Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
జయహో..

» విజయసూత్రం.. స్ఫూర్తి మంత్రం

       క్షణం వృథా చేసినా జీవితంలో ఎంతో కొంత కోల్పోయినట్లే.! లక్ష్య ఛేదనలో ఉన్నవారు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేయాలి.. 'జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం.. తలవంచావా అపజయమే.., ఎదిరించావా విజయం నీదే..' అంటాడో కవి..! దీన్ని అక్షర మంత్రంగా స్వీకరించి గమ్యాన్ని ఎలా చేరుకోవాలి..? విజయాన్ని ఎలా ముద్దాడాలి..?
ఫలితాన్ని బట్టే విజయం
* లండన్‌లో ఒలింపిక్‌ పోటీల్లో పొరుగు దేశం చైనాకు 236 పతకాలు వచ్చాయి. ఇదే సమయంలో భారతదేశానికి ఆరు పతకాలు దక్కాయి. ఇక అమెరికాకు చెందిన మైఖేల్‌ ఫెల్ప్స్‌ అనే ఈతగాడు మొత్తం 18 పతకాలు గెలుచుకున్నాడు. మరి.. ఆయా దేశాల, వ్యక్తుల విజయాన్ని 'అదృష్టం' అందామా..? 'అనుకోకుండా జరిగిన అంశం'గా భావించలేం..! ఎందుకంటే..? ఎవరూ కార్యసాధన లేకుండా విజయం సాధించలేరు..! మృగరాజు అయినంత మాత్రాన సింహానికీ ఆహారం నోట్లోకి వచ్చిపడదు కదా..! విజయ సాధకులు స్పష్టమైన ప్రణాళికతో కార్యాచరణ చేస్తారు..! ఎక్కువ ప్రయత్నం చేసేవారికి ఎక్కువ ఫలితం.. తక్కువ ప్రయత్నం చేసేవారికి తక్కువ ఫలితం.. వీటినే మనం జయాపజయాలు అంటాం..! విజయకేతనం ఎలా ఎగురేయాలి..? జీవితంలో ఎలా జీవించాలో..? నవ సూత్రాల ద్వారా తెలుసుకోండి..
స్పష్టమైన లక్ష్యం...
ప్రతి వ్యక్తికి నిర్దిష్ట లక్ష్యం ఉండాలి.. అది లేకుండా ప్రయాణం ప్రారంభించేవారికి ఏ మైలురాయీ ఉపయోగ పడదు. ఏ రవాణా రక్షకభటుడూ దారి చూపలేడు. విద్యార్థి, వ్యాపారి, ఉద్యోగి.. ఇలా ఎవరైనా సరే లక్ష్యం లేకుండా ప్రారంభించే పని దారం తెగిన గాలిపటంలాంటిదే..! తెడ్డు లేని పడవలో ప్రయాణం వంటిదే..!! లక్ష్యాలను విజేతలు కాగితంపై రాసుకుంటారు. మనో నేత్రంతో ముద్రించుకుంటారు. దాని సాధనకు నిరంతరం శ్రమిస్తారు. అందుకే అదే ధ్యాస, అదే శ్వాసగా జీవించాలి..! అనుకున్నది సాధించకపోవడం కాదు.. అసలు లక్ష్యం లేకపోవడమే అత్యంత దురదృష్టకరం. ఏదీ ఒక్క రోజులో అయ్యేది కాదని గుర్తుంచుకోవాలి. పెద్ద లక్ష్యం పెట్టుకున్నపుడు.. చేరుకునేందుకు చిన్న లక్ష్యాలను దాటుకుంటూ సాగాలి. ఉదాహరణకు ఇంటర్‌ మొదటి సంవత్సర విద్యార్థికి వైద్యుడు కావాలని ఉంటే.. మొదట ఇంటర్‌ సిలబస్‌పై పట్టు సాధించాలి. తర్వాత మెడిసిన్‌ అర్హత పరీక్షలో జయకేతనం ఎగురవేయాలి..
జ్వలించే కోరిక
కోరికలు ఉండడం సహజం. కానీ జ్వలించే కోరికలు ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. మనలో చాలామంది అగ్గిపుల్లలో ఉండే నిప్పు కణిక లాంటివారే.. వెలిగించగానే చుట్టూ ఉన్న గాలికి 'టప్‌' అని ఆరిపోతారు. అదే భగ్గున జ్వలించే కాగడాలా ఉంటే ఏ వస్తువునైనా మండించగలం. అప్పుడా మంటకు చుట్టూ ఉండే గాలి తోడైతే పెద్ద అగ్ని జ్వాల రగులుతుంది. విజేతలు.. స్వీయ ప్రేరణతో కోరికను జ్వలించే కోరికగా మార్చుకుంటారు.
ఆలోచనే ఆయుధం
మంచైనా, చెడైనా ఆలోచనలే వాస్తవాలవుతాయి. అందుకే 'యద్భావం తద్భవతి' అంటాం. విజయం కాంక్షించే వ్యక్తులు ఆశావహ దృక్పథంతో మనసులో పెద్ద ఆలోచనలకు అవకాశం కల్పిస్తారు. ప్రపంచంలో ఏ వస్తువైనా రెండుసార్లు పుడుతుంది. మనం చూసే కంప్యూటర్లు, కార్లు, జెట్‌ విమానాలు.. ఇవన్నీ ఓ ఆలోచన రూపంలో మనుషి మెదడులో మొదటిసారి పుట్టాయి. వాస్తవ రూపంలోకి మారాక రెండోసారి భౌతికంగా పుట్టాయి. అందుకే 'ఆలోచనల' ప్రాధాన్యం గుర్తించాలి. అయితే.. వాటికి హద్దులు నిర్ణయించుకోవడమూ మన చేతుల్లోనే ఉంటుంది. ఆలోచనలు మాటలవుతాయి.. మాటలు చేతలవుతాయి.. చేతలు అలవాట్లుగా మారతాయి.. అలవాటే శీలంగా మారుతుంది.. మనిషి శీలమేమళ్లీ ఆలోచనగా మారుతుంది. ఉదాహరణకు.. ఓ రైతుకు గుమ్మడికాయ తోట ఉంది. పక్షం రోజులు వేరే గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో మూడు కుండలు తీసుకుని తోటలోకి వెళ్లాడు. ఒక పిందెను చిన్న కుండలో, రెండోదాన్ని కాస్త పెద్ద కుండలో, మూడోదాన్ని ఇంకాస్త పెద్ద కుండలో ఉంచాడు. పదిహేను రోజుల తర్వాత వచ్చి చూస్తే.. పిందెలు ఆ కుండల పరిమాణమంత వరకే పెరిగి ఆగిపోయాయి. చిన్న, పెద్ద, చాలా పెద్ద ఇలా మూడు రకాల కాయలు తయారయ్యాయి. ఇక్కడ కుండ మన ఆలోచనకు ప్రతిరూపం. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలో నిర్ణయించుకోండి.
వైఖరిని బట్టి ఫలితాలు
ఒకే బొమ్మను ఒక్కో ఫొటోగ్రాఫర్‌ ఒక్కోలా తన కెమేరాలో బంధిస్తాడు. బొమ్మ సహజ స్వరూపం మారదు. కానీ ఛాయచిత్రకారుడి కెమేరా కోణం మారుతుంది.. ఈ కోణం అనేది మనిషి ఆలోచనా ధోరణి, వైఖరి అన్నమాట. ఎదుటి వ్యక్తి నుంచి వస్తువు అవసరమైన సందర్భంలో అతడు 'వీలు కాదు' అని చెబితే.. ఆ జవాబునుఒక్కొక్కరు ఒక్కోలా భావిస్తారు. 'వీలు కాదు' అన్నమాట ఒకరికి కోపం తెప్పిస్తుంది. ఒకరికి ద్వేషం పుట్టిస్తుంది. మరొకరు నిజంగా వీలు కాలేదేమోలే అని భావిస్తారు. ఇదంతా మన వైఖరిని బట్టే. సకారాత్మక వైఖరి ఉన్నవారిని విజయం సాధించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు.
అచంచల ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసం విజయ ప్రయాణానికి ఇంధనం. గాంధీ, నెల్సన్‌ మండేలా, మదర్‌థెరిసా, నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నుంచి సచిన్‌ టెండ్కూలర్‌, సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌, కేజ్రీవాల్‌ వరకు అందరిలోనూ ఉన్న ఏకైక సారూప్య లక్షణం అచంచల ఆత్మవిశ్వాసం. మెండుగా ఉన్నవారు ఎక్కువ సామర్ధ్యం ఉన్నవారి కన్నా ఎక్కువ సార్లు విజయం సాధిస్తారు. అందుకే.. వైఫల్యాల గురించి ఎక్కువగా మాట్లాడేవారికి దూరంగా ఉండడం అవసరం. ఉదాహరణకు.. ఒక అమ్మాయి పుట్టినపుడు రెండు కిలోల కంటే తక్కువ బరువుంది. పైగా పోలియో బారినపడింది. వైద్యులు బతకదన్నారు. తల్లి మాత్రం ఆ మాట వినదల్చుకోలేదు. కూతురు కూడా తల్లినే నమ్మింది. తల్లి కూతురిని వెంటబెట్టుకుని వెళ్లి వారానికి రెండుసార్లు 80 కి.మీ. ప్రయాణించి ఫిజియోథెరపీ చేయించింది. పన్నెండో ఏట పాప నడిచింది. మరికొద్ది కాలానికే పరుగెత్తడం ప్రారంభించింది. 1956 ఒలింపిక్స్‌ 400 మీటర్ల రిలే పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. 1960 ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన తొలి రన్నర్‌గా ఆవిర్భవించింది. ఆ అమ్మాయి పేరే విల్మా రుడాల్ఫ్‌.
సమయపాలన
వాస్తవానికి సమయపాలన అనేది లేదు. వ్యక్తిగత పాలనే సమయపాలన.. రాజు, భిక్షగాడికి అందరికీ రోజుకు 24 గంటల సమయమే. కానీ.. ఎందుకని కొందరే విజయం సాధిస్తున్నారు..? వారు సమయపాలన పాటిస్తారు గనుక. విజేతలుగా నిలిచినవారు.. ముందుగా తమ సమయం ఎక్కడ వృథా అవుతుందో వారం, పది రోజులు గమనించి ఉంటారు. ఆ అంశాలు రాసుకుని ఒక్కోదాన్ని పట్టించుకుంటారు. అవేమంటే.. ఫోన్‌, వృథా చర్చలు, వాయిదా వేయడం, ప్రయాణాలు, ప్రణాళిక లేకుండా పనిచేయడం వంటివన్నమాట. విజేతలు ప్రతి పనికి నిర్దిష్ట సమయం కేటాయించుకుని ఆ సమయంలోనే పూర్తి చేస్తారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అనుకోరు. మార్కెట్లో దొరికే డైరీలు, ప్లానర్లు, ఆర్గనైజర్ల ద్వారా సమయాన్ని గరిష్ఠంగా వాడుకుంటారు.
ఆరోగ్యంపై దృష్టి
డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు. ఆరోగ్యం పాడైతే లక్ష్యం సాధించడం చాలా కష్టం. ఒక్కోసారి అసాధ్యమూ కావచ్చు. చైనాలో ఓ కాలనీలో ఉంది. అక్కడ కనిష్ఠంగా 105 సంవత్సరాలు ఆపైన వయసున్నవారే నివసించడానికి అర్హులు. సమయానికి నిద్ర, ఆహారం, వ్యాయామం ఇదే మనిషి ఆయువును నిర్ణయించే ప్రధానాంశాలు. మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, నిర్లక్ష్య ఆహార అలవాట్లు నేటి యువతకు శత్రువులవుతున్నాయి. నూరేళ్లూ నిండుగా బతకాల్సిన మనిషి ఆయుష్షును 60 లేక 70 ఏళ్లకు తగ్గించుకుంటున్నాడు. ఇది మారాలి.
ఆధునిక పరికరాలతో జాగ్రత్త
చరవాణి, అంతర్జాలం, పాశ్చాత్య ధోరణులు, సాంకేతిక వస్తువులు మనిషిని శాసిస్తున్నాయి. మనిషి.. మనుషులనుప్రేమిస్తూ వస్తువులు వాడుకోవాల్సింది పోయి.. మనుషులను వాడుకుంటూ వస్తువులను ప్రేమించడం నేర్చుకుంటున్నారు. ఈ తీరును మార్చి ఆర్యోగకర సమాజాన్ని నిర్మించాలందరూ..!
ఇవ్వడంలోనే ఆనందం
విజేత అంటే ఓ పెద్ద ఉద్యోగం సంపాదించడమో, వ్యాపారంలో కోట్లు సంపాదించడమో, అంతర్జాతీ క్రికెట్‌లో శతకాలు సాధించడమో కానక్కర్లేదు. పక్కవాడికి చేతనైన సాయం చేయడం, ఉన్నదాంట్లో కొంచెమైనా ఇతరులకు ఇవ్వడం కూడా మనల్ని విజేతలుగా నిలుపుతుంది. బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌లాంటి అపర కుబేరులు సమాజానికి వేల కోట్లు విరాళం ఇచ్చారు. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను..' వంటి నైజం విజేతల లక్షణం.