Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అవకాశాలన్నీ ఒకే చోట!

* 3 ల‌క్ష‌ల ఇంట‌ర్న్‌షిప్‌ల‌కు వేదిక‌.. తులిప్‌

కొవిడ్‌-19 ప్రభావం విద్యా ఉపాధి రంగాలను బాగా దెబ్బతీసింది. కరిగిపోయిన కొలువులు ఒక పక్క.. ఊగిసలాడుతున్న ఉద్యోగాలు మరోపక్క. అస్పష్టమైన భవిష్యత్‌చిత్రం ఉద్యోగార్థులనూ, విద్యార్థులనూ భయపెడుతోంది. ఇది దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందిస్తోంది. తాజా గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. తమ ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

ఉద్యోగావకాశాలను పెంచేందుకు తోడ్పడాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం కొత్త ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా విద్యార్థులకు ఆకర్షణీయ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ‘ద అర్బన్‌ లర్నింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ లేదా తులిప్‌ (TULIP) గా దీనికి పేరు పెట్టారు. ప్రస్తుతం 23,970 సంస్థల్లో దాదాపు మూడు లక్షల ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ పరిచయమున్నదే. నిజానికి ఇది వారికి తప్పనిసరి కూడా. పుస్తక పరిజ్ఞానాన్ని విధి నిర్వహణలో ఎలా ఉపయోగించాలో తెలుసుకునే మార్గమే ఇంటర్న్‌షిప్‌. ఇది పని గురించిన అవగాహనను కల్పించడంతోపాటు మెరుగైన అవకాశాలనూ అందిస్తుంది. ఈ అవకాశాలను గ్రాడ్యుయేట్లకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. తులిప్‌ పోర్టల్‌లో దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలను ఒకేచోట అందుబాటులో ఉంచుతారు. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్, లా, సైన్స్, కామర్స్‌/ ఆర్ట్స్‌ విభాగాల్లో అభ్యర్థి తన రంగానికి సంబంధించిన ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవచ్చు. ఇంటర్న్‌షిప్‌ల వ్యవధి ఎంచుకున్న ప్రాజెక్టును బట్టి మారుతుంది. సాధారణంగా 8 వారాల పరిధి నుంచి ఏడాది వరకూ ఉంటుంది.

ఏవిధంగా ఉపయోగం?
వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నవారు అర్బన్, స్మార్ట్‌ సిటీ పరిధిలోని ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌లుగా పనిచేస్తారు. అర్బన్‌ ప్లానింగ్, అర్బన్‌ డిజైనింగ్, వివిధ ఇంజినీరింగ్‌ బ్రాంచిలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మొబిలిటీ, ఫైనాన్స్, సోషల్‌ సెక్టార్, పర్యావరణ సమస్యలు సహా ఇతర ఎన్నో విభాగాల్లో అవగాహన కల్పించుకునే అవకాశం లభిస్తుంది. తులిప్‌ ఇంటర్న్‌లకు విధానాల రూపకల్పన, అమలు అంశాల్లోనూ అవగాహన కల్పిస్తారు. నగర అధికారులు, సంబంధిత వ్యక్తులతో రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి సంప్రదింపులు జరిగే అవకాశం లభిస్తుంది. పాటించాల్సిన పద్ధతులు, ఆలోచనలను పంచుకోవడం, ప్రారంభ స్థాయిలో ప్రాజెక్టును అమలుపరచడం వంటి అంశాల్లో పాల్గొనవచ్చు. ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యేనాటికి నగర పరిపాలనలో భవిష్యత్‌కు అవసరమైన అనేక అంశాలపై పట్టు ఏర్పరచుకునే అవకాశం లభిస్తుంది.

ఎవరు అర్హులు?
భారతీయులై ఉండాలి. గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో.. బి.ప్లాన్, బీటెక్, బి.ఆర్క్, బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, ఎల్‌ఎల్‌బీ తత్సమాన విద్యను పూర్తిచేసినవారు అర్హులు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయి 18 నెలలలోపైవుంటే వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ
దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థికి ఏడు ఇంటర్న్‌షిప్‌ల వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఆధారంగా ఎంపికైనవారిని ఇంటర్వ్యూ నిమిత్తం పిలుస్తారు. ఇది ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ల్లో ఏదో ఒక రూపంలో ఉండే వీలుంది. దీనిలోనూ అర్హత సాధించినవారికి డిజిటల్‌ ఆఫర్‌ లెటర్‌ను అందజేస్తారు. ఆఫర్‌ లెటర్‌ను అంగీకరించడం, తిరస్కరించడం పోర్టల్‌లోనే చేయొచ్చు. విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌ కూడా అందజేస్తారు. గృహ, పట్టణ అభివృద్ధి శాఖ, ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వం యూఎల్‌బీ/ స్మార్ట్‌సిటీ సంయుక్తంగా దీన్ని అందజేస్తాయి. అభ్యర్థి పనితీరును ప్రాజెక్ట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌/ మెంటర్‌ అంచనావేస్తారు. దాని ఆధారంగా గ్రేడ్‌ను ఇస్తారు.

దరఖాస్తు ఇలా..
ఆన్‌లైన్‌లోనే https://internship.aicteindia.org/index.phpz దరఖాస్తు చేసుకోవాలి. వివరాలతోపాటు సంబంధిత పత్రాలనూ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఏమీ లేదు.
* వెబ్‌సైట్‌లో ‘రిజిస్టర్‌’ బటన్‌ను నొక్కాలి.
* అందుబాటులో ఉన్న ఆప్షన్లలో ‘స్టూడెంట్‌’ కేటగిరీని ఎంచుకోవాలి.
* పేరు, ఈ-మెయిల్‌ ఐడీ, ఇంకా ఇతర అవసరమైన వివరాలను నింపి, ‘రిజిస్టర్‌’ బటన్‌ను నొక్కాలి.
* వెరిఫికేషన్‌ లింకు ఈ-మెయిల్‌కు వస్తుంది. దానిలోకి వెళ్లి ‘వెరిఫై’పైన క్లిక్‌ చేయాలి.
* ఈ-మెయిల్‌ ఐడీ, రూపొందించుకున్న పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అయ్యి అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.
* అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్‌ల్లో నచ్చినదాన్ని ఎంచుకుని, దరఖాస్తు చేసుకోవాలి.
* ఎంపికయ్యారో లేదో తెలుసుకోవడానికి అకౌంట్‌కి లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంపికైనవారిని తరువాతి రౌండ్లలో పరీక్షిస్తారు.
* వీటిలోనూ ఎంపికైతే ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ అందిస్తారు. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి, స్టైపెండ్‌ వివరాలతో కూడిన ఆఫర్‌ లెటర్‌ను అందజేస్తారు.

సమర్పించాల్సిన పత్రాలు
గుర్తింపు రుజువు (డ్రైవింగ్‌ లైసెన్స్, ఎలక్షన్‌ కార్డ్, ఆధార్‌కార్డ్‌ లాంటివి), విద్యార్హత ధ్రువపత్రాలు, మెంటర్లు లేదా చదివిన కళాశాల నుంచి లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్‌లను సమర్పించాల్సి ఉంటుంది.

Back..

Posted on 08-06-2020