Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వ్యూహాలు పన్నడమే వీరి ఉద్యోగం!

* కెరియర్‌ గైడెన్స్‌ ఎనలిటిక్స్‌

లాభాలు పెంచుకోవాలి.. ఖర్చులు తగ్గించుకోవాలి.. పోటీలో ముందు ఉండాలి.. కస్టమర్ల అభిరుచులను కనిపెట్టి వారిని కలకాలం కాపాడుకోవాలి.. ఎలా? వినియోగదారుల అవసరాల మేరకు వస్తువులు మార్కెట్‌లోకి ఏవిధంగా వస్తాయి? ట్రెండ్స్‌ అందరూ ఫాలో అవుతారు. మరి ఆ ట్రెండ్స్‌ ఎవరు సృష్టిస్తారు?ఆధునిక డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రపంచంలో ఎదురయ్యే ఈ ప్రశ్నలకు ఏకైక సమాధానం ఎనలిటిక్స్‌. విస్తృత సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, వ్యాపార సమస్యలకు పరిష్కారం చూపించే ఎనలిటిక్స్‌ నిపుణులకు ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతోంది.

అమెజాన్‌లో నిన్న అన్వేషించిన వస్తువుకు సంబంధించిన సమాచారం ఈ రోజు ఏ వెబ్‌సైట్‌ చూస్తున్నా.. వాణిజ్యప్రకటన రూపంలో దర్శనమిస్తుంది. బడి నేస్తాల వివరాలు ఫేస్‌బుక్‌లో ‘పీపుల్‌ యూ మే నో’ అంటూ కనిపిస్తాయి. బెంగళూరు వెళ్లడానికి ఆన్‌లైన్లో టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత పక్కనే బెంగళూరు హోటళ్లు, ట్రావెల్‌ ఏజెన్సీల ప్రకటనలు వస్తుంటాయి. ఇవన్నీ ఎలా సాధ్యం? మన అవసరాలు, ఇష్టాలను అంత వేగంగా ఎవరు గమనిస్తున్నారు.. మనకు కావాల్సిన వాటినే ఎలా ప్రదర్శిస్తున్నారు? ఒకటే సమాధానం. అదంతా ఎనలిటిక్స్‌ మహిమ. ఇదే ఇప్పటి ఆధునిక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. కొత్త కొత్త అవకాశాలకు దారి చూపుతోంది. పెద్దఎత్తున సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి.. వ్యాపార, వాణిజ్య వ్యూహాలకు దిశానిర్దేశం చేస్తోంది. ఇలా రోజు రోజుకీ ఎదుగుతున్న ఈ రంగంలో సమర్థ మానవ వనరుల కొరత ఉంది. ఆసక్తి, అభిరుచి ఉన్నవాళ్లు తగిన నైపుణ్యాలను పెంపొందించుకుంటే మంచి అవకాశాలను అందుకోవచ్చు. వినియోగదారుల సమాచారాన్ని విశ్లేషించి తమ వ్యాపార మార్గాలను సంస్థలు మార్చుకుంటున్నాయి. దీంతో కొనుగోలుదారుల అవసరాలతోపాటు సంస్థల లక్ష్యాలూ నెరవేరతాయి. పెద్ద మొత్తంలో పోగయ్యే సమాచారం నుంచి అవసరమైనదాన్ని గ్రహించి, వినియోగించుకోడానికి ఎనలిటిక్స్‌ దోహదపడుతుంది. ఇందుకోసం కొన్ని టూల్స్‌ ఉపయోగిస్తారు. అందుకే కంపెనీలన్నీ ఎనలిటిక్స్‌ నుంచి సరైన ప్రయోజనాలను పొందడానికి నిపుణులను నియమించుకుంటున్నాయి.

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రిటైల్‌, హెల్త్‌కేర్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా...తదితర విభాగాల్లో ఎనలిటిక్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్టాటిస్టిక్స్‌, క్వాంటిటేటివ్‌ అనాలిసిస్‌, ఫ్యాక్ట్‌ బేస్డ్‌ మేనేజ్‌మెంట్‌్...తదితరాలతో విశ్లేషించి, కొన్ని రకాల ఫలితాలను పొందడమే ప్రధాన లక్ష్యం. వాటి ఆధారంగా వినియోగదారుల బిహేవియర్‌, ప్యాటర్న్‌, ట్రెండ్‌ పసిగడతారు. వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. వ్యూహాలను రచిస్తారు. ఈ పరిణామ క్రమంలో మనదేశం ఎనలిటిక్స్‌ విభాగంలో ప్రపంచ హబ్‌గా మారుతోంది. పలు భారతీయ కంపెనీలు ఖండాంతర సేవలను అందిస్తున్నాయి.

ఏ నైపుణ్యాలు కావాలి?
ఎనలిటిక్స్‌లో కెరియర్‌ ఎంచుకునే అభ్యర్థులకు క్వాంటిటేటివ్‌, అనలిటికల్‌, కమ్యూనికేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు ఉండాలి. ప్రోగ్రామింగ్‌, స్టాటిస్టికల్‌, మ్యాథ్స్‌, మెషీన్‌ లర్నింగ్‌, డేటా విజువలైజింగ్‌ స్కిల్స్‌ పెంపొందించుకోవాలి. వినియోగదారుల అవసరాలు, ఇబ్బందులను గమనించాలి. ఏ విషయమైనా ఎందుకు, ఎలా అనే స్పష్టత ఏర్పరచుకోవాలి. పూర్తి ఆసక్తి, సమస్యను అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండాలి. లాజిక్‌ (తర్కం), ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలి. సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం ఎనలిస్ట్‌ ప్రధాన విధి. వాటి ఆధారంగా నివేదికలు తయారుచేస్తారు. ఇందులో గ్రాఫ్‌లు, చార్టులు, ఇన్ఫోగ్రాఫిక్స్‌ ఉపయోగిస్తారు. ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్‌పై అవగాహన ఉండాలి. సమాచారం (డేటా) నిల్వచేయడం, తిరిగి పొందడానికి సంబంధించిన విధానాలను తెలుసుకోవాలి. హడూప్‌ లాంటి అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌పై పరిజ్ఞానం అవసరం. పైథాన్‌, ఆర్‌, ఎస్‌ఎఎస్‌ మొదలైనవి నేర్చుకోవాలి. శ్వాట్‌, రేషనల్‌ రిక్విజిట్‌ ప్రొ, బ్లూ ప్రింట్‌, ఆక్సుర్‌ మొదలైన టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి.

కోర్సులు
ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ), కోల్‌కతా; ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్‌పూర్‌; ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), కోల్‌కతా... ఈ మూడు సంస్థలూ కలిసి పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. ఇందులో చేరిన అభ్యర్థులు ఒక్కో సంస్థలో 6 నెలలపాటు చదువుకుంటారు. చివరి 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఎనలిటిక్స్‌కి సంబంధించిన సాంకేతికాంశాలు ఐఐటీలో, స్టాటిస్టిక్స్‌, మెషీన్‌ లర్నింగ్‌ థియరీని ఐఎస్‌ఐలో, అనువర్తనాలను ఐఐఎంలో నేర్పుతారు.

60 శాతం మార్కులతో బీటెక్‌/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంకాం పూర్తిచేసుకున్నవారు అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పదోతరగతి, ఇంటర్మీడియట్లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఫీజు రూ.20 లక్షలు. స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ డిసెంబరులో మొదలవుతుంది. కోర్సు పూర్తి చేసుకున్నవారు సగటున రూ.22 లక్షల వార్షిక వేతనాన్ని పొందుతున్నారు. రూ.44 లక్షలకు పైగా వేతనంతో అవకాశాలు అందుకున్నవారూ ఉన్నారు. ఇంటర్న్‌ వ్యవధిలో నెలకు రూ.1.10 లక్షల నుంచి రూ. 1.40 లక్షల స్టైపెండ్‌ లభిస్తుంది.‌
* ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు అందుబాటులో ఉంది.
* ఐఎస్‌బీ బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం అందిస్తోంది.
* మణిపాల్‌ యూనివర్సిటీ ఎమ్మెస్సీ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు ఆఫర్‌ చేస్తోంది.
* హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు అందుబాటులో ఉంది.
* భారతీయార్‌ యూనివర్సిటీ, కోయంబత్తూర్‌లో ఎమ్మెస్సీ డేటా ఎనలిటిక్స్‌ కోర్సు ఉంది.
* నార్సీ మోంజీ ముంబయి, బెంగళూరు కేంద్రాల్లో బీఎస్‌సీ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ కోర్సు ఇస్తున్నారు. ‌
* సింబయాసిస్‌, బెంగళూరు క్యాంపస్‌లో ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు అందిస్తోంది.

ఆన్‌లైన్‌లో: ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్‌, జాన్‌ హాప్కిన్స్‌..తదితర విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. కోర్స్‌ ఎరా, ఎడ్‌ఎక్స్‌, యుడెమి, గ్రేట్‌ లర్నింగ్‌ సంస్థలూ వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి. గ్రేట్‌ లేక్స్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థలు పని అనుభవం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి.

నియామక సంస్థలు
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మెకిన్సే అండ్‌ కంపెనీ, ఐటీసీ, పీడబ్ల్యుసీ, యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌, గార్ట్‌నర్‌, జియో, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌, పేపాల్‌, మాస్టర్‌ కార్డ్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, మిత్సుబిషి, వాల్‌మార్ట్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, టీసీఎస్‌, యాక్చెంచర్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌... తదితర సంస్థలెన్నో క్యాంపస్‌ నియామకాల ద్వారా ఎనలిస్టులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రారంభంలో ఎనలిస్టుగా విధులు నిర్వహించి, నాలుగేళ్ల అనుభవంతో సీనియర్‌ ఎనలిస్ట్‌ హోదాకు చేరుకోవచ్చు. ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవారు లీడ్‌ ఎనలిస్టుగానూ, పన్నెండేళ్ల అనుభవంతో మేనేజర్‌గానూ ఎదగవచ్చు. పరిజ్ఞానంతోపాటు నాయకత్వ లక్షణాలు, బృంద నిర్వహణ నైపుణ్యాలు ఉంటేనే పదోన్నతులు సాధ్యమవుతాయి. ఫైనాన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో బిజినెస్‌ ఎనలిస్ట్‌ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రంగాల్లో వేతనాలు పెద్ద మొత్తంలో అందుతున్నాయి.

ఎన్నో రకాల ఉద్యోగాలు
డేటా ఎనలిస్ట్‌: భిన్న మార్గాల్లో డేటా సేకరిస్తారు. విశ్లేషిస్తారు. సమస్యలను గుర్తిస్తారు. పరిష్కారం చూపుతారు.
బిజినెస్‌ ఎనలిస్ట్‌: డేటా ఎనలిస్ట్‌ నుంచి సమాచారాన్ని స్వీకరించి, దానికి అనుగుణంగా వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. మార్పులు చేపడతారు.
డేటా సైంటిస్ట్‌: డేటా ఉపయోగించి, భవిష్యత్తును అంచనా వేస్తారు. పరిస్థితులు ముందుముందు ఎలా ఉండబోతున్నాయి, అందుకు అనుగుణంగా ఏమి చేయాలో సూచిస్తారు. భవిష్యత్తు అవసరాల మేరకు కంపెనీలను సిద్ధం చేస్తారు.
విజువలైజేషన్‌ కన్సల్టెంట్లు: టబ్లూ లాంటి టూల్స్‌ ఉపయోగించి భారీగా ఉన్న వినియోగదారుల డేటాను విశ్లేషిస్తారు. పలు రకాలుగా దీన్ని పోల్చి చూస్తారు.
కస్టమర్‌ బిహేవియర్‌ ఎనలిస్ట్‌/ మార్కెట్‌ రిసెర్చ్‌ ఎనలిస్ట్‌: కంపెనీ వద్ద ఉన్న వినియోగదారుల సమాచారం ఆధారంగా కొనుగోళ్లను పరిశీలిస్తారు. ఏ ఉత్పత్తికి గిరాకీ ఎక్కువగా ఉందో తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడం, దుకాణాలకు చేరవేయడం, నిల్వ చేయడం వంటివి వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి.
ఆపరేషన్స్‌ ఎనలిస్ట్‌: కంపెనీలో వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులను గమనిస్తారు. రోజువారీ సమస్యలను పరిశీలిస్తారు. శాఖలవారీగా మెరుగైన పనితీరుకు సూచనలు చేస్తారు. సమస్యలకు పరిష్కారాలను సూచిస్తారు.
సప్లై చెయిన్‌ ఎనలిస్ట్‌: ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉండే విధంగా చూస్తారు. వినియోగదారుడు కోరుకున్న వెంటనే వస్తువు లభించేలా చూడడంలో వీరిపాత్ర ఉంటుంది.
రిసెర్చ్‌ ఎనలిస్ట్లు: సంస్థల్లో వీరికి ఎక్కువ గుర్తింపు ఉంటుంది. సమస్యలను విశ్లేషిస్తారు. వినియోగదారుల, స్టేక్‌ హోల్డర్ల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలు చూపుతారు. సంబంధిత డొమైన్‌ నిపుణులుగా సేవలందిస్తారు.
రిస్క్‌ ఎనలిస్ట్లు: సమాచారాన్ని విశ్లేషించి, కంపెనీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఏమైనా ఉంటే గమనిస్తారు. నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటారు. సంస్థ ఆర్థికశక్తికి తోడ్పడతారు.
డేటా మోడలర్‌: పెద్ద ఎత్తున ఉన్న డేటా నుంచి విలువైన, ఉపయోగకరమైన సమాచారాన్ని సేకరిస్తారు. దాని ద్వారా సంస్థకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతారు.
ఇంకా పోర్ట్‌ఫోలియో ఎనలిస్ట్‌, క్యాంపైన్‌ ఎనలిస్ట్‌, హెచ్‌ఆర్‌ / పీపుల్‌ ఎనలిస్ట్‌, ప్రైసింగ్‌ ఎనలిస్ట్‌, ఫైనాన్సియల్‌ ఎనలిస్ట్‌, సెక్యూరిటీ ఎనలిస్ట్‌, వెబ్‌ ఎనలిస్ట్‌, స్టాటిస్టికల్‌ ఎనలిస్ట్‌, సీఆర్‌ఎం ఎనలిస్ట్‌, ఎస్‌క్యూఎల్‌ ఎనలిస్ట్‌ తదితర పేర్లతో సంస్థల అవసరాలకు అనుగుణంగా నిపుణులు సేవలందిస్తారు.

* 2022 నాటికి దాదాపు 85 శాతం సంస్థలు సమర్థ వ్యాపార నిర్వహణ కోసం ఎనలిటిక్స్‌ను ఉపయోగిస్తాయని అంచనా.

* బిజినెస్‌ ఎనలిటిక్స్‌ ఉద్యోగాలకు 2026 నాటికి మంచి డిమాండ్‌ ఉంటుందని యునైటెడ్‌ స్టేట్స్‌ బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకటించింది.


Back..

Posted on 18-09-2019