Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సేవకు తోవ!

క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించడం మీకు ఇష్టమా? సమస్యల్లో ఉన్నవారికి సాయపడాలనీ, ఆపన్నులకు సేవ చేయాలనీ తపన పడుతుంటారా? ఆకర్షణీయమైన వేతనం కోసం కాకుండా వృత్తిపరమైన సంతృప్తి కోసం పనిచేయాలని భావిస్తుంటారా? అయితే ‘సోషల్‌ వర్క్‌’ మీకు సరైన ఎంపిక. దీని పరిధిలోకి హ్యూమన్‌ సైకాలజీ, కమ్యూనికేషన్‌, డెవలప్‌మెంట్‌, ఫిజికల్‌, మెంటల్‌ అండ్‌ కమ్యూనిటీ హెల్త్‌, సోషల్‌ పాలసీ, ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థల నిర్వహణ మొదలైనవి వస్తాయి. సామాజిక అంశాలపై ఆసక్తి, అవగాహన ఉన్నవారు సంబంధిత కోర్సులు చేస్తే అద్భుతంగా రాణిస్తారు!పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్యసేవల కొరత, వ్యసనాలు, సమాజ వ్యతిరేక ప్రవర్తనలు మొదలైన ఎన్నో సమస్యల తీవ్రతను తగ్గించటమూ, వాటి పరిష్కారానికి కృషి చేయటమూ సోషల్‌వర్కర్ల విధులు. వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు, బృందాలు- ఇలా అందరికీ వీరి సేవల అవసరం ఉంటుంది.
కెరియర్‌ ప్రారంభంలో తక్కువ వేతనమే లభిస్తుంది. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యతల నిర్వహణ (సోషల్‌ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా నిపుణులైన సోషల్‌ వర్కర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. టాటా స్టీల్‌ లాంటి ప్రయివేట్‌ సంస్థలతోపాటు ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కమిషన్‌ (ఓఎన్‌జీసీ) మొదలైనవి సమాజ సంక్షేమ ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌ను కేటాయిస్తున్నాయి. వృత్తిపరమైన శిక్షణ పొందిన, నైపుణ్యం ఉన్న సోషల్‌ వర్కర్లకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లో లేబర్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు, సోషల్‌ వర్కర్లు లాంటి ఉద్యోగాలు లభిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే చాలా విశ్వవిద్యాలయాలు సోషల్‌ వర్క్‌లో వివిధ కోర్సులను ప్రవేశపెట్టాయి. ఈ రంగంలో ప్రతిభ చూపాలంటే టీమ్‌ మేనేజ్‌మెంట్‌, సానుకూల ధోరణితో పనిచేయడం చాలా అవసరం. ఫీల్డ్‌ వర్క్‌లో అధిక సమయం వెచ్చించాల్సిరావడం, ప్రయాణాలు సాధారణం. వ్యక్తులతో సంభాషించే నేర్పు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

పీజీ చేస్తేనే...
గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోనే ఈ కోర్సు అందుబాటులో ఉన్నప్పటికీ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేస్తే మెరుగైన అవకాశాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌సైన్సెస్‌ లాంటివి సోషల్‌ వర్క్‌లో పీజీ నిర్వహిస్తున్నాయి. ఏ సబ్జెక్టులోనైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు ఈ పీజీ కోర్సులు చదవడానికి అర్హులు. అయితే సోషల్‌ వర్క్‌, సైకాలజీ, సోషల్‌ సైన్స్‌, సోషియాలజీ లాంటి సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసినవారికి ప్రాధాన్యం లభిస్తుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసినవారికి కొన్ని సంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు కల్పిస్తున్నాయి.

సోషల్‌ వర్క్‌ పీజీలో ఉన్న స్పెషలైజేషన్లు:
* క్రిమినాలజీ అండ్‌ జస్టిస్‌
* కమ్యూనిటీ హెల్త్‌
* మెంటల్‌ హెల్త్‌
* అర్బన్‌ డెవలప్‌మెంట్‌
* సైకియాట్రిక్‌ సోషల్‌ వర్క్‌
* కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌
* కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌
* ట్రైబల్‌ స్టడీస్‌ అండ్‌ యాక్షన్‌
* డిజేబిలిటీ స్టడీస్‌ అండ్‌ యాక్షన్‌
* లైవ్లీహుడ్‌ అండ్‌ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌
* చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీ ఇష్యూస్‌
* డైవర్సిటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌. సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఎం.ఫిల్‌. చేయొచ్చు.

స్పెషలైజేషన్‌ ఆధారంగా...
ఈ రంగంలో ఉద్యోగావకాశాలు అభ్యర్థులు చదివిన స్పెషలైజేషన్‌ ఆధారంగా ఉంటాయి. చేసే ఉద్యోగాన్ని బట్టి - ప్రాజెక్ట్‌ ప్రతిపాదన తయారీ, మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎంఐఎస్‌) రూపకల్పన, ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రణాళిక తయారీ, జిల్లా/ రాష్ట్ర/ జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్‌ నిర్వహణ, ప్రోగ్రామ్‌ మానిటరింగ్‌, ఎవాల్యుయేషన్‌, నివేదిక రచన, ప్రజెంటేషన్‌, నెలవారీ ప్రణాళిక, బడ్జెట్‌ తయారీ మొదలైన విధులుంటాయి. ఇంకా.. రాష్ట్ర, జాతీయస్థాయి ప్రాజెక్ట్టులను నిర్వహించడం, సమన్వయపరచడం, శిక్షణ, వర్క్‌షాపులూ, సెమినార్లూ నిర్వహించడం, డాక్యుమెంటేషన్‌, కేస్‌ స్టడీస్‌ వీరి పరిధిలోకే వస్తాయి.
* హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజేషన్‌ చేసినవారు పర్సనెల్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, కర్మాగారాలు, వాణిజ్య సంస్థల్లో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, ట్రెయినీ ఆఫీసర్లు, వెల్ఫేర్‌ ఆఫీసర్లు, సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లుగా కెరియర్‌ ప్రారంభించవచ్చు.
* సోషల్‌ వర్కర్లు బోధనరంగాన్ని కూడా ఎంచుకోవచ్చు. కొన్నేళ్ల అనుభవం తర్వాత వివిధ సంస్థలకు కన్సల్టెంట్‌గా కెరియర్‌ కొనసాగించవచ్చు. లేదా ఫ్రీలాన్సర్‌గా సేవలు అందించవచ్చు.
* హెల్త్‌కేర్‌, అడాప్షన్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌ లాంటివాటిలో కౌన్సెలర్‌గా ఉద్యోగం పొందొచ్చు.
* చైల్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఫ్యామిలీ సర్వీసెస్‌, మెంటల్‌ హెల్త్‌ సర్వీసెస్‌, పబ్లిక్‌ అసిస్టెన్స్‌, మెడికల్‌ సోషల్‌ వర్క్‌, కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌, సోషల్‌ వర్క్‌, ప్లానింగ్‌ అండ్‌ పాలసీ డెవలప్‌మెంట్‌, సోషల్‌ వెల్ఫేర్‌ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి అంశాల్లో స్పెషలైజేషన్‌ చేసినవారికి ఆయా రంగాల్లో ఉద్యోగాలు ఉంటాయి.
* మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి సాంత్వన చేకూర్చడం క్లినికల్‌ సోషల్‌ వర్కర్ల బాధ్యత. వీరు ఫిజియోథెరపీ, కౌన్సెలింగ్‌ కూడా చేస్తారు. క్లినికల్‌ సోషల్‌ వర్క్‌లో ఆసక్తి ఉంటే హెల్త్‌ క్లినిక్స్‌, హాస్పిటల్స్‌తో కలిసి పనిచేయొచ్చు లేదా సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు.
* విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల మధ్య సమన్వయం ఉండేలా చూడటం స్కూల్‌ సోషల్‌ వర్కర్ల పని. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వచ్చే సమస్యలను పరిష్కరించి, కౌన్సెలింగ్‌ ద్వారా వారి ఆందోళనను తగ్గించడం, ఉపాధ్యాయులకు పిల్లలతో ఎలా మెలగాలో సలహాలు ఇవ్వడం వీరి ప్రధాన బాధ్యత.
* మానసిక ఒత్తిడి/ ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి దాన్నుంచి బయటపడే మార్గాలను సూచించడం సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్ల బాధ్యత. దీన్నే క్లినికల్‌ సోషల్‌ వర్క్‌గా కూడా వ్యవహరిస్తుంటారు. సాధారణంగా వీరు హాస్పిటళ్లు, క్లినిక్‌లతో కలిసి పని చేస్తుంటారు.
* నేరాలు, వాటికి దారితీసే కారణాలు, నివారణ మొదలైన అంశాలకు సంబంధించినది... క్రిమినాలజీ అండ్‌ కరెక్షనల్‌ సోషల్‌ వర్క్‌. జైళ్లు, జువైనల్‌ హోమ్స్‌లో శిక్ష అనుభవిస్తున్నవారికి సేవలు అందించాల్సి ఉంటుంది.
* మెడికల్‌, పబ్లిక్‌ హెల్త్‌ సోషల్‌ వర్కర్లు లేదా హాస్పిటల్‌ సోషల్‌ వర్కర్లు నర్సింగ్‌, వ్యక్తిగత సేవలు అందిస్తుంటారు. వీరు ఏజెన్సీలతో లేదా స్థానిక సంస్థలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

‘టిస్‌’ కోర్సుల ప్రవేశ ప్రకటన

సోషల్‌ వర్క్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌...తదితర సామాజిక శాస్త్రాల కోర్సులకు దేశంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థ టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌). వైవిధ్యమైన ఎన్నో కోర్సులను టిస్‌ అందిస్తోంది. వివిధ విభాగాల్లో విస్తృతమైన స్పెషలైజేషన్లు ఈ సంస్థ ప్రత్యేకత. తాజాగా బీఏ, ఎంఏ, షార్ట్‌ టర్మ్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి టిస్‌ ప్రకటన విడుదలచేసింది. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటిలో చేరి, విజయవంతంగా కోర్సులు పూర్తిచేసుకున్నవారు క్యాంపస్‌ నియామకాల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు!
టిస్‌కు ముంబయి, తుల్జాపూర్, హైదరాబాద్, గువాహటిలో కేంద్రాలున్నాయి. పీజీ స్థాయిలో ఈ సంస్థ 54 పీజీ కోర్సులు అందిస్తోంది. అభ్యర్థులు చేరిన కోర్సులను బట్టి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంహెచ్‌ఏ, ఎంపీహెచ్‌ డిగ్రీలను ప్రదానం చేస్తారు. ప్రతి అభ్యర్థీ గరిష్ఠంగా 3 ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముందుగా అభ్యర్థులు టిస్‌-నెట్‌ రాయాలి. వంద మార్కులకు వంద ప్రశ్నలుంటాయి. వంద నిమిషాల్లో పూర్తిచేయాలి. జనరల్‌ అవేర్‌నెస్‌ 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, మ్యాథ్స్, లాజికల్‌ రీజనింగ్‌ 30 మార్కులకు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ఇందులో అర్హత సాధించినవారికి ప్రీ ఇంటర్వ్యూ టెస్టు/ గ్రూప్‌ డిస్కషన్‌ 50 మార్కులకు ఉంటాయి. ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు. అంటే మొత్తం 225 మార్కులు.

ఏ కోర్సుకైనా ఉమ్మడి ప్రశ్నలే
ఈ పరీక్ష ప్రత్యేకమైంది. ఏ సబ్జెక్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రశ్నలు మాత్రం అందరికీ ఉమ్మడిగానే అడుగుతారు. అభ్యర్థులు డిగ్రీ కోర్సుల్లో చదువుకున్న అంశాలతో ఎలాంటి సంబంధం లేదు. ప్రశ్నలన్నీ జనరల్‌ విభాగానికి చెందినవే వస్తాయి. సాధారణంగా భారతీయ విశ్వవిద్యాలయాలు నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షల్లో దరఖాస్తు చేసుకున్న కోర్సు/ విభాగంలోని యూజీ సిలబస్‌ నుంచి సింహభాగం ప్రశ్నలు వస్తాయి. కానీ ఇక్కడ కనీసం ఒక ప్రశ్నకూడా కోర్సుతో ముడిపడి ఉండదు.
వివిధ పీజీ కోర్సులకు సాధారణ డిగ్రీ విద్యార్హతతో పోటీ పడే అవకాశం కల్పించారు. కొన్ని కోర్సులకు మాత్రం సంబంధిత విభాగంలో యూజీ పూర్తిచేసినవారే అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డెమో పరీక్ష రాసుకోవచ్చు.
టిస్‌ వెబ్‌సైట్‌లో ఈ లింక్‌ జనవరి 6 నుంచి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం 2016, 2017 టిస్‌-నెట్‌ ప్రశ్నపత్రాలను పొందుపరిచారు. వీటిని గమనిస్తే ప్రశ్నలు అడిగే అంశాల, కాఠిన్యత స్థాయులపై అవగాహన తెచ్చుకోవచ్చు.
జనరల్‌ అవేర్‌నెస్‌ కు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. ఆయా విభాగాలవారీగా ఏయే అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయో తెలుసుకోవడానికి సిలబస్‌ వివరాలు సైతం టిస్‌ నెట్‌లో ఉంచారు. ఇంగ్లిష్, రీజనింగ్, మ్యాథ్స్‌ విభాగాల్లోని ప్రశ్నలకు బ్యాంక్‌ క్లరికల్‌ ప్రశ్నపత్రాలు కొంతవరకు ఉపయోగపడతాయి. జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం 8, 9, 10 తరగతుల సోషల్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. వర్తమానాంశాలు, క్రీడలు, పర్యావరణం, కళలు, సంస్కృతి, సాహిత్యం, విద్య...మొదలైన విభాగాల నుంచి జనరల్‌ అవేర్‌నెస్‌లో భాగంగా ప్రశ్నలు వస్తాయి. లోకజ్ఞానం, ఆంగ్ల ప్రావీణ్యం, గణితంలో ప్రతిభ ఈ మూడూ పరీక్షలో పరిశీలిస్తారు. అయితే ప్రశ్నలు మాత్రం సాధారణ విద్యార్థి ఎదుర్కునేలా ఉంటాయి. మ్యాథ్స్, రీజనింగ్‌ ప్రశ్నలు విద్యా నేపథ్యంతో ముడిపడకుండా పదో తరగతి గణిత ప్రావీణ్యంతో రాయగలిగేలా అడుగుతున్నారు. సిలబస్‌లో పేర్కొన్న అంశాలు పరిమితంగానే ఉన్నాయి. వాటిని శ్రద్ధగా చదువుకుంటే సగటు విద్యార్థి సైతం మంచి స్కోర్‌ తెచ్చుకోవచ్చు.

కోర్సుల్లో వైవిధ్యం
ఆధునిక సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వైవిధ్యభరితమైన కోర్సులు ఈ సంస్థ ప్రత్యేకత.
పీజీ స్థాయిలో: ఎడ్యుకేషన్‌ (ఎలిమెంటరీ), డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఉమెన్‌ స్టడీస్, క్లయిమెట్‌ చేంజ్‌ సస్ట్టెయినబిలిటీ స్టడీస్, రెగ్యులేటరీ గవర్నెన్స్, అర్బన్‌ పాలసీ గవర్నెన్స్, వాటర్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, అప్లయిడ్‌ సైకాలజీ (క్లినికల్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ ప్రాక్టీస్‌), గ్లోబలైజేషన్‌ అండ్‌ లేబర్‌; హ్యూ మన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్స్, ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్, చేంజ్‌ అండ్‌ లీడర్‌షిప్‌; సోషల్‌ ఆంత్రపెన్యూర్‌షిప్, మీడియా అండ్‌ కల్చరల్‌ స్టడీస్, డెవలప్‌మెంట్‌ పాలసీ, ప్లానింగ్‌ అండ్‌ ప్రాక్టీస్‌; సస్ట్టెయినబుల్‌ లైవ్లీ హుడ్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ గవర్నెన్స్‌; సోషల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్, సోషల్‌ వర్క్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, సోషల్‌ వర్క్‌: (చిల్డన్ర్‌ అండ్‌ ఫ్యామిలీస్‌ / కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాక్టీస్‌/ క్రిమినాలజీ అండ్‌ జస్టిస్‌/ దళిత్, ట్రైబల్‌ స్టడీస్‌ అండ్‌ యాక్షన్‌ / లైవ్‌లీ హుడ్స్‌ అండ్‌ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్స్‌/ మెంటల్‌ హెల్త్‌ / పబ్లిక్‌ హెల్త్‌/ విమెన్‌ సెంటర్డ్‌ ప్రాక్టీస్‌/ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాక్టీసెస్‌/ కౌన్సెలింగ్‌/ లైవ్‌లీ హుడ్స్‌ అండ్‌ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌/ పబ్లిక్‌ హెల్త్‌), డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, డెెవలప్‌మెంట్‌ స్టడీస్, నేచురల్‌ రిసోర్స్‌ అండ్‌ గవర్నెన్స్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నెన్స్, ఉమెన్స్‌ స్టడీస్, ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్ట్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, లేబర్‌ స్టడీస్‌ అండ్‌ సోషల్‌ ప్రొటెక్షన్‌/ పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిలక్ట్‌ స్టడీస్, సోషియాలజీ అండ్‌ సోషల్‌ ఆంత్రపాలజీ, అప్లైడ్‌ సైకాలజీ (క్లినికల్‌ సైకాలజీ/ కౌన్సెలింగ్‌ సైకాలజీ), హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంహెచ్‌ఎ), పబ్లిక్‌ హెల్త్‌ (హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌/ హెల్త్‌ పాలసీ, ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ / సోషల్‌ ఎపిడమాలజీ), ఎల్‌ఎల్‌ఎం.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 10
పోస్టు ద్వారా స్వీకరించడానికి: డిసెంబరు 12
పరీక్ష తేదీ: జనవరి 13, 2019
ఫలితాలు: ఫిబ్రవరి 4న ప్రకటిస్తారు
వెబ్‌సైట్‌: http://www.tiss.edu/

యూజీ స్థాయిలో: బీఏ సోషల్‌ వర్క్‌ (రూరల్‌ డెవలప్‌మెంట్‌) తుల్జాపూర్‌ క్యాంపస్, బీఏ సోషల్‌ సైన్సెస్‌ కోర్సులను తుల్జాపూర్, గువాహతి క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు.
యూజీ కోర్సులకు బ్యాచిలర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (బ్యాట్‌) తో ప్రవేశం కల్పిస్తున్నారు. వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పార్ట్‌ ఎ 60 మార్కులకు 60 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. కరంట్‌ అఫైర్స్, సోషల్‌ అవేర్‌నెస్, లాజికల్, ఎనలిటికల్‌ రీజనింగ్‌ విభాగాల్లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌ బి డిస్క్రిప్టివ్‌ పరీక్ష. ఆంగ్లంలో 2 ప్రశ్నలకు జవాబు రాయాలి. ఈ విభాగానికి 30 నిమిషాలు కేటాయించారు. 40 మార్కులు ఉంటాయి. ఈ రెండు విభాగాల్లోనూ అభ్యర్థులు అర్హత సాధించాలి. వీటికి కటాఫ్‌ మార్కులు విడిగా ఉంటాయి. కటాఫ్‌ కంటే ఎక్కువ మార్కుల పొందిన అభ్యర్థుల పార్ట్‌ ఎ, బి మార్కులు కలిపి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం కోర్సుల్లోకి తీసుకుంటారు.
పాత ప్రశ్నపత్రాలు, సిలబస్‌ వివరాలు టిస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. బీఏ కోర్సుల్లో మొత్తం 140 సీట్లు ఉన్నాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 20, 2019
షార్ట్‌ టర్మ్‌ కోర్సులు: షార్ట్‌ టర్మ్‌ కోర్సుల్లో ప్రవేశాలు ఆయా కోర్సును బట్టి ఉంటాయి. కొన్నింటికి నేరుగా ఇంటర్వ్యూలతో ప్రవేశం కల్పిస్తారు. కొన్ని కోర్సులకు మాత్రం పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశాలు ఉంటాయి. ఆ కోర్సులో సీట్ల కంటే తక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎలాంటి పరీక్షలూ లేకుండా అవకాశం ఉంటుంది.

దరఖాస్తులకు గడువు:
* ఎగ్జిక్యూటివ్‌ పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజ్‌: ఏప్రిల్‌ 30, 2019
* ఎగ్జిక్యూటివ్‌ పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌: మే 31, 2019
* పీజీ డిప్లొమా ఇన్‌ హెల్త్‌కేర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌: జూన్‌ 28, 2019
* పీజీ డిప్లొమా ఇన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌: జనవరి 28, 2019
* సర్టిఫికెట్‌ ప్రోగ్రాం ఇన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌: జనవరి 28, 2019
* పీజీ డిప్లొమా ఇన్‌ ఫెసిలిటేటింగ్‌ గవర్నెన్స్‌ రీఫార్మ్‌: జనవరి 31,

అంతర్జాతీయ, కార్పొరేట్‌ సంస్థల్లో...
అనుభవం, మంచి ట్రాక్‌ రికార్డ్‌ సాధిస్తే పేరున్న కార్పొరేట్‌, అంతర్జాతీయ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనం అందుకోవచ్చు. నిష్ణాతులైనవారికి యూనిసెఫ్‌, యూఎన్‌డీపీ లాంటి సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే చాలా సందర్భాల్లో ఇవి నిర్ణీత కాలపరిమితికి లోబడి ఉంటాయి. ‌
* ఆసక్తి ఉన్న అభ్యర్థులు తాము ఎంచుకున్న రంగంలో కౌన్సెలర్‌గా స్థిరపడవచ్చు. పరిశోధన చేయవచ్చు. లేదా రిహాబిలిటేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించవచ్చు.
* సోషల్‌ వర్క్‌లో అనుభవం ఉన్నవారితో కలిసి నాన్‌ గవర్నమెంట్‌ ఆర్గనైజేషన్‌ను (ఎన్‌జీవో) ఏర్పాటు చేయవచ్చు.
విదేశాల్లో కూడా విస్తృతమైన అవకాశాలున్నాయి. సోషల్‌ వర్క్‌ను కెరియర్‌గా ఎంచుకున్నవారు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, గ్రీన్‌పీస్‌, ఆక్స్‌ఫామ్‌ లాంటి ఎన్‌జీవోలలో చేరవచ్చు. అమెరికా, స్కాట్లాండ్‌, నార్తర్న్‌ ఐస్‌లాండ్‌ లాంటి దేశాల్లో సోషల్‌ వర్కర్‌గా పని చేయాలంటే అక్కడి గవర్నింగ్‌ సంస్థల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏ కోర్సులు... ఎక్కడ?
ఎంఎస్‌డబ్ల్యూ/ సోషల్‌ వర్క్‌లో ఎంఏ అందిస్తున్న సంస్థలు:
* టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఐఎస్‌ఎస్‌): ముంబయి, తుల్జాపూర్, గువహటి, హైదరాబాద్‌ .
* దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (డీఎస్‌ఎస్‌డబ్ల్యూ)
* మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్, చెన్నై
* రాజగిరి స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్, కొచ్చి
* ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ వర్క్, జామియా మిలియా ఇస్లామియా, న్యూదిల్లీ
* ఇండోర్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఐఎస్‌ఎస్‌డబ్ల్యూ)
* గుల్బర్గా యూనివర్సిటీ, కర్ణాటక
* అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ
* ఉత్కళ్‌ యూనివర్సిటీ, భువనేశ్వర్‌
* బెంగళూరు యూనివర్సిటీ
* కర్ణాటక యూనివర్సిటీ, ధార్వాడ్‌
* ఎంజేపీ రోహిల్‌ఖండ్‌ యూనివర్సిటీ, బరేలీ
* కురుక్షేత్ర యూనివర్సిటీ, హరియాణా
* యూనివర్సిటీ ఆఫ్‌ కాలికట్, కేరళ
* మంగళూరు యూనివర్సిటీ
* యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌
* అమరావతి యూనివర్సిటీ, మహారాష్ట్ర
* విశ్వభారతి యూనివర్సిటీ, శాంతినికేతన్‌
* పుణె యూనివర్సిటీ
* లయోలా కాలేజీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, తిరువనంతపురం

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న కోర్సులు:
* డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ ఇన్‌ సోషల్‌ వర్క్‌ (పీహెచ్‌డీఎస్‌డబ్ల్యూ)
* మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (కౌన్సెలింగ్‌)
* పీజీ డిప్లొమా ఇన్‌ సోషల్‌ వర్క్‌ అమాంగ్‌ ది ట్రైబల్స్‌ (పీజీడీఎస్‌డబ్ల్యూటీ)
* మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యూ)

తెలుగు రాష్ట్రాల్లో సోషల్‌ వర్క్‌ కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు:
* ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు www.nagarjunauniversity.ac.in
* ఆంధ్రా యూనివర్సిటీ, వాల్తేర్, ఆంధ్రప్రదేశ్‌ www.andhrauniversity.edu.in
* శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, www.spmvv.ac.in
* శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి www.svuniversity.edu.in
* డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ, శ్రీకాకుళం www.mysmartap.com
* ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ www.osmania.ac.in
* శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం www.skuniversity.ac.in
* ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజమండ్రి www.nannayauniversity.info
* కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నం www.krishnauniversity.ac.in
* మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్‌ www.manuu.ac.in
* పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌ www.palamuruniversity.ac.in
* విక్రమ సింహపురి యూనివర్సిటీ, నెల్లూరు www.simhapuriuniv.ac.in

Back..

Posted on 26-11-2018