ప్రత్యేక కథనాలు

కావాల్సిన పుస్తకం... క్లిక్కంత దూరంలో..

వరంగల్ జిల్లా (దేవరుప్పుల) : దేవరుప్పులకు చెందిన సాంబశివరెడ్డి నిరుపేద కుటుంబానికి చెందిన పట్టభద్రుడు. పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు. దూరంగా హైదరాబాదులో మకాం చేసి కోచింగ్‌ సెంటర్లో చదువు కొనలేని స్థితి. దగ్గర్లోని గ్రంథాలయంలో అందుబాటులో గల పోటీ పరీక్షల పుస్తకాలను తరచూ చదువుతున్నారు. ఇంకా అవసరమైన సమాచారం దొరకడం లేదని మథనపడేవారు. నగరంలో కోచింగ్‌ తీసుకుంటున్న మిత్రుడు పోటీ పరీక్షల కోసం తాజా పుస్తకం విడుదలైందని చెప్పగానే ఎంత సంతోషించాడో దాని ధర చూసి అంత నిరాశ చెందారు. పరీక్షల్లో నెగ్గాలంటే అ పుస్తకం చదవి తీరాల్సిందే.. కానీ ఆర్థిక స్థితి అందుకు సహకరించదు... ఇలా మథన పడేవారి కోసం గ్రంథాలయ సంస్థ 'అడగండి.. అందిస్తాం' పేరిట కొత్త కార్యక్రమానికి పురుడు పోసింది.
విలువైన పుస్తకాల గురించి వినడమే కానీ స్వయంగా కొనుగోలు చేయలేని వారి కోసం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సరికొత్త పథకానికి పురుడు పోసింది. అదే 'ఆన్‌లైన్‌ బుక్‌ రిక్వెస్ట్‌' పథకం. అంతర్జాలంతో కొద్దిపాటి పరిచయం ఉన్న వారెవరైనా తమకు కావల్సిన పుస్తకం దరఖాస్తు చేస్తే కొద్ది రోజుల్లో కోరిన గ్రంథాలయంలో అందుబాటులో ఉంటుంది. దీంతో పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, ఇంకా పుస్తక ప్రియులకు కావాల్సినన్ని పుస్తకాలు తెప్పించుచోవచ్చు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రధాన గ్రంథాలయం సహా సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, ఆరు ప్రాంతీయ గ్రంథాలయాలు, 22 జిల్లా, 1,449 శాఖా, 363 గ్రామీణ గ్రంథాలయాలు 99 సంచార గ్రంథాలయాలు సహా 1,402 పుస్తక నిక్షిప్త కేంద్రాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి.
* ఇదివరకు ఎలా ఉండేదంటే...?
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ తన నిధుల వెసులుబాటు అధారంగా పుస్తకాలను గ్రంథాలయాలకు పంపించేది. పాఠకులు కూడా వీటితోనే సంతృప్తి పడేవారు. అనంతరం రాజారామ్‌మోహన్‌రాయ్‌ గ్రంథాలయ సంస్థ నుంచి మేలిరకం పుస్తకాలు అందిస్తున్నారు. గతేడాది నుంచి మరింత మంది చదువరులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా పుస్తక ప్రియులు కోరిన పుస్తకాలు అందుబాటులో లేకుంటే గ్రంథపాలకుడికి దరఖాస్తు చేసుకుంటే ఆయన ఎప్పటికప్పుడు పుస్తకాల లిస్టు జిల్లాకు పంపిస్తే అక్కడ వీలునుబట్టి కొనుగోలు చేసి మండల గ్రంథాలయాలకు అందించేవారు. ఇప్పుడు...! ఈ పద్ధతినే కాస్త ఆధునీకరించింది. పాఠకులు అంతర్జాలం ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా కోరిన పుస్తకం గ్రంథాలయంలో దర్శన మిస్తుంది.
* దరఖాస్తు చేసుకోవాలంటే ఎలా?
వ్యక్తిగత గణని(కంప్యూటర్లు) ఉన్న వారు గూగుల్‌ శోధన(సెర్చ్‌)లోకి ప్రవేశించి http://publiclibraries.ap.nic.in/ అని టైప్‌ చేస్తే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ గ్రంథాలయ సంస్థ పేరిట అంతర్జాల ముఖచిత్రం కనిపిస్తుంది. దీనిలో ఎడమ వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి పూనం మాలకొండయ్య సహా పౌరగ్రంథాలయాల సంస్థ సంచాలకుడు సిహెచ్‌.పుల్లయ్యల నిశ్చల ఛాయా చిత్రాలు కనిపిస్తాయి. ఎడమ చేతివైపు అనేక ఐచ్చికాలు(ఆప్షన్లు) ఉంటాయి. దీనిలో మొదటి విభాగంలో రెండో అంశంగా ఉన్న ఆన్‌లైన్‌బుక్‌ రిక్వెస్ట్‌ ఫారం అని ఉన్న చోట క్లిక్‌ చేస్తే ఒక దరఖాస్తు కనిపిస్తుంది. మనకు అవసరమున్న పుస్తకం సహా రచయిత పేరు, ప్రచురుణకర్త పేరు ఏ సంవత్సరం విడుదలైంది తదితర వివరాలు అందులో పేర్కొన్న క్రమంలో అందించాలి. వివరాలు అన్నీ సంతృప్తి కరమే అని స్వయం ధ్రువీకరణ కోసం వెరిఫైయింగ్‌ నెంబర్‌ టైప్‌ చేయాలి. దీంతో దరఖాస్తులో పేర్కొన్న గ్రంథాలయంలోకి మనం కోరిన పుస్తకం చేరుతుంది.
* ఆలస్యమైతే ఎలా?
మనం దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. మరీ అనుమానం వస్తే మన దరఖాస్తు అందిందా లేదా లేకపోతే ఏ దశలో ఉందో తెలుసుకునే ఐచ్చికం కూడా ఉంది.
* వినియోగించుకుంటే మేలు : పొట్లూరి పద్మజ, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ వరంగల్‌
స్వంతంగా కొనుగోలు చేయలేని వారి కోసం ఏర్పాటు చేసిన దివ్యమైన కార్యక్రమం. కాకపోతే అనుసంధించిన పుస్తక విక్రేత దగ్గర పుస్తకం ఉంటే వెంటనే పాఠకుడు కోరిన గ్రంథాలయానికి పంపిస్తాం. దొరకక పోతే అదే విషయాన్ని తెలియబరుస్తాం. ఇదివరకు గ్రంథపాలకులు పంపితే నెలరోజుల వరకు పట్టేది. ఇప్పుడు వారం పదిరోజుల్లో పాఠకుల చెంత చేరుతుంది. ప్రతిరోజు మెయిల్‌ చెక్‌ చేసి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చూసి ఎప్పటి కప్పుడు స్పందించే యంత్రాంగం ఉంది. పాఠకులకు మరింత చేరువయ్యే ప్రక్రియ ఇది.

© Ushodaya Enterprises Private Limited 2013 Main Home | Twitter | Facebook | Blog | Email Subscription | Contact