Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరీక్ష ఒకటే.. ప్రయోజనాలెన్నో!

* ఎన్‌టీఏ-యూజీసీ నెట్‌ ప్రకటన విడుదల

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోన్న యూజీసీ-నెట్‌ ప్రకటన వెలువడింది. డిసెంబరు 2 నుంచి మొదలయ్యే ఈ పరీక్షలకు అక్టోబరు 9లోగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. సంబంధిత విభాగాల్లో పీజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు, చదువుతున్నవారు నెట్‌ రాసుకోవచ్ఛు దీని స్కోరు పరిశోధనకూ, అధ్యాపక ఉద్యోగాలకూ మాత్రమే కాకుండా ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులు సాధించేందుకూ ఉపయోగపడుతుంది!

నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌కి ఎంపికైనవారు స్టైపెండ్‌తో కూడిన పీహెచ్‌డీ చేయటానికి అవకాశం ఉంటుంది. లెక్చరర్‌షిప్‌ లేదా జేఆర్‌ఎఫ్‌ అర్హులు డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్ఛు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్‌ స్కోరుతో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ హోదాతో లీగల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తున్నాయి. ప్రైవేటు సంస్థలూ నెట్‌ అర్హులకు ఎంపికలో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించినవారికి ప్రతి నెలా స్ట్టైపెండ్‌, ఏటా కాంటింజెన్సీ గ్రాంటు అందుతాయి.

సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్ఛు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 50 శాతం మార్కులు. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారికీ దరఖాస్తు అవకాశం ఉంది. జేఆర్‌ఎఫ్‌కు డిసెంబరు 1, 2019 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది. లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దరఖాస్తులకు వయః పరిమితి వర్తించదు.

పరీక్ష స్వరూపం
నెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పేపర్‌-1 వంద మార్కులకు, రెండో పేపర్‌ 200 మార్కులకు ఉంటాయి. పేపర్‌-1 అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. పేపర్‌ -2 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ఉంటుంది. మొత్తం వంద ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు.

పేపర్‌ -1: రీజనింగ్‌, కాంప్రహెన్షన్‌, డైవర్జెంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో అభ్యర్థి సామర్థ్యాలను పరీక్షిస్తారు. పేపర్‌-1లో 10 విభాగాలు ఉన్నాయి. అవి..1) టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 2) రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ 3) కాంప్రహెన్షన్‌ 4) కమ్యూనికేషన్‌ 5) మేథమేటికల్‌ రీజనింగ్‌ 6) లాజికల్‌ రీజనింగ్‌ 7) డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ 8) ఐ.సి.టి. (ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ) 9) పీపుల్‌- ఎన్విరాన్మెంట్‌ 10) హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌- గవర్నెన్స్‌. ఈ పది అధ్యాయాల్లో ఒక్కో విభాగం నుంచి 5 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల సరళి తెలుసుకోవడానికి పాతప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. టాటా మెక్‌ గ్రాహిల్స్‌తో పాటు వివిధ పబ్లిషర్ల పుస్తకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలో నచ్చిన ఏదో ఒక పుస్తకాన్ని ఎంచుకుని చదువుకోవచ్ఛు

పేపర్‌-2: మొత్తం సబ్జెక్టు ప్రశ్నలే ఉంటాయి. సంబంధిత సబ్జెక్టులో ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. వీటికి సమాధానాలు గుర్తించడానికి మౌలికాంశాలపై పట్టు తప్పనిసరి. సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేయాలి. బిట్ల రూపంలో కాకుండా కాన్సెప్టులవారీ చదవడం ఎక్కువ ప్రయోజనకరం. ఇందుకోసం ముందుగా సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ తర్వాత పీజీ పాఠ్యాంశాలు, రిఫరెన్స్‌ బుక్స్‌ అధ్యయనం చేయాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఈ మధ్యకాలంలో సంబంధిత సబ్జెక్టుల్లో నిర్వహించిన జేఎల్‌, డీఎల్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది. వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబరు 9 వరకు స్వీకరిస్తారు
దరఖాస్తుల సవరణలు: అక్టోబరు 18 నుంచి 25లోగా మార్పులు ఏవైనా అవసరమైతే ఆన్‌లైన్‌లో సవరించుకోవచ్ఛు
పరీక్షలు: డిసెంబరు 2 నుంచి 6 వరకు ప్రతి రోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్‌ -1, పేపర్‌ -2 మధ్య విరామం ఉండదు.
ఫలితాలు: డిసెంబరు 31న ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: https://ntanet.nic.in

Back..

Posted on 12-09-2019