Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విమానయాన ఉద్యోగాల వారధి!

* అభ్యర్థులు, సంస్థల కోసం ప్రత్యేక పోర్టల్‌

విమానయాన రంగంలో పైలట్‌, ఎయిర్‌ హోస్టెస్‌, ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, క్యాబిన్‌ క్రూ మొదలైన ఉద్యోగాలను ఆశించే వారికీ, ఆ ఖాళీలను కల్పించే సంస్థలకూ ఉమ్మడి వేదికగా ఒక ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ప్రారంభమైంది. నిరుద్యోగులు ఈ వేదిక ద్వారా పోస్టుల సమాచారం తెలుసుకోవచ్చు! సంస్థలు తమకు తగిన అభ్యర్థులనూ ఇక్కడే వెతుక్కోవచ్చు.

దేశంలో వేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో విమానయానం (ఏవియేషన్‌) ముందు వరుసలో ఉంది. విమానాశ్రయాలు, వివిధ సేవలందించే సంస్థలు, ప్రయాణికుల సంఖ్య బాగా పెరగడంతో భారత్‌లో ఈ రంగం జోరందుకుంటోంది. విదేశీ పెట్టుబడులు, ప్రజల ఆదాయాలు పెరగడంతో కొత్తగా పలు సంస్థలు ఈ విభాగంలో సేవలందిస్తున్నాయి.

విమానయాన రంగంలో వివిధ విభాగాలకు చెందిన మానవ వనరుల సేవలు ఎంతో కీలకం. పైలట్లు, ఎయిర్‌ హోస్టెస్‌లతోపాటు గ్రౌండ్‌ డ్యూటీ సిబ్బంది (సాంకేతిక నిపుణులు, మేనేజర్లు) ఇందులో పాలు పంచుకుంటారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఏవియేషన్‌ కోర్సులు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఎంతోమంది ఔత్సాహికులు ఈ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. సంస్థలు సైతం అర్హుల కోసం అన్వేషిస్తున్నాయి. ఉద్యోగార్థులకూ, సంస్థలకూ ఉపయోగపడే విధంగా సివిల్‌ ఏవియేషన్‌ మంత్రిత్వశాఖ ఒక వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించింది.

ప్రయోజనాలు
అభ్యర్థులు అన్ని పోర్టళ్లలోకి వెళ్లి ఖాళీలను వెతుక్కోవడానికి సమయం వెచ్చించాల్సిన పని లేదు. ఫేక్‌ ఆఫర్ల బెడద తప్పినట్లే. సంస్థలూ వివిధ జాబ్‌ పోర్టళ్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. దీనిద్వారా అందరికీ ఎంతో సమయం ఆదా అవుతుంది. కావాల్సిన మానవవనరులన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. తమకు తగినవారిని ఎంపికచేసుకోవడం తేలికవుతుంది. అభ్యర్థుల సమాచారం నేరుగా పొందే సౌలభ్యం ఉండడం వల్ల నియామకాల కోసం ఇతర సంస్థలను ఆశ్రయించడం, ఇందుకోసం డబ్బు వెచ్చించడం.. లాంటి ఇబ్బందులేమీ ఉండవు. ఈ పోర్టల్‌ ఉద్యోగార్థులకూ, సంస్థలకూ మధ్య వారధిలా పనిచేస్తుంది. ఒకరి వివరాలు మరొకరికి నేరుగా అందుతాయి. అర్హతలేని సంస్థలు ఇందులో ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పోర్టల్లో నమోదైన ఉద్యోగార్థులు అవకాశాలు సొంతం చేసుకునేలా చూస్తామని సివిల్‌ ఏవియేషన్‌ వర్గాలు తెలిపాయి.

పైలట్‌, ఎయిర్‌ హోస్టెస్‌, ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, క్యాబిన్‌ క్రూ ఉద్యోగార్థులకూ, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, బీఎస్సీ ఏవియేషన్‌, హాస్పిటాలిటీ, ఎయిర్‌ టికెటింగ్‌ కోర్సులు చదివినవారికీ ఈ వెబ్‌ పోర్టల్‌ ఉపయోగకరం. ఎయిర్‌ లైన్లు, ఎయిర్‌ పోర్టులు, కార్గో, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, ఏవియేషన్‌ హాస్పిటాలిటీ...తదితర సంస్థలూ, విభాగాలూ దీనిద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ఎలా పనిచేస్తుంది?
ఏవియేషన్‌ రంగంలో ఉద్యోగాలు ఆశించేవారు పోర్టల్‌లోని ‘క్యాండిడేట్‌ అకౌంట్‌’లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. సిబ్బంది అవసరం ఉన్న సంస్థలు ఎంపిక చేసుకోవడానికి వీరి అభ్యర్థిత్వాలను పరిశీలిస్తాయి. అదేవిధంగా వివిధ విభాగాలకు ఉద్యోగులు అవసరమైన సంస్థలు ‘ఎంప్లాయర్‌ అకౌంట్‌’లో వివరాలు రిజిస్టర్‌ చేసుకోవాలి. పోస్టులకు తగిన అభ్యర్థుల సమాచారం సంస్థలకూ, తాము ఆశించే ఉద్యోగానికి సంబంధించిన ఖాళీల వివరాలు అభ్యర్థులకూ ఈ వెబ్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.

వెబ్‌సైట్‌: https://aviationjobs.co.in

Back..

Posted on 10-09-2019