Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

కాంబినేషన్లు పెరిగాయ్‌!

* అడ్మిషన్లు తెలంగాణ

‘డిగ్రీ కోర్సా?’ అని చాలామంది తేలిగ్గా చూస్తారు గానీ ఇంటర్‌మీడియట్‌ పాసైనవారిలో 60 శాతానికిపైగా విద్యార్థులు చేరేది డిగ్రీలోనే! అందుకు కారణం డిగ్రీ కోర్సులను నిత్యనూతనంగా తయారు చేస్తుండటమేనని అంటున్నారు నిపుణులు. బీఏ, బీకాం, బీఎస్‌సీలే కాదు... బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూతోపాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌...అందులోనూ పదుల సంఖ్యలో కాంబినేషన్లు డిగ్రీ కోర్సులకు గిరాకీ తగ్గకుండా చేస్తున్నాయి. ఈసారి ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లోనూ బీబీఏతోపాటు బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్ల సీట్లు పెంచుతున్నారు. ఉద్యోగావకాశాలకు పెద్దపీట వేసేలా...మార్కెట్‌ అవసరాలను తీర్చేలా నూతన సబ్జెక్టుల కాంబినేషన్లను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ - తెలంగాణ(https://dost.cgg.gov.in) ప్రకటన వెలువడింది. మరి వివిధ కళాశాలలు, కోర్సుల గురించి తెలుసుకుందామా?

సాధారణ డిగ్రీకి సరికొత్త రూపుడి
గ్రీ ప్రవేశాలకు 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.200 చెల్లించి దోస్త్‌ వెబ్‌సైట్‌ నుంచి ఎంసెట్‌ తరహాలో ఎన్ని కళాశాలలకైనా, కోర్సులకైనా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. దీనివల్ల ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన మారుమూల విద్యార్థులు హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక నిజాం, సిటీ కళాశాలల్లోనూ సీట్లు సాధిస్తున్నారు.

ఎన్నో కొత్త కొత్త కోర్సులు వస్తున్నా...డిగ్రీ కోర్సులు తమ మనుగడను ఇప్పటికీ కాపాడుకుంటూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏటా 2.20 లక్షల మంది వీటిలో చేరుతున్నారు. కాలానుగుణంగా మారిన...మార్కెట్లో గిరాకీ ఉన్న కాంబినేషన్లను ఎంచుకుంటే సాధారణ డిగ్రీతోనే మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.

బీఏ, బీకాం, బీఎస్‌సీలలో కొన్నేళ్ల క్రితం కేవలం అయిదారు...గరిష్ఠంగా పది లోపు కాంబినేషన్లు ఉండేవి. ఇప్పుడు ఒక్క బీఏలోనే 68 రకాల కోర్సులు వచ్చాయి. ఇక బీఎస్‌సీలో 73 రకాల కోర్సులు, బీకాంలో 13 రకాల కోర్సులు! వాటితోపాటు బీబీఎం, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (బీఎస్‌డబ్ల్యూ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (బ్యాంకింగ్‌- ఇన్సూరెన్స్‌; హాస్పిటాలిటీ- టూరిజం అడ్మినిస్ట్రేషన్‌) కోర్సులు ఆయా విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి.

ఉద్యోగావకాశాలు... పోటీ పరీక్షలు
ఉద్యోగావకాశాలు పెంచేందుకు ఈసారి ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో బీబీఏ కోర్సులు ప్రవేశపెట్టారు. బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్‌ కోర్సును విస్తరించారు. ఇంటర్‌లో గణితం చదివినవారికి మరింతగా ఉద్యోగావకాశాలు దక్కేలా ఈసారి వినూత్నంగా బీఎస్‌సీ గణితం, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు తీసుకొచ్చారు. దానివల్ల డేటా సైంటిస్టుగా కెరియర్‌లో ముందుకెళ్లొచ్చు. ఇక పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌) కింద ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. అంటే బీఎస్‌సీ విద్యార్థి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ను ఒక సబ్జెక్టుగా చదువుకోవచ్చు. వీటిని గమనించి కోర్సులను, సబ్జెక్టులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉపాధి లక్ష్యం
ఒకప్పుడు కేవలం పీజీ చదువులోనే స్పెషలైజేషన్లు ఉండేవి. డిగ్రీ విద్యతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలన్న లక్ష్యంతో పలు స్పెషలైజ్‌డ్‌, పరిశోధన తరహా సబ్జెక్టులను ప్రవేశపెడుతున్నారు. పీజీ విద్యపై ఆసక్తి ఉంటే వెళ్లొచ్చు. లేదంటే డిగ్రీ పరిజ్ఞానంతో అవకాశాలను అందుకోవచ్చు..ఉదాహరణకు బీఎస్‌సీ ఎంపీసీలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు, బైపీసీ విద్యార్థులకు అయితే వృక్ష, జంతు, రసాయనశాస్త్రాలు ఉండేవి. కాలానుగుణంగా పీజీలో ఉండే మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫుడ్‌ సైన్స్‌, పౌల్ట్రీ సైన్స్‌, ఫిషరీస్‌, సెరీకల్చర్‌ మొదలైనవి వచ్చి చేరాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్‌పై అవగాహన తప్పనిసరి అవుతుండటంతో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కూడా ప్రవేశపెట్టారు.

బీఎస్‌సీ, బీకాంలోనే కాదు...బీఏలోనూ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఒక సబ్జెక్టుగా చేరింది. బీఏలో గత ఆరేడు సంవత్సరాలుగా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కాంబినేషన్‌ ప్రైవేట్‌ కళాశాలల్లోనే ఉండగా ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ ప్రవేశపెట్టారు. దీనివల్ల ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకూ ఉద్యోగావకాశాలు పెరిగాయి.

విభిన్న సబ్జెక్టుల కాంబినేషన్లు
బీఏలో..
* కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌+ కంప్యూటర్‌ అప్లికేషన్లు+ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌
* ఆర్థికశాస్త్రం+ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌+ కంప్యూటర్‌ అప్లికేషన్లు
* చరిత్ర+ కంప్యూటర్‌ అప్లికేషన్లు+ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
* చరిత్ర+ రాజకీయ శాస్త్రం+ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
* గణితం+ ఆర్థికశాస్త్రం+ కంప్యూటర్‌ అప్లికేషన్లు
* అడ్వర్‌టైజింగ్‌- సేల్స్‌ ప్రమోషన్‌- సేల్స్‌ మేనేజ్‌మెంట్‌
* బ్యాంకింగ్‌ - ఇన్సూరెన్స్‌- కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
* ఈ-కామర్స్‌ ్ఝ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
* ఫారెన్‌ ట్రేడ్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ ప్రొసీజర్స్‌

బీకాంలో..బీఎస్‌సీలో..
* అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌+ వృక్షశాస్త్రం+రసాయనశాస్త్రం
* బయోటెక్నాలజీ+ రసాయనశాస్త్రం+ కంప్యూటర్‌ అప్లికేషన్లు
* బయోటెక్నాలజీ+ రసాయనశాస్త్రం+ ఫోరెన్సిక్‌ సైన్స్‌
* బయోటెక్నాలజీ+జంతుశాస్త్రం+కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
* బయోటెక్నాలజీ+ మైక్రోబయాలజీ+ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
* వృక్షశాస్త్రం+ ఫారెస్ట్రీ+ రసాయనశాస్త్రం
* వృక్షశాస్త్రం+రసాయనశాస్త్రం+ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌
* బయోటెక్నాలజీ+ రసాయనశాస్త్రం+ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ కంట్రోల్‌
* జన్యుశాస్త్రం అండ్‌ బయోటెక్నాలజీ+ వృక్షశాస్త్రం+ బయలాజికల్‌ కెమిస్ట్రీ
* ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ+జంతుశాస్త్రం+ రసాయనశాస్త్రం
* మైక్రోబయాలజీ+ అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌+ రసాయనశాస్త్రం
* పౌల్ట్రీ సైన్స్‌+ జంతుశాస్త్రం+ రసాయనశాస్త్రం
* సెరీ కల్చర్‌+ వృక్షశాస్త్రం+ జంతుశాస్త్రం
* న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌+ జుంతుశాస్త్రం+ రసాయన శాస్త్రం

దోస్త్‌ యాప్‌ అందుబాటులోకి తెచ్చాం
రాష్ట్రవ్యాప్తంగా వందలాది డిగ్రీ కళాశాలలు ఉన్నందున ఐచ్ఛికాలు ఇచ్చే ముందు నాణ్యమైన కళాశాలల జాబితా రాసుకొని...ఆసక్తి ఉన్న కోర్సులను ఎంచుకోవాలి. ఎవరో చెప్పారని ఇష్టం లేని కోర్సులను, కళాశాలలను ఎంచుకోవద్దు. మూడు సబ్జెక్టుల కాంబినేషన్‌ను ఎంచుకునే సమయంలో వాటితో పీజీలో ఏ కోర్సులో చేరవచ్చో కూడా అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే పీజీలో మీకు ఆసక్తి ఉన్న కోర్సు చేయడానికి వీలవదు. మా కళాశాలలోనే చేరాలని యాజమాన్యాల ఒత్తిడి, ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిలోనూ లొంగొద్దు. అదే జరిగితే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా హైదరాబాద్‌ వరకు రాకుండానే పరిష్కరించేందుకు పాత 10 జిల్లాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు(ఎస్‌హెచ్‌ఎల్‌సీ)ను ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సహాయ కేంద్రాలున్నాయి. వాటిల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేసుకోవచ్చు. విద్యార్థులకు మరింత సులభంగా పూర్తి సమాచారాన్ని దోస్త్‌ వెబ్‌సైట్లో ఉంచాం. వాటిని క్షుణ్నంగా చదవండి. దోస్త్‌కు సంబంధించిన ప్రకటన, తాజా సమాచారం, కాలపట్టిక, కోర్సులు, రుసుముల వివరాలు, తరచూ అడిగే ప్రశ్నలు, కేటాయించిన కళాశాల వివరాలు, అది ఉన్న ప్రాంతం తదితర వాటి కోసం దోస్త్‌ పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపిస్తాం.
- ఆచార్య ఆర్‌.లింబాద్రి, కన్వీనర్‌, దోస్త్‌

డిగ్రీ ఉంటే చాలు!
ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని పరిశ్రమలు తమ ఉద్యోగులు అందరికీ పీజీలు అవసరమని కోరుకోవడం లేదు. కొంత ఆంగ్ల నైపుణ్యం, సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్న డిగ్రీ విద్యార్థులూ చాలంటున్నాయి. వారిని తమ అవసరాలకు తగ్గట్లు మార్చుకోవచ్చని భావిస్తున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో పలు ఐటీ, ఫైనాన్స్‌ కంపెనీలు నేరుగా డిగ్రీ కళాశాలలకే వచ్చి ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేసుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు సైతం ముఖ్యంగా బీకాం, బీబీఏ విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి. మూడేళ్లలోనే కోర్సు పూర్తవుతుంది. దాంతోపాటు ఈ కోర్సులు చదివితే గ్రూపు, సివిల్స్‌ రాయడానికి ప్రయోజనకరంగా ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. బీకాం, బీబీఏ చదువుతూనే మరోవైపు సీఏ, ఐసీడబ్ల్యూఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను పూర్తి చేస్తున్నారు. రెడ్డీస్‌ లాంటి కొన్ని ఫార్మా పరిశ్రమలు ఇప్పుడు బీఎస్‌సీ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.

కళాశాలలు ఇవీ...
ప్రభుత్వ కళాశాలలు: 119
ప్రభుత్వ స్వయంప్రతిపత్తి: 9
ప్రైవేట్‌ ఎయిడెడ్‌: 42
ప్రైవేట్‌ ఎయిడెడ్‌(స్వయంప్రతిపత్తి): 3
ప్రైవేట్‌: 810
ప్రైవేట్‌ (స్వయంప్రతిపత్తి): 3
రైల్వే శాఖ: 1
విశ్వవిద్యాలయం (స్వయంప్రతిపత్తి): 3
యూనివర్సిటీ కళాశాలలు: 2
మొత్తం; 992

కోర్సుల వారీగా సీట్లు
బీఎస్‌సీ: 1,72,588
బీకాం: 1,32,741
బీఏ: 59,693
బీబీఏ: 10,870
బీబీఎం: 875
బీసీఏ: 1135
బీఎస్‌డబ్ల్యూ: 120
బ్యాచిలర్‌ఆఫ్‌ ఒకేషనల్‌: 100
మొత్తం: 3,78,122

ఏ తేదీల్లో ఏది?
రిజిస్ట్రేషన్లు: మే 23 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు
వెబ్‌ ఆప్షన్లు: మే 25 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు
ఆలస్య రుసుంతో రిజిస్ట్రేషన్లు( రూ.400): జూన్‌ 4న
మొదటి విడత సీట్ల కేటాయింపు: జూన్‌ 10న
రెండో విడత రిజిస్ట్రేషన్లు: జూన్‌ 10 నుంచి 15వ తేదీ వరకు (రూ.400 రుసుం)
చివరి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లు: జూన్‌ 20 నుంచి 25వ తేదీ వరకు
తరగతులు ప్రారంభం (ప్రథమ సెమిస్టర్‌): జులై 1వ తేదీ నుంచి

- పెమ్మసాని బాపనయ్య, ఈనాడు, హైదరాబాద్‌


Back..

Posted on 27-05-2019