Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలంగాణ గురుకుల బోర్డు పరీక్షా విధానంలో మార్పులు

* తప్పు జవాబులకు మార్కుల కోత
* ప్రాథమిక పరీక్ష ప్రశ్నలు 100కు కుదింపు
* పాఠశాలలు, కళాశాలలకు వేర్వేరు ప్రిలిమినరీ పరీక్షలు
* పలు పోస్టులకు మౌఖిక, ప్రాక్టికల్‌ పరీక్షలు
* జూన్‌ 15 నాటికి ఉద్యోగ ప్రకటనలు..!
ఈనాడు - హైదరాబాద్: గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించే పరీక్షలో తప్పుడు సమాధానాలకు మార్కుల కోత (నెగిటివ్‌ మార్కులు) అమలు చేయాలని తెలంగాణ గురుకుల బోర్డు నిర్ణయించింది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 వంతు మార్కు చొప్పున తగ్గించనుంది. మరోవైపు ప్రలిమినరీ పరీక్షలో ప్రశ్నల సంఖ్యను 100కు కుదించారు. ఈ మేరకు పరీక్ష విధానం, సిలబస్‌ను గురుకుల నియామక బోర్డు ఖరారు చేసింది. దీనిపై త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. గురుకుల పరీక్షల్లో తొలిసారిగా నెగిటివ్‌ మార్కుల విధానం అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. పాఠశాలలు, జూనియర్‌-డిగ్రీ కళాశాలల్లో పోస్టుల స్థాయి మేరకు సబ్జెక్టు కాఠిన్యతతో వేర్వేరు ప్రాథమిక పరీక్షలు నిర్వహించనున్నారు. పాఠశాల, కళాశాలల్లో పోస్టులకు అర్హులైన అందరికీ ఆయా పరీక్షలు రాసేందుకు అవకాశమివ్వడంతోపాటు ఆ మేరకు పరీక్ష షెడ్యూలు ఖరారు చేయాలని బోర్డు భావిస్తోంది. జూన్‌ 15 నాటికి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే గురుకుల సొసైటీలు రోస్టర్‌ సిద్ధం చేస్తున్నాయి. త్వరలోనే ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని ప్రకటనలు వెలువరించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ప్రాథమిక పరీక్షను పేపర్‌-1గా, సంబంధిత సబ్జెక్టులో బోధన పద్ధతులు, పాఠశాల యాజమాన్య నిర్వహణను పేపర్‌-2గా, సబ్జెక్టుపై విషయ పరిజ్ఞానం పేపర్‌-3గా ఉంటాయి. పేపర్‌-2, పేపర్‌-3లో ప్రశ్నలు 150 చొప్పున మొత్తం 300గా ఖరారు చేశారు. గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు, స్టాఫ్‌ నర్సు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు మినహా మిగతా పోస్టులకు ఇంటర్వ్యూలు, నమూన తరగతులు నిర్వహించనున్నారు. గురుకులాల నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూకి అప్పగించారు.
అన్నీ ఆఫ్‌లైన్లోనే...
గురుకుల నియామక పరీక్షలన్నీ ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్ష కూడా ఆఫ్‌లైన్లో ఉంటుంది. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే పోస్టులకు ఆన్‌లైన్లో, ఎక్కువ సంఖ్యలో వచ్చే పోస్టులకు ఆఫ్‌లైన్లో నిర్వహించడంతో ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు భావించాయి. మరోవైపు భారీసంఖ్యలో అభ్యర్థులకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించే మౌలిక సదుపాయాలు అందుబాటులోలేవని జేఎన్‌టీయూ పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో అన్నిటినీ ఆఫ్‌లైన్లోనే చేపట్టనుంది. పేపర్‌-1ను కేవలం అర్హత పరీక్షగానే భావించాలని తొలుత నిర్ణయించినా ఆ తరువాత ప్రశ్నల సంఖ్య తగ్గించడంతో పేపర్‌-2, 3తో పాటు పేపర్‌-1 మార్కులను కలిపి మెరిట్‌ జాబితాలు రూపొందించనుంది. పీఈటీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌, స్టాఫ్‌నర్సులు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అవసరం లేదని ప్రతిపాదించింది. అలాగే ఇంటర్వ్యూలు లేదా నమూన తరగతులు లేదా ప్రాక్టికల్స్‌కు 50 మార్కులు ఇవ్వనుంది.
ఇంటర్వ్యూలున్న పోస్టులు
పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌, జూనియర్‌ లెక్చరర్లు, పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ఫిజికల్‌ డైరెక్టర్లు, జూనియర్‌ కళాశాలల లైబ్రేరియన్లు, పీఈటీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్లు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, పీడీలు, లైబ్రేరియన్లు.
మార్కులు ఇలా..
పోస్టులు: పీజీటీ, టీజీటీ, పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌
పేపర్‌-1 (ప్రిలిమినరీ) - 100 మార్కులు (100 ప్రశ్నలు)
పేపర్‌-2 (మెయిన్స్‌) - 150 మార్కులు (150 ప్రశ్నలు)
పేపర్‌-3 (మెయిన్స్‌) - 150 మార్కులు (150 ప్రశ్నలు)
* జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు పేపర్‌-1లో 100, పేపర్‌-2లో 100 ప్రశ్నలు, పేపర్‌-3లో 200 ప్రశ్నలు అడుగుతారు. ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్లకు ఒకే పేపర్‌ ఉంటుంది. ఈ పేపర్‌లో 200 ప్రశ్నలు ఉంటాయి.
* పాఠశాలల పీడీలు, జూనియర్‌ కళాశాలల లైబ్రేరియన్లు, డిగ్రీ లెక్చరర్‌, పీడీ, లైబ్రేరియన్‌ పోస్టులకు ప్రధానపరీక్షలో 150ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 300 మార్కులు ఇస్తారు.
* పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో పీడీలు, లైబ్రేరియన్లు, పీఈటీలు, స్టాఫ్‌నర్సులు, డిగ్రీ లెక్చరర్లు, పీడీలు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు పేపర్‌-1, 2 పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఒక్కో పేపర్‌ నుంచి 150 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.

Back..

Posted on 26-05-2018