Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పిల్లలూ.. జర పదిలం

* ‘పది’ పరీక్షల్లో చిన్న పొరపాట్లతో మార్కులకు కోత
* ఈ తప్పులు చెయ్యొద్దు..!
* విద్యార్థులకు సూచిస్తున్న సబ్జెక్టు నిపుణులు


తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 3తో ముగుస్తాయి. పరీక్షలు మొదలు కావడానికి ఇక కేవలం ఆరు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఎంత చదివినా.. అపార పరిజ్ఞానం ఉన్నా పరీక్షల్లో ఏం రాస్తారన్నదే ప్రధానం. ప్రతిభావంతులైన విద్యార్థులైనా సరే.. పరీక్షల్లో చేసే చిన్న పొరపాట్లు, తప్పుల కారణంగా మార్కులు కోల్పోతున్నారు. ఒక్కోసారి ఒక్క మార్కు తేడాతోనే మంచి కోర్సుల్లో చేరే మహదవకాశాన్ని కోల్పోతున్న ఉదంతాలూ ఉన్నాయి. కచ్చితంగా పాస్‌ మార్కులు వస్తాయనుకునే సాధారణ విద్యార్థులు తప్పుతున్నారు. గతంలో అతి స్వల్ప తేడాతో పలువురు విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం కోల్పోయారు. ఒక్క మార్కు తగ్గితే పది గ్రేడ్‌ కాస్తా 9కి దిగజారుతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలు తారుమారవుతాయి. బాగా సన్నద్ధమయ్యామనే ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరైనా, చిన్న పొరపాట్లతో కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. ఎక్కువ మంది చేస్తున్న సాధారణ పొరపాట్లు, తప్పులు ఏమిటి? ఆశించిన స్థాయిలో మార్కులు రావాలంటే పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన జాగ్రత్తలు, మెలకువలు ఏమిటి? తదితర అంశాలపై పలువురు ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు నిపుణులను ‘ఈనాడు’ సంప్రదించింది. వారి సూచనలు, అభిప్రాయాలు ఇవీ..
వార్షిక పరీక్షల్లో అప్రమత్తత అవసరం
మొదటి ర్యాంకు వచ్చే వారు సైతం పరీక్షలంటే కొంత ఆందోళనకు గురవుతుంటారు. ఏడాది పొడవునా ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ), సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ), స్లిప్‌ టెస్టులు, ప్రి ఫైనల్‌ పరీక్షలు నిర్వహించినా వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మరెన్నో పొరపాట్లు చేస్తున్నారు. సాధారణ పరీక్షల్లో తప్పులు జరిగితే వచ్చే నష్టం ఏమీ లేకున్నా చివరి పరీక్షల్లో అవే పునరావృతమైతే జరిగే నష్టం అపారమని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. పదిలో ఉత్తీర్ణులైతేనే పై తరగతులకు వెళ్లే అవకాశం ఉంటుందని, ఉత్తమ మార్కులు వస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అది ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, నిజామాబాద్‌ జిల్లా బోర్గాం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్రా రాఘవరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత, వరంగల్‌ గ్రామీణ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు రమేష్‌, ఖమ్మం జిల్లా మధిర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మారుముడి ప్రభు దయాళ్‌ తదితరులు సూచిస్తున్నారు.
పది పరీక్షల్లో సాధారణంగా చేస్తున్న తప్పులివీ..
* ప్రశ్నపత్రం నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో ఉంటుంది. ప్రశ్నలు నేరుగా కాకుండా, విద్యార్థుల పరిశీలన, విశ్లేషణ, అవగాహన శక్తిని వెలికితీసేలా ఉంటాయి. అందుకే ప్రశ్నపత్రాన్ని చదవడానికే 15 నిమిషాలు సమయం ఇచ్చారు. అయితే 75 శాతానికిపైగా విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని తీసుకున్న 5 నిమిషాల్లోనే జవాబులు రాస్తున్నారు. ప్రశ్నలను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలేదు.
* జవాబు రాసేటప్పుడు ఎడమ వైపు ఒక మార్జిన్‌ వదలాలి. అందులో ప్రశ్న సంఖ్య రాయాలి. ఇది కూడా అందరూ పాటించడంలేదు. కనీసం 0.5-1 శాతం వరకు ఏదో ఒక సబ్జెక్టులో కొన్ని ప్రశ్నలకు సంఖ్య రాయడం మరిచిపోతున్నారు.
* బిట్‌ పేపర్‌లో కొట్టివేతలు, దిద్దివేతలు ఉండకూడదు. కనీసం 60 శాతానికిపైగా ఇది పాటించడం లేదు. బ్రాకెట్‌లో ఒకటి రాసి, మళ్లీ కొట్టివేసి బయట రాస్తున్నారు.
* పేజీ చివర కొద్ది ప్రదేశం మిగిలిందని ఇంకో జవాబు రాస్తున్నారు. ఒక పదాన్ని విడగొట్టి రాస్తున్నారు. పేజీ చివరిలో కొంత, కింది వరుసలో మరికొంత రాస్తున్నారు. దీన్ని పరిహరించాలి.
* జవాబులను వ్యాసంలా రాయకూడదు. చిన్న చిన్న పేరాలుగా రాయాలి. ఉప శీర్షికలు ఉండాలి. దానివల్ల మూల్యాంకనం చేసే వారికి సులభంగా అర్థమవుతుంది. ఇలా రాసే వారు 50 శాతానికి మించడం లేదు.
* జవాబుపత్రంలో ఒక పేజీలో 18-20 వరుసలు రాయాలి. మరీ ఎక్కువ, మరీ తక్కువ రాసే వారి శాతం సగానికిపైగా ఉంటోంది.
* ప్రారంభంలో రెండు మూడు పేజీలు చక్కగా రాస్తున్నారు. తర్వాత గజిబిజిగా రాస్తున్నారు. సమయం సరిపోదన్న ఆందోళనే అందుకు కారణం.
* ప్రశ్నలో ఏం అడిగారో అంత వరకే రాయాలి. అడగని విషయాన్ని కూడా రాసే వారే అధిక శాతం మంది ఉంటున్నారు. ప్రశ్నను సరిగా అర్థం చేసుకోకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. చిత్రం గీయాలని అడగకున్నా.. అవసరమనుకుంటే బొమ్మ గీయవచ్చు.

సబ్జెక్టుల వారీగా సూచనలివీ...


*
గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల్లో సమాధానాలు రాసేటప్పుడు మొదటి 2 మార్కులు...తర్వాత ఒక మార్కు రాయాలి. చివరగా 4 మార్కుల సమాధానాలు రాస్తే మంచిది.
* ఆంగ్లం, తెలుగు, హిందీలో వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.
* గణితంలో గ్రాఫ్‌లో స్కేల్‌ తప్పక రాయాలి. ఎక్స్‌, వై అక్షాల యూనిట్లు ఎంతో రాయాలి. గ్రాఫ్‌లో సరళ రేఖ సమీకరణాన్ని తప్పక రాయాలి. సంఖ్యలను స్పష్టంగా రాయాలి. ఉదాహరణకు రాసింది అయిదా? ఎనిమిదా? అన్న సందేహం వచ్చేలా ఉండరాదు.
* భౌతిక శాస్త్రంలోని సమస్యలు (ప్రాబ్లెమ్స్‌)లో ప్రమాణాలను రాయడం మరిచిపోరాదు. ఉదాహరణకు సెంటీమీటరు, గ్రాము, జౌలు, వాట్స్‌ తదితరాలు.
* జీవశాస్త్రంలో ప్రయోగాలకు చెందిన జవాబులను రాసేటప్పుడు సంబంధిత బొమ్మలను కూడా తప్పక వేయాలి.
* సాంఘిక శాస్త్రంలో సంవత్సరాలు, బిరుదులు తదితర అంశాలకు అండర్‌లైన్‌ చేయాలి. బాగా తెలిస్తేనే సంవత్సరాలు, తేదీలు రాయాలి.


ఎక్కువ మార్కులు పొందాలంటే..
* ఒక మార్కు ప్రశ్నలన్నీ ఒక పేజీలోనే ఉండేలా రాస్తే మంచిది.
* మొత్తం రాశాక ఒకసారి అన్నిటినీ పరిశీలించాలి. ప్రశ్న సంఖ్య రాయకున్నా, ఇంకేమైనా తప్పులు చేసినా వాటిని సరిచేసుకోవచ్చు.
* ముఖ్యమైన పాయింట్లను, పదాలను కలం లేదా కలర్‌ పెన్సిల్‌తో అండర్‌లైన్‌ చేయాలి. ప్రతి జవాబుకు శీర్షిక తప్పక రాయాలి. దాన్ని కూడా అండర్‌లైన్‌ చేయాలి. శీర్షిక అక్షరాల పరిమాణం సమాధానంలోని అక్షరాల కంటే కొద్దిగా పెద్దగా ఉండాలి.

- ఈనాడు, హైద‌రాబాద్‌‌

Back..

Posted on 10-03-2019