ప్రత్యేక కథనాలు

బరువు, బాధ్యత ఎక్కువ.. కేడర్ తక్కువ

* పీఎస్ ఉద్యోగాల కేడర్ పెంచాలంటూ సర్వత్రా డిమాండ్
* వీఆర్వో ఉద్యోగాల సన్నద్ధతకే అధిక ప్రాధాన్యం
వేతనం ఒకటే. అర్హతలు, సిలబస్ వేర్వేరు. రికార్డు అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి(పీఎస్) ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది. దీనిపై ఉద్యోగార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువగా ఉన్నా, అర్హతను డిగ్రీగా ఖరారు చేసినప్పటికీ వేతనం, కేడర్ మాత్రం ఇంటర్ అర్హత కలిగిన వీఆర్వో ఉద్యోగంతో సమానంగా ఉన్నందున ఉద్యోగార్థు దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. ఈ రెండు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడగా..మెజార్టీ ఉద్యోగార్థులు వీఆర్వో ఉద్యోగాల సన్నద్ధతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రెవెన్యూ శాఖలో వీఆర్వో ఉద్యోగం కావడం, స్థలాల విషయంలో వీరి పాత్ర కీలకమైనందున ఈ ఉద్యోగం ప్రత్యేకతను ఆపాదించుకుంది. పదోన్నతులు వచ్చే కొద్దీ వీరికి సమాజంలో గుర్తింపు పెరుగుతూ ఉంటుంది. ఈ ఉద్యోగంలో 'అన్నీ' ఉంటాయని ఆశించే వారూ లేకపోలేదు. ఈ ఉద్యోగాలకు 13.50 లక్షల మంది దరఖాస్తు చేయడం గమనార్హం. వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు రెండింటికీ ఎంపికైతే అత్యధికులు వీఆర్వో ఉద్యోగంలో చేరేందుకు ప్రాధాన్యం ఇస్తారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ఉద్యోగాలకు ఒకే కేడర్, వేతనం (రూ.7250-22430) ఒకటే నిర్ణయించడం ఉద్యోగార్థులకు రుచించడంలేదు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి డిగ్రీ కలిగిన వారు మాత్రమే దరఖాస్తుచేసే అవకాశాన్ని కల్పించారు. మరోవైపు ఖరారు చేసిన వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల రాత పరీక్ష సిలబస్‌లో ఎంతో వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని అర్హత, బాధ్యతలు అనుసరించి జూనియర్ అసిస్టెంట్ కేడర్ కింద మార్చాలన్న డిమాండ్ సర్వత్రా వినవస్తోంది. అయితే..ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని పంచాయతీ శాఖలోని సంబంధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
64 రకాల బాధ్యతలు..72 రికార్డుల్లో వివరాలు నమోదు
వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి బాధ్యతలను గమనిస్తే..పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో ఉన్న వారిపై రాజకీయాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు వారు నిర్వహిస్తున్న బాధ్యతలే కారణం. 2010లో ప్రభుత్వం 5000 జనాభా లేక ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామాలను ఒక క్లస్టర్‌గా చేసి, దాని ఆదాయాన్ని అనుసరించి ఒక కార్యదర్శిని నియమించాలని నిర్ణయించింది. దీనివల్ల కార్యదర్శి పరిధిలో నాలుగైదు గ్రామాలు ఉంటున్నాయి. గ్రామస్థాయిలో ప్రజలకు ముఖ్యమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, జనన, మరణ, వివాహ ధృవీకరణపత్రాల జారీ అన్నీ పంచాయతీ కార్యదర్శి ద్వారానే జరుగుతాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలోనూ వీరిదే కీలకపాత్ర. పంచాయతీ నిధుల వినియోగం, క్యాష్‌బుక్ నిర్వహణ, ప్రతి ఏడాది ఆడిటింగ్ బాధ్యతలను కార్యదర్శి నిర్వహించాల్సి ఉంది. పంచాయతీ తీర్మానాలు అనుసరించి కార్యదర్శి విధుల నిర్వహణ ఆధారపడి ఉంది. దాదాపు 64 రకాల బాధ్యతలు, 72 రికార్డుల నమోదును అన్ని గ్రామాలకు నిర్వహించాలి. ఈ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శి రాజకీయ ఒత్తిళ్లు, నేతల ఆదేశాల మధ్య ఇరుక్కుపోతున్నారు. పంచాయతీ నిధుల వినియోగంలో తేడాలువస్తే కార్యదర్శి పింఛను ఆగిపోవడం అనివార్యం. అన్నివర్గాల ప్రజాప్రతినిధులను, ప్రజలను కలుపుకోని పోలేని వారికి కార్యదర్శి ఉద్యోగం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
వీఆర్వోకు సహాయకారిగా వీఆర్ఏ
గ్రామ రెవెన్యూ అధికారి కూడా గ్రామస్థాయిలో విధులు నిర్వహిస్తారు. ఇక్కడ 5000 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి ఇద్దరు వీఆర్వోలు ఉంటారు. తహశీల్దార్ పర్యవేక్షణలో పనిచేసే వీరికి గ్రామస్థాయిలో వీఆర్ఏ సహాయకారిగా ఉంటారు. వీరు కులం, ఆదాయ ధ్రవపత్రాల మంజూరుపై తహశీల్దారుకు సిఫార్సు చేస్తారు. వీరు గ్రామస్థాయిలో స్థలాలకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నందున వీరికి ప్రజల్లో తగిన గుర్తింపు ఉంది. వీఆర్వోకు వీఆర్ఏ సహకరిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో ఉన్న వారికి చాలాచోట్ల లేకపోవడం గమనార్హం.

back

© Ushodaya Enterprises Private Limited 2013 Main Home | Twitter | Facebook | Blog | Email Subscription | Contact