Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మేనేజ్‌మెంట్‌లో మేటి కోర్సులు

ఎప్పటికీ డిమాండ్‌ తగ్గని వాటిలో మేనేజ్‌మెంట్‌ విద్య ఒకటి. మారుతున్న అవసరాలను అనుసరించి ఈ రంగంలో కోర్సులను ప్రవేశపెడుతున్నారు. విద్యార్థుల్లో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించేందుకు కొన్ని సంస్థలు వాటిని నిర్వహిస్తున్నాయి. అలాంటి కోర్సుల్లో ఫారిన్‌ ట్రేడ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రధానమైనవి.

దేశవ్యాప్తంగా మేటి సంస్థలెన్నో మేనేజ్‌మెంట్‌ విద్యను అందిస్తున్నాయి. సమాజ అవసరాలను బట్టి రూపొందించిన ఈ ఆధునిక కోర్సులకు గిరాకీ ఎక్కువ. అలాంటి మేనేజ్‌మెంట్‌ కోర్సుల బోధనలో కొన్ని విద్యాసంస్థలు ఎంతో పేరుపొందాయి. చెప్పుకోదగిన రెండు ప్రత్యేక కోర్సులకు సంబంధించి ఇటీవల ప్రకటనలు వెలువడ్డాయి.

ఐఐఎఫ్‌టీ: ఇంటర్నేషనల్‌ బిజినెస్‌
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఎంబీఏ కోర్సునందించే ప్రముఖ సంస్థ. దీనికి న్యూదిల్లీ, కోల్‌కతా, దారుస్సలాంల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. దేశంలోని టాప్‌-10 బీ స్కూళ్లలో ఇది ఒకటి. భారతప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశం నుంచి ఎగుమతులు పెంచడానికీ, ఫారిన్‌ ట్రేడ్‌లో నాణ్యమైన మానవ వనరులను రూపొందించడానికీ దీన్ని నెలకొల్పారు. రెండేళ్ల ఫుల్‌ టైం ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌తోపాటు మూడేళ్ల పార్ట్‌ టైం కోర్సు నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎగ్జిక్యూటివ్‌ మాస్టర్స్‌, ఎక్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్‌ ప్రోగ్రాం, ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సులను అందిస్తోంది. ఈ సంస్థలో రెండేళ్ల ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సులో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన విడుదల చేసింది. రెండేళ్ల ఈ కోర్సును 6 ట్రైమిస్టర్లలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదువుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో సగటున రూ.20 లక్షలకు పైగా వార్షిక వేతనంతో బహుళజాతి కంపెనీల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. కోటీ యాభై లక్షల డాలర్లతో విదేశీ ఆఫర్లు, జాతీయంగా రూ.కోటికిపైగా వార్షిక ప్యాకేజీ అందుకున్నవారూ ఉన్నారు. కోర్సు ఫీజు సుమారు రూ.17 లక్షలు.

అర్హత: కనీసం 50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45) శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆఖరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థులూ అర్హులే. వయః పరిమితి లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబరు 25. పరీక్ష తేదీ డిసెంబరు 1. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు రూ. వెయ్యి, మిగిలినవారికి రూ.2000.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్ష ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. వ్యవధి 2 గంటలు. ఇందులో ఆంగ్ల వ్యాకరణం, పద సంపద, కాంప్రహెన్షన్‌, జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన వ్యవహారాలు, లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, క్వాంటిటేటివ్‌ అనాలిసిస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
పరీక్షా కేంద్రాలు: ఏపీ, తెలంగాణాల్లో పలు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

వెబ్‌సైట్‌: http:// tedu.iift.ac.in/iift/index.php

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ: హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌
దేశంలోని టాప్‌- 10 బీ స్కూళ్లలో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ- జంషెడ్‌పూర్‌ ఒకటి. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లో ఈ సంస్థ తర్వాతే మరేదైనా. దేశంలో క్యాట్‌ తర్వాత పేరు పొందిన ప్రవేశపరీక్ష జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎక్స్‌ఏటీ) ద్వారా దీనిలోకి ప్రవేశం ఉంటుంది. ఎక్స్‌ఏటీ స్కోరును ఈ సంస్థతోపాటు వివిధ జేవియర్‌ విద్యాసంస్థలు, వందకుపైగా ఇతర బీ స్కూళ్లు మేనేజ్‌మెంట్‌లో పీజీ అడ్మిషన్ల కోసం పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఎక్స్‌ఏటీ ప్రకటన ప్రస్తుతం వెలువడింది. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ- జంషెడ్‌పూర్‌లో వివిధ ఐచ్ఛికాలతో మేనేజ్‌మెంట్‌ కోర్సులు లభిస్తున్నాయి. ఈ సంస్థకు చెన్నై, ముంబయి, బెంగళూరు, రాంచీ, భువనేశ్వర్‌తదితర చోట్ల క్యాంపస్‌లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి న్యూదిల్లీలో కొత్త క్యాంపస్‌ మొదలవుతుంది. ఈ స్కోరు ఆధారంగా గీతం, విజ్ఞాన జ్యోతి, శివశివానీ...మొదలైన సంస్థలు అడ్మిషన్లు ఇస్తున్నాయి. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేదీ నవంబరు 30. పరీక్ష ఫీజు రూ. 1700. పరీక్ష తేదీ జనవరి 5. వెర్బల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి పరీక్షలో ప్రశ్నలు వస్తాయి.
వెబ్‌సైట్‌: http://www.xatonline.in

ఈ బీ స్కూళ్లలో చేరడానికి ప్రవేశపరీక్ష స్కోరు ఒక్కటే సరిపోదు. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో ప్రతిభను ప్రదర్శించాలి. అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవానికి వెయిటేజీ ఉంటుంది.

Back..

Posted on 24-09-2019