Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పుస్తకంపై మనసు నిలవాలంటే..!

       ఇది చదువుల రుతువు. ఒకట్రెండు నెలల్లో పరీక్షలొచ్చేస్తాయి కాబట్టి టీనేజీ కుర్రకారు పుస్తకాలతో కసరత్తు చేసే కాలం. ప్రతి విద్యార్థీ విద్యలోని ఆనందాన్ని ఆస్వాదించాల్సిన సమయం! అయితే ఆ ఆనందం స్థానంలో ఆందోళనే ఇప్పుడు ఎక్కువగా ఉంటోంది. చదువుల సంతోషం అనేక ఒత్తిళ్ల మధ్య కొడిగడుతోంది. దాంతో నేటి విద్యార్థులు మానసిక, శారీరక అనారోగ్యాలకూ గురవుతున్నారు. ఈ చదువుల ఒత్తిళ్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతాయి.. వాటినెలా ఎదుర్కోవాలి.. పరీక్షల్లో 'ది బెస్ట్‌'గా ఎలా రాణించాలో వివరిస్తున్నారు నిపుణులు...
పరీక్షల ఒత్తిడి ఇప్పుడు ఒక్క విద్యార్థికే కాదు.. మొత్తం సమాజానికీ ఉందని చెప్పాలి. అటు ప్రభుత్వం, ఇటు విద్యాసంస్థలూ, తల్లిదండ్రులూ అందరూ ఆ ఒత్తిడికి లోనవుతున్నారు. కాకపోతే.. మిగతా అందరికన్నా విద్యార్థులు మూడురెట్లు ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా పది, ఇంటర్‌ పిల్లల్లో ఒత్తిడి తారాస్థాయిలో ఉంటోంది. జీవితం అనే పరుగు పందెంలో తాము ఓడిపోతున్నామనే భావన పిల్లల్లో ఏర్పడి వాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మానసిక వైద్యంలో ఇలాంటి బాహ్య ఒత్తిడిని 'ప్రెజ్యూమ్డ్‌ ప్రెజర్‌' అంటారు! మామూలు తలనొప్పీ, చెమటలు పట్టడం, కొద్దిగా జ్వరం, పరీక్షల్లో ఫెయిల్‌ అయినట్లు కలలు రావడం, అకస్మాత్తుగా కిందకు పడిపోయినట్లు కలలు రావడం దీనికి సంబంధించిన ప్రాథమిక సూచనలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి రెండోదశలోకి వెళుతుంది.
ఆ రెండోదశలో..
వారాల తరబడి రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం, ఒళ్లంతా నొప్పులూ, నరాల బలహీనతా, చర్మ సంబంధిత సమస్యలూ, విటమిన్‌ డీ, బీ లోపం వంటివి ఒత్తిడి ఎదుర్కొనే విద్యార్థుల్లో కనిపించే శారీరక సమస్యలు. కొందరమ్మాయిల్లో హార్మోన్‌ ల అసమతుల్యత మొదలై, పీసీఓడీ సమస్యలకు దారితీస్తుంది. వెంటవెంటనే కోపం, ఉక్రోషం, ఏడుపు రావడం (మూడ్‌ స్వింగ్స్‌) మనం సులభంగా గుర్తుపట్టగల మానసిక ఒత్తిడి లక్షణాలు. కొందరు ఏడాదంతా బాగానే ఉంటారు కానీ, జనవరి నెల రివిజన్‌ మొదలుపెట్టేసరికి అకస్మాత్తుగా 'నాకు చదివిందేదీ గుర్తుండటం లేద'ని చెబుతుంటారు. 'గుర్తున్నా వాటిని అక్షరాల్లో పెట్టలేకపోతున్నామ'ని ఫిర్యాదు చేస్తుంటారు. ఇవి రెండు కూడా తీవ్ర ఒత్తిడి లక్షణాలు. సాధారణంగా మన విద్యార్థులు ఎక్కువగా ఈ రెండోదశలోనే కనిపిస్తారు. చిన్నప్పటి నుంచే అతిసున్నితంగా ఉన్న పిల్లల్లో ఈ ఒత్తిడి మూడురెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివాళ్లు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, ఎదుటివాళ్లపై దాడి చేయడం వంటి చేష్టలకు దిగుతారు.
పరిస్థితిని బట్టి..
రెండోదశ సమస్యల్లో ఏ అయిదు కనిపించినా.. మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంతోపాటూ సంబంధిత వైద్యులనూ సంప్రదించాలి. అమ్మాయిల్లో హార్మోన్ల అసమతుల్యత కనిపించగానే వెంటనే దానికి సంబంధించిన వైద్యుల్ని సంప్రదించి ఆ సమస్యని నివారించాలి. లేకపోతే వాళ్ల చదువుకి ఇది మరింత ప్రతిబంధకంగా మారుతుంది. మూడ్‌ స్వింగ్స్‌, చదివింది సరిగ్గా గుర్తుండటం లేదని బాధపడే పిల్లలకు మానసిక వైద్యం పరంగా రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌, ఆత్మవిశ్వాసం పెంచే శిక్షణ ఇవ్వాలి. సాధారణంగా టీనేజీ పిల్లలకంటే కాస్త పెద్దవారూ, తల్లిదండ్రులూ కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే ఈ సమస్య నుంచి పిల్లల్ని బయటపడేయొచ్చు. పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తుంటే కచ్చితంగా మానసిక నిపుణుల సహకారం అవసరం ఉంటుంది.
విద్యార్థులకు ప్రణాళిక..
ముందుగా రోజుకి మీరెన్ని గంటలు చదవగలరో నిజాయతీగా అంచనా వేయండి. దాన్ని బట్టే రోజూ చదువుగంటల్ని నిర్ణయించుకోండి. ఉదాహరణకు మీరు రోజులో అయిదు గంటలు మాత్రమే చదవగలరని అనుకుందాం! దాన్ని బట్టే షెడ్యూల్‌ ఏర్పాటుచేసుకోండి. వచ్చే మూడు నెలల కాలంలో మీ సమయపాలనలో ఒక్క నిమిషం కూడా తేడాలేకుండా చూడండి. రోజూ ఓ నిర్ణీత సమయానికి చదవడం అలవాటు చేస్తే మెదడు అద్భుతాలు సృష్టించగలుగుతుంది. ఏకాగ్రత కుదరడం లేదనే వాళ్లు ఇలా చేసి చూడొచ్చు! గంటసేపు చదివితే అయిదునిమిషాలు విశ్రాంతి తీసుకోవడాన్ని తప్పనిసరి చేసుకోండి. ఆ అయిదు నిమిషాలు చక్కటి సంగీతం వినడం, కొద్దిగా నడవడం వంటివి చేయండి.
మెదడు సామర్థ్యానికి : దీనికి మనం చేయాల్సిందంతా.. మెదడుకిష్టమైన పని చేయడమే! లేదా మనం చేసే పనిలో ఇష్టం పెరిగేలా చూడటమే. కంఠస్థీకరణ అన్నది మెదడుకెప్పుడూ భారమైన విషయం! సబ్జెక్టు ఏదైనా కాన్సెప్ట్‌ అర్థం చేసుకుని.. మీకు తెలిసిన పరిజ్ఞానంతో జతచేసి గుర్తుంచుకోండి! ఫార్ములాలూ, పద్యాలూ, తారీఖులకి ఎలాగూ కంఠస్థీకరణ తప్పదు. అవి తప్ప మిగతా వ్యాసాలన్నింటినీ దాని భావన అర్థం చేసుకుని సొంత వాక్యాల్లోనే రాయండి. ఇలా చేస్తే మీ మెదడూ ఖుషీ అవుతుంది. దాని సామర్థ్యమూ పెరుగుతుంది.
స్నేహితులు : 'నేను ర్యాంకు సాధిస్తానా?' అని మీరంటే 'నీకంత సీనులేదమ్మా..' అనే మిత్రులు చుట్టుపక్కల లేకుండా చూసుకోండి. 'నువ్వు కచ్చితంగా చేసితీరతావ్‌..' అనేవాళ్లే కావాలి. ఈ సానుకూల ప్రోత్సాహం మీచేత అద్భుతాలు సాధించేలా చేస్తుంది. స్నేహం విషయం అలా ఉంచితే.. మీరు ఇప్పటికే ప్రేమలో పడ్డారా? పడితే ఆ వూసులన్నీ పరీక్షలయ్యేంత వరకూ పక్కనపెట్టండి. ప్రేమ వూహలు హార్మోన్లపై ప్రభావం చూపేవి కాబట్టి ఏకాగ్రతకీ, చదువుపై శ్రద్ధకీ ప్రతిబంధకాలే అవుతాయి. కాదూ కుదర్దు అనుకుంటే.. గంటలతరబడి మాట్లాడుకోవడం కాకుండా 'హాయ్‌.. హలో'లకు పరిమితంకండి. అది కూడా రోజుకొక్కసారే!
సామాజిక మాధ్యమాలు : ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లేని విద్యార్థులు లేరు! ఇది చదువుల వేళ కాబట్టి సామాజిక మాధ్యమాల్ని చూడటం వారానికోసారి గంటా.. రెండు గంటలు పరిమితంకండి. అసలు స్మార్ట్‌ఫోన్‌లకి సెలవు ప్రకటించడం ఇంకా మంచిదే. అవసరమైతే స్నేహితురాళ్లని మీ తల్లిదండ్రుల ఫోన్‌లో మాట్లాడమనండి. టీవీలూ, సినిమాలకూ ఇది వర్తిస్తుంది. అయితే 'నాకు ఆ ఒక్కరోజు కూడా అక్కర్లేదు. ఏడురోజులూ చదివేస్తాను...' అని పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలా చేస్తే మనసు మళ్లీమళ్లీ సరదాలవైపే మళ్లుతుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది.
నిద్ర, ఆహారం, వ్యాయామం : పరీక్షలకి సిద్ధమయ్యే రోజుల్లో రాత్రి నిద్రరాకుండా ఉండేందుకు.. కొన్ని రకాల మందులు వాడే విద్యార్థులూ ఉన్నారు! వీటిని వాడటం వల్ల నిద్ర రానట్టు అనిపించినా ఇవి మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మేధస్సునీ పూర్తిగా హరిస్తాయి. నిజానికి, నిద్ర.. మెదడు తనని తాను పునరుత్తేజం చేసుకునే ఓ ప్రక్రియ! చక్కగా నిద్రపోతేనే మెదడు బాగా పనిచేస్తుందనే విషయం గుర్తుంచుకోండి. నిద్రలాగే కొందరు ఆహారాన్నీ దూరం చేస్తుంటారు! చదువుల వేళ జంక్‌ఫుడ్స్‌ తప్ప మిగతా అన్ని ఆహారాలనీ తీసుకోవచ్చు. మొలకెత్తిన గింజలు, క్యారట్‌, బీట్‌రూట్‌ జ్యూస్‌లాంటివి మెదడు చురుగ్గా పనిచేసేలా చూస్తాయి. ఇక, వ్యాయామం విషయానికొస్తే శరీరానికి ఎక్కువ శ్రమ ఇవ్వని వాకింగ్‌, జాకింగ్‌లకి పరిమితం కావడం మంచిది. తీవ్ర వ్యాయమాలూ శరీరాన్ని మరింతగా అలసిపోయేలా చేసి.. మెదడుని పనిచేయనివ్వవు

<<-Back
Published on 19-1-2015