Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉచిత విద్య.. ఉన్నత శిక్షణ!

* ఆరో తరగతి, ఇంటర్‌లోకి ప్రవేశాలు

* గిరిజన గురుకులాల ప్రకటన విడుదల

ఉచితంగా చదువు, వసతి, భోజన సౌకర్యాలతో సైనిక్‌ స్కూల్లో ఆరోతరగతి, జూనియర్‌ కాలేజీల్లో ఎన్‌డీఏ కోచింగ్‌తో కూడిన ఇంటర్‌లో చేరే అవకాశం వచ్చింది. రాత పరీక్షలో ప్రతిభను ప్రదర్శిస్తే ఎలాంటి ఖర్చూ లేకుండా నాణ్యమైన విద్యను ఈ తెలంగాణ గిరిజన గురుకులాల్లో అందుకోవచ్చు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా అశోక్‌నగర్‌లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌లో ఆరోతరగతి (80 సీట్లు), ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం (ఎంపీసీ-80 సీట్లు); రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని టీటీడబ్ల్యూయూఆర్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం (ఎంపీసీ-80 సీట్లు) భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఏ మీడియం విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.

మంచి విద్యతోపాటు శారీరకంగా, మానసికంగా, వ్యక్తిత్వపరంగా మంచి శిక్షణను సైనిక్‌ స్కూలు ఇస్తుంది. జూనియర్‌ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్‌తోపాటు ఎన్‌డీఏ పరీక్షకు కోచింగ్‌ ఇస్తారు. దీంతో త్రివిధ దళాల ఉద్యోగాల్లో చేరి మంచి భవిష్యత్తును అందుకోవచ్చు.

ఎవరు అర్హులు?
ప్రస్తుత విద్యా సంవత్సరంలో అయిదు, పది తరగతులు చదువుతున్న విద్యార్థులు సంబంధిత కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరులో ప్రవేశాలకు జులై 2, 2008 - జులై 1, 2011 లోగా; ఇంటర్‌ ప్రవేశాలకు జులై 2, 2003- జులై 1, 2006లోపు జన్మించివుండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారైతే రూ.1.5 లక్షలు, పట్టణాల్లోని వారైతే రూ.2 లక్షల లోపు ఉండాలి.

పరీక్ష విధానం
ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. ఇందులో తెలుగు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. అయిదో తరగతి సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తారు.

ఇంటర్‌లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌ 40, ఇంగ్లిష్‌ 20, ఫిజిక్స్‌ 20, కెమిస్ట్రీ 15, బయాలజీ 5 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 8, 9, 10 తరగతుల సిలబస్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

ఫిజికల్‌ టెస్టు: పరీక్షలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా సీట్ల సంఖ్యకు మూడు రెట్ల మందిని ఫిజికల్‌ టెస్టులకు తీసుకుంటారు. అందులో ఎంపిక కావడం తప్పనిసరి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. ఇలా అన్ని విభాగాల్లోనూ నెగ్గితే కోర్సులోకి తీసుకుంటారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 3

రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 21

వెబ్‌సైట్‌: http://www.tgtwgurukulam.telangana.gov.in/

Back..

Posted on 23-01-2020