Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పోటీకి కాల పరీక్ష

పోటీ పరీక్షార్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేసేవాటిలో సమయం చాలా ముఖ్యమైనది. దీన్నెలా ప్రణాళికాబద్ధం చేసి, సద్వినియోగం చేసుకోవాలి? 2016 సంవత్సరం నిష్క్రమిస్తూ మరొక సంవత్సర కాలం మన చేతిలోకి వస్తున్న తరుణంలో ఈ అవలోకనం ప్రయోజనకరం!
పోటీ పరీక్షార్థులు విజయం కోసం తపిస్తుంటారు. సివిల్‌ సర్వీసెస్‌ నుంచి రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పోటీ పరీక్షల వరకూ, జేఈఈ నుంచి ఎంసెట్‌ వరకూ, జాతీయబ్యాంకు పరీక్షల నుంచి స్థానిక కోర్టుల సిబ్బంది వరకూ... ఏ పోటీ పరీక్షలోనైనా విజయానికి అంతిమంగా ఏది కేంద్ర బిందువు అవుతుంది? పరిశీలిస్తే... సిలబస్‌, స్టడీ మెటీరియల్‌, పరీక్షా పత్రాల సరళి... ఇలా అన్నింటినీ మించిన ఒక అంశం ప్రధానంగా గోచరిస్తుంది. అదే కాలం/ సమయం!
తెలివితేటలున్న అభ్యర్థులు కూడా పోటీ పరీక్ష రాసేసి పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చి, జయాపజయాల స్వీయ విశ్లేషణ చేసుకుంటున్న తరుణంలో ‘సన్నద్ధతకు సమయం సరిపోలేదు. లేకపోతే ఇంకా బాగా రాసేవాణ్ణి’ అంటూ పశ్చాత్తాపపడతారు. ఏళ్ల తరబడి దీక్షతో చదివిన అభ్యర్థి కూడా ఎంత ముందునుంచి చదివినా చివరి వారం సమయం సర్దుబాటు కాలేకపోవడం వల్ల అనుకున్నంతగా పరీక్షలో ప్రతిభ చూపలేకపోయాననుకుంటాడు.
మొత్తం మీద అభ్యర్థులందరూ తమ గెలుపు ఓటములను సమయానికే ముడి పెడతారు. మరి ఇంత విలువైనది కాలం!
‘మీరు జీవితాన్ని ప్రేమించేవారైతే... కాలాన్ని వృథా చేయవద్దు. కాలం అనే ఇటుకలతో నిర్మించేదే జీవిత సౌధం’ అంటాడు యువతరం ఆరాధ్య నటుడు బ్రూస్‌ లీ. ఈ మాటలు నూటికి నూరుపాళ్ళూ పోటీ పరీక్షలకు వర్తిస్తాయి. పోటీ పరీక్షల రైలు... కాలం అనే పట్టాల పైనే పరుగెడుతుంది. ఇదే ప్రధాన ముడిసరుకు. అందుకే ఇంతటి విలువైన కాలాన్ని పోటీ పరీక్షల కోణంలో ఎలా వినియోగించుకోవాలో చూద్దాం. ఇందుకు ఏడు సోపానాలున్నాయి.
1. సమయ ప్రణాళిక: ఇది పోటీ పరీక్షార్థి లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి ఒక పోటీ పరీక్షలో గెలిచేందుకు స్వల్పకాల లక్ష్యంతో ఉన్నాడా? లేక దీర్ఘకాలం లక్ష్యంగా నిర్దేశించుకున్నాడా? అన్నది ముఖ్యం. డీఎస్‌సీ ప్రకటన వెలువడిన అనంతరం పరీక్షకు ఉండే కేవలం రెండు మూడు నెలల సమయంలో విజయం వైపు గురిపెట్టే అభ్యర్థి ప్రణాళిక ఒకలా ఉంటే- మూడు సంవత్సరాల సమయంలో సివిల్స్‌ కొండను ఢీకొనాలన్న దీర్ఘకాల లక్ష్యంతో మరొక అభ్యర్థి ఉంటాడు. పోటీ పరీక్షార్థి లక్ష్యాన్ని గమనంలో ఉంచుకొని ఈ సమయ ప్రణాళిక జరగాలి.
2 సమయ సమీక్ష: పోటీ పరీక్షల విషయంలో ఇది రెండు రకాలుగా జరగాలి. గమ్యం చేరేందుకు ప్రణాళిక ఎంతవరకు ఉపయోగపడుతుందన్న తొలి సమీక్ష ఒకసారీ, ప్రణాళికలో కొంతశాతం ముందుకు వెళ్ళిన తర్వాత సమయ సద్వినియోగం పురోగతిని మరొకసారీ పునస్సమీక్షించుకోవాలి. దీనివల్ల ఎన్నో లోపాలు బయటకొస్తాయి. సమయం ఎక్కడ వృథా అవుతున్నదీ అవగతం అవుతుంది. మిగిలిన సమయాన్ని ప్రయోజనకరంగా వినియోగించుకునేందుకు దోహదపడుతుంది.
3. ప్రాథమ్యాల గుర్తింపు: పోటీ పరీక్షల్లో సమయ వినియోగానికి ప్రాథమ్యాల నిర్దేశన కీలకం. పోటీ పరీక్షల విజయానికి ఉపకరించే దశలను ప్రాధాన్యక్రమంలో అమలు చేయాల్సి ఉంటుంది. సిలబస్‌ అవలోకన, గత ప్రశ్నపత్రాల అనుసంధానం, అధ్యయన పుస్తకాల సేకరణ, అవసరమైతే శిక్షణ, తొలి పఠనం, మలి పఠనం, స్వీయ విశ్లేషణ- మదింపు, తప్పొప్పుల సవరణ, అంతిమ సన్నద్ధత... ఇలా వివిధ దశలను ఏ సమయంలో ఏది అవలంబించాలో ప్రాథమ్యాలను నిర్ణయించుకోవాలి. దాన్ని అనుసరించి నడవాల్సి ఉంటుంది. ఈ ప్రాథమ్యాలను సమయానికి అనుసంధానం చేసుకుంటూ సన్నద్ధత జరగకపోతే రైలు పట్టాలు తప్పినట్టే!
4. కాల ప్రణాళిక రూపకల్పన: పోటీ పరీక్షలకు అందరూ చదువుతారు కానీ కొందరే లక్ష్యం చేరతారు. విజయం సొంతం చేసుకున్నవారిలో దాదాపు అందరూ తమ గెలుపును తాము రూపొందించుకున్న టైమ్‌టేబుల్‌కి అనుసంధానిస్తారు.
ఉద్యోగ నియామక ప్రకటన నుంచి పరీక్ష తేదీ వరకూ ఒక కాల ప్రణాళిక, అంతకంటే ముందు ఆ పోటీ పరీక్షకు నిర్దేశించిన సబ్జెక్టులను ఏ సమయంలో దేన్ని పూర్తిచేయాలన్న నిర్దిష్ట కాల ప్రణాళిక, చివరగా ఈ సబ్జెక్టులపై స్వీయ/ బాహ్య పరీక్షలలో పాల్గొని పోటీలో తానెక్కడ నిలబడుతున్నానన్న వాస్తవాన్ని ముందే తెలుసుకోవడం వంటివి ముఖ్యం. ఈ వివిధ ఘట్టాలను ఎప్పుడు ఏది పూర్తిచేయాలన్నా కాల ప్రణాళిక (టైమ్‌ షెడ్యూల్‌) ఉండాలి.
5. స్వీయ అంచనా: చాలామంది పోటీ పరీక్షార్థులు అనుసరించని, కొద్దిమంది మాత్రం ఆశ్రయించి విజయం సాధించే ఉపకరణం స్వీయ మదింపు. సమయాన్ని అత్యంత ప్రభావవంతంగావినియోగించేందుకు ఉపకరించే సోపానం. సన్నద్ధత మధ్యలోనో, సన్నద్ధత పూర్తవుతున్న దశలోనో స్వీయ పరీక్షలు రాయడం ద్వారా సన్నద్ధతలో లోపాలు, జ్ఞాపకశక్తి సమస్యలు, విషయధారణకు సమస్యలు బయటకొస్తాయి. వీటిని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
6. సమంజస కాలవ్యవధి: ఒక ఒలింపిక్స్‌ క్రీడలకూ మరొక ఒలింపిక్స్‌ ఆటలకూ మధ్య నాలుగేళ్ళ వ్యవధి ఉంటుంది. తదుపరి ఒలింపిక్స్‌ ఎప్పుడు జరుగుతుందో నాలుగేళ్ల కిందటే నిర్ణయమైపోతుంది. దీనిబట్టి క్రీడాకారులు తమ నైపుణ్యాలు, సామర్థ్యాలకు పదును పెట్టుకుంటారు. గత ఒలింపిక్స్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఈ నాలుగేళ్ళ వ్యవధిలో వచ్చే వివిధ స్థాయి పోటీలలో పాల్గొని తమ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటుంటారు.
సరిగ్గా పోటీ పరీక్షలు ఇంతే. అందరికంటే అత్యంత ప్రతిభావంతులనే ఎంపిక చేసుకునే ప్రక్రియ. ఇందుకు నిర్ణయించుకునే కాల వ్యవధి సమంజసంగా ఉండాలి. మరీ దీర్ఘకాలం ఉంటే స్ఫూర్తి సన్నగిల్లుతుంది. అలా అని మరీ స్వల్ప వ్యవధి అయితే ఒత్తిడి విజయావకాశాలను మూసివేస్తుంది. అందుకే నిర్దిష్టమైన, సమంజసమైన కాల ప్రణాళిక అవసరం.
7. శిక్షణతో అనుసంధానం: మిత్రులతో కలిసి తర్ఫీదు/ బయటి సంస్థలో శిక్షణ... పరీక్ష దిశగా చేసే ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే. అంతేగానీ శిక్షణే మొత్తం ప్రయాణం కారాదు. పరీక్షా లక్ష్య ఛేదనకు నిర్దేశించుకున్న సంపూర్ణ, సమగ్ర కాల ప్రణాళికలో శిక్షణను ఒక అంతర్భాగంగా చూసి ఆ దశను సమర్థంగా వినియోగించుకోవాలి. ఆపై తదుపరి దశవైపు ప్రయాణం సాగించాలి. అంతేతప్ప శిక్షణే సర్వస్వం అనుకుంటే విజయావకాశాలు పరిమితమవుతాయి.
ఈ ఏడు సోపానాలూ పోటీ పరీక్షల విజయ సంహాసనాన్ని చేరేందుకు ఉపకరిస్తాయి. అయితే వాటికి ప్రాతిపదిక కాలమే. సమయ పునాదులపై ఈ సోపానాలు నిర్మించుకోవాలి. ఇందుకు మీకు ఎల్లప్పుడూ లభించే సమయం ముడిసరుకు. ఈ ముడిసరుకుకు మీరేమీ చెల్లించనవసరంలేదు. సమయం ఉచితంగా లభిస్తుంది. కానీ సక్రమంగా సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వస్తుంది.

మస్తిష్కంలో ముద్రలు
సమయం, మస్తిష్కం ఈ రెండూ గొప్ప విజయాలను సాధించి పెడతాయి. కాలాన్ని మచ్చిక చేసుకొని దానికి కళ్ళెం వేయండి- ఆపై మీకు అది సలాంగిరి చేస్తుంది. అది మీ నియంత్రణ తప్పితే అదే మీపై ఎక్కి స్వారీ చేస్తుంది. ఈ సందర్భంలో రష్యన్‌ మానసిక శాస్త్రవేత్త పావ్‌లోవ్‌ చేసిన ప్రయోగాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి.
పావ్‌లోవ్‌ ఒక గదిలో కుక్కను కట్టేసి రోజూ కచ్చితంగా ఒక సమయానికి వచ్చి ఒక గంట మోగించేవాడు. ఆపై కుక్క ఎదురుగా మాంసం ముక్క పెట్టేవాడు. వెంటనే దానిని అందుకొని కుక్క తినేది. ఇలా రోజూ చేస్తుంటే కుక్కకి గది తలుపులు తెరుచుకొని గంట మోగింది అంటే తనకు ఆహారం నోటి ముందుకు వస్తుందని అర్థమై దాని నోట్లో లాలాజలం వూరేది. కొద్దిరోజులకు పావ్‌లోవ్‌ గది తలుపులు తెరచినా, గంట మోగించినా మాంసం ముక్క లేకపోయినా సరే కుక్క నోట్లో లాలాజలం వూరడం గమనించాడు. దీనినే ఆయన ‘కండిషనింగ్‌’ అన్నాడు. గంట మోగడం ద్వారా కుక్క మెదడుకు ఆహారం వస్తుందన్న సంకేతం వెళ్ళి నిక్షిప్తమైపోయింది. అందుకే ఆ తర్వాత ఆహారం లేకపోయినా కుక్క నోట్లో లాలాజలం వచ్చింది.
సరిగ్గా ఈ చిట్కాను అభ్యర్థులు తమ విజయానికి ఉపకరణంలా వినియోగించుకోవచ్చు. నిర్దేశించుకున్న టైమ్‌టేబుల్‌ ప్రకారం నిర్దిష్ట వేళకు నిద్రలేవడం, పుస్తక పఠనం, శిక్షణకు హాజరు కావడం వంటివి జరగడం వల్ల మస్తిష్కంలో ముద్రలు పడి కొంతకాలానికి అలవాటుగా మారి క్రమశిక్షణ అలవడుతుంది.
రోజువారీ సన్నద్ధతలో కూడా అభ్యర్థి శారీరక స్థితిని బట్టి ప్రణాళిక వేసుకోవాలి. రాత్రివేళ త్వరగా నిద్రకు ఉపక్రమించేవారయితే బలవంతాన పుస్తకాల ముందు కూర్చోకూడదు. దానికంటే తెల్లవారుఝామున లేవడం మంచిది.
సన్నద్ధతను స్వల్పకాల సెషన్‌లా విభజించుకోవాలి. అంటే మొత్తం రోజులో 10 గంటలు చదివేలా ప్రణాళిక వేసుకుంటే రెండు గంటలకు ఒక సెషన్‌లా వర్గీకరించుకొని ఆపై పావుగంట విరామం ఇవ్వడంవల్ల ధారణ శక్తి (జ్ఞాపకం ఉండటం) 30 శాతం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.

ఓకే.. ఫోర్‌ ఆర్‌ చిట్కా
సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి OK-4R చిట్కాను అనుసరించవచ్చు.
* O అంటే Overall view . హాజరయ్యే పోటీ పరీక్ష సిలబస్‌, స్టడీ మెటీరియల్‌ను విహంగ వీక్షణ- అవలోకనం చేయడం.
* K అంటే మొత్తం సిలబస్‌ నుంచి Key Ideas ... ముఖ్యాంశాలను ఒడిసి పట్టుకోవడం.
* R-1 రెడీ ద టాపిక్‌: సిలబస్‌లోని వివిధ అంశాలను విభజించుకొని ప్రతి టాపిక్‌కు పూర్తిగా సన్నద్ధం కావడం.
* R-2 రీకాల్‌: చదివినది తగిన వ్యవధిలో జ్ఞాపకం తెచ్చుకోవడం, పునశ్చరణ
* R-3 రిఫ్లెక్ట్‌: చదివినదానిని తిరిగి రాయగలుగుతున్నామా? లేదా? అని ప్రయత్నించడం
* R-4 రివ్యూ: సన్నద్ధతలోని వివిధ దశలలో ప్రతి దశ వద్ద సమీక్షించుకోవడం.

Back..

Posted on 20-12-2016