Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తిరస్కరణలుతప్పాలంటే..!

* ఉద్యోగాన్వేషణలో మెలకువలు

‘మళ్లీ కబురు చేస్తాం... అయిపోయింది ఇక మీరు వెళ్లొచ్చు... సారీ మీరు సెలెక్ట్‌ కాలేదు...’ ఉద్యోగం కోసం వెళ్లిన అభ్యర్థికి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. కొంతమంది ఇక తాము ఎందుకు పనికిరామేమో అన్నంత ఆత్మన్యూనతకు గురవుతుంటారు. రెజ్యూమెను ఎంత జాగ్రత్తగా చెక్కినా... సబ్జెక్టు అదరగొట్టినా... హెచ్‌ఆర్‌ రౌండులో అంతా బాగానే చేసినా... ఆఫర్‌ లెటర్‌ అందదు. తెలియకుండానే జరిగే కొన్ని పొరపాట్లతో తిరస్కరణకు గురికావాల్సి వస్తుంది. అలాంటివి తప్పాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లోపాలను సవరించుకోవాలి.

తొలిదశ తడబాటు
ఉద్యోగ దరఖాస్తుకు మొదటి మెట్టు రెజ్యూమెనే. అభ్యర్థిపై మొదటి అభిప్రాయాన్ని కలిగించేది ఇదే. కాబట్టి, దీన్ని రూపొందించుకునేటపుడే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సంస్థ అభ్యర్థిలో ఉద్యోగానికి సంబంధించిన అర్హతలతోపాటు కొన్ని నైపుణ్యాలనూ చూస్తుంటుంది. అవి ఆ వ్యక్తిలో లేనపుడు తిరస్కరిస్తుంది.
కొందరు ఒక రెజ్యూమెను తయారుచేసుకుని అన్ని ఉద్యోగాలకూ దాన్నే పంపుతుంటారు. చక్కగా తయారు చేసుకున్నామని భావిస్తుంటారు. నిజమే... మీ నైపుణ్యాలు, ఆసక్తులు అన్నింటితో రెజ్యూమెను తయారుచేశారు. కానీ అవి సంస్థకూ ఉపయోగపడాలి కదా! అక్కడే అభ్యర్థి దరఖాస్తు బుట్టదాఖలవుతుంది. కాబట్టి దరఖాస్తు చేసుకుంటున్న సంస్థకు తగ్గట్టుగా రెజ్యూమె, కవర్‌ లెటర్లను ఎప్పటికప్పుడు తాజాగా సిద్ధం చేసుకోవాలి. అలాగే ఉద్యోగ వివరాల్లో అడిగిన నైపుణ్యాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి.
ఉదాహరణకు- ఒక సంస్థ డిగ్రీ అర్హత ఉన్నవారికి ఉద్యోగ ప్రకటన ఇచ్చిందనుకుందాం. ఒక్కో ఉద్యోగావసరాల్ని వివరిస్తూ.. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి అని కూడా అన్నారనుకుందాం. మీరు డిగ్రీ అర్హత ఉంది కదా అని దరఖాస్తు చేసుకున్నారు. మీతోపాటు మీ స్నేహితుడికి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంది. దీంతో సంస్థ మీకన్నా మీ స్నేహితుడినే ఎంచుకోవడానికే మొగ్గు చూపుతుంది. రెజ్యూమెలో సాధించిన విజయాలను కూడా చేర్చాలి. అయితే అవి ఎక్కువ నిడివితో ఉండకూడదు. ఎక్కువ రాస్తేనే అధికారుల దృష్టిలో పడతారనే అపోహతో పేజీలు నింపుతుంటారు. కానీ అదంతా చదివి, సంస్థకు తగిన నైపుణ్యాలు ఉన్నాయేమో తెలుసుకునే ఓపిక, సమయం అధికారులకు ఉండదు. తక్కువ పదాల్లో విషయం అర్థమయ్యేలా లేకపోయినా అభ్యర్థికి చేటే.
రెజ్యూమెలో అక్షరదోషాలు కూడా అభ్యర్థిపై వ్యతిరేక భావాన్ని తెప్పిస్తాయి. అభ్యర్థి ఉద్యోగ విషయంలో సిన్సియర్‌గా లేడన్న భావన సంస్థ అధికారులకు కలుగుతుంది. కాపీ చేయడం లాంటివి కూడా చేయకూడదు.
ఇవన్నీ సరిగా ఉన్నా.. కొన్ని సంస్థలు రెఫరెన్స్‌ను ఆశిస్తాయి. ఇది ప్రకటనల్లో తెలిసే అవకాశముండదు. కాబట్టి, దరఖాస్తు చేసుకునే సంస్థలో తెలిసినవారెవరైనా ఉంటే వారి దగ్గరి నుంచి సమాచారం సేకరించుకోవచ్చు.

ఇంటర్వ్యూలో చేసే పొరపాట్లు
రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, టెక్నికల్‌ ఇంటర్వ్యూలు దాటినా.. చివరి మెట్టు అయిన హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో కొందరు వెనుదిరుగుతుంటారు. సంస్థకు కావాల్సిన పరిజ్ఞానం అంతా ఉన్నా.. అభ్యర్థికి ‘నో’ చెబుతున్నారంటే.. ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కొరవడుతున్నట్టే!
రూపురేఖలు: చాలామంది ఎంతసేపూ అడిగే ప్రశ్నలు, చదవాల్సిన అంశాలపైనే దృష్టిపెడతారు. వేసుకునే దుస్తులు, రూపురేఖలకు అంత ప్రాధాన్యమివ్వరు. నిజానికి అభ్యర్థిపై ఏర్పడే మొదటి అభిప్రాయం వీటిపైనే ఉంటుంది. క్యాజువల్స్‌లోనో, ఫంక్షన్‌కు వెళ్లినట్లో హాజరైతే అభ్యర్థికి ఉద్యోగం పట్ల ఆసక్తి లేదనే అభిప్రాయం అధికారులకు కలుగుతుంది. కాబట్టి, హుందాగా కనపించే ప్రయత్నం చేయాలి.
పరిశోధన: అభ్యర్థి ఉద్యోగం, సంస్థ, పరిశ్రమపై అవగాహన పెంచుకోవడానికి సమయం కేటాయించలేదని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేసేవారికి ఎంతో సమయం పట్టదు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక సమాచారమంతా అరచేతిలోకి వచ్చింది. కాబట్టి, సంస్థ గురించి కనీస వివరాలు సులువుగానే తెలుసుకోవచ్చు. స్నేహితులు, నిపుణులు, అందులో ఉద్యోగం చేసేవారూ ఈ విషయంలో సహాయపడతారు. ఇన్ని సదుపాయాలున్నా సంస్థ గురించిన కనీస వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయనపుడు అభ్యర్థిలో తగినంత శ్రద్ధ లేదని భావిస్తారు.
ప్రశ్నలేమీ లేకపోవడం: హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో భాగంగా అధికారి అభ్యర్థిని సంస్థ గురించిన సందేహాలేమైనా ఉన్నాయా అని అడుగుతుంటారు. అభ్యర్థి దగ్గర అడగడానికి ఏ ప్రశ్నలూ లేవంటే.. అభ్యర్థి సన్నద్ధం కాని విషయాన్ని సూచిస్తుంది. అలాగే వెబ్‌సైట్‌లో దొరికే ప్రాథమిక అంశాల గురించి అడిగే ప్రశ్నలూ ఇదే విషయాన్ని నిర్ధరిస్తుంది. దరఖాస్తు చేసిన ఉద్యోగానికి సంబంధించి సమాచారమంతా దరఖాస్తు సమయంలోనే తెలిసే అవకాశముండదు. కాబట్టి వాటికి సంబంధించిన ప్రశ్నలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
రెజ్యూమె విషయాలనే ప్రస్తావించడం: ఇంటర్వ్యూ అధికారి ఏదైనా ప్రశ్నను అడిగినపుడు దానికి సంబంధించిన విషయాలు రెజ్యూమెలో ఉంటే వాటినే ఉన్నది ఉన్నట్టుగా దింపేయకూడదు. ఇంటర్వ్యూ వరకు వచ్చారంటే మీ రెజ్యూమెను పూర్తిగా కాకపోయినా కనీసం చూస్తారు. అయినా ఆ ప్రశ్నను అడిగారంటే.. రెజ్యూమెను అప్పజెేప్పేయొద్దు. అలా చేస్తే.. దాన్ని బట్టీపట్టిన భావన తెప్పించగలరు కానీ, అవి నిజంగా మీ నైపుణ్యాలే అని ఒప్పించలేరు. కాబట్టి, ఆ లక్షణాలు, నైపుణ్యాలను కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేయాలి.
మొహమాటం: విద్యార్థి దశలో చిన్నచిన్నవే అయినా ఏవో కొన్ని విజయాలుంటాయి. చాలామంది అభ్యర్థులు వాటిని చెప్పడానికి సంకోచిస్తుంటారు. నిజానికి వాటి ఆధారంగా అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, బృందంతో పనిచేయగల నైపుణ్యాలను అధికారులు అంచనా వేస్తారు. మీరు వాటిని చెప్పడానికి ఇబ్బందిపడితే.. మీకు ఆ నైపుణ్యాలు లేకపోయినా రెజ్యూమెలో పొందుపరిచారనే అభిప్రాయానికి అధికారులు వచ్చే అవకాశముంది. అలాగే సంస్థకు అవసరం లేని విజయాల గురించి ప్రస్తావించొద్దు. మీరు సాఫ్ట్‌వేర్‌ సంస్థకు దరఖాస్తు చేసి, ‘పాటల పోటీలో ఎప్పుడూ ఫస్ట్‌ వస్తా’ అని చెబితే దానివల్ల వారికొచ్చే లాభమేం ఉండదు కదా! మీరు చెప్పే విజయాలు సంస్థకు తోడ్పడగలిగేలా ఉండాలి.
కెరియర్‌ విషయంలో అస్పష్టత: కెరియర్‌పై స్పష్టమైన అవగాహన ఉన్నవారిని ఎంచుకోవడానికి సంస్థలు ఆసక్తిని చూపుతాయి. ఎందుకంటే.. వారు వాటిని సాధించే క్రమంలో సంస్థ అభివృద్ధికీ తోడ్పడుతారనే అభిప్రాయం అధికారుల్లో ఉంటుంది. సాధారణంగా ఇంటర్వ్యూ సమయంలో ‘అయిదేళ్లలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు?’ అన్న ప్రశ్న ఇందుకు సంబంధించిందే. సమాధానం ఇవ్వాలన్నట్లుగా కాకుండా మనస్ఫూర్తిగా మీరేం చేయాలనుకుంటున్నారో ఆలోచించుకుని సమాధానం ఇవ్వాలి. అసాధ్యమన్న భావన కలిగించేలా కూడా ఉండకూడదు.
లక్ష్యమా? అవసరమా?: అభ్యర్థి ఉద్యోగాన్ని పొందడానికి ఎంతవరకూ ఉత్సాహం చూపుతున్నాడన్నదాన్నీ హెచ్‌ఆర్‌ అధికారులు చూస్తారు. అది పని విషయంలో మీరు చూపే ఆసక్తి, లక్ష్యాలను బట్టి అంచనా వేస్తారు. అలాకాకుండా తప్పనిసరిగా ఎలాగైనా ఈ ఉద్యోగాన్ని చేరాలన్న ధోరణో, అవసరమన్న ఉద్దేశమో ప్రదర్శిస్తే తిరస్కరణ తప్పదు. ఏ సంస్థ అయినా దీర్ఘకాలం తమతో నడిచేవారినే ఎంచుకోవాలనుకుంటుంది. అవసరం కోసం వస్తున్నారనిపిస్తే.. తీరా అది తీరాక వేరేదానికి వెళ్లిపోతారు అని భావిస్తుంది. ‘మిమ్మల్నే ఎందుకు ఎంచుకోవాలి?’, ‘సంస్థకు మీరే తగినవారని ఎలా చెబుతారు?’ వంటి ప్రశ్నలు ఈ విషయంపై స్పష్టత కోసమే అడుగుతారు.

సంస్థల కోణంలోనూ..
దరఖాస్తు చేసుకున్నాక అయినా, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ అయ్యాక అయినా సంస్థ నుంచి పిలుపు రాకపోతే అది పూర్తిగా అభ్యర్థి లోపమే అని చెప్పలేం. ఒక్కోసారి సంస్థ తీసుకునే నిర్ణయాలూ కారణమవొచ్చు. వాటిలో..
* ఒక్కోసారి సంస్థలు తమ కొత్త ప్రాజెక్టుల కోసం ఉద్యోగ ప్రకటనలిస్తాయి. అవి రద్దు అవ్వడమో, ఆలస్యమవడమో జరిగినపుడు స్పందించవు. సాధారణంగా ఈ సమాచారం సంస్థలో ఉండే లోపలి వ్యక్తుల ద్వారానే తెలుస్తుంది. వెబ్‌సైట్లలోనూ ఉండదు. ఎప్పుడో మనం ఇచ్చిన రెజ్యూమెకు కొన్ని నెలల తర్వాత ఫోన్‌ వస్తుండటం గమనిస్తుంటాం కదా! అది ఇందులో భాగమే.
* కొన్నిసార్లు సంస్థలకు తక్షణం పనిలో చేరగలిగేవారు అవసరమవుతారు. దీర్ఘకాలం శిక్షణనిచ్చి ఉద్యోగంలోకి తీసుకునేవారికన్నా నేరుగా లేదా కొద్దిపాటి శిక్షణ సరిపోయేవారు అవసరమవుతుంటారు. అలాంటప్పుడు కూడా కాల్‌ రాదు. కొత్త విద్యార్థులైనా.. ఇంటర్న్‌షిప్‌లు, పార్ట్‌టైం ఉద్యోగానుభవం ఉన్నవారు అసలు అనుభవం లేనివారికంటే సంస్థలకు మేలే కదా!
* ఉద్యోగాల జాబితా తక్కువగా ఉన్నపుడు రాతపరీక్ష, బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఇలా ఎక్కువ సమయం, డబ్బు వృథా చేయడానికి సంస్థలు ఇష్టపడవు. ఇలాంటపుడు సంస్థలోని వారికి అర్హులైనవారిని సూచించమంటాయి. బయటినుంచి వచ్చిన వేలాది దరఖాస్తుల్లో నుంచి ఎంచుకోవడం కంటే లోపలి వారి దగ్గర్నుంచి వచ్చిన పదుల సంఖ్యలో దరఖాస్తులను చూసి ఎంచుకోవడం వారికి సులువు. వారిలో అర్హులైనవారికి నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి తీసుకుంటారు.
* అడిగిన దానికంటే ఎక్కువ అర్హత ఉన్నవారిని తీసుకోవడానికీ సంస్థలు సంకోచిస్తాయి. ఇప్పుడు అవసరం కాబట్టి, దీనికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంతకంటే మంచి అవకాశం వస్తే.. తప్పకుండా వెళ్లిపోతారనుకున్నపుడూ పక్కనపెట్టేస్తాయి.

Back..

Posted on 29-11-2018