Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
టీఎస్‌ ట్రాన్స్‌కోలో జూనియర్‌ లైన్‌మెన్లు

ఐటీఐ లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. తెలంగాణ ట్రాన్స్‌కో జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. సర్వీసులో ఉన్నవారికి మార్కుల వెయిటేజీ కూడా ఉంది. కేవలం రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.
తెలంగాణ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ ట్రాన్స్‌కో) 1100 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిలో సదరన్‌ జోన్‌లో 657, నార్తర్న్‌ జోన్‌లో 443 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా ఒకేషనల్‌ కోర్సు పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఐటీఐ లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు
పదోతరగతి అనంతరం ఎలక్ట్రికల్‌ లేదా వైర్‌మెన్‌ ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు పాసై ఉండాలి.
జులై 1, 2017 నాటికి కనిష్ఠంగా 18, గరిష్ఠంగా 35 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయఃపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పోల్‌ ఎక్కగలగాలి. స్తంభం ఎక్కలేనివాళ్లు ఈ పోస్టులకు అనర్హులు.
ఇంటర్వ్యూ లేదు
రాత ప‌రీక్ష‌¹ 80 మార్కులకు జరుగుతుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ రెండు మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 80 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 65 ప్రశ్నలు ఐటీఐ/ ఒకేషనల్‌ కోర్సులోని ఎలక్ట్రికల్‌ సబ్జెక్టుపై ఉంటాయి. మిగిలిన 15 ప్రశ్నలు జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ నుంచి అడుగుతారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. పరీక్ష కేంద్రాలన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటాయి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఓఎంఆర్‌ పత్రంపై బ్లాక్‌ పెన్నుతో సరైన సమాధానం ఆప్షన్‌ వృత్తాన్ని పూరించాలి. వైట్‌నర్‌ ఉపయోగించకూడదు. పరీక్ష జరిగిన మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12న ప్రైమరీ కీ టీఎస్‌ ట్రాన్స్‌కో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇంటర్వ్యూ లేదు.
అర్హత సాధించాలంటే...
రాత ప‌రీక్ష‌¹లో అర్హత సాధించడానికి ఓసీలు 40, బీసీలు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు పొందాలి. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గరిష్ఠంగా 20 మార్కుల వెయిటేజీ వర్తిస్తుంది. వీరు పని చేసిన కాలానికి ప్రతి ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున వెయిటేజీలో కలుపుతారు. మొత్తం పోస్టుల్లో 20 శాతం పోస్టులకు అందరూ అర్హులే. వీటికి లోకల్‌, నాన్‌ లోకల్‌ ఎవరైనా పోటీ పడొచ్చు. మిగిలిన 80 శాతం పోస్టులకు కేవలం లోకల్‌ అభ్యర్థులే అర్హులు. ఉద్యోగానికి ఎంపికైనవాళ్లు రెండేళ్లు ప్రొబేషన్‌లో కొనసాగుతారు. వేతన శ్రేణి: రూ.15585 - రూ.25200
ఈ అంశాల్లో ప్రశ్నలు
విద్యుత్తు, ఎలక్ట్రానిక్స్‌, ఏసీలో ప్రాథమికాంశాలు, బ్యాటరీలు, అయస్కాంతత్వం, ఎసీ, డీసీ మెషిన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్తు కొలతలు, ఉత్పత్తి తదితరాంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌పైనా ప్రశ్నలడుగుతారు. ఈ ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 5 నుంచి ప్రారంభమైంది
చివరితేదీ: జనవరి 20.
ఫీజు: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా రూ.100 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుగా చెల్లించాలి. దీంతోపాటు రూ.120 పరీక్ష ఫీజు కట్టాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
హాల్‌ టికెట్లు: ఫిబ్రవరి 5 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 11, 2018 మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు.

Back..

Posted on 09-01-2018