ప్రత్యేక కథనాలు

సైనిక స్ఫూర్తి... భవితకు దీప్తి

ఉన్నత శిఖరాల అధిరోహణకు వీలు

ఆసక్తి చూపుతున్న యువత

ఆర్మీలో ప్రగతిదాయక అవకాశాలెన్నో

       'జై జవాన్‌... జై కిసాన్‌'... ప్రజల ఆకలిని తీర్చే బాధ్యతను రైతు తన భుజాల మీద వేసుకుంటే దేశ పౌరులంతా నిర్భయంగా, నిశ్చింతగా ఉండేందుకు సైనికుడు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతుంటాడు. దేశం లోపలా ఉగ్రవాదాన్ని అణచడానికి... ప్రకృతి విపత్తులనుంచి ప్రజలను ఆదుకునేందుకు ఎల్లవేళలా ముందడుగు వేస్తుంటాడు. ఘనకీర్తి కలిగిన సైన్యంలో పనిచేసి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి నేడు పలువురు యువకులు ముందుకొస్తున్నారు. ఈ పనిని తాము ఉద్యోగంగా భావించడం లేదని, ఎంతో బాధ్యతగా స్వీకరిస్తున్నామని వారంటున్నారు. యుద్ధంలో ముందుండి పోరాడే జవానుతో పాటు... వారికి అన్నివేళలా మద్దతుగా నిలుస్తూ, అవసరమైన సౌకర్యాలను కల్పించే విభాగాల వారికీ సైన్యంలో ఎంతో ప్రాధాన్యం ఉంటోంది. చిన్న స్థాయిలో సైన్యంలో చేరినా అనంతరం ఉన్నతమైన స్థానానికి ఎగబాకడానికి పలు అవకాశాలున్నాయి.
* ధైర్యానికి గుర్తింపు... సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పలు రకాలుగా ప్రోత్సాహం అందిస్తోంది. యుద్ధంలో అసమాన ప్రతిభ చూపిన వారితో పాటు, తమ తెలివితేటలతో, ధైర్యసాహసాలతో దేశానికి రక్షణగా నిలుస్తున్న వారికీ ఎన్నో అవార్డులను సైతం అందిస్తోంది. పరమవీరచక్ర, అశోక చక్ర, మహావీర చక్ర, కీర్తిచక్ర, వీర చక్ర, శౌర్యచక్రలతో పాటు సేవా పతకం, విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, ఉత్తమ్‌ యుద్ధ సేవా పతకాలను అందిస్తోంది. ఒక్కో పతకాన్ని, అవార్డును బట్టి గౌరవ వేతనం కూడా అందిస్తారు
* ప్రత్యేక కోర్సులతో కీలక స్థానానికి... కొన్ని ప్రత్యేక కోర్సులు చేసిన వారు సైన్యంలో కీలకమైన ఉద్యోగాల్లో ప్రవేశించి పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వీలవుతుంది.
1. ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు మే, డిసెంబర్‌ నెలల్లో యూపీఎస్సీ వెలువరించే నోటిఫికేషన్‌ ద్వారా పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరే అవకాశం ఉంటుంది. వయోపరిమితి 16.5 నుంచి 19 సంవత్సరాలు.
2. డిగ్రీ పూర్త్తెన వారు జూన్‌, నవంబరు నెలల్లో యూపీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో చేరవచ్చు. వయోపరిమితి 19 నుంచి 24 ఏళ్లు.
3. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో షార్ట్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి 20 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న వారు టెక్నికల్‌ విభాగానికి, ఇతర డిగ్రీలు పూర్తి చేసి 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు నాన్‌ టెక్నికల్‌ విభాగానికి అర్హులు. ప్రవేశాలు పొందిన వారికి 49 వారాల శిక్షణ ఉంటుంది.
4. బీటెక్‌ పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న వారితో పాటు ఎంఏ, ఎమ్మెస్సీ పూర్తయిన వారికి డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీ వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసుకుంటోంది. వీరికి ఏడాది పాటు శిక్షణ అందించి అనంతరం వారిని ఆయావిభాగాల్లో అధికారులుగా నియమిస్తుంది.
5. న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేసి బార్‌ కౌన్సిల్‌ చేత గుర్తింపు పొందిన అభ్యర్థులకు జూన్‌, డిసెంబర్‌లలో నోటిఫికేషన్లను విడుదల చేసి చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ 49 వారాల పాటు శిక్షణ అందిస్తుంది. వయోపరిమితి 21 నుంచి 27 ఏళ్లు. ఎన్‌సీసీలో 'సి' సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష ఉంటుంది.
6. ఇంటర్మీడియెట్‌లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం పాఠ్యాంశాలుగా ఉండి 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు టెక్నికల్‌ ఎంట్రీ స్కీం పరీక్ష రాయడానికి అర్హులు. దీనిలో ఎంపికైన వారికి గయలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఐదేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. వయోపరిమితి 16.5 నుంచి 19.5 ఏళ్లు.
7. ఆర్మీలో చేరాలనుకునేవారు www.joinindianarmy.nic.in లో ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
కనీస వేతనం రూ.15వేలపైనే
సైన్యంలో చేరిన వారికి ఇతరులతో పోలిస్తే జీతభత్యాలు అధికంగానే ఉంటాయి. కనిష్ఠంగా రూ.15వేల నుంచి వీరికి వేతనం లభిస్తుంది. ఆపై స్థాయిని బట్టి వేతనాల్లో మార్పులుంటాయి. 15 ఏళ్లపాటు సైన్యంలో పనిచేసిన వారికి రిటైర్‌మెంట్‌ తర్వాత పింఛను అందిస్తారు. అంతకంటే తక్కువ కాలం పనిచేసిన వారికి ఇది వర్తించదు. విధుల్లో ఉండి ఏదైనా ప్రమాదానికి గురయిన వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
విధుల్లో ఉన్నా విద్య...
పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హతతో సైన్యంలో చేరిన వారికి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుంది. ఒకవైపు విధులు నిర్వర్తిస్తూనే, మరోవైపు వారు విద్యనభ్యసించే వీలుంది. దీనికి సంబంధించి వారు ఏదైనా పుస్తకాలు కొనుగోలు చేసినా ప్రభుత్వం వాటి ఖర్చులను భరిస్తుంది.
ప్రయోజనాలివి...
* సైనికోద్యోగుల ఖర్చులను సర్కారే భరిస్తుంది. దుస్తులు, ఆహారం, ఆవాసం ఇలా అన్ని సదుపాయాలను కల్పిస్తుంది.
* ఏడాదిలో రెండు నెలలు సెలవులు ఇస్తారు. ఈ సమయంలో స్వస్థలాలకు వెళ్లి రావడానికి అయ్యే ఖర్చులను ఇస్తారు. వీటికి అదనంగా నెలపాటు సాధారణ సెలవులు కూడా ఉంటాయి.
* తల్లిదండ్రులు, భార్యాపిల్లలకు పూర్తి వైద్య సదుపాయాలు కల్పిస్తారు. మైనర్లయిన తోబుట్టువులకు కూడా ఇది వర్తిస్తుంది.
* దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ క్యాంటీన్ల ద్వారా నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాహనాలు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
* సైనికుల పిల్లలకు క్రమశిక్షణ గల వాతావరణంలో చక్కని విద్య నేర్పుతారు. కేంద్రీయ విద్యాలయాల్లో వారి పిల్లలకు ఉచిత ప్రవేశం ఉంటుంది. మంచి పౌరులుగా వారిని తీర్చిదిద్దేందుకు కావలసిన ప్రతి సదుపాయం ఈ పాఠశాలల్లో ఉంటుంది. విద్యానంతరం వారు ఆర్మీలో చేరాలనుకుంటే ఆ దిశగా వారికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
ఎంపిక ఇలా...
* ఎనిమిదో తరగతి: సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌. ఇందులో హౌస్‌ కీపర్‌, మెస్‌ కీపర్‌ ఉద్యోగాలకు 8వతరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. చీఫ్‌ కుక్‌, వెయిటర్‌, బార్బర్‌, వాషర్‌మెన్‌, టైలర్‌, కార్పెంటర్‌లకు పది ఉత్తీర్ణులై ఉండాలి.
* పదో తరగతి: సోల్జర్‌ జనరల్‌ డ్యూటీకి అర్హులు. ఇంటర్మీడియెట్‌ చదువుతున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
* ఇంటర్మీడియెట్‌: సోల్జర్‌ టెక్నికల్‌ ఉద్యోగానికి.. భౌతిక శాస్త్రం, గణితం, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ఉత్తీర్ణత కలవారు అర్హులు. సోల్జర్‌ అసిస్టెంట్‌ నర్సింగ్‌, అసిస్టెంట్‌ వెటర్నరీ ఉద్యోగాలకు.. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ ఉద్యోగాలకు.. గణితం, అకౌంటింగ్‌, సైన్స్‌, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులు.
ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల కోసం ఈనెల 17 నుంచి 25 వరకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహిస్తున్నారు. చెన్నైలోని జోనల్‌ రిక్రూట్‌ కార్యాలయం, సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని తెలంగాణ రీజియన్‌లోని పది జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఇందులో పాల్గొనడానికి అర్హులు.ముందుగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అనుకూలమైన వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అందులోనూ ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష ఉంటుంది.
గర్వకారణం
- మేజర్ యోగేష్ ముదలియార్
సైన్యంలో పనిచేయడం గర్వంగా భావించాల్సిన అంశం. ఏ ఇతర ఉద్యోగాల్లో లేని తృప్తి ఇందులో దొరుకుతుంది. శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తూ చేసే సేవ ఉన్నతమైనది. సమాజంలో మంచి గౌరవం, ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వీరి కుటుంబసభ్యుల గురించి కూడా రక్షణ శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. శారీరకంగానే కాదు మానసికంగానూ సైనికులను తీర్చిదిద్దేలా శిక్షణ కొనసాగుతుంది.
వ్కక్తిగత క్రమ శిక్షణ అలవడుతుంది
- మేజర్ ఎన్.ఎస్. రాథోర్
మిలటరీలో చేరి శిక్షణ తీసుకున్న వారికి ముఖ్యంగా వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. ఉన్నతంగా ఎదగడంలో ఈ గుణం ఎంతగానో తోడ్పడుతుంది. పదో తరగతి చదువున్న వారికీ మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో చేరిన తర్వాత ఉన్నత చదువులు చదువుకోవడానికీ అవకాశం ఉంటుంది. దీనిని సద్వినియోగం చేసుకున్నవారు భవిష్యత్తులో ఆర్మీలో మంచి స్థాయికి చేరడానికి వీలవుతుంది.
దళారులను నమ్మొద్దు
- సుబేదార్ మేజర్ డి.ఎల్. చహర్
సైన్యంలో చేరడానికి ఎలాంటి ఇతర దారులు లేవు. కేవలం ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే ప్రవేశాలుంటాయి. కొందరు తమకు తెలిసిన వారితో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారిని నమ్మకూడదు. శారీరక దారుఢ్యంతో పాటు కష్టపడే తత్త్వం ఉన్నవారికి కచ్చితంగా ప్రవేశం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి దేశం కోసం పనిచేసే విధంగా సైనికులను తయారు చేస్తారు.
విరమణ తర్వాతా లాభాలెన్నో
- అమ్మిక రంగయ్య గౌడ్, అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం
నేను 16 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేశాను. అదో మరిచిపోలేని అనుభూతి.సైన్యంలో పనిచేస్తున్నప్పుడు, విరమణ తర్వాత కూడా కేంద్రం ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తుంది. ఉన్నత స్థానాలను అధిరోహించడానికి సైన్యంలో పలు అవకాశాలుంటాయి. మనతో పాటు కుటుంబానికీ సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అక్కడ ఇచ్చే శిక్షణ వల్ల శారీరకంగానూ దృఢంగా ఉండొచ్చు.

© Ushodaya Enterprises Private Limited 2013 Main Home | Twitter | Facebook | Blog | Email Subscription | Contact