Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విదేశీ భాష... ఉపాధి బాట

       కొందరు ఇంజినీరింగ్ చేస్తారు... మరికొందరు ఎంబీఏ చేస్తారు...ఇంకొందరు ఎంసీఏ చదువుతారు... అయినా ఈ పోటీ ప్రపంచంలో ఏదో ఒక ఉద్యోగం సాధించేందుకు కాళ్లరిగేలా తిరుగుతుంటారు. కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఇతర కార్యక్రమాలు చేసుకుంటూనే కొంత సమయాన్ని కేటాయించి విదేశీ భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు తగినట్లుగానే నగరంలో వివిధ ఉపాధి అవకాశాలు వీరి తలుపు తడుతున్నాయి. కొత్త తరహా ఉద్యోగాల్లో చేరి సమాజంలో హోదాతో పాటు ఆకర్షణీయమైన వేతనాలు పొందుతున్నారు.
       జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, ఇటాలియన్ లాంటి విదేశీ భాషలు నేర్చుకునే వారు నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్నారు. సాధారణ కోర్సులను అభ్యసించే విద్యార్థుల కంటే ఉద్యోగం చేస్తూనో లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తూనో వీటిని నేర్చుకునే వారు అధికంగా ఉంటున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, గృహిణులు, వ్యాపారాలు చేసేవారు సైతం వీటిపై ఆసక్తి చూపుతున్నారు. వీరికి అందుబాటులో ఉండేలా నగరంలోని విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ప్రత్యేకంగా పార్టుటైం కోర్సులను అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకొని నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఇలా నేర్చుకునేందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఈ రంగంలోని అధ్యాపకులు చెబుతున్నారు.
అవకాశాలు ఆపారం
       ప్రపంచీకరణ నేపథ్యంలో కేవలం కొద్దిపాటి నైపుణ్యాలున్న వారికి ఉద్యోగం లభించడం గగనమైపోయింది. ఇలాంటి తరుణంలో విదేశీ భాషలను నేర్చుకునేందుకు అనేకమంది మొగ్గు చూపుతున్నారు. వీరికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండటం దీనికి ఓ కారణం. ఐబీఎం, టెక్ మహీంద్రా, ఒరాకిల్, హెచ్‌పీ, టీసీఎస్, సొనాటా లాంటి వాటితో పాటు సాధారణ కంపెనీల్లోనూ వీరికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించే సమయంలో స్పానిష్, ఫ్రెంచి లాంటి భాషలు వచ్చిన వారి అవసరం ఎక్కువగా ఉంటోంది. దీనితో పాటు పర్యాటక రంగంలో విదేశీయులకు గైడ్లుగా వ్యవహరించే అవకాశం దొరుకుతోంది. ఇలాంటి వారిని నియమించుకోవడానికి ట్రావెల్, టూరిజం సంస్థలు ముందుకొస్తున్నాయి. నగరంలో కొన్నేళ్లుగా ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. 2012లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు నుంచి ఇటీవల జరిగిన బాలల చలన చిత్రోత్సవం వరకు అన్నీ ఉపాధిని కల్పిస్తున్నాయి. వీటి సందర్భంగా ఇక్కడికి వచ్చే దేశవిదేశాల ప్రతినిధులు విదేశీ భాషల్లో నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసుకుంటున్నారు.
బోధకులు గానూ...
       నగరంలో ప్రస్తుతం ప్రతి ప్రాంతంలోనూ ఒక ఇంటర్నేషనల్ పాఠశాల దర్శనమిస్తోంది. వీటిలో చదువుకునే విద్యార్థులకు తప్పనిసరిగా నిర్వాహకులు ఒకటి రెండు విదేశీ భాషలను నేర్పిస్తున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వావిద్యాలయాన్నింటిలోనూ జర్మన్ భాషను నేర్పించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో విదేశీ భాషలను నేర్చుకున్న వారికి ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉండబోతున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. వీరితో పాటు వైద్యులు, పరిశోధకులు సైతం వివిధ భాషలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వారికి విదేశాల్లో పర్యటనలు, పరిశోధనల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఉజ్వల భవిష్యత్తు ఉంది
       ప్రపంచీకరణ నేపథ్యంలో భిన్న భాషలు రావడం తప్పనిసరిగా మారింది. అలా నేర్చుకున్నవారికి సాఫ్ట్‌వేర్, అనువాదం, పాఠశాలలు... తదితర రంగాల్లో అవకాశాలున్నాయి. ఏదో ఒక ఉద్యోగం చేస్తూ వీటిని నేర్చుకుంటున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. గృహిణులు వీటిని నేర్చుకొని తమ తీరిక వేళల్లో అనువాదం చేస్తూ ఎవరూ వూహించిన విధంగా ఆదాయం పొందుతున్నారు. ఇంజినీరింగ్, ఎంబీఎ, ఎంసీఎ చదివిన విద్యార్థులూ విదేశీ భాషలను నేర్చుకొని అవకాశాలను మెరుగు పర్చుకుంటున్నారు.

- రావి ఈశ్వర్ చంద్ర, ఫ్రెంచ్ విభాగం అధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం

సరికొత్త ఆదాయ మార్గం
       నేను ఇంజినీరింగ్ పూర్తి చేశాను. కొన్నేళ్ల క్రితం రామకృష్ణమఠంలో చేరి స్పానిష్‌లో ప్రాథమిక కోర్సులను పూర్తి చేశాను. అనంతరం ఇఫ్లూలో ఎం.ఎ (స్పానిష్) చదివాను. ఇటీవలే ఒక ప్రముఖ సంస్థలో సాంకేతిక అనువాదకుడిగా ఉద్యోగంలో చేరాను. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఎ లాంటి కోర్సులను పూర్తి చేసిన వారికంటే ఇలాంటి భాషలను నేర్చుకున్న వారికి త్వరగా భిన్నరంగాల్లో ఉద్యోగాలు దొరుకుతాయి.

- మల్లేశ్

నేర్చుకొని... బోధిస్తున్నా
       ఎంఏ పూర్తి చేసిన తర్వాత కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి రావడంతో కొద్దికాలం ఇంటికే పరిమితమైపోయాను. ఆ తర్వాత కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇలా విదేశీ భాషలను నేర్చుకునే అవకాశం ఉందని తెలుసుకొని అందులో ప్రవేశించాను. జర్మనీ భాషపై పట్టుసాధించి కొత్తగా నేర్చుకోవడానికి వచ్చేవారికి బోధించే స్థాయికి చేరుకున్నాను. భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణుల అవసరం చాలా ఉండబోతోంది.

- పద్మావతి

బాలల చిత్రోత్సవంలో పనిచేశా...
       బి.టెక్ చదువుకుంటూనే ఉదయం వేళల్లో ప్రత్యేక తరగతుల ద్వారా స్పానిష్ నేర్చుకున్నాను. ఇటీవలే ముగిసిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో దుబాసీగా పనిచేసే అవకాశం దక్కింది. ఇదొక చక్కని అనుభవం. ఇలా పనిచేసినందుకు ఆకర్షణీయమైన వేతనం లభించడంతో పాటు విదేశీ దర్శకులు, నిర్మాతలతో ముచ్చటించి వారి అనుభవాలను తెలుసుకో గలిగాను. ఇది భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను.

- అశ్విన్‌రత్న

అందిపుచ్చుకుంటున్నారు
       గతంతో పోలిస్తే ఇలాంటి భాషలు మాట్లాడటం, రాయడం వచ్చిన వారికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఇటువైపు వస్తున్నారు. వీరికంటే ఇప్పటికే వివిధ డిగ్రీలు పొందినవారు, గృహిణులు వీటిని నేర్చుకోవడానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇఫ్లూతో పాటు మరికొన్ని సంస్థలు వారికి అందుబాటులో ఉండేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి.

- డాక్టర్ శ్రీవాణి, స్పానిష్ విభాగం హెడ్, ఇఫ్లూ

అందుబాటులో ఇక్కడ..
       ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ), ఉస్మానియా విశ్వవిద్యాలయం, రామకృష్ణ మఠం లాంటి వాటితో పాటు గోతేజంత్రం లాంటి విదేశీ అధ్యయన సంస్థలు ఈ తరహా తరగతులను నిర్వహిస్తున్నాయి. ఉద్యోగం చేసేవారు, గృహిణులకు అందుబాటులో ఉండేలా ఉదయం, సాయంత్రం, కొన్నిసార్లు మధ్యాహ్న వేళల్లోనూ తరగతులు ఉండేలా చూస్తున్నారు. వీటిలో భిన్న స్థాయులున్నాయి. వాటిని పూర్తి చేసిన వారు తర్వాతి స్థాయిలో పీజీ చేసే అవకాశం ఉంటోంది. వారానికి మూడు రోజుల చొప్పున తరగతులు ఉంటున్నాయి.