Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అవుదామా.. అకౌంట్స్‌ ఆఫీసర్‌!

కామర్స్‌ అభ్యర్థులు డైరెక్ట్‌గా ఆఫీసర్‌ ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం వచ్చింది. కేవలం రాత పరీక్ష మార్కుల ఆధారంగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో జేఏఓగా జాయిన్‌ కావచ్చు. ప్రధానంగా బీకామ్‌ డిగ్రీలో చదివిన సిలబస్‌నే గట్టిగా మరోపట్టు పడితే ఉద్యోగం ఖాయం చేసుకోవచ్చు.
తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) ఇటీవల 114 జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ (జేఏఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫిబ్రవరి 2న ప్రారంభమై అదే నెల 19తో ముగుస్తుంది. ఉద్యోగ పరీక్షను 25 మార్చి, 2018న నిర్వహిస్తారు. రాత పరీక్ష మెరిట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉండదు.
రాత పరీక్ష 100 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ప్రధాన సబ్జెక్టుల నుంచి 80 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. రెండో విభాగంలో జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో జరుగుతుంది.

రిఫరెన్స్‌ పుస్తకాలు
తెలుగు మాధ్యమం:
* ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌, అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌, కార్పొరేట్‌ అకౌంటింగ్‌
* కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌
* ఆడిటింగ్‌ - తెలుగు అకాడమీ, హిమాలయ పబ్లికేషన్స్‌, కల్యాణి పబ్లికేషన్స్‌.
ఇంగ్లిష్‌ మీడియం:
* ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌, అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌, కార్పొరేట్‌ అకౌంటింగ్‌ కోసం ఎస్‌పీ జైన్‌ అండ్‌ కెఎల్‌ నారంగ్‌, ఎస్‌ఎన్‌ మహేశ్వరి, ఆర్‌ఎల్‌ గుప్తా, వీకే గుప్తా పుస్తకాలు.
* కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ కోసం ఎంఎన్‌ అరోరా, జైన్‌ అండ్‌ నారంగ్‌
* ఆడిటింగ్‌కి ఆర్‌జీ సక్సేనా, టీఎన్‌ టాండన్‌ - తెలుగు అకాడమీ, హిమాలయ పబ్లికేషన్స్‌, కల్యాణి పబ్లికేషన్స్‌.
జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ కోసం ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకం.

సిలబస్‌ విశ్లేషణ
విభాగం-ఎ లో మొత్తం 80 మార్కులకు కామర్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో అకౌంటెన్సీ, అడ్వాన్స్‌డ్‌ అకౌంటెన్సీ 35, కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ 25, ఆడిటింగ్‌ 20 మార్కులకు ఉంటాయి.

అకౌంటెన్సీ, అడ్వాన్స్‌డ్‌ అకౌంటెన్సీ: ఈ సబ్జెక్టులో బీకామ్‌లోని మూడు సంవత్సరాల అకౌంటింగ్‌ సిలబస్‌ను ఇచ్చారు. దీని నుంచి దాదాపు 10 నుంచి 12 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ భావనలు, సంప్రదాయాలు, అకౌంటింగ్‌ ప్రక్రియలోని వివిధ అంశాలైన చిట్టా, ఆవర్జా, సహాయక పుస్తకాలు, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక, వినిమయ బిల్లులు, అంకణా, ముగింపు లెక్కలు తదితరాలను సూత్రాల సహా లోతుగా చదవాలి. సాధ్యమైనన్ని లెక్కలు చేయాలి.
సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ లెడ్జర్‌, రాయల్టీలు, అద్దె కొనుగోలు, వాయిదా కొనుగోలు పద్ధతులు, ఒంటి పద్దు విధానం, వ్యాపారేతర సంస్థల ఖాతాలు, అసంపూర్ణ రికార్డుల నుంచి ఖాతాలు, భాగస్వామ్య ఖాతాలు (ప్రవేశం, విరమణ, మరణం, రద్దు), బ్రాంచి ఖాతాలు, కంపెనీ ఖాతాలు - వాటాలు మొదలైన వాటిని అధ్యయనం చేయాలి. వాటిలోని వివిధ పద్ధతులను, సూత్రాలను, వివిధ ఖాతాల నమూనాలను, షెడ్యూల్‌ నెంబర్లను గుర్తు పెట్టుకోవాలి. ఇందులో లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.

కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌: జేఏఓ సాధించడంలో ప్రముఖపాత్ర వహించే సబ్జెక్టుల్లో ఇది ప్రధానమైంది. దీని నుంచి 25 మార్కులకు ప్రశ్నలు రావచ్చు. వ్యయ ప్రాథమిక భావనలు, మెటీరియల్‌, లేబర్‌ వ్యయాలు, ఓవర్‌హెడ్స్‌, వివిధ కాస్టింగ్‌ పద్ధతులు, బ్రేక్‌-ఈవెన్‌ విశ్లేషణ తదితరాలను గత ప్రశ్నపత్రాల ఆధారంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా వివిధ కాస్టింగ్‌ నిర్వహణలు, వాటిని పాటించే సంస్థలు, సూత్రాలను విశ్లేషిస్తూ చదవాలి. వివిధ పద్ధతుల్లో లెక్కలను ప్రాక్టీస్‌ చేయాలి. ముఖ్యాంశాలను, సూత్రాలను నోట్‌ చేసుకుని మళ్లీ మళ్లీ చదవడం మంచిది.

ఆడిటింగ్‌: ఉద్యోగ ఎంపికలో కీలకమైన మరో సబ్జెక్టు ఆడిటింగ్‌. దీని నుంచి 20 మార్కులకు ప్రశ్నలను ఇస్తారు. ఆడిటింగ్‌ ప్రాథమికాంశాలు, అంతర్గత తనిఖీ, వెరిఫికేషన్‌, కంపెనీల ఆడిట్‌, విభాజనీయ లాభాలు, భారతీయ ఆడిటింగ్‌ ప్రమాణాలు మొదలైన వాటిని చదవాలి. ఇందులో వివిధ సెక్షన్లు, సంవత్సరాలు, కనీస, గరిష్ఠ సంఖ్య, ఇతర నియమాలను విశ్లేషిస్తూ ప్రిపేర్‌ కావాలి. నిర్దేశించిన సిలబస్‌తో పాటు అకౌంటింగ్‌, వ్యాపార, ఆర్థిక రంగాల్లో వస్తున్న సంస్కరణలు, వర్తమానాంశాలను అధ్యయనం చేయాలి.

విభాగం-బి జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ: ఇందులో అభ్యర్థుల సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు వివిధ అంశాల నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ఇందులో న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, ఆంగ్ల పరిజ్ఞానం, తెలంగాణ ఉద్యమం-సంస్కృతి, కంప్యూటర్‌ పరిజ్ఞానం మొదలైనవి ప్రధానమైనవి.
రాత పరీక్షకు దాదాపు రెండు నెలల సమయం ఉంది. ప్రామాణిక పుస్తకాల ఆధారంగా రోజుకు 10 నుంచి 12 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు అభ్యర్థులు కేటాయించాలి. వీలైనన్ని మోడల్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేయాలి.

డాక్ట‌ర్ ఎం.మ‌ల్లారెడ్డి, కామ‌ర్స్ స‌హాయ ఆచార్యులు


Posted on 24-01-2018