Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఒత్తిడిని ఓడిద్దాం!

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రోహిణి రాత్రింబవళ్లు చదివేస్తోంది. నిద్రాహారాలు మానేసి నిరంతరం ప్రిపేరవుతున్నా ఏదో భయం. పూర్తి చేయాల్సిన సిలబస్‌ ఇంకా మిగిలిపోయిందనే ఆందోళన. అప్పటి వరకు చదివినదంతా మర్చిపోయానేమోననే మథనం. ఇదంతా చూస్తున్న తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఈ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో టెన్త్‌ ఎగ్జామ్స్‌ రాసే పిల్లలున్న ప్రతి ఇంట్లో దాదాపు కనిపిస్తుంటాయి. వీటన్నింటిని అధిగమించాలంటే కొన్ని మార్పులు చేసుకొని.. కొంత ప్రశాంతత సమకూర్చుకుంటే సక్సెస్‌ఫుల్‌గా పరీక్షలు రాసేయవచ్చంటున్నారు నిపుణులు.

తరగతి గది పాఠాలు, పాఠ్య, నోట్‌ పుస్తకాలతో కుస్తీ, హోంవర్క్‌, ట్యూషన్లు, స్నేహితులు.. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ విద్యాసంవత్సరం ముగింపు కొచ్చేసింది. పరీక్షలు దగ్గరవుతున్నాయంటే విద్యార్థుల్లో ఒకరకమైన భయం, ఆందోళన. ఇక మొదటిసారి పబ్లిక్‌ పరీక్షలను ఎదుర్కొంటున్న వారి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. ఒక్కో రోజు గడుస్తున్నకొద్దీ చదివినదంతా రెక్కలొచ్చినట్లు ఎగిరిపోయినట్లు బుర్రంతా ఖాళీ అనిపిస్తుంటుంది. ఈ లక్షణాలన్నింటికీ మూల కారణం.. పరీక్షల ఒత్తిడి.

పబ్లిక్‌, బోర్డు పరీక్షలనగానే పిల్లలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒకరకమైన అంచనాలు పెంచేసుకుంటారు. కొందరు అదే పనిగా చదివేస్తుంటారు. కొందరు నచ్చిన సమయంలోనే చదువుతుంటారు. ఎప్పుడూ పుస్తకం ముందేసుకుని ఉంటేనే చదువుతున్నట్లు కాదు. తల్లిదండ్రులు అదేపనిగా పిల్లలను ఇతరులతో పోల్చటం ఒత్తిడిని ఏర్పరుస్తుంది. నిజానికి కొంతమేర ఒత్తిడి మంచిదే. అది ప్రేరణగానూ పనికొస్తుంది. పూర్తిచేయాల్సిన పనిని సక్రమంగా చేసేలా ప్రోత్సహిస్తుంది. అది పరిధి దాటినప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఒత్తిడి మితిమీరితే శారీరకంగా, మానసికంగా సమస్యలు వస్తాయి.

లక్షణాలేంటి?
మానసికంగా:
* చిరాకు, కోపం, నిరాశ నిస్పృహ
* భయందోళనలు
* విశ్రాంతికి దూరమవటం
* మానసికంగా అలసట
* ఉదాసీనంగా ఉండటం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం.
* దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం.
శారీరకంగా: ‌
* కండరాలు పట్టేయడం
* ఆకలిలో మార్పులు, జీర్ణశక్తి తగ్గిపోవడం
* నిద్రపట్టకపోవడం ‌
* హృదయ స్పందనలో అనుకోని మార్పులు ‌
* తరచూ మూత్ర విసర్జన చేయాలనిపించడం ‌
* ఛాతిలో అసౌకర్యంగా ఉండటం
* మలబద్ధకం లేదా విరేచనాలు ‌
* వెన్ను నొప్పి

తిండీ, నిద్రా, వ్యాయామం
పరీక్షలు అనగానే చాలామంది నిద్రను పక్కన పెట్టేస్తారు. చదివినదాన్ని మెదడులో నిక్షిప్తం చేయడంలో నిద్రది ప్రధాన పాత్ర. తక్కువ గంటలు నిద్రపోయి, కొంత చదివి మళ్లీ పడుకుందాం అనుకుంటుంటారు కొందరు. అదీ మంచిది కాదు. ఎలాంటి అంతరాయం లేకుండా పోయే నిద్రే ప్రయోజనకరం. ఆపై లేచాక చదివింది త్వరగా అర్థమవడమే కాకుండా ఎక్కువగా గుర్తుంటుంది.
* పరీక్షల సన్నద్ధత పేరుతో తిండిని నిర్లక్ష్యం చేయకూడదు. ఏదో ఒకటి కాకుండా బలమైన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. చిరుతిళ్లకు దూరంగా ఉండాలి. ఇవి కూడా ఆందోళనకు కారణాలే. నిద్ర, ఆహారం.. రెండింటికీ సమయపాలన పాటించడమూ తప్పనిసరే!
* వ్యాయామం, కొద్దిసేపు నడవటం, పరుగెత్తటం, డాన్సింగ్‌, సైక్లింగ్‌ లాంటివి చేస్తే ఒత్తిడి తగ్గి మనసు తేలికవుతుంది.

కొద్ది మార్పులతో...
చదివే పద్ధతిలో కొద్ది మార్పులు చేసుకుంటే.. త్వరగా, సులువుగా నేర్చుకోవచ్చు. ఫలితంగా ఒత్తిడీ తగ్గిపోతుంది.
* ఏకాగ్రత పెట్టలేకపోతున్నట్టు అనిపించగానే చిన్న చిన్న విరామాలను తీసుకోవాలి. చల్లగాలికి కొంతసేపు నడవడం, పాటలు వినడం, చిన్న చిన్న వ్యాయామాలు ఇలా దేన్నైనా విరామ సమయంలో పాటించవచ్చు.
* చదివే ప్రదేశం ఏకాగ్రతకు భంగం కలిగించనిదిగా, పరిశుభ్రంగా ఉండాలి.
* ఏ సమయంలో ఏకాగ్రత పెట్టగలుగుతామని అనుకుంటారో అలాంటి సమయంలోనే ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. ఈ సమయంలో కష్టమైన సబ్జెక్టును చదవటం మేలు.
* కష్టమైన సబ్జెక్టుల విషయంలో బృందంగా చదవడానికి ప్రాధాన్యమివ్వాలి. ఇక్కడ సబ్జెక్టుపరంగా చేసే చిన్న చిన్న చర్చలు గుర్తుంచుకోవడానికి ఎక్కువ అవకాశమిస్తాయి.
* గత వైఫల్యాలను మనసులో నుంచి తుడిచేయాలి. గతంలో ఎక్కడ వెనకబడ్డారో వాటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
* చదవడం ప్రారంభించే ముందే చదివే అంశం/ సబ్జెక్టుపై సమయాన్ని నిర్దేశించుకోవాలి. దాన్ని పక్కాగా పాటించాలి.
* వచ్చినవాటిని పక్కన పెట్టేసి, కొత్తవాటిని చదువుతూ కూర్చోకూడదు. ముందుగా వచ్చిన వాటి పునశ్చరణ పూర్తిచేశాకే మిగతావాటి జోలికి వెళ్లాలి.
* పరీక్షకు ముందు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. చివరి నిమిషం వరకూ చదవాలన్న ఆలోచన వద్దు.

కొన్ని సందేహాలు-నిపుణుల సూచనలు
* ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి?
ఇది అందరికీ ఉండే సమస్యే. సాధారణంగా కష్టమైన సబ్జెక్టును చదివేప్పుడు ఎక్కువగా ఇలా అనిపిస్తుంటుంది. చదివేటపుడు నచ్చిన పాటనో, సన్నివేశాన్ని గుర్తుచేసుకోవడమో జరుగుతుంటుంది. కారణం- ప్రతి ఒక్కరికీ ఏకాగ్రతా సమయం ఒకటుంటుంది. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు ఆ సమయం ఎంతో గమనించుకుని, ప్రిపరేషన్‌ కొనసాగించాలి. ఏకాగ్రత లోపించింది అనగానే విరామం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

* ఇలా చదవడం ప్రారంభించానో లేదో నిద్ర ముంచుకొచ్చేస్తోంది. ఏం చేయను?
కష్టంగా, బోర్‌గా భావించేవి అది చివరికి సినిమా అయినా నిద్ర తెప్పిస్తుంది. అన్యమనస్కంగా చేస్తున్నారు అంటే.. సమయం వృథా చేస్తున్నట్లే. నిద్రకు ఎంత సమయం కేటాయిస్తున్నారనేదీ ఇక్కడ ప్రధానమే. కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. అది సరిపోలేదు అనిపిస్తే ఇంకో రెండు గంటలు పడుకోండి. నిద్ర సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా కూడా చూసుకోవాలి. అప్పుడే చదువుపై ఆసక్తి చూపగలరు. ప్రతి సబ్జెక్టులోనూ అది ఎంత కష్టమైనదైనా.. నచ్చిన భాగం ఉంటుంది. అనాసక్తి సమయంలో దాని పునశ్చరణకు ప్రాధాన్యమిచ్చి, ఆసక్తి కలిగించే సమయంలో కష్టమైనదాని వైపు వెళితే సరి!

* ఆందోళనగా ఉంది. ఒకవేళ పరీక్ష బాగా రాయకపోతే?
ఆందోళన, ఒత్తిడి పరిధి దాటినప్పుడే సమస్యలు ఎదురవుతాయి. ఈ స్థితికి చేరితే మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవాలి. అయితే ఒకటి- మార్కులు మాత్రమే జీవితం అనుకోకండి. మీరు, మీ జీవితమే అన్నింటికంటే ముఖ్యం. చదివేటప్పుడు మధ్యమధ్య విరామాల్లో గత ప్రశ్నపత్రాలను చూడండి. అవి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఒకసారి మీరు చదివింది ప్రశ్నపత్రాల్లో కనిపించగానే అనవసర ఆందోళన తగ్గి, ఉత్సాహం పెరుగుతుంది.


Back..

Posted on 13-03-2019