Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
యూసీడ్‌,సీడ్‌ - 2020

* కెరియర్‌ డిజైన్‌కు కొన్ని కోర్సులు
అగ్గిపెట్టెలు అలాగే ఎలా ఉంటాయి? సబ్బుబిళ్లలకు అంత సొగసెందుకు? కంపెనీకో తీరుగా కార్లు ఉండటానికి కారణం ఏమిటి? అన్నింటికీ సమాధానం ఒక్కటే. అవన్నీ వినియోగదారుడిని ఆకట్టుకోవడానికి మార్కెట్‌ చేసే మాయలు. వాటి వెనుక ఎందరో నిపుణులు ఉంటారు. ఏ వస్తువు ఏ ఆకారంలో ఉండాలో డిసైడ్‌ చేస్తారు. శాస్త్రీయంగా డిజైన్‌ చేస్తారు. ఇలా వస్తుప్రేమతో సృజనాత్మకంగా కెరియర్‌ సాగించాలనుకుంటే కొన్ని కోర్సులు చేయాలి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి.

మార్కెట్‌లో ప్రతి వస్తువుకు ఒక ఆకారం ఉంటుంది. దాన్ని ఆ రూపంలో తీర్చిదిద్దడానికి నిపుణులు కృషి చేస్తుంటారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాటిని రూపొందిస్తుంటారు. ఆ విధంగా డిజైనింగ్‌ పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం కొన్ని కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ అర్హతతో వాటిలో చేరవచ్చు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్లు డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో ఈ కోర్సులను అందిస్తున్నాయి. అగ్గిపెట్టెలు.. సబ్బుడొక్కులు, పాదరక్షలు.. పైజామాలు, సెల్‌ఫోన్లు.. సెమీ కండక్టర్లు...దేనికైనా ఒక నిర్దిష్ట ఆకారం ఉంటుందని మనకు తెలుసు. అవి అలా రూపొందటం వెనుక డిజైనర్ల కృషి ఉంది. ఈ డిజైనింగ్‌ను శాస్త్రీయంగా బోధించేందుకు డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులున్నాయి. ఐఐఎస్సీ, ఐఐటీలతోపాటు ప్రసిద్ధ సంస్థల్లో వీటిని అందిస్తున్నారు. ఇలాంటి మేటి సంస్థల్లో చేరి డిజైన్‌లో సత్తా చాటాలనుకునేవారి కోసం నిర్వహించే ప్రవేశపరీక్ష... సీడ్‌. తాజాగా యూసీడ్, సీడ్‌ ప్రకటనలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు నవంబరు 9లోపు దరఖాస్తు చేసుకుని, జనవరిలో జరిగే పరీక్షలకు సంసిద్ధం కావాలి!

ఇంటర్‌ తర్వాత యూసీడ్‌
ఇంటర్మీడియట్‌ తర్వాత డిజైన్‌ కోర్సుల్లో చేరాలంటే యూసీడ్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌)కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మెరిట్‌ సాధిస్తే ఐఐటీ-బాంబే, గువాహటితోపాటు పేరున్న సంస్థలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిస్‌) కోర్సులోకి ప్రవేశం లభిస్తుంది. 2019లో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ ఇలా.. ఏ బ్రాంచీ విద్యార్థులైనా అర్హులే. మూడేళ్ల డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు చదివిన విద్యార్థులూ అప్లై చేయవచ్చు. 2018, అంతకంటే ముందు కోర్సులు పూర్తిచేసినవారు అనర్హులు. (ఐఐటీ-గువాహటిలో ప్రవేశానికి ఇంటర్‌ ఎంపీసీ తప్పనిసరి). రెండు వరుస ప్రయత్నాల్లో మాత్రమే యూసీడ్‌ రాయడానికి అవకాశం ఉంటుంది.
వయసు: అక్టోబరు 1, 1995 తర్వాత జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే అక్టోబరు 1, 1990 తర్వాత జన్మించినప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షలో రెండు భాగాలు
పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో 300 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు భాగాలు (ఎ, బి) ఉంటాయి.
పార్ట్‌-ఎ: ఈ విభాగం మొత్తం 240 మార్కులు. వ్యవధి రెండున్నర గంటలు. 3 సెక్షన్లు ఉంటాయి.
సెక్షన్‌ ఎ (న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌): 18 ప్రశ్నలు వస్తాయి.ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. ఆప్షన్లు ఉండవు. జవాబును నేరుగా ఖాళీపై పూరించాలి. ఆన్‌లైన్‌ కీబోర్డు ఉపయోగించి సమస్యను సాధించుకోవచ్చు. ఈ విభాగానికి 72 మార్కులు కేటాయించారు.
సెక్షన్‌ బి (మల్టిపుల్‌ సెలక్ట్‌ టైప్‌): ఈ విభాగానికీ 72 మార్కులు కేటాయించారు. మొత్తం 18 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన జవాబులు ఉండవచ్చు. అభ్యర్థులు సరైన ఆప్షన్లు గుర్తిస్తే 4 మార్కులు సొంతమవుతాయి. ఆ ప్రశ్నకు ఉన్న సరైన సమాధానాలన్నీ గుర్తిస్తేనే మార్కులుంటాయి. ఈ సెక్షన్‌ లోనూ రుణాత్మక మార్కులున్నాయి.
సెక్షన్‌ సి (మల్టిపుల్‌ ఛాయిస్‌ టైప్‌): 96 మార్కులు కేటాయించారు. ఇందులో 32 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఉంటాయి. ఒక ఆప్షన్‌ మాత్రమే సరైనది. ఈ విభాగానికి రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి సరైన జవాబుకూ 3 మార్కులు ఉంటాయి.
పార్ట్‌-బి: ఈ విభాగానికి 60 మార్కులు కేటాయించారు. వ్యవధి 30 నిమిషాలు.
ఇందులో ఒక ప్రశ్న వస్తుంది. అభ్యర్థి డ్రాయింగ్‌ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ప్రశ్న ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌పై వస్తుంది. అయితే సమాధానం (డ్రాయింగ్‌) జవాబు పత్రంపై రాయాలి.

ప్రశ్నలడిగే విభాగాలు...
విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ, ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ సోషల్‌ అవేర్‌నెస్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డ్రాయింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలు-జవాబులు యూసీడ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా పరీక్ష విధానం, ప్రశ్నల స్వరూపంపై అవగాహనకు రావచ్చు. సృజన, ఆలోచన, తార్కికతలపై ముడిపడి ఎక్కువ ప్రశ్నలు సంధిస్తారు.

ప్రవేశం కల్పించే సంస్థలు, సీట్లు:
ఐఐబీ-బాంబే, గువాహటి, హైదరాబాద్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ - జబల్‌పూర్‌ 4 సంస్థల్లోనూ కలిపి 144 సీట్లు ఉన్నాయి. వీటిలో ఐఐటీ-బాంబే 37, ఐఐటీ-గువాహటి 56, ఐఐటీ- హైదరాబాద్‌ 13, ఐఐఐటీడీఎం-జబల్‌పూర్‌లో 38 చొప్పున సీట్లు ఉన్నాయి. ఐఐటీ-బాంబేలో చేరినవారు కావాలనుకుంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులో చేరవచ్చు. కోర్సు మూడో సంవత్సరంలో ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇలా చేరినవారికి బీడిస్‌ + ఎండిస్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సు అయిదేళ్లలో పూర్తవుతుంది. యుసీడ్‌ స్కోర్‌తో దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్థలూ ప్రవేశం కల్పిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి... యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విట్, లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, శ్రేష్ఠ, ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, చండీగఢ్‌ యూనివర్సిటీ, మిట్, యూపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబరు 9
చివరి తేదీ: నవంబరు 9. రూ.500 ఆలస్య రుసుంతో: నవంబరు 16 పరీక్ష: జనవరి 18.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
వెబ్‌సైట్‌: www.uceed.iitb.ac.in/2020, www.ceed.iitb.ac.in/2020

పీజీ, పీహెచ్‌డీలకు సీడ్‌
డిజైన్‌లో యూజీ కోర్సులు చదువుతున్నవారి పీజీ ప్రవేశానికి సీడ్‌ ద్వారా అవకాశం కలుగుతుంది. ఈ పరీక్షతో పీజీ విద్యార్థులు పీహెచ్‌డీ కోర్సులో చేరవచ్చు. ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ-బాంబే, దిల్లీ, గువాహటి, హైదరాబాద్, కాన్పూర్, ఐఐటీడీఎం జబల్‌పూర్‌లో డిజైన్‌కు సంబంధించి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌) రాయడం తప్పనిసరి.

సంస్థలవారీ కోర్సులు / స్పెషలైజేషన్లు
ఐఐఎస్సీ బెంగళూరు: ఎండిజైన్‌- ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ బాంబే: ఎండిజైన్‌- ఇండస్ట్రియల్‌ డిజైన్, కమ్యూనికేషన్‌ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్షన్‌ డిజైన్, మొబిలిటీ అండ్‌ వెహికల్‌ డిజైన్‌; పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ దిల్లీ: ఎం.డిజైన్‌- ఇండస్ట్రియల్‌‌ డిజైన్‌
ఐఐటీ గువాహటి: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ హైదరాబాద్‌: ఎం.డిజైన్‌- విజువల్‌ డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ కాన్పూర్‌: ఎం.డిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌: ఎం.డిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

ప్రశ్నపత్రం ఇలా..
ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. అవి పార్ట్‌ ఎ, బి. పార్ట్‌ - ఎ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఈ విభాగంలో న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్, మల్టిపుల్‌ సెలక్ట్, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. మొత్తం 41 ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ప్రశ్నలు 8 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. రుణాత్మక మార్కులు ఉండవు. మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు 10 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. మల్టిపుల్‌ ఛాయిస్‌ విభాగంలో 23 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి.

పార్ట్‌ ఎ వ్యవధి ఒక గంట. ఇందులో విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్, సోషల్‌ అవేర్‌నెస్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-బి ప్రశ్నలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌పై డిస్‌ప్లే అవుతాయి. అయితే వీటికి సమాధానాలు (డ్రాయింగ్స్‌) బుక్‌లెట్‌లో రాయాలి. ప్రతి ప్రశ్నకు 20 మార్కులు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. స్కెచింగ్, క్రియేటివిటీ, ఫామ్‌ సెన్సిటివిటీ, విజువల్‌ సెన్సిటివిటీ, ప్రాబ్లమ్‌ ఐడెంటిఫికేషన్‌ ఒక్కో విభాగంలో ఒక ప్రశ్న చొప్పున ఉంటాయి. వ్యవధి 2 గంటలు. పార్ట్‌-ఎను స్క్రీనింగ్‌ టెస్టుగా పరిగణిస్తారు. పార్ట్‌-ఎ పరీక్షలోని ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. ఎంపికైనవారి పార్ట్‌ బి సమాధానాలు మూల్యాంకనం చేస్తారు. పార్ట్‌-ఎకు 25, పార్ట్‌-బికి 75 శాతం వెయిటేజీ లభిస్తుంది.

అర్హత: గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకవోవచ్చు. ప్రవేశం కల్పించే సంస్థలను బట్టి స్వల్ప వ్యత్యాసాలుంటాయి. బీటెక్, బీఆర్క్, డిజైన్, ఇంటీరియర్‌ డిజైన్, బీఎఫ్‌ఏ- వీటిలో ఏదైనా నాలుగేళ్ల కోర్సు లేదా జీడీ ఆర్ట్స్‌ డిప్లొమా ప్రోగ్రాం (10+5 ఇయర్స్‌) చదివినవారికి అన్ని సంస్థల్లోనూ అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. వయసు నిబంధన లేదు.
ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో 300 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎలో మొత్తం 240 మార్కులు. వ్యవధి రెండున్నర గంటలు. 3 సెక్షన్లు ఉంటాయి. పార్ట్‌-బికి 60 మార్కులు. వ్యవధి 30 నిమిషాలు. ఒక ప్రశ్న ఇస్తారు. అభ్యర్థి డ్రాయింగ్‌ నైపుణ్యాలను పరిశీలిస్తారు.

ప్రవేశం కల్పించే సంస్థలు, సీట్లు
ఐఐటీ-బాంబే, గువాహటి, హైదరాబాద్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ - జబల్‌పూర్‌.. ఈ నాలుగు సంస్థల్లో మొత్తం 144 సీట్లు ఉన్నాయి. ఐఐటీ-బాంబేలో చేరినవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సు చేసుకోవచ్చు. డిగ్రీ మూడో సంవత్సరంలో ఐచ్ఛికాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా చేరినవారికి బీడిస్‌ + ఎండిస్‌ డ్యూయల్‌ డిగ్రీ అయిదేళ్లలో పూర్తవుతుంది. యూసీడ్‌ స్కోర్‌ను దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్థలూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విట్, లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, చండీగఢ్‌ యూనివర్సిటీ, మిట్, యూపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబరు 9
చివరి తేదీ: నవంబరు 9. రూ.500 ఆలస్య రుసుంతో: నవంబరు 16 పరీక్ష: జనవరి 18.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
వెబ్‌సైట్‌: www.uceed.iitb.ac.in/2020, www.ceed.iitb.ac.in/2020


Back..

Posted on 09-10-2019