తి మార్కులు స్కోర్‌ చేయవచ్చు.

హిందీ
పాఠ్యపుస్తకం పఠనంతో మేలు - ఐ.సత్యనారాయణరాజు, హిందీ పండితుడు, బొమ్మినంపాడు
హిందీ వ్యాకరణంలో అభ్యాసం చేయాలి. వాక్య నిర్మాణంలో వ్యాకరణం చక్కగా దోహదపడుతుంది. ఒక్కో పదానికి ఉన్న పర్యాయ పదాలన్నీ నేర్చుకోవాలి. దీనివల్ల సొంత పదాలతో వాక్యనిర్మాణం సాధ్యమవుతుంది. పాఠ్యపుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. సీసీఈ విధానంలో పరీక్ష రాయడానికి ఇది చాలా సహకరిస్తుంది. 20 మార్కులకు బిట్స్‌ ఉంటాయి. వీటిని చక్కగా సాధన చేయాలి.

భౌతికశాస్త్రం
బట్టీ విధానం పనిచేయదు - శంకరరావు, భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు
పాఠ్యాంశాలను చక్కగా ఆకళింపు చేసుకోవాలి. కృత్యాల ద్వారా పాఠాన్ని అవగాహన చేసుకోవాలి. 1, 2, 3, 7, 8, 9, 10, 11, 12 చాప్టర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నాలుగు, రెండు మార్కుల ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. గతం కంటే భిన్నంగా బిట్‌ పేపరు ఉంటుంది. మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. బొమ్మలు, సమస్యల మీద దృష్టిసారించాలి. బట్టీ విధానం పనిచేయదని విద్యార్థులు గుర్తించాలి.

గణితం
పదికి పది సాధన సులువు.. -కేఎస్‌ఎస్‌ కుమార్‌, లెక్కల ఉపాధ్యాయుడు, కానుకొల్లు
సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి. ప్రతి అధ్యాయానికి సూత్రాలను గుర్తుంచుకోవాలి. సమస్యల్లో అంకెలను మార్చి ఇచ్చినా చేసే విధంగా తర్ఫీదు పొందాలి. ప్రతి సమస్యకు ముందుగా దత్తాంశం, ఏం కనుక్కోవాలో, సమస్యకు సంబంధించిన సూత్రం, విలువలకు ఆ సూత్రంలో ప్రతిక్షేపించడం, ఆపైన సరైన విధానంలో సాధించడం, చివరిగా ముగింపు ఇవ్వడాన్ని మరిచిపోకూడదు. గణితంలో 8వ అధ్యాయంలో ఇచ్చిన సిద్ధాంతాలు 8, 9వ అధ్యాయాల్లో ఇచ్చిన నిర్మాణాలు, 3, 4వ అధ్యాయాల్లో ఇచ్చిన గ్రూపులను చక్కగా అభ్యాసం చేయాలి. ప్రతి అధ్యాయంలో నిర్వచనాలు, సూత్రాలు, సిద్ధాంతాలతో కూడిన భావనను అర్థం చేసుకోవాలి. ప్రణాళిక ప్రకారం వెళితే 20 మార్కుల బిట్‌ పేపరును విద్యార్థి సమర్థంగా ఆన్సర్‌ చేయగలుగుతారు.

జీవశాస్త్రం
బహుళైచ్ఛిక ప్రశ్నల సాధన అవసరం -సీహెచ్‌.పాండురంగారావు, ఉపాధ్యాయుడు, గురజ
పాఠ్యపుస్తకాన్ని చక్కగా చదవాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలు సాధనపై దృష్టిసారించాలి. సృజనాత్మక రీజనింగ్‌ ప్రశ్నలపై సాధన చేయాలి. ప్రధానమైన అంశాలను చూడకుండా రాయాలి. చిత్రపటాలపై సాధన తప్పనిసరి. పరిశోధనల ద్వారా సమాచార సేకరణ చేయాలి. జంతు, మానవ, వృక్ష దేహాల పనితీరుకు సంబంధించి చిత్రపటాలను ప్రాక్టీస్‌ చేయాలి. సాధన కృత్యాలను క్రమం తప్పకుండా చేయాలి.

సాంఘికశాస్త్రం
సమకాలీన అంశాలపై పట్టు -బీఎస్‌ వరప్రసాద్‌, సాంఘికశాస్త్రం, పెదగొన్నూరు
ఈ సబ్జెక్టులో ప్రశ్నలు అడిగే విధానంలో మార్పు వచ్చింది. గత ఏడాది నుంచి నూతన విధానం అమల్లºకి వచ్చింది. పాత పద్ధతిలో ఏదైనా ప్రదేశాల ప్రాముఖ్యత వర్ణించండని ప్రశ్న అడిగేవారు. నూతన విధానంలో ఆ ప్రదేశాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదనే రీతిలో ప్రశ్నలుంటాయి. సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి. బిట్టులపై ఎక్కువ దృష్టి సారించాలి. కాలక్రమ పట్టికలు, బార్‌ గ్రాపులు, మ్యాపు రీడింగ్‌లపై పట్టు అవసరం.

Back..

Posted on 22-02-2018